"హలో.....హౌ ఆర్యూ సార్?" ఆశ్చర్యంగా అడిగింది కావ్య.
"ఫైన్! సారీ ఫర్ ది డిస్ట్రబింగ్ యూ! మనం కల్సినప్పుడు నువ్వు నాతో కొన్ని విషయాలు చెప్పావు జ్ఞాపకం వుందా?"
ఏ విషయమో ఆమెకు జ్ఞాపకం రాలేదు.
"అదే ప్రతిభావంతమైన ఆర్టిస్టుల్ని వుపయోగించుకుంటే చాలా మంది హార్ట్ కోల్ క్రిమినల్స్ అవలీలగా పట్టుకోవచ్చని....."
"ఎస్ సార్!"
"నాకు అర్జంటుగా ఓ మంచి ఆర్టిస్టు కావాలి."
కావ్య మెదడులో వెంటనే అభినవ్ మెదిలాడు.
"మీరు ఎలాంటి ఆర్టిస్టు కావాలని కోరుకుంటారో అలాంటి ఆర్టిస్టుని మీకు ఇమ్మీడియట్ గా అప్పగించగలను" హుషారుగా అంది కావ్య.
"ఆర్యూ ష్యూర్?"
"ఎస్ సర్!"
"రేపు మార్నింగ్ ఫ్లైట్లో నేను హైద్రాబాద్ వస్తున్నాను" చెప్పి ఫోను రిసీవర్ని క్రెడిల్ చేశాడు హరిహరన్.
* * *
దిల్ కుష్ గెస్ట్ హౌస్.....
"ఒక నేరస్తుడ్ని పట్టుకోవటానికి నేను మీకు ఉపయోగపడాలి. అందుకేనా అంత దూరం నుంచి మీరు శ్రమపడి వచ్చింది" అలా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా అడుగుతున్న అభినవ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు హరిహరన్.
అంతకు పూర్వం అభినవ్ మనస్తత్వం, కుటుంబ పరిస్థితులు అతని సున్నితత్వం గురించి కావ్య ద్వారా తెలుసుకున్న హరిహరన్ మనసులోనే నవ్వుకున్నాడు.
"మరి మీరు ఆర్టిస్టుగా బ్రతుకుతున్నది దేనికోసం?" సూటిగా ప్రశ్నించాడు హరిహరన్.
"ఆర్ట్ ఈజ్ నాట్ ఏ కమ్మెడిటీ ఫర్ సేల్. ఆర్ట్ ఈజ్ ఏ డివైన్ సోల్. ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్. ఆర్ట్ ఈజ్ ఆర్ట్ ఫర్ సేక్."
"మరి మీరు మీ ఆర్ట్ ని డబ్బులు కోసం వెయ్యరా?" సూటిగా ప్రశ్నించాడు హరిహరన్.
"నో..... నెవర్."
ప్రపంచంలో అలాంటి వ్యక్తులుంటారని హరిహరన్ కు తెలీదు. ఎంతోమంది క్రిమినల్స్ ని డీల్ చేసిన హరిహరన్ ఒక ఆర్టిస్టును ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు.
"నేను మీ దగ్గరికొచ్చింది నాకోసం గానీ, నా స్వార్థం కోసం గానీ, కాదు. మీరు నాకు కోపరేట్ చేయడం ద్వారా ఈ దేశానికి మచ్చగా తయారైన ఒక స్మగ్లర్ ని, ఒక టెర్రరిస్ట్ ని పట్టుకోడానికి వుపయోగపడుతున్నారనే విషయం మరిచిపోకండి."
"ఐయామ్ సారీ సర్" లేచి నిలబడ్డాడు అభినవ్.
అతన్ని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావడం లేదు హరిహరన్ కి. ముందుకు నడుస్తున్న అభినవ్ భుజం మీద చెయ్యి వేసి, మిస్టర్ అభినవ్! మీ దగ్గరికి సహాయం కోరి వచ్చే వ్యక్తికి మీరు హెల్ప్ చేస్తారా?"
"పరిస్థితులను బట్టి."
"అలాగే నేను అడుగుతున్నాను. మీ వ్యక్తిత్వాన్ని అభిమానించే ఓ ఫ్రెండ్ గా అడుగుతున్నాను. నాకు పర్సనల్ గా హెల్ప్ చేయలేరా?"
అభినవ్ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు.
"పోనీ నా ఆనందం కోసం నాక్కావలసిన పెయింటింగ్ ని వేసి పెట్టండి. అందుకు నా పది లక్షల ఆస్తిని మీకు రెమ్యునరేషన్ గా యివ్వడానికి సిద్ధంగా వున్నాను."
"ఈ పద్ధతిలో డబ్బు సంపాదించాలంటే నేనెప్పుడో సంపాదించి వుండేవాడిని" అంటూ ముందుకు మరో అడుగు వేశాడతను.
"అందుకేనా మీ చెల్లెలికి కనీసం వైద్యం చేయించలేని పరిస్థితిలో మీరున్నారు?"
అతని కళ్ళలోకి చివుక్కుమని కోపం పొంగుకు వచ్చింది.
"మిస్టర్ అభినవ్! నా బ్రదర్ లాంటి మిమ్మల్ని బాధపెట్టాలనే వుద్దేశ్యంతో నేనీ మాట అనలేదు. నీ కోసం గానీ వుపయోగపడని ఆర్ట్ ఎప్పుడూ ఆర్ట్ కాదు. మరణానంతరం మన ఆర్ట్ కి నోబుల్ ప్రైజిచ్చినా, పులిట్జర్ ప్రైజిచ్చినా ఒకటే! వర్తమాన సమాజంలో ఆర్ట్ ఆనందానికే కాదు బ్రతుక్కి కూడా వుపయోగ పడాలి.......
ప్లీజ్ కోపరేట్ విత్ మి.....
మీ చెల్లెలు మళ్ళీ మనిషిగా తిరగడానికి నేను కోపరేట్ చేస్తాను. మరొక్కసారి ఆలోచించండి."
ఆ మాట వెనక ఉన్న హరిహరన్ వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తున్నాడు అభినవ్. మనిషి ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ కాక తప్పదు. ఎంతటి బలీయమైన ఆశయమైనా ఒక్కచోట సడలక తప్పదు. ఒక్క క్షణం తర్వాత
"నేనేం చేయాలి?" అడిగాడు నెమ్మదిగా.
హరిహరన్ పెదవుల మీద సన్నటి చిరునవ్వు కదలాడింది.
* * *
మర్నాడు సాయంత్రం ఆరు గంటల సమయం....
హరిహరన్ పోలీస్ అఫీసర్ లా లేడు. ఊరిని చూడడానికొచ్చిన విజిటర్ లా వున్నాడు. అతని వెనక మేఘమలై, ఆ పక్కన అభినవ్.
దాదాపు పాతికేళ్ళ క్రితం పుష్పరాజ్ ఇల్లు వున్న చోటుకి, తిరిగిన ప్రదేశాల్ని మేఘమలై చెప్పిన డెబ్భై ఏళ్ళ వృద్ధుడ్ని కలిసి, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లోకోచ్చారు.
తనేం చేయాలో అర్థం కావడం లేడు అభినవ్ కి.
ఆ ఊళ్లో వున్న సబ్ ఇన్స్ పెక్టర్ ద్వారా ఊరి ప్రెసిడెంట్ తో మాట్లాడాడు హరిహరన్.
వాళ్ళందరూ వెళ్ళిపోయాక "నన్ను అనవసరంగా ఇక్కడకు తీసుకొచ్చారనుకుంటాను" అన్నాడు అభినవ్ నవ్వుతూ.
"ఏం?"
"మీకే సరైన ఆధారాలు దొరకనప్పుడు నన్ను మీరెలా వుపయోగించుకుంటారు?" నవ్వుతూ అన్నాడు అభినవ్.
"నో మిస్టర్ అభినవ్! నేను నీకో గొప్ప ఆధారాన్ని, వండ్రపుల్ ఇన్ స్పిరేషన్ ని ముడిపదార్ధాన్ని యివ్వబోతున్నాను."
"ఏంటది?" వెటనే అడిగాడతను.
"వెయిట్ అండ్ సీ" మేఘమలై తో పాటు బయటికెళ్తూ అన్నాడు హరిహరన్.
అభినవ్ కి ఏమీ అర్థం కాలేదు.