Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 16

   

      కిరణ్మయికి ఏం చెయ్యాలో తోచలేదు. పోలీస్ స్టేషన్ కి కాస్త దూరంలో నిలబడివుంది. పోలీసులు తన వెనుక మాట్లాడిన మాటలు ఆమె చెవిలో యింకా మార్మోగుతూనే వున్నాయి.
   
    అక్కడ ఇన్ స్పెక్టర్ కాస్త మంచివాడిలా తోచాడు. కనీసం అతడైనా బయట వరండాలోకి వస్తాడేమోనని చూస్తూ నిలబడింది. ఈ లోపులో టెలిగ్రాం తీసుకువచ్చి ఇచ్చిన స్నేహితుడు దూరంనుంచి వస్తూ కనిపించాడు.
   
    కిరణ్మయి మొహం వాడిపోయి వుంది. లే ఎండ ఆమె మొహంమీద ఎర్రగా ప్రతిబింబిస్తోంది. అతడు దగ్గిరకొచ్చి "ఏం మాడమ్ - ఇక్కడ నిలబడ్డారు?" అని అడిగాడు. "లోపలికి వెళ్ళనివ్వటంలేదు" అంది కిరణ్మయి. ఆమె కంఠం నూతిలోంచి వచ్చినట్టు వుంది. "-రాత్రి వచ్చినప్పుడు బాగానే మాట్లాడాడు ఇన్ స్పెక్టర్. ఇప్పుడు వెళ్తే ఆయన్ని చూడటానికి కుదరదంటున్నాడు."
   
    "మీరేం చేద్దామనుకుంటున్నారు. "కిరణ్మయి మాట్లాడలేదు. ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. "మీ అన్నయ్యలెవరూ మీతో రాలేదా?" లేదన్నట్టు తలూపింది. "అసలిలా కాఫీలూ అవీ తీసుకెళ్ళి ఇవ్వటానికి వప్పుకోరు" అన్నాడు. "నేనే ప్రాణం వుండబట్టలేక తీసుకొచ్చాను."
   
    "నాకు రూల్సూ అవీ తెలీదు. అరెస్టు చేసిన ఇరవై నాలుగ్గంటల్లోగా మేజిస్ట్రేటు ముందు హాజరు పర్చి , కావాలంటే రిమాండులో వుంచటానికి మళ్ళీ అనుమతి తీసుకోవాలి. అంతవరకూ తెలుసు. మన మెవర్నయినా లాయర్ ని కలుసుకుంటే మంచిదేమో."
   
    "అయితే పదింటికి వెళ్ళడమే మంచిదంటారా?"
   
    "అవును. అప్పుడే వెళ్ళి ఇన్ స్పెక్టర్ ని అడుగుదాం. అతడు ఏ విషయమూ సరిగ్గా చెప్పకపోతే, అట్నుంచి అటే లాయర్ దగ్గిరకి వెళదాం. పదింటికి వదిలేస్తే మనకి లాయర్ అవసరం వెంటనే వుండదు. తరువాత నెమ్మదిమీద చూసుకోవచ్చు."
   
    కిరణ్మయికి ఇది బాగానే వుందనిపించింది.
   
    "థాంక్స్. నే నింటికి వెళతాను."
   
    "పదింటికి మీ ఇంటికొస్తాను. ఈ లోపులో ఎవరైనా లాయర్ లు మా వాళ్ళకి తెలుసేమో కనుక్కుంటాను."
   
    "నేనూ అన్నయ్యలతో మాట్లాడతాను" అంటూ ఆమె వెనుదిరిగింది.
   
    "సిస్టర్-"
   
    వెనుకనించి వినిపించిన పిలుపుకి ఆమె ఆగింది.
   
    "మీరేమీ అధైర్య పడవద్దు. మేము చాలామంది వున్నాం. ముఖ్యంగా చెప్పేదేమిటంటే.....మీరేమీ అదైర్యపడవద్దు."
   
    ఆమె తల వంచుకుని ఇంటివైపు అడుగులు వేసింది.
   
                                   *    *    *
   
    "మీరిప్పటికయినా నిజం చెప్పటం మంచిది."
   
    రాయన్న నుదుటిమీద చెమట తుడుచుకున్నాడు. "ఆ రోజు మేము డిన్నర్ తీసుకున్నాక రాజారావు చాలా 'హై'లో వున్నట్టు గమనించాను. వెళ్ళిపోదాం అన్నాను. అప్పటికి రమణికూడా 'హై'లో వుంది. పిక్నిక్ కి వెళ్దామంది."
   
    "రాత్రి పదకొండింటికి?" అర్ధంకానట్టు అడిగాడు ఇన్ స్పెక్టర్.
   
    "పూర్తిగా 'హై'లో వున్నారిద్దరూ. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు."
   
    "తరువాత?"
   
    "చాలాసేపు సర్ది చెప్పవలసి వచ్చింది. 'ఏమైనాసరే ఈ రాత్రి ఏ సకతీ మమ్మల్ని విడదీయలేదు' అని నాటకీయంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఒకళ్ళమీద ఒకళ్ళు చేతులు వేసుకుని అసభ్యంగా ప్రవర్తించటం మొదలుపెట్టారు. బార్ మానేజర్ వచ్చి అది పబ్లిక్ ప్లేస్ అని, అక్కడ అలా ప్రవర్తిస్తే కష్టం అనీ చెప్పాడు. అక్కణ్నుంచి బయటకొచ్చాం."
   
    "అయినా ఆ రాత్రి వాళ్ళు ఒకర్ని విడిచి మరొకరు వుండలేము అన్నారు కాబట్టి మీరు అక్కన్నుంచి హోటల్ కి వెళ్ళారు...."
   
    .........
   
    "నలుగురూ ఒకే రూంలో మకాం పెట్టారా?"
   
    "లేదు. వాళ్ళని రూమ్ లో చేర్చి, నేనూ లక్ష్మీ వచ్చేసేం."
   
    "మరి రూం మీ పేరుమీద ఎందుకు తీసుకున్నారు?"
   
    "అతడు పూర్తిగా తాగివున్నాడు. ఎవరయితే ఏమని నేను సంతకం పెట్టాను."
   
    "మీరు తాగి లేరా?"
   
    "రెండు పెగ్గులు తాగాను."
   
    "అలా అర్దరాత్రివెళ్తే హోటల్లో రూమ్ ఇస్తారా?"
   
    "రాజారావుకి వాళ్ళు తెలుసట."
   
    "అయినా మీతో సంతకం పెట్టించుకున్నారా?"
   
    "అవును."
   
    "నమ్మమంటారు!"
   
    .........
   
    "అప్పుడు అపురూపలక్ష్మి ఏం చేస్తూంది?"
   
    రాయన్న సమాధానం చెప్పలేదు.
   
    "మీరందరూ జల్సాగా హోటల్ లో రూమ్ తీసుకుందామనుకుంటున్నప్పుడు లక్ష్మి కూడా తాగి వుందా? మీతో హుషారుగా తనుకూడా హోటల్ కి వచ్చిందా? రెండు రూమ్ లు అక్కర్లేదు- ఒకే రూమ్ చాలు అందా? లేక పూర్తిగా తాగి స్పృహ తప్పిపోయిందా?"
   
    "ఇదేమి చెయ్యలేదు."
   
    "మరేం చేసింది?"
   
    "ఏడ్చింది."
   
    "వ్వాట్."
   
    "అవును ఇదంతా ఆ అమ్మాయికి కొత్తలాగా వుంది. మేము ఒక పెగ్ తాగేవరకూ బాగానే వుంది. రమణి 'జిన్'కి ఆర్డర్ ఇవ్వగానే వద్దు వెళ్ళిపోదాం అని మొదలుపెట్టింది. రమణి ఆమెని తిట్టి కావలిస్తే తననీ తాగమంది. అరగంట గడిచేసరికి ముందు చెప్పినట్టు 'హై'లోకి వెళ్ళిపోయారు. వాళ్ళని హాస్టల్ లో దింపుతానని నేను అన్నాను. లక్ష్మి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని తయారై లేచి నిలబడింది. ఇద్దరూ చెరోవైపునుంచి పట్టుబట్టారు. బలవంతంగా హోటల్ కి లాక్కెళ్ళారు!"
   
    "మీరుకూడా లక్ష్మితో ఒక ఛాన్సు దొరుకుతుందేమో అనుకున్నారు."
   
    "నేనెప్పుడూ లక్ష్మిని అలా చూడలేదు."
   
    "ఒహో! మరెలా చూశారు?"
   
    "తనంటే నాకు అభిమానం. ఒక చిన్నపిల్లను చూసినట్టు వుండేది."
   
    "అంతేకానీ మీకు తనతో ఎటువంటి శారీరక సంబంధమూ లేదు. అంతేనా?"
   
    "లక్ష్మితోనా? ఛా లేదు. నన్ను నమ్మండి. ఆ అమ్మాయి చాలా మంచిది. వాళ్ళ నాన్నగారు బి.డి.వో. ఎప్పుడూ తన అక్కల గురించీ, అమ్మగురించీ, తమ్ముళ్ళ గురించీ చెపుతూవుండేది. బాగా బెంగగా వుండేది. ఇంట్లో అందరూ తననెంత గారాబంగా చూసుకునేవారో చెప్పేది."
   
    "మిమ్మల్ని అన్నయ్యా అనికూడా అనేదా?" వెటకారంగా అడిగాడు.
   
    "లేదు. కానీ నేను పరిచయం కాకపోతే ఇంత నగరంలో, ఆ హాస్టల్ హడావుడికి ఉక్కిరిబిక్కిరి అయిపోయేదాన్ని అనిమాత్రం చాలాసార్లు అనేది ఆ అమ్మాయి. చాలా మంచి కుటుంబంలోంచి వచ్చింది."
   
    "రమణి మంచి కుటుంబంలోంచి రాలేదా?"
   
    "వచ్చి వుండొచ్చు. కానీ తను సీనియర్."
   
    "సీనియారిటీకి-మంచికీ సంబంధం ఏముంది?"
   
    .........
   
    "ఇంతకీ ఆరోజు జరిగిన కథ పూర్తిగా చెప్పలేదు మీరు."
   
    రాయన్న ఇప్పుడు కాస్త ధైర్యంగా జవాబులు చెప్పగలుగుతున్నాడు. తన మాటలు ఇన్ స్పెక్టర్ వింటున్నాడన్న నమ్మకం కలిగింది.
   
    "రాజారావు కూడా హోటల్ కే అని పట్టుపట్టాడు. పైగా తనకు తెలిసిన హోటల్ అన్నాడు. మరోవైపు లక్ష్మి ఏడుస్తూంది. నాకేం చెయ్యాలో తోచలేదు. వాళ్ళిద్దర్నీ హోటల్ లో వదిలేసి, లక్ష్మిని హాస్టల్ లో దింపుదామనుకున్నాను."
   
    "మీ ఇద్దరికీ స్కూటర్లున్నాయా?"
   
    "నాకు లేదు. అతనికుంది. కానీ ఆ పరిస్థితుల్లో స్కూటర్ అతడు డ్రైవ్ చేస్తే ప్రమాదమని నేనే చేశాను. నా వెనుక లక్ష్మి కూర్చుంది. వాళ్ళిద్దరూ ఆటోలో వచ్చారు."
   
    "ఆటోలో ముగ్గురూ కూర్చోవచ్చు కదా-"
   
    "లక్ష్మి వాళ్ళతో కలిసి కూర్చోవటానికి భయపడింది."
   
    "సరే. నలుగురూ హోటల్ కి వచ్చారు. తరువాత ఏం జరిగింది?"
   
    "అక్కడ రాజారావుకీ, రిసెప్షనిస్టుకీ గొడవ జరిగింది. తనకున్న పరపతికి రూమ్ ఇవ్వాలనీ, సంతకాలు అవీ రేపు పెడతాననీ అంటాడు రాజారావు, కుదరదంటాడు రిసెప్షనిస్టు. చివరికి నేను సంతకంపెట్టి ఇద్దర్నీ పంపాను. తరువాత లక్ష్మిని తీసుకొచ్చి హాస్టల్ లో దింపాను."

 Previous Page Next Page