"చెబుతాను పద" అంటూ ఆమె నిలబడి, కోడల్ని కూడా రెక్క పట్టుకుని లేవదీసి బయటకు తీసుకుపోతూంది.
"ఎక్కడి కత్తయ్యా?" అంటూంది భారతి మాట వెలువడీ వెలువడనట్లు.
"అంత అమాయకురాలివా? లేక నటిస్తున్నావా?" అంటూ రంగాజమ్మగారు కోడల్ని సారథి గదిదాకా తీసుకువెళ్ళి "బాబూ! సిద్ధంగా వున్నావా?" అని బయట నుండి కేకవేసింది.
"నేను రెడీయేనమ్మా!" అని లోపలి నుండి జవాబు వచ్చింది.
తను రెడీనా? అంటే అర్ధమేమిటి? తనని తోటలోకి షికారు తీసుకువెళ్ళటానికి సూటూ, బూటూ వేసుకుని రెడీగా వున్నాడా? ఆయన సూటు వేసుకుని బయటకు వచ్చి దర్శనమిస్తే మాత్రం తను ఇక్కడి నుంచి ఆమడదూరం__చందరాలలో, అంతకంటే ఇంకా పైకి పారిపోతుంది.
"అయితే బయటకు రా. లోపల ఎంతసేపు దాక్కుంటావు?"
సారధి బయటకు వచ్చాడు. అతనివంక చూడకూడదనుకుంటూనే చూసిన భారతి 'అమ్మయ్య' అని సేద తీరినట్లయింది, సిల్కులాల్చీ, పైజమా వేసుకుని వున్నాడు. రాజ్య పరిపాలన గురించి ఏమీ పట్టించుకోకుండా కలల్లో తేలిపోయే సుకుమారుడైన రాజకుమారుడిలా వున్నాడు.
'ఇతను అందగాడేనమ్మా. ఇది ఓ రకం అందం మల్లికా!" అనుకుంది భారతి.
"అమ్మా, వెళ్ళిరామా" అన్నాడు సారథి అక్కడినుంచీ త్వరగా త్వరగా తప్పించుకునే ఉద్దేశంలో వున్నట్లు.
రంగాజమ్మగారు నవ్వి "అలాగే బాబూ!" అని భారతిని మృదువుగా ముందుకు నెట్టింది. సారథి అడుగు ముందుకు వేశాడు. ఇద్దరూ అనుకోకుండా ఒకరి ప్రక్క ఒకరు నిలబడ్డారు.
"పద భారతీ!" అని అతనన్నట్లు ఆమెకు వినిపించింది, బహుశా అని వుండడు.
ఆమె మంత్రబద్ధ అయినట్లు ముందుకు కదిలింది. ఇద్దరూ ఒకరి ప్రక్క ఒకరు నడుస్తూ మెట్లుదిగి క్రిందికి వచ్చారు. హాలు దాటి, బయటకు వచ్చేసరికి కారు సిద్ధంగా వుంది.
వెనకసీట్లో యిద్దరూ కూర్చున్నాక కారు కదిలింది.
డ్రైవరు బట్టతలమీద నెరిసిన వెంట్రుకలు గాలికి కదులుతున్నాయి. ఈ పెళ్ళికి అతని సారథ్యం కూడా కొంత వుంది. భారతి అతనివంక ఆసక్తిగా చూస్తూ నవ్వుకుంది.
కొద్దిగా తల త్రిప్పి ఓరగా సారధివైపు చూసింది. అదే సమయానికి అతనూ ఆమె వైపు చూశాడు. తనతో మాట్లాడాలన్న తాపత్రయం, ఆరాటం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా ఏం మాట్లాడాలో తెలియనట్లు కళ్ళప్పజెప్పి ఊరుకున్నాడు భారతి మళ్ళీ ముఖం యిటువైపు త్రిప్పుకుని 'ఈయన ఈ శతాబ్దంలో పుట్టవలసిన మనిషి కాదు' అనుకుంది. 'పోనీ, నేనే పలకరించనా?' అనుకుంది.
ఇలా అనుకుంటూనే మౌనం నాట్యంచేస్తూండగా సమయం గడిచిపోయింది. కారు ఊరు బయటకు చేరుకుని తోట సమీపించి, గేటు దగ్గర ఆగిపోయింది. కాపలావాడు తోటలోనే పాక వేసుకుని కుటుంబంతో కాపుర ముంటున్నాడు. కారు ఆగిన శబ్దం విని కాపలావాడు పరిగెత్తుకు వచ్చి గేటు తెరిచాడు. సారధి భారతితో సహా కారుదిగి లోపలకు నడిచాడు.
ఆకాశం మబ్బు మబ్బుగా వుండి, చల్లని పిల్లతెమ్మరలు వీస్తున్నాయి. దూరంగా కనిపించే పర్వతశ్రేణుల మీది ఆకుపచ్చని అడవులు మబ్బుల చాటున మూసుకుపోతున్నాయి. తోటలోకి అడుగు పెట్టగానే రకరకాల పిట్టలు చెట్లమీద నుంచి ఎగురుతూ కనిపించాయి.
భారతి పులకితురాలై పోయి హాయిగా గుండెల నిండా గాలిపీల్చుకుని చుట్టూరా తిలకించింది.
ఎంత పెద్ద తోట! ఎన్నిరకాల వృక్ష సమూహాలు! జామచెట్టు నిండా పళ్ళు విరగగాచి నేలమీదివరకూ వ్రేలాడుతున్నాయి. మామిడి చెట్లు సరేసరి. బరువుగా కాయలతో నిండిపోయి 'మా భారం తొలగించం'డని వేడుకున్నట్లు కనిపించాయి. నిమ్మ, దానిమ్మ ,సీతాఫలపు చెట్లు, ఇంకా ఎన్నో రకాలు....భారతి ముగ్ధురాలయిపోయింది.
పువ్వులు....రంగుల రంగుల, వివిధ వాసనలు విరజిమ్మే పువ్వులు, ఆ పువ్వులన్నీ కోసుకుని, క్రింద రాశిగా పోసి పాన్పు చేసుకుని, దానిమీద మెత్తగా పవళించాలనుకుంది భారతి.
ఆకాశం ముసురు ముసురుగా వుంది.
భారతి అడుగు ముందుకు వేద్దామనుకుంది. ఇంతలో ఆమె భుజంమీద మృదువైన చెయ్యి పడింది. ఉలిక్కిపడి, తల ఎత్తి సారథి ముఖంలోకి చూసింది. ఆమె పెదిమలు వణుకుతున్నాయి. విశాలమైన ఆమె కన్నులు సిగ్గుతో, భయంతో కలవరపడుతున్నాయి.
"భారతీ!" అని పిలిచాడతను.
కొండల సమూహం మధ్య ఆ పిలుపు పదిసార్లు ప్రతిధ్వనించినట్లు ఆ స్వరం పదే పదే "భారతీం, భారతీ!" అని ఆమె చెవిలో మార్ర్మోగింది.
"ఊఁ!" అంది అప్రయత్నంగా ఆమె.
తన రెండవ చేతిని కూడా ఆమె రెండవ భుజంమీద వేసి తన వైపు త్రిప్పుకున్నాడు మృదువుగా.
"అబ్బ!" అంది భారతి కళ్ళు మూసుకుని.
"ఏమిటి? నొప్పి కలిగించానా?"
"ఉహుఁ!" అంది కళ్ళు తెరవకుండానే తల అడ్డంగా త్రిప్పి.
ఆమె కళ్ళు తెరిచి అతని వంక చూసి నవ్వి, "నాకు తెలియదు" అంది.
ఆకాశం మరీ ముసురు క్రమ్మివేసినట్లయింది. ఇద్దరి ముఖాలలోని హావ భావాలను దాచిపెట్టేందుకు చీకటి వ్యాపిస్తున్నట్లయింది.
ఆమె లేత భుజాలమీద అతని సున్నితమైన వేళ్ళు సంకోచపడుతూ నర్తించాయి.
అతనికేం మాట్లాడాలో తోచలేదు. ఒక నిమిష మాలోచించి అన్నాడు! "ఒక నెల రోజులక్రితం మనం యిద్దరం ఒకరి కొకరు ఎంత అపరిచితులమో! ఇంత త్వరగా వివాహితుణ్ణి అవుతానని కూడా నేననుకోలేదు. ఎప్పుడూ ఏకాంతంగా బొమ్మలు గీసుకుంటూ, ఫిడేలు వాయించుకుంటూ, పిచ్చిగా తిరుగుతూ కాలం గడిపే నాలో ఇలాంటి కోరిక వుదయించటం వింతగానే వుంది!"
భారతి కనురెప్పలు క్రిందకు వాల్చి మౌనంగా నిలబడింది.
"ఈ తోటలో ఎన్నోసార్లు ఒంటరిగా విహరిస్తూ, ప్రకృతిని పుపాసిస్తూ గడిపాను. గంటలకు గంటలు ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూనో, చెరువుగట్టున చతికిలబడి వాయిస్తూనో గడిపేవాణ్ణి."
"మీరు మురళి వాయిస్తారా?" అని అడిగింది భారతి తల ఎత్తి
"అప్పుడప్పుడూ, ఊరికి దూరం వచ్చినప్పుడు, కాని నాకు వయొలిన్ ఎక్కువ యిష్టం"
"మీ రదృష్టవంతులు. మీ కన్నీవచ్చు" అనుకుంది భారతి.
"నీకేది యిష్టం మరి?"
కొంచెం ఆలోచించి ఆమె అన్నది! "ప్రత్యేకించి చెప్పలేను. ఆ వాయిద్యాల కంటే వాటిని మనోహరంగా పలికించేవారంటే ఎక్కువ యిష్టమేమో!"
"అమ్మో! అయితే నీ యిష్టంలో నేనెక్కడ నిలుస్తానో?"
"ఆ మాట ఎవర్ని ఉద్దేశించి అన్నానో గ్రహించలేకపోయారా?" అనుకుంది భారతి.
మెల్లగా వినిపించీ వినిపించనట్లు, "మన కాపురం మొదలయీ మొదలవక ముందే మీలో అసూయ బయల్దేరిందే" అన్నది.
"ఏమిటీ అన్నావు?" అన్నాడతను సరిగ్గా వినబడక.
భారతి చిన్నగా నవ్వి, "ఏమీ లేదులెండి" అని తప్పించుకుంది.
సారథి ఒక భుజంమీద నుంచి చెయ్యి తీసివేసి, "ముందుకు పోదామా?" అన్నాడు.
"మీ ఇష్టం."
"పద. అతను తన చేతిని భుజం చుట్టూ వేసి ముందుకు అడుగువేశాడు. అతనితో పాటే ఆమె నడవసాగింది.
మెల్లిగా చినుకులు కూడా పడసాగినాయి. గాలికి కొమ్మలు ఆకులతో సహా కదిలిన చప్పుడుతో, ఆకులమీది చినుకులు పడినప్పుడు కలిగే 'టప్ టప్' మనే చప్పుడు మిళితమై వింత ఆహ్లాదం కలిగిస్తూంది చెట్లచాటు నుంచి రెండు కుందేళ్ళు వచ్చి వాళ్ళ కాళ్ళ ముందుగా పరిగెత్తుకుపోయినాయి. భారతి మనసు పురి విప్పిన నెమలిలా అయింది.