"అర్ధమయిందిలే నాన్నా! నన్నిక్కడ వదిలేసి వెడతానని చెప్పటానికి ఇంత ప్రయాసపడ్డావు అంతేకదూ" అని అడిగింది సూటిగా భారతి, తండ్రి ముఖంలోకి చూస్తూ.
ఆయన కుమార్తెను మరింత దగ్గరగా తీసుకుంటూ, "చూడు తల్లీ! అలా మనసు కష్టపెట్టుకోకూడదు. ఈ సాంప్రదాయాలూ, ముచ్చటలూ గట్టిగా కాదనటానికి వీలుకాదు మరి. అవతలేమో నాకు...." అన్నాడు.
"తలకు మించినన్ని పనులు, ఏం నాన్నా! నన్ను విడిచి ఉండటానికి కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నావు కదూ?"
"కాదు, భారతీ, కాదు ముందు జరగబోయే పరిణామానికి ఇప్పటి నుంచీ నన్ను శిక్షించుకొనేటంతటి అవివేకిని కాదు."
భారతి ఒక నిమిషం మెదలకుండా నిలబడి, "నువ్విక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవటం నీకు శ్రేయస్సే నాన్నా. ఈ వాతావరణం నీ కంతగా ఇమడదు. ఎవరికీ ఏ వికారమూ కలగకముందే, నీ గౌరవం కాపాడుకున్నట్లవుతుంది" అన్నది నిర్లిప్తంగా.
"తప్పు అలా అనకూడదమ్మా. వాళ్ళంతా ఎంతో మర్యాదస్తులు. మనపట్ల ఎంతో గౌరవ ప్రతిష్టలతో ప్రవర్తించారు."
మరో నిమిషం మౌనంగా కదిలిపోయింది.
"నాకదే విచిత్రంగా కనబడుతుంది నాన్నా!" అంది భారతి మనసులోని వ్యధను దాచుకుంటున్నట్లు. "సర్వత్రా ఇలాగే జరుగుతూ వుంటుంది. తమ బిడ్డల సుఖం కోసమని చాటుకుంటూ అందరాని అంతస్తులకు అర్రులుచాచి, క్రిందామీదా అవుతారు తలిదండ్రులు. తీరా ఆ బిడ్డను తీసుకెళ్ళి ఓ అగాతంలో పారేశాక ఊపిరి సలపనట్లూ ,హక్కులు కోల్పోయినట్లూ బాధపడి, అశాంతికి గురి అవుతారు."
గౌరీపతిగారు ఆమె పోరబడుతూన్నదని వ్యక్తీకరించటానికన్నట్లు బలవంతాన నవ్వు తెచ్చుకుంటూ. "అదేమీ కాదమ్మా తమ బిడ్డకు న్యాయం జరిగిందన్న తృప్తి కలిగిననాడు__తాము దూరంగా వుండవలసి వచ్చినా సరే.... తలిదండ్రుల సంతోషానికి అవధులు వుండవు" అన్నాడు.
అంతలో రాధమ్మ'గారు వాళ్ళని వెతుక్కుంటూ అక్కడికి రావటంతో వారి సంభాషణ అక్కడితో ఆగిపోయింది.
"మీరందరూ ఇక్కడ వున్నారా?" అన్నట్లు చూస్తూ ఆమె గదిలికి వచ్చి భారతి వంక తిరిగి,"అఁ దా" అంది ఏదో చెప్పటానికి ప్రయత్నిస్తూ.
"పిన్నీ!" అని అరుస్తూ భారతి ఆమె చేయి పట్టుకుంది. "నాన్న నిన్ను నాకు సాయం వుంచి తాను వెళ్ళిపోతానంటున్నాడు, విన్నావా?" అన్నది.
రాధమ్మ కొంచెం ఆలోచించినట్లు ముఖంపెట్టి తరువాత తల వూపుతూ 'ఉంటాను' అన్నట్లు చేయి కూడా ఆడించి సూచించింది.
"పిన్నీ! నువ్వు కూడా మారిపోయావా? నీ తెలివితేటలన్నీ ఏమయిపోయాయి? నా చుట్టూ ఇంతమంది పరివేష్టించి కాపాడుతూండగా, నువ్వు కూడా నాన్నని వదిలేసి ఇక్కడే కూర్చుంటే, నాన్న నెవరు చూస్తారక్కడ? ఆయన తిండీ తిప్పలూ సంగతేమిటి?" భారతి కొంచెం గదమాయించినట్లుగా అడిగింది.
రాధమ్మ పశ్చాత్తాపపడినట్లు లజ్జాభారంతో ముఖం నిండిపోగా కళ్ళప్పగించి అమాయకంగా చూసింది.
"భారతీ! ఇదేమిటమ్మా, నాకేం భయం...." అని తండ్రి ఇంకా ఏదో అనబోతూ వుండగా ఆమె మధ్యలోనే అడ్డుకుని మొండిగా, "నువ్వు పిన్నిని తీసుకెళ్ళాలిసిందే లేకపోతే నిన్నిక్కడనించి అడుగు కూడా కదలనివ్వను, తెలుసా" అంది.
గౌరీపతిగారు హతాశుడై "నీ ఇష్టమమ్మా" అన్నాడు చేసేది లేక.
రాధమ్మ భారతికి దగ్గరగా వచ్చి తన చేతిని ఆమె వీపు చుట్టూ వేసి కళ్ళ నీళ్ళు తిరుగుతూండగా ఆప్యాయంగా మూగభాషలో మాట్లాడింది.
"మాటలు రాకపోతే ఏం పిన్నీ? నాన్నకు నిన్ను మించిన రక్షణ శక్తిఏదీలేదు"
"పోనీ మల్లికనైనా నీకు తోడుగా వుంచుకో అమ్మా"
"ఆమె నీకంటే ముందే ప్రయాణమయింది, నాన్నా. వాళ్ళమ్మ గారికి పాపం ఒంట్లో అస్వస్థత వుందిట. వెళ్ళవచ్చని నేనిప్పుడే పర్మిషన్ ఇచ్చేశాను"
ఇందాకటి నుంచీ మౌనంగా నిలబడివున్న మల్లిక "అవునండీ, బాబాయిగారూ ప్రొద్దుటే పాలేరు వచ్చి చెప్పాడు. అమ్మకి ఒంట్లో ఏం బాగులేదుట. నన్ను తొందరగా రమ్మని కబురుచేసింది" అంది తన అసమర్ధతకు సిగ్గుపడుతూన్నట్లుగా.
"అయ్యో! అలాగా!" అని గౌరీపతిగారు సానుభూతి వ్యక్తంచేసి, "అయితే నువ్వు కూడా మాతోటే రావచ్చు. అంతా కలిసేపోదాం" అన్నారు.
భారతి బరువుగా నవ్వింది. "ఎందుకు నాన్నా, మీ అందరి ముఖాల్లో దిగులు కనబడుతోంది? ఏదో తప్పుచేసినట్లు తడుముకుంటారేం? నా శుభంకోసం మీరంతా కష్టపడ్డారు .మీ మేలు మరిచిపోలేను, నాన్నా. నేనిక్కడ ధైర్యంగా వుంటాను, వెళ్ళిరండి, నాన్నా" అంది.
అందరి ముఖాలూ వాడిపోయినట్లయ్యాయి. ఆ క్షణంలోనే మల్లికకు పెళ్ళంటే విరక్తి కలిగింది.
* * * *
మరునాటి సాయంత్రం రంగాజమ్మగారు కోడలికి తలదువ్వి జడవేస్తూ, "నువ్వు ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది ఒకటుంది. అందాలొలికే ఈ జుట్టు ఎప్పటికీ వూడిపోకుండా చూసుకోవటం. ఇది నీకు దేవుడిచ్చిన వరం. ఈ వరాన్ని వృధా చేసుకోకు" అంది.
"అంటే?" అన్నది భారతి నవ్వుతూ.
"త్రాచుపాములాంటి ఈ జడను మీ ఆయన మెడచుట్టూ బిగించి వుంచు, అర్ధమయిందా?"
భారతి మళ్ళీ నవ్వి ఊరుకుంది. ఏమీ జవాబు చెప్పలేదు.
అసలీ వేళ ఈ ముష్తాబంతా ఎందుకూ అని అనుమానం వచ్చిందామెకు. ఎప్పటికన్నా హడావుడి చేస్తూందీ రోజు అత్తగారు.
"చూడు భారతీ! పెళ్ళయాక ఒక్కసారయినా నిన్ను పలకరించాడా మా సారథి?"
భారతి సిగ్గుపడిపోయి ,లేదత్తయ్యా!" అన్నది చిన్నగా.
"పోనీ, నువ్వయినా అతన్ని పలకరించావా?"
"పొండత్తయ్యా"
"అట్లా అని తప్పించుకోకు. నిజం చెప్పు."
"ఉహుఁ. లేదు."
"అదేం? ఇంత విడ్డూరం నేనెక్కడా చూడలేదు. ఇదేనా ప్రేమించుకోవటమంటే?" భారతి జడ పుచ్చుకుని వెనక్కి గుంజింది.
భారతి హృదయం ఆర్ద్రమై, నవనీతమై యింకేమో అయింది. తనకు వరమివ్వటంకోసం దేవలోకం నుండి దిగివచ్చిన కోరికలు తీర్చే తల్లిలా కనిపించింది గాని, ఏమాత్రమూ అత్తగారిలా కనిపించలేదు.
"సరే, మీరిద్దరూ మీ ఇష్టానికి వదిల్తే గోళ్ళు గిల్లుకుంటూ సంవత్సరాల తరబడి గడపగలరు గాని, మా తోట చూడ్డానికి ఏర్పాటు చేశా నీవేళ ఏం?" అంది రంగాజమ్మగారు, జడవెయ్యటం పూర్తిచేసి కోడల్ని భుజాలు పట్టుకొని తనవైపు తిప్పుకుంటూ.
"తోట! అక్కడ పువ్వులు వుంటాయా, అత్తయ్యా" అని అడిగింది భారతి ఎంతో సంబరపడి.
"ఒక్క పువ్వులేమిటి? రకరకాల ఫలవృక్షాలు__ఎన్నో, చాలా బాగుంటుందిలే."
భారతి ఉత్సాహం ఆపుకోలేక, "అయితే రండత్తయ్యా, త్వరగా పోదాం" అంది తొందరపెడుతూ.
రంగాజమ్మగారు విస్మయంగా చూసి బుగ్గ నొక్కుకుని, "ఏమిటీ? నువ్వూ నేనూనా? ఇందుకా నిన్నింత ముస్తాబు చేసింది?" అంది కళ్ళు కూడా పెద్దవి చేసి.
"మరి?" అంది భారతి బెదిరినట్లుగా.