"వాటీజ్ యువక్వాలిఫికేషన్?" అందా ఆంగ్లో ఇండియన్ నా వేపు చూసి నాకేమి అర్ధంకాలేదు ఆమె మాటలు. ఎందుకయినా మంచిదని ఓ చిరునవ్వు నవ్వాను మాట్లాడకుండా!
"వయాయు లాఫీన్?" అందామె మళ్ళీ.
నాకు భయం మొదలయింది! ఆమె మాట్లాడేభాష ఇంగ్లీష్ లాగానే వుంది కాని ఇంగ్లీషు మాత్రంకాదు.
మళ్ళీ ఓసారి నవ్విబట్టతలాయనవేపు చూశాను.
"వయ్ డోంటుయు ఆన్సర్?" అన్నాడతను చిరాకుగా.
నాకు చెమటలు పట్టినయ్...
"మీరేమంటున్నారు?" అనడిగాణు ఆయనను దీనంగా కళ్ళజోడతను నా పరిస్థితిని చూసి జాలిపడ్డాడు.
"అతనికి ఇంగ్లీషు రాదు కాబోలు-" అన్నాడు వాళ్ళందరితోనూ జాలిగా.
"అవునండీ! నేను తెలుగు మీడియం" అన్నాను వినయంగా.
"మైగాడ్" అన్నాడు బట్టతల వ్యక్తి బట్టతలను సవరించుకుంటూ.
"కిరణ్-టెల్ మీ-వాటీజ్ యువర్ నేమ్?" అడిగిందామె. వాడు నావేపు చూశాడు.
"కమాన్ - వాటీజ్ యువర్ నేమ్? చెప్పు-" అన్నాన్నేను వాడితో వాడు మళ్ళీ అందరివేపు చూశాడొకసారి. నోరు మెదపలేదు- ఆమె మళ్ళీ అడిగింది. వాడు మళ్ళీ అందరి మొహాలు చూశాడు. నాకు వాడిమీద ఒళ్ళు మండిపోయింది. చెంపలు పగలకొట్టాలన్న కోరికను అతి కష్టం మీద అణచుకున్నాను.
"చెప్పు నీ పేరు చెప్పు" అన్నాను ఆత్రుతగా.
వాడు నోరు కదపలేదు.
"టెల్ ఎ బి సి డి...." అందామె.
వాడు ససేమిరా పలకలేదు.
"ఎ బి సి డి చెప్పారా?" అన్నాన్నేను కసిగా.
వాడు మాట్లాడలేదు.
"ఓ వెరీ పూర్-"అందామె మళ్ళీ.
నాకు అర్ధమైపోయింది వాడికి సీటు దొరకడం దుర్లభమని.
"సారీ సీటు దొరకదు" అన్నాడు కళ్ళజోడు.
"వీడు కొంచెం కొత్తగా ఫీలవుతున్నాడండీ! అందుకని చెప్పడానికి జంకుతున్నాడు. అంతే! నిజానికి వాడికి అన్నీవచ్చు కొన్ని పదాలు కూడా చెప్పగలడు. "బ్రతిమాలుతూ అన్నాను.
"సారీ- మిస్టర్-పోనీ మీకయినా మంచి మార్కులొస్తే తీసుకునే వాళ్ళం" అన్నాడతను.
"నాకా? నాకు మార్కులేమిటి?"
"ఈ ఇంటర్వ్యూలో మేము పేరంట్ నీ, పిల్లలకూ కూడా వాళ్ళకెపాసిటీ చూసి మార్కులేస్తాము..."
"అదేమిటి? చదివేది వాళ్ళయితే మమ్మల్నెందుకు పరీక్షించడం?"
"ఇంటి దగ్గర కూడా పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకునే తెలివిగల తల్లిదండ్రులుంటేనే సీటు ఇవ్వాలని మా మేనేజ్ మెంట్ నిర్ణయం యూకెన్ గో! ఓ! మీరు తెలుగు మీడియం కదూ- మీరిక వెళ్ళవచ్చు."
నేను కిరణ్ గాడిని బయటికి ఈడ్చుకొచ్చాను.
"ఏమయింది?" అడిగారు జనం చుట్టూ మూగి.
"నేనూ, మా కుర్రాడు ఇద్దరం ఫెయిలయ్యాం" అన్నానేను.
పిల్లలను తీసుకుని నేనూ, గోపాల్రావ్ బయటికొస్తుంటే ఓ కారు ఎదురొచ్చి ఆగింది. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి కారు దిగుతూనే నన్ను చూసి-
"అరె! నువ్వీడకొచ్చినావేమి సంగతన్నా?" అన్నాడు నన్ను గుర్తుపట్టి.
"ఏం లేదు రాములూ! వీళ్ళిద్దరికీ స్కూల్లో ఎడ్మిషను ట్రైచేద్దామని...."
ఈలోగా ఫ్యూన్ పరుగుతో వచ్చి అతనికి సెల్యూట్ కొట్టి నిలబడ్డాడు.
"అరేయ్- ఇగో- సూడు- ఈ దొరల్ని తోలుకపోయి నా కమరాలో కూర్చుండబెట్టు నేను ప్రిన్సిపాలుడితో జరంత మాట్లాడొస్త! పదండ్రన్నా! ఆడ కూర్చోండ్రి! ఇప్పుడే వస్తా!" అని సరాసరి ప్రిన్సిపాల్ రూమ్ లొ కెళ్ళిపోయాడు. నేనూ, గోపాల్రావ్ ఫ్యూన్ తో పాటు మేడ మీద కెళ్ళి సెక్రటరీ అని బోర్డువున్న గదిలోకెళ్ళి కూర్చున్నాము. ఎయిర్ కండిషన్ ఏర్పాటు ఉండటంచేత చాలా చల్లగా ఉందాగది. లోపల చాలా ఖరీదయిన ఫర్నీచరు.
"ఇప్పుడు నీతో మాట్లాడితను ఈ స్కూలు సెక్రటరీయా?" అడిగాడు గోపాల్రావ్ ఆశ్చర్యంతో.
"అలాగే కనబడుతోంది!" అన్నాను ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ.
"ఎట్లా తెలుసు నీకతను?"
"నేను ఎక్సయిజ్ డిపార్టుమెంటులో పని చేసేటప్పుడు పరిచయం. సారా దుకాణం కాంట్రాక్టర్- ఆ ఏరియాలో రౌడీ."
రాములు లోపలికొచ్చి కూర్చున్నాడు.
"ఆ! చెప్పన్నా! నువ్వు ఎడ్మిషన్ గురించి వచ్చినావ్?"
"అవును! అది సరేగానీ ఈ స్కూలు..."
"నాదే అన్నా! గుడంబదందా నడిచినంతకాలం మంచిగానే ఉండేగానీ, థూల్ పేటలో పోలీసుల జులుం ఎక్కువయిందన్నా! ఇక ఆళ్ళతో కిరికిరెందుకానీ ఆ దందా బంద్ చేసి ఈ స్కూల్ దందా షురూజేసిన! ఇగో-నిజం చెప్తున్న- ఇను! ఈ స్కూల్ నడిపే దందాల ఇంత లాభముందని ముంగటే ఎరికుంటే నేను ఆ ఫాల్తుగుడుంబ పక్కకే పోకపోతుండె! పెద్ద పెద్దోండ్లు వచ్చి స్కూల్ల సీటు గురించి క్యూల నిలబడుతున్రు! ఇక పైసలు ఎన్ని గట్టమంటే అన్ని కట్టనీకి తయారు.... రెండేండ్లకిందట ఇరవైవేలతో ఈ స్కూలు షురూజేసిన! గిప్పుడు కమాయ్ ఎంతనో ఎరుకనా? పది లక్షలు గిట్లుండాల దంద అంటే!"
నేనూ, గోపాల్రావ్ నివ్వెరపోయి వింటూండిపోయాము అతని మాటలు.
"అది సరేగానీ మా పిల్లలిద్దరికీ ఎడ్మిషన్ కావాలి మీ స్కూల్లో! ఇప్పిస్తావా? అడిగాన్నేను అయిష్టంగానే. గుడంబా వ్యాపారం చేసే ఓ రౌడీ నడిపే స్కూల్లో మా పిల్లలు చదువు నేర్చుకోవడం నాకు నచ్చలేదు. రాములు ఓ నిమిషం మాట్లాడలేదు. ఏదో ఆలోచనలోపడ్డాడు.
"పోనీలే- కష్టమయితే ఇంకో స్కూల్లో ప్రయత్నిస్తాము" అన్నాను నేను అతని ధోరణి చూసి.
"కష్టం గురించికాదన్నా! నేను వేరే విషయం గురించి సోంచాయిస్తున్నా!"
"ఏమిటది?"
"నువ్వు నాకు చాలాసార్లు మదద్ చేసినావ్! గసంటప్పుడు నీకు నిజం చెప్పకుండా లోపల జేయనికి నాకిష్టంలేదు. నీ పిల్లగాడ్ని భీ నా పిల్లగాడు లెక్కచూడాలి గదా! వీళ్ళని వేరే మంచి స్కూల్ల జేర్పించు! నా స్కూలు మంచిగలేదు."
నేనూ, గోపాల్రావ్ మొఖాలు చూచుకున్నాం! ఆ స్కూలు ఎంతో గొప్పదన్న పుకార్లు వినే మేము అక్కడికొచ్చామసలు.
"నీ స్కూలు ఎందుకని మంచిదికాదు?" అడిగాన్నేను.
"ఏమి జెప్పాల? సదువు మంచిగుండదు."
"అదేమిటి? ఎక్కువ ఆంగ్లో ఇండియన్ టీచర్లున్నారు కదా!"
"అగో అక్కడనే లోపటయేది అందరూ! ఆ చట్ కారోళ్ళు ఏం సదివిన్రనుకుంటున్నావు? ఎనిమిదో కలాసు. అదికూడా పాస్ కాలే! తప్పిన్రు. ఇంక ఆళ్ళు పిల్లగాండ్లకేమ్ జెప్తరు? వాండ్లకే తెలియకపాయె! ఇంక మిగిలినోండ్లలొ ఇద్దరు పోరీలు మా బంధువులే! ఇద్దరూ అయిదో క్లాస్ తోనే బంద్ చేసిన్రు. ఈళ్ళందరికీ జరస్త ఇంగ్లీష్ మంచిగొస్తది గనుక నడిచి పోతున్నది. లేకుంటే అప్పుడే కిరికిరి అవుతుండే. అసలు నా కొడుకులిద్దరు ఏడ జదువుతున్రో నీకెరుకనా?"