Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 14


    "అది ఒక ద్వీపం అటండీ! ఎక్కడుంది అనడిగారు.-" విసుక్కుంటూ చెప్పాడా వ్యక్తి తెలుగులో.
    "ద్వీపం అంటే" మళ్ళీ అడిగాడా బిజినెస్ మ్యాన్.
    "ద్వీపం అంటే కూడా తెలీదుటయ్యా" ఇంకెవరో ఫోజుతో అడిగాడు.
    "ద్వీపం అంటే మూడువేపుల నీరు ఒకవేపు నేలవుంటుంది" అన్నాడు ఒకతను తెలిసినట్లు.
    "కాదు-" ఇంకెవరో అరిచారు.
    "ద్వీపం అంటే చుట్టూ సముద్రం మధ్యలో భూమివుంటుంది."
    "చుట్టూ సముద్రమే ఉండనక్కరలేదు. నది నీరు చుట్టూ వున్నా దానిని ద్వీపమే అంటారు" అన్నాడు గెజిటెడ్ ఆఫీసర్ గారు.
    "కాదు" తను తాలూకాఫీసులో ఎల్డీసీ గా పని చేస్తున్నానని అంతకుముందే పరిచయం చేసుకున్నాయన ఎదురుతిరిగాడు.
    "చుట్టూ నీరువుంటే దానిని లంక అంటారు. సముద్రం వుంటే ద్వీపం అంటారు" అన్నాడతను.
    కొంతమంది ఆలోచనలోపడ్డారు. అతని మాటలు నిజమా కాదా అని!
    "ఇంతకూ ఆ మూర్ ద్వీపం ఎక్కడుందసలు?" గోపాల్రావ్ బుర్రగోక్కుంటూ నన్నడిగాడు.
    "సౌత్ అమెరికా దగ్గర" అన్నాన్నేను తడుముకోకుండా.
    "కరెక్ట్! బ్లాక్ సీలో ఉందది" అన్నాడు మరో ఆఫీసరు నన్ను సమర్ధిస్తూ.
    "కాదు మన ఇండియా దగ్గరే ఉందది" అన్నాడు మరొకతను. అంతా ఆశ్చర్యపోయారు.
    "మన ఇండియా దగ్గరా?"
    "అవును బంగాళాఖాతం సముద్రంలో ఉంది."
    "నో! ఇటీజ్ నాట్ బే ఆఫ్ బెంగాల్. అరేబియా సముద్రం" అన్నారింకెవరో.
    "అదికూడా కాదు ఇండియన్ ఓషన్, అంటే హిందూ మహాసముద్రం" అన్నాడు మరొకతను.
    "అసలు మనకి మొత్తం ఎన్ని సముద్రాలున్నాయి?" అడిగారెవరో.
    "అది సరేగాని- అసలీ ప్రశ్న మన పేరెంట్స్ నెందుకడిగినట్లు?" ఒకాయన ఆలోచిస్తూ అన్నాడు.
    "అవును! నిజమే! మూర్ ఐలెండి సంగతి మనకెందుకుట?"
    ఈలోగా మరో వ్యక్తి ప్రిన్సిపాల్ రూమ్ లోంచి బయటపడ్డాడు హుషారుగా.
    అందరూ అతని చుట్టూ మూగారు.
    "మిమ్మల్నేం అడిగారు?"
    "19x19 ఎంతో చెప్పమన్నారు. ఠకీమని చెప్పేశాను. అంతే! మా అబ్బాయికి సీటు ఇవ్వడానికి వప్పుకున్నాడు."
    "అంటే మీ అబ్బాయినేమీ అడగలేదా?"
    "ఒక్క ముక్కకూడా అడగలేదు."
    "ఇదెక్కడి విడ్దూరం- తండ్రిని ప్రశ్నలడిగి కొడుకుని యల్.కె,జిలో చేర్చుకోవడం" ఒకాయన ఆశ్చర్యపోతూ అన్నాడు.
    "వాళ్ళు తండ్రి ఇంటలిజెన్స్ ని పరీక్షిస్తున్నారండీ తండ్రి ఇంటిలిజెంట్ అయితే కొడుకు ఇంటిలిజెంటయి ఉంటాడని ఐడియా! కనుక అందరూ అలాంటి తెలివిగల పిల్లలనే స్కూల్లో చేర్చుకుంటే స్కూలుకి మంచి పేరొస్తుందనీ వాళ్ళు అభిప్రాయం. "ఒకాయన వివరించాడు.
    "నన్నడిగితే అలా అనుకోవడం పరమ తెలివితక్కువతనం" ఆఫీసరుగారన్నారు.
    "ఎందుకని"
    "పండిత పుత్రః పరమ శుంఠః" అని మన పూర్వీకులు ఘోషించలేదుటండీ?
    "అవును! వారు చెప్పింది నిజమే. కావాలంటే చరిత్ర తిరగేసుకోండి. గొప్ప గొప్పవారి పుత్రులంతా వెధవలే. అది ఈనాటి రాజకీయాలకు కూడా వర్తిస్తుంది...." అన్నాడు సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న ఆఫీసరుగారు.
    "అది సరేగానీ 19x19 ఎంత?" గోపాల్రావ్ నన్నడిగాడు. నేను లోలోపల ఎక్కాలు చదవటం మొదలుపెట్టానుగానీ పందొమ్మిదిల దగ్గర కొచ్చేసరికి ఆగిపోతోంది.
    అందరూ ఆన్సర్ కోసం ఆశగా నావంక చూడడం గమనించేసరికి అక్కడున్నవారెవరికీ ఆన్సర్ తెలీదనే నాకు అర్ధమైపోయింది.
    వెంటనే ఓ కాగితం, పెన్నూ తీసుకుని త్వరత్వరగా 19x19 లెక్కకట్టడం ప్రారంభించాను.
    "మూడు వందల అరవయి ఒకటి" ఆన్సర్ అందరికీ గట్టిగా చదివివినిపించాను.
    అప్పటికప్పుడే అందరూ వరండా అంతా తిరుగుతూ పందొమ్మిదిపందిమ్మిదులు మూడొందల అరవయి ఒకటి అని మననం చేసుకోసాగారు. మరో పెద్ద మనిషిని లోపలకు పిలిపించారు.
    ఆయన దిగాలుపడిన ముఖంతో బయటకొచ్చాడు. కాసేపటికి అందరూ ఆయనను చుట్టుముట్టేశారు.
    "మిమ్మల్నేమడిగారు?" అడిగాడు గోపాల్రావ్ ఆత్రుతగా.
    "నన్నేమీ అడగలేదు. నేను రైల్వేలో ఎల్డీసిగా పనిచేస్తున్నానని తెలీగానే సీటు దొరకదు వెళ్ళిపొమ్మన్నారు."
    "అదేమిటి?" అందరం ఆశ్చర్యపోతూ అడిగాము.
    "ఈ స్కూలు ఫ్యూనుక్కూడా మా కంటే ఎక్కువ జీతం వస్తుందిట! కనుక మాలాంటి లోక్లాస్ వాళ్ళకు అడ్మిషను ఇవ్వరట...."
    ఈలోగా మరో వ్యక్తి లోపల్నుంచి ఆనందంగా బయటకురావటంతో అందరూ అతని దగ్గరకు పరిగెత్తారు.
    "మా బాబుని ఎబిసిడీలు చెప్పమన్నారు. వాడు తడుముకోకుండా చెప్పేశాడు. అంతే ఎడ్మిషన్ ఇచ్చేశారు.
    ఆ మాట వినేసరికి అందరికీ బోలెడు ధైర్యం వచ్చింది.
    నేనూ, గోపాల్రావ్ కిరణ్ గాడిని- చిన్నిగాడిని కూర్చోబెట్టి మళ్ళీ ఏబీసీడీలు చెప్పించాము.
    ఈలోగా గోపాల్రావ్ పేరు పిలవనే పిలిచారు.
    ఇరవయి నిమిషాల తర్వాత సీరియస్ గా బయటకు వచ్చాడు. అందరం మామూలు గానే వాడిచుట్టూ మూగాము.
    "ఏమడిగారు?"
    గోపాల్రావ్ హఠాత్తుగా పూనకం వచ్చినట్లు వూగిపోతూ, పళ్ళుబిగపట్టి, చిన్నిగాడ్ని పట్టుకుని చావగొట్టసాగాడు.
    అందరూ కలిసి వాళ్ళిద్దర్నీ విడదీశాం.
    "రాస్కెల్- నెలరోజుల నుంచీ ప్రాక్టీస్ చేయించామా? వీడులోపల కెళ్ళాక నోరువిప్పడే! వాటీజ్ యువర్ నేమ్ అంటే మాట్లాడడు. పిల్లి బొమ్మను చూపించి వాటీజ్ దిస్ అంటే నవ్వుతాడుగానీ నోరు మెదపడు. ఏబిసిడీలు చెప్పమ్మా అంటే అడ్డంగా తలూపుతాడు."
    నా గుండెల్లో రాయిపడింది. బహుశా అదేరాయి అందరి గుండెల్లో పడినట్లుంది. ఎవరిపిల్లల్ని వాళ్ళు బుజ్జగించి వాళ్ళకు నేర్పిందంతా మళ్ళీ వెళ్ళగక్కించటం ప్ర్రారంభించారు.
    నా పేరు రానే వచ్చింది.
    కిరణ్ గాడిని తీసుకుని లోపల కెళ్ళాను. ఒక కళ్ళజోడు అతను, ఓ బట్టతలతను, ఓ ఆంగ్లో ఇండియన్ ముసలామెకూర్చుని ఉన్నారు.
    "హల్లో-కిరణ్- కమియర్ బాయ్" అంటూ కిరణ్ ని తన దగ్గరున్న స్టూల్ మీద కూర్చోబెట్టిందామె.
    నేను వేరే కుర్చీలో కూర్చున్నాను.

 Previous Page Next Page