"నేను ... నేను ..."
"ఊ... చెప్పండి."
* * *
ఆమె రిక్షా దిగేసరికి ఎనిమిదీ పది అయింది. ఫ్లాస్క్ పట్టుకుని ఆమె వడివడిగా మెట్లెక్కింది. తలుపు దగ్గిరున్న సెంట్రీ చెయ్యి అడ్డుపెట్టాడు.
"లోపలికి వెళ్ళడానికి వీల్లేదు."
మెట్లమీద కూర్చుని బీడీ తాగుతున్న మరొ పోలీసు పక్కవైపు నుంచి కనిపిస్తూన్న ఆమె వక్షంవైపు కన్నార్పకుండా చూస్తూ పెదాలు తడుపుకుంటున్నాడు.
"ఆయనకి కాఫీ ఇవ్వాలి."
"ఆయనా? ఆయనెవరు?" వెకిలిగా అడిగాడు.
ఆమె మొహం ఎర్రబడింది.
"రాయన్న నిన్నరాత్రి అరెస్టు చేశారు. ఇంతకుముందు ఒకసారి వచ్చాను తెల్లవారుఝామున."
"లోపల ఇన్ స్పెక్టర్ గారు ఇంటరాగేట్ చేస్తున్నారు. కాఫీలు అవి తెచ్చి ఇవ్వటానికి ఇదేం హోటల్ కాదు. వెళ్ళిరండి."
ఆమె కోపం అణుచుకుని "నేనొకసారి ఇన్ స్పెక్టర్ ని కలుసుకోవచ్చా" అని అడిగింది.
"ఎందుకు కలుసుకోకూడదు. రాత్రికి తీరిగ్గా రండి." కుడికన్ను సగం మూసి అన్నాడు.
"ఐ విల్ రిపోర్ట్ దిస్ టు ది పీపుల్స్ కౌన్సిల్. ఏమనుకుంటున్నారు మీరు? డోన్ట్ యు హావ్ ఎనీ మానర్స్" ఆమె కంఠం ఆ వరండాలో ప్రతిధ్వనించింది.
పోలీసు బెదిరాడు. "అలా నిలబడండి. కనుక్కుని వస్తాను" అని లోపలికి వెళ్ళాడు. నిముషం తరువాత తిరిగి వచ్చాడు. అతడి మొహంలో విజయగర్వం తొణికిస లాడుతూంది.
"ఇన్ స్పెక్టర్ గారు ఇప్పుడెవర్నీ చూడరట, రాయన్నని కూడా ఇప్పుడు ఎవరూ కలుసుకోవడానికి వీల్లేదట. వెళ్ళిరండి" అన్నాడు.
కిరణ్మయి మొహం వాడిపోయింది. ఆమెకేం చెయ్యాలో తోచలేదు. నీరసంగా ఫ్లాస్కు పట్టుకుని మెట్లు దిగింది.
"సీటు బావుందిరా" వెనుకనుంచి పోలీసు అంటున్న మాటలు గాలిలో తేలివచ్చి ఆమె కర్ణాన్ని సోకాయి. పెదవుల్ని పంటితో నొక్కిపట్టి ఆమె తొందర తొందరగా అక్కణ్నుంచి బయటపడింది.
నిండు ఫ్లాస్కు ఆమె చేతిలో అలాగే వుంది.
* * *
"మీరు నా ఓర్పుని పరీక్షిస్తున్నారు" అన్నాడు ఇన్ స్పెక్టర్ బెల్ కొడుతూ సెంట్రీ లోపలికి వచ్చాడు. "రెండు కాఫీ తీసుకురా .... మీకు సిగరెట్లు కావాలా?"
"వద్దు తాగను."
"ఊ చెప్పండి."
రాయన్న జవాబు చెప్పలేదు.
"మీరు, అపురూపలక్ష్మీ కలిసి నాలుగైదుసార్లు మాత్రమే హోటల్ కి, అధీ డిన్నర్ కి వెళ్ళాం అన్నారు కదూ."
"అవును"
"డిన్నర్ పూర్తయేసరికి ఎంతయ్యేది?"
"పదీ- పదిన్నర."
ఇన్ స్పెక్టర్ ఫైలులోంచి ఒక కాగితంతీసి అతడిముందు పెడుతూ "ఇవి లేడీస్ హాస్టల్ రూల్సు. రాత్రి పదింటి తరువాత లోపలికి రానివ్వొద్దని రూల్ నెం. 10 చెపుతోంది. మరి మీరెలా మానేజ్ చేసేవారు?"
"నాకు తెలీదు. వాళ్ళని గేటుదగ్గిర దింపుతే, వాళ్ళు లోపలికి మామూలుగా వెళ్ళిపోయేవారు....."
"దింపగానే వాళ్ళు వెళ్ళరు. గేటుదగ్గిర నిలబడి మరో అర్ధగంట మాట్లాడతారు .... అవునా?"
.... ..... ......
"నేను వాచ్ మన్ లని ప్రశ్నించాను. ముందు పదిన్నర వుండేదట. కొత్త వార్డెన్ వచ్చి దాన్ని పదిగంటలు చేస్తే - యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ - అమ్మాయిలు స్ట్రయిక్ చేసేంతవరకు వెళ్ళార్ట" ఆశ్చర్యంగా లేదూ."
"అవును ఆ విషయం వాళ్ళూ మాకు చెప్పారు."
"నాకు ఆశ్చర్యం వేసింది. పదిన్నరకీ, పదికీ అంతా తేడా ఏముందని? ఇప్పుడర్ధమైంది. ఎనిమిదింటికి డిన్నర్ మొదలైతే, పూర్తి అయ్యేసరికి ఎలాగూ పది అవుతుంది, అక్కణ్నుంచి కబుర్లు చెప్పుకుంటూ హాస్టల్ చేరుకునేసరికి పదిన్నర. అమ్మాయిల్ని ఎదిరించే ధైర్యం తమకు వుండదని వాచ్ మన్ అన్నాడు. కాబట్టి రూల్ రూలే రాకపోక మామూలే. మిస్టర్ రాయన్నా! ఒక రాత్రంతా అమ్మాయి హాస్టల్ కి రాకపోతే ఎటువంటి చర్య తీసుకుంటారు?"
"నాకు తెలీదు -"
"మీకు తెలుసు...."
"తెలీదు."
"తెలుసు-" లాఠీతో బల్లమీద బలంగా కొడ్తూ అన్నాడు ఇన్ స్పెక్టర్. "మీకు సిగ్గుగా లేదూ? అభం శుభం తెలియని ఆడపిల్లలు! తమ తల్లిడండ్రుల్నీ పల్లెల్నీ వదిలీ - ఈ పట్నాల్లో చదువుకోవటానికి వస్తే, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, వాళ్ళకి రంగురంగుల లోకం చూపించి, రకరకాల లైట్ల వెలుగులో డిన్నర్లిచ్చి - రాత్రిళ్ళు ఆలస్యంగా హాస్టళ్ళదగ్గర దింపి - చివరికి ఒక వార్డెన్ ఆ రూల్ మార్చాలనుకుంటే దానికి వ్యతిరేకంగా స్ట్రయిక్ చేయించేటంతవరకూ వాళ్ళని పురిగొల్పినందుకు .... మీకు సిగ్గుగా లేదూ?"
"నే నెన్నోసార్లు అటు వెళ్ళలేదు. ఒకటి రెండుసార్లే అలా జరిగింది."
"ఎలా?"
"పదిన్నర తరువాత అలా దింపటం."
"అంటే - రాత్రి పన్నెండు దాటాకా?"
"కాదు కాదు." కంగారుగా అన్నాడు. "ఓ పదినిముషాలు అటూ ఇటూగా-"
_________________________________________________________________________________________________
* ఈ సంఘటన హైద్రాబాద్ హాస్టల్ కి సంబంధించి యదార్ధంగా జరిగింది. 1986 ఫిబ్రవరిలో.
_________________________________________________________________________________________________
"అంతేకానీ రాత్రంతా మీతో ఆ అమ్మాయిలు ఏ రోజూ వుండ లేదంటారు."
రాయన్న తలపైకెత్తి "లేదే" అన్నాడు అర్ధంకానట్టు. ఇన్ స్పెక్టర్ అతడి కళ్ళలోకి సూటిగాచూస్తూ "నిజంగా ఏ రాత్రీ లేదా?" అని గట్టిగా అడిగాడు.
"లేదు."
ఫైల్లోంచి ఒక ఫోటో తీస్తూ "వీళ్ళిద్దరూ ఎవరో మీకు తెలుసుకదా" అన్నాడు.
"ఒకరు రమణి" ఫోటో చూస్తూ అన్నాడు రాయన్న.
"రెండోది - రెండోది అపురూప లక్ష్మి."
"ఇది చూడండి. ఈ సంతకం మీదేనా?" ఫోటోస్టాట్ కాపీ చూపిస్తూ అడిగాడు.
"నాదే"
ఇప్పుడు కాగితాన్ని పూర్తిగా చూపించాడు. హోటల్ రిజిష్టర్ కాగితం అది. ఇన్ స్పెక్టర్ కంఠం కంచులా మ్రోగింది. "మొన్న డిసెంబర్ పన్నెండో తారీఖు మీరూ, ఇంకో యువకుడూ ఈ ఇద్దరమ్మాయిలతోనూ రాత్రంతా తమ హోటల్లో వున్నారని, ఈ హోటల్ రిసెప్షనిస్టు సాక్ష్యం చెప్పాడు. పైగా మీరు ధైర్యంగా మీ పేరుతోనే రూమ్ కూడా తీసుకున్నారు. కాదంటారా- ఈ సంతకం మీది కాదంటారా? ఈ అమ్మాయిలు హాస్టల్ వదిలి మీతో రాలేదంటారా?"
రాయన్న మొహంలో రక్తం ఇంకిపోయింది. తడబడ్డాడు. ఇన్ స్పెక్టర్ ఆవేశంతో అతడి మెడ పైగా పట్టుకుని గెడ్డం పైకొచ్చేలా ఎత్తి అతడి మొహంలోకి చూస్తూ క్రౌర్యంగా "అందుకే మా పోలీసులు రాక్షసులవుతారు. నన్నూ అలా చేయకండి. నాకు నిజం కావాలి. ఐవాంట్ ట్రూత్" - అని ఆ హాలు ప్రతిధ్వనించేలా అరిచాడు. హిస్టీరియా వచ్చిన వాడిలా వూగిపోయాడు. "నా చెల్లెళ్ళిద్దరు హాస్టల్ లో చదువుతున్నారు. రేపు నా కూతురు హాస్టల్ లోనే చదవవలసి రావొచ్చు. మిమ్మల్ని నేను వదిలిపెట్టను. నరాలు కత్తిరించి, రక్తం తోడేసైనా నీతో నిజం చెప్పిస్తాను - చెప్పు. ఈ హోటల్ రూమ్ బుక్ చేసింది నువ్వేనా?"
"-నేనే."
* * *