Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 14

   

     హెడ్డింగ్ చదువుతూ ఉంటే అతడి మొహం పాలిపోయింది. కానీ చివరి వాక్యం చదువుతూ నిటారుగా అయ్యాడు. ఈ లోపులో ఇన్ స్పెక్టర్ వస్తూ వుండటం చూసి, విప్పారిన మొహంతో "చూడండి ఇన్ స్పెక్టర్ గారూ! ఈ అమ్మాయి చనిపోతూ ఉత్తరం పెట్టి చనిపోయిందట" అన్నాడు.
   
    ఇన్ స్పెక్టర్ తలూపుతూ, "అవును అందుకే మిమ్మల్ని అలాంటి ఉత్తరం వ్రాయమన్నాను" అంటూ ఒక నోట్ పుస్తకం, రెండు కాగితాలూ అతడి ముందు పెట్టాడు. ఆ కాగితాల్లో ఒకటి అతడు అంతక్రితం వ్రాసిందే.
   
    రెండో కాగితాన్ని ముందుకు తోస్తూ "అపురూపలక్ష్మి శవం దగ్గిర దొరికిన ఉత్తరం ఇది. మీరు పేపర్లో చైద్వింది దీనిగురించే" అన్నాడు ఇన్ స్పెక్టర్. తరువాత నోట్ బుక్ విప్పుతూ "ఇది అపురూపలక్ష్మి స్వంత చేతివ్రాత" అన్నాడు.
   
    రాయన్న అర్ధంకానట్టు చూశాడు. ఇన్ స్పెక్టర్ చూపుడు వేలితో నోట్ బుక్ వైపు మొదటి ఉత్తరం వైపు చూపిస్తూ "ఈ వ్రాతకీ, ఆ వ్రాతకీ ఎంత తేడా వుందో చూస్తారా? ఈ ఉత్తరం లక్ష్మి వ్రాయలేదు."
   
    "మరెవరు వ్రాశారు?"
   
    "మీరు."
   
    ఆకాశం విరిగి మీదపడినట్టు చూశాడు. ఇన్ స్పెక్టర్ నవ్వాడు కానీ వెంటనే అతడి మొహం కఠినంగా మారింది.
   
    "చాలా చిన్న ట్రిక్ అది. అపురూపలక్ష్మి చేతివ్రాతను అనుకరిస్తూ అలాంటి ఉత్తరం ఆమె శవం దగ్గిర వ్రాసి పెట్టేస్తే అందరూ అది ఆత్మహత్య అనుకుంటారు- అని! పోలీసులు కూడా పెద్దగా పరిశోధించరు. హాస్టల్ లో అయిన మరణం. పైగా స్వయంగా ఉరిపోసుకుంది. ప్రక్కన ఉత్తరం ఉంది. ఆత్మహత్యగా క్లోజ్ చేస్తారు ఫైలు. చాలా తెలివితేటల్తోనే వేశారు. ఈ ప్లాను కానీ మీరు తప్పటడుగు వేసినదల్లా సంతకం దగ్గిర. లక్ష్మికి తన నోట్ పుస్తకాలనిండా సంతకాలు పెట్టడం అలవాటు. సంతకం చేసి అడుగున గీత గీయటం ఆమెకు అలవాటులేదు. అలా గీతగీసి క్రింద రెండు చుక్కలు పెట్టటం కేవలం మీ అలవాటు. పొరపాటున "లక్ష్మి" అని సంతకం పెట్టి క్రింద గీతగీసి రెండు చుక్కలు పెట్టారు. అది మీ ఉత్తరంలోనూ, లక్ష్మి శవం దగ్గిర ఉత్తరంలోనూ కామన్ గా వుంది."
   
    రాయన్న అయోమయంగా చూశాడు ఇన్ స్పెక్టర్ వైపు.
   
    "ఒక్కొక్క మనిషికి ఒకొక్క అక్షరం ఒకోలా వ్రాయటం అలవాటు. దాన్నిబట్టి రెండు చేతివ్రాతలు ఒకరు వ్రాసినవా, వేర్వేరు వ్యక్తులు వ్రాసినవా అని తెలుసుకోవటం మా నిపుణులకి కష్టంకాదు. పోతే ఈ విషయంలో...." అంటూ అపురూపలక్ష్మి నోట్ పుస్తకం అతడి ముందుకు తోస్తూ "ఈ ఆత్మహత్య ఉత్తరం ఆ నోట్ బుక్ లో చేతివ్రాత ఒకరు వ్రాసినవా, వేర్వేరు మనుష్యులు వ్రాసినవా అని తెలుసుకోవటానికి నిపుణులు కూడా అక్కర్లేదు. మనం చాలు. చెప్పండి మీకేం అనిపిస్తుంది. ఈ ఆత్మహత్య ఉత్తరం వ్రాసింది లక్ష్మేనా?"
   
    "..... కాదు" అన్నాడు రాయన్న అప్రయత్నంగా. ఆ తేడా చూడగానే తెలిసిపోతోంది.
   
    "ఆ ఆత్మహత్య ఉత్తరాన్నీ, మీరు వ్రాసిన ఉత్తరాన్నీ చూడండి. రెండూ ఒకరు వ్రాసినవేనా?"
   
    "నో... నో ... నో" అంటూ అరుస్తూ లేచాడు రాయన్న.
   
    "చాలా అద్భుతమైన నటులు రాయన్నా మీరు! అయోమయాన్నీ, ఆవేశాన్నీ వెంటవెంటనే మార్చి చూపించగలరు- బయట వాళ్ళెవరైనా మీ భంగిమలు చూసి - నిజంగా ఏమీ తెలియని వారనుకుంటారు. కాని మా సంగతి అలాకాదు. ప్రొద్దున లేస్తే మీకన్నా గొప్పగా నటించగల జేబుదొంగల్నించి నిజం కక్కిస్తూ వుంటాం."
   
    రాయన్న మాట్లాడలేదు.
   
    "ఈ రెండు ఉత్తరాలు చూడండి 'స్వ, త్మ, త్య, టు, ణ, మై' ఈ అక్షరాలన్నీ ఒకరు వ్రాసినవే అని చూడగానే తెలుస్తుంది. సంబంధం అని వ్రాయవలసి వచ్చినచోట 'సంబంధం' అని వ్రాసారు. ఇంతకన్నా ఋజువులు కావాలా? ఇప్పటికయినా నిజం వప్పుకోండి-"
   
    రాయన్న నుదుటిమీద చెమటపట్టింది.
   
    "మీమీద నాకు సానుభూతి వుంది. మీరు వర్ధమాన క్రికెట్ ప్లేయర్ అని తెలుసు. ఆ గౌరవం మీరు కూడా నిలుపుకుని మీ నేరం ఒప్పుకుంటే మంచిది."
   
    రాయన్న తలవంచుకుని కూర్చున్నాడు. అతడి మొహంలో భావాలు కనపడటం లేదు. ఏం ఆలోచిస్తున్నాడో చెప్పడం కష్టం. ఏం మాట్లాడదామన్నా నోటమాట రావడం లేదు.
   
    ఇన్ స్పెక్టర్ లేచి పచార్లుచేస్తూ అన్నాడు. "-పోలీస్ స్టేషన్ లో అందరూ రాక్షసులు వుంటారని, లాకప్పులో పెట్టి చిత్రహింసలు పెడుతూవుంటారని అందరూ అనుకుంటూ వుంటారు. ఇదే స్టేషన్ లో ఒక సబ్-ఇన్ స్పెక్టర్ వున్నాడు- సత్యనారాయణ అని. అతడు దాన్ని బాగా నమ్ముతాడు" లాఠీ తిప్పుతూ అతడు కొనసాగించాడు. "....ఒక రకంగా ఆలోచిస్తే అందులోనూ తప్పులేదు. కర్కోటకులు, కిరాతకులు, దుర్మార్గులు ఎందరో ఈ లాకప్ లోకి వస్తారు. ప్రతీవాళ్ళని ఓర్పుతో ప్రశ్నలువేసి, ఋజువులు సంపాదించి, వాళ్ళంతట వాళ్ళే వప్పుకునేలా చేయటం అసాధ్యం. ఉదాహరణకి మీ చెల్లి కాలేజీనుంచి వస్తూవుండగా ఆమె మెడలోంచి చెయిన్ లాక్కొని సైకిల్ మీద ఒకడు పారిపోయాడనుకోండి. భయంతో మీ చెల్లి రెండురోజులు పక్కమీదనుంచి లేవలేదు. అప్పుడు వాడిని ఏం చెయ్యాలనిపిస్తుంది మీకు? మీ భార్యాభర్తలు పిల్లల్తో కలిసి నిద్రపోతూ వుండగా గొడ్డళ్ళతో, గునపాల్తో నలుగురు బందిపోట్లు అర్దరాత్రి  తలుపులు బ్రద్దలుకొట్టి లోపలికి వస్తారు. అరుస్తూన్న భార్యని తల బ్రద్దలు కొడతారు... ఏడ్చే పిల్లాడి గుండెల్లో గునపాన్ని దింపి, ఆస్తి దోచుకుపోతారు. తరువాత వాళ్ళు దొరుకుతారు. వాళ్ళని ఏం చెయ్యాలనిపిస్తుంది? ఉరికంబం ఎక్కించాలనిపిస్తుంది. అవునా .... కానీ సాక్ష్యాలు దొరకవు, వాళ్ళు స్వేచ్చగా బయటపడ్డారనుకోండి. అప్పుడేం చెయ్యాలనిపిస్తుంది? మీకు ఇంత ద్రోహం చేసిన ఆ కిరాతకుల్ని మీరు ఉరికంబం ఎక్కినాసరే, వాళ్ళని స్వయంగా చంపాలనిపించదూ?" ఆగేడు.
   
    "..... మేం చేసేది అదే. ఇక్కడికొచ్చిన వాళ్ళెవరూ తమ తప్పు వప్పుకోరు. ఇలాంటి ఇంటరాగేషన్స్ ఎన్నో వాళ్ళు చూసి వుంటారు. వాళ్ళ నుంచి నిజం కక్కించటం మా విద్యుక్తధర్మం. చట్టం నుంచి తప్పించుకోవటం, సాక్ష్యాలు లేకుండా చేయటం ఎలాగో వాళ్ళకి తెలిసినప్పుడు, వాళ్ళని తిరిగి చట్టంలో బంధించటంకోసం మేము రకరకాలుగా ప్రయత్నించటంలో తప్పులేదు. నేరం ఎలా చేశారో వాళ్ళ నోటినుంచే చెప్పించటానికి మా మార్గాలు మాకున్నాయి."
   
    రాయన్న చేతివేళ్ళు నలుపుకుంటున్నాడు. ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుందతడికి. ఇన్ స్పెక్టర్ కొనసాగించాడు. "అపురూపలక్ష్మి మంచి అమ్మాయి అని మీరే అన్నారు. తమని విడిచి పట్నంలో చదువుకోవటానికి వచ్చిన ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి, ఎంతో భవిష్యత్తు వున్నది- అకస్మాత్తుగా చచ్చిపోయిందని తెలిస్తే ఆ తల్లిదండ్రులకి ఎలా వుంటుంది? ఒక మొగవాడి మాయలోపడి ఆ చిన్నారి జీవితం సమాప్తమయిపోయిందని తెలిస్తే వాళ్ళకి ఆ మోసగాడిని ఏం చెయ్యాలనిపిస్తుంది? నిలువునా కాల్చెయ్యాలనిపించదూ .... మామూలుగా ఎంత చెప్పినా, ఎన్ని సాక్ష్యాలు చూపించినా ఆ నేరగాడు తన తప్పు వప్పుకోకపోతే అవసరమైన దానికంటే ఎక్కువ తెలివితేటలు చూపిస్తే, అమోఘంగా అమాయకత్వం నటిస్తే-మీకెలా వుంటుంది? ఆ చిన్నపాప శవంమీదే వాడినీ వేసి తగులబెట్టాలనిపించడూ....."

    రాయన్న హృదయాన్ని లోపల్నుంచి సముద్ర కెరటాలు బలంగా తాకుతున్నట్టు అనిపిస్తున్నాయి.
   
    "నేను ఎమ్మెస్సీ పాసయిన కొత్తలో ఈ పోలీసు ఉద్యోగం వచ్చిందని తెలిసినప్పుడు మా అమ్మ వద్దని గోల పెట్టింది. అటువంటి ఉద్యోగం మనకెందుకురా అంటూ అడ్డుచెప్పింది. మామూలు మనుష్యులకు ఈ పోలీసుల మీద అంత కసి, ద్వేషం ..... అసహ్యం! కానీ మా వైపునుంచి ఆలోచిస్తే, నేరస్థుల నుంచి నేరం వప్పించటానికి ఇంకో మార్గం ఏది? మొన్న పేపర్లో వచ్చిన వార్త చదివారు కదా. ఎనిమిదో తరగతి చదువుతున్న పాప స్కూలునుంచి ఇంటికి వెళ్తూంటే నోరుమూసి పక్క పార్కుకి తీసుకెళ్ళి రేప్ చేశారు ఇద్దరు. మాకే సాక్ష్యమూ లేదు. కోర్టులో కేసు నిలవదు. నాకేం చేయాలో తోచలేదు. పాపకి సిఫిలిస్ వచ్చింది. భవిష్యత్తు నాశనమైపోయింది. ఆ తల్లిదండ్రుల ఏడుపు మీరు స్వయంగా చూడాలి. మరోవైపు నేరస్థులు బెయిల్ మీద శుభ్రంగా తిని తాగుతున్నారు. ఆ సమయంలో ఈ కేసు మా సత్యనారాయణ టేకప్ చేశాడు. నాలుగుచోట్ల ఎముకలు విరిసేశాడు. ఆప్పుడు చెప్పారు వాళ్ళు ఈ పథకం ఎలా వేశారో! వాళ్ళకి సాయం చేసిన టాక్సీ డ్రైవరు, తోటమాలి అందరూ బయటపడ్డారు. కోర్టులో కేసు పకడ్బందీగా నడుస్తూంది. ఇప్పుడు చెప్పండి ఫోర్స్ ఉపయోగించటంలో తప్పువుందా? మీ ప్రజలంతా మమ్మల్ని ఎందుకు తిడతారు? ఈ ప్రశ్న ఎప్పట్నుంచో నాలోవుంది. మీకు తెలిస్తే చెప్పండి సమాధానం."
   
    స్టేషన్ లో గడియారం ఎనిమిది గంటలు కొట్టింది.
   
    "ఆఖరిసారి చెపుతున్నాను రాయన్నా! మీ గురించి విన్నాను కాబట్టి, మీరంటే గౌరవం వుంది కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాను. నేను ఒక్కో విషయమే వివరించి చెపుతూ ఓర్పుగా మీనుంచి నిజాలు చెప్పించగలను. కానీ అంత అవసరం లేకుండా మీ అంత మీరే నిజం చెప్తే మంచిది" అతడి కంఠం కఠినంగా మారింది. ".....మీరు నాతో సహకరించకపోతే ఈకేసు మా సత్యనారాయణకి అప్పగించవలసి వస్తుంది. ఒకసారి అతడి చేతిలోకి వెళ్తే మరి మీరు ఈ షేపులో బయటకు రారు. మీ మంచికోసమే నేను మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తున్నాను .... చెప్పండి. ఈ మర్డర్ ఎలా చేశారు?"

 Previous Page Next Page