Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 14

    గేటవతలనుంచి చేతిలో సంచితో నడిచిపోతున్న ప్రజ్ఞను ఆగమన్నట్టు సౌంజ్ఞ చేసింది.

    ప్రజ్ఞకు ఆగక తప్పలేదు. ఆమె సంశయిస్తూ నిలబడేసరికి తేజ నిలబడి గేటు దగ్గర కొచ్చింది.

    "లోపలికి రండి" అంది.

    "ఇంట్లో పని వుందండి" అంది ప్రజ్ఞ చాలా సంకోచంగా.

    తేజ నవ్వి, "పర్వాలేదులెండి. పని ఎప్పుడూ వుండేదే. మా ఇంట్లో కెప్పుడూ రాలేదు. ఒక్క అయిదు నిమిషాలు కూర్చుని వెళ్ళిపోదురు గాని రండి" అంది.

    ప్రజ్ఞకు తప్పలేదు. తేజ కొంచెం గేటు తెరవగా మొహమాటంగా లోపలి కొచ్చింది.

    ఇల్లంతా వాళ్ళు తప్ప ఎవరూ లేనట్లు బావురుమంటోంది.

    "మా డాడీ ఆఫీసుకెళ్ళారు _ మమ్మీ ఎక్కడకు వెడుతుందో నేనెప్పుడూ అడగను. పనివాళ్ళు పనులమీద వెళ్ళారు. పని అంటే అదే లెండి _ మాకుగా మేము కల్పించుకున్న పనులు. ప్రస్తుతానికి ఇంట్లో ఒక్కదాన్నే వున్నాను" అంది తేజ.

    "ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరు వుండడానికి భయం వెయ్యదా మీకు ?"

    తేజ నవ్వింది. "మనుషులు ఉంటే భయపడాలి. లేకపోతే భయం దేనికి ?"

    ఇల్లంతా చాలా రిచ్ గా ఉంది. గోడలకు రకరకాల పెయింటింగ్స్ ఖరీదయిన సోఫాసెట్స్, ఇరవై ఎదంగుళాల వెడల్పు స్క్రీన్ గల ఇంపోర్టేడ్ కలర్ టి.వి., వి.సి.ఆర్. ఓవెన్, మూడుకు పైగా వున్న గ్యాస్ స్టవ్ లు,నిలబడ్డ చోటునుంచి కదలకుండా అన్ని సౌకర్యాలూ అందుకో గల కిచెన్ ...

    ప్రజ్ఞకు ఆశ్చర్యంగా వుంది గాని అసూయగా లేదు. తనకు లేనిదాని గురించి అసూయపడడం ఆమె కెప్పుడూ అలవాటు లేదు.

    "ఏం త్రాగుతారు? కాఫీనా ? టీ నా ?"

    "నాకు రెండూ అలవాటు లేదు."

    "పోనీ జ్యూస్ ఏమయినా తీసుకోండి. లెమన్, ఆరంజ్, గ్రేప్స్ ..."

    "ప్లీజ్ ! ఏదీ వద్దండీ."

    "మీ యిష్టం. రండి నా గదిలోకి వెళ్ళి కూచుందాం" అని తేజ ఆమెను లోపలికి తీసుకెళ్ళింది.

    ఆమె గది చాలా అధునాతనంగా, అపురూపంగా వున్నది. ఒక ప్రక్క చిన్న పోర్టబుల్ కలర్ టి.వి. అది కూడా ఇంపోర్టెడ్ దే.

    ఆమె బలవంతం చేసినమీదట ప్రజ్ఞ సోఫాలో కూర్చుంది.

    "మీరు చదువుకుంటున్నారా ?"

    ప్రజ్ఞ లేదన్నట్టు తల ఊపింది.

    "ఎందుకని ?"

    "టెన్త్ క్లాస్ వరకూ చదువుకున్నాను. తర్వాత మా  నాన్నగారికి స్తోమతలేక చదివించడం మానేశాను."

    "మరి తర్వాత ఏం చేస్తారు?"

    "ఏం చేస్తాను ? ప్రతి ఆడపిల్ల ఏం చేస్తుందో అదే చేస్తాను."

    "అంటే ...పెళ్ళి ..."

    సిగ్గుతో ప్రజ్ఞ ముఖం ఎర్రబడింది.

    "అలా అని కాదు..."

    "మరి ..." 

    ప్రజ్ఞ జవాబు చెప్పలేదు.

    "పోనీ పెళ్ళి గురించి మీ ఉద్దేశం ?"

    "...పెళ్ళి అనేది స్త్రీ పురుషుల మధ్య సంభవించే ఓ పవిత్ర బంధం."

    "మీ దృష్టిలో వివాహం అంత గొప్పదా ?"

    "కేవలం గొప్పదే కాదు, అద్భుతమైనది"

    "పెళ్ళి చేసుకోనిదే సంపూర్ణత్వం సిద్ధించదని మీరు భావిస్తున్నారా?"

    "అవును."

    "మీరు ప్రేమని అంగీకరిస్తారా?"

    "ప్రేమ లేనిదే జీవితం లేదు."

    "ప్రేమించి పెళ్ళి చేసుకోవడం గొప్పదనా లేక పెళ్ళిచేసుకుని ప్రేమించడం గొప్పదనా మీ ఉద్దేశం?"

    "నా ఉద్దేశంలో ఈ రెంటికీ తేడా లేదు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నా, పెళ్ళి చేసుకుని ప్రేమించుకున్నా ఆ ప్రేమ శాశ్వతమైనదై వుండాలి. భార్యా భర్తల మధ్య ఇంకో వ్యక్తి ప్రేమకు సంబంధించినంత వరకూ ఉండడానికి ఆస్కారం వుండకూడదు."

    తేజ నవ్వింది. "బహుశా మీరు ఊహాలోకాల్లో వున్నారనుకుంటాను. సాధ్యం కానిదాన్ని గురించీ, అసత్యమైన దాన్ని గురించీ ఎక్కువ విలువలు ఆపాదించి తప్పుదోవలో వున్నారనుకుంటాను" అంది.

    "నా ఆలోచన అతిశయోక్తిగా కనిపించవచ్చు. నేను తప్పు త్రోవన నడవనని నా నమ్మకం."

    "ఈ ప్రపంచం ఎంత మారిపోయిందో, ఎంత వేగంగా పరిగెత్తుతున్నదో మీరు గమనించడం లేదని నా ఉద్దేశ్యం."  
 

 Previous Page Next Page