Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 14

    రఘునందన్ , నట్వర్ సింగ్ ల్ని పంపేటప్పుడు  సాధిస్తారన్న  నమ్మకం కలిగింది. కాని, చైతన్యను చూస్తుంటే  ఓడిపోడు అన్నభావం  తప్ప గెలుస్తాడు అన్న  నమ్మకం కలగడం లేదెందుకో.

    ఎంతో మాటాడతాడని, ఎన్నో అనుమానాల్ని  వ్యక్తం చేస్తాడని  అనుకున్న  అనిల్ కుమార్....చైతన్య  క్లుప్తంగా తన అంగీకారాన్ని  తెలపగానే  "గుడ్ లక్" అన్నాడు లేచి కరచాలనం  చేస్తూ.

    "మిష్టర్ చైతన్యా!" అన్న పిలుపు  విని  క్షణంపాటు  ఆగాడు.

    "యు నో...." సంశయిస్తున్నట్టుగా  చూసిన అనిల్ కుమార్_"మీరు అడుగు పెడుతున్నది చాలా ప్రమాదభూయిష్టమైన  అడవిలో. వేసే  ప్రతి అడుగూ  చాలా  విలువైనదిగా భావించి  నడుచుకోవాలి. మీకెటువంటి  సహాయం కావలసి  వచ్చినా  విశాఖ జిల్లా కలెక్టర్ మొదలుకుని  నా వరకూ  అన్ని వేళలా  సిద్ధంగా  ఉంటామని మర్చిపోకండి."

    "థాంక్స్ ఎ లాట్ సర్!" అంటూ  మరోమారు  విష్ చేసి తాపీగా  బయటకు నడిచాడు ఫారెస్టాఫీసర్ చైతన్య. అణుమాత్రమయినా  సంచలనం గాని, తను ఓ భయంకరమయిన వలయంలో  అడుగు పెడుతున్నానన్న  భావంగాని  ముఖంలో  కనిపించని  చైతన్యను చూస్తూ  "సెక్యూలియర్ గే" అనుకున్నాడు అనిల్ కుమార్ సాలోచనగా.

    ఆలస్యం చేయటం  ఇష్టం  లేదతనికి. సాధ్యమైనంత  త్వరలో  రంగంలోకి  దిగాలని  అనుకోవడంతో  హైదరాబాదు నుంచే  మాడుగుల రేంజి ఆఫీసుకు  ఫోన్ చేసి, జీపు  వైజాక్ లోని తన ఇంటి దగ్గరకు  పంపి  డ్రయివరును  వెనక్కి  రప్పించుకోమని  ఉత్తర్వు జారీచేశాడు చైతన్య.

    పాడేరు అడవిలో  అడుగు పెట్టేముందు  అమ్మని ,చెల్లాయిని ఓమారు  చూడాలని ,కొన్ని గంటలపాటైనా  వారిమధ్య గడపాలనిపించింది.

    ఆ రోజే  ప్లయిటులో  విశాఖపట్నం  చేరుకున్నాడు. 
   

                                           6

    ఆఫీషియల్ కాలనీలోని  అధునాతనమైన  బంగళా అది.

    పోర్టికోలో  ఆగిన  టాక్సీలోంచి  దిగిన  చైతన్యను  చూడగానే కొన్ని క్షణాలవరకూ  తేరుకోలేకపోయింది  అనసూయ. అతని  తల్లి.

    "అమ్మా!"

    ఒక ఆనందబాష్పం ఆమె  కనుకొలకుల్లో  నిలిచి  ఆవిరయింది.

    ఆప్యాయంగా  కొడుకుని  దగ్గరకు  తీసుకుని  లోపలికి  నడిచిందామె.

    హఠాత్తుగా  ప్రత్యక్షమయ్యే  చైతన్య అప్పుడప్పుడిలా  ఆమెను ఆనందపరుస్తుంటాడు.

    యుద్ధంలో  ప్రాణాలు   కోల్పోయిన  స్క్వాడ్రన్ లీడర్ పరశురాం  భార్య ఆమె. దేశం కోసం  ప్రాణాలు  విడిచిన భర్త గుర్తుగా  పరమవీర చక్రను మాత్రం  మిగుల్చుకున్న  అభాగిని. భర్తతోపాటే  ఆమె కూడా సహగమనం చేసి  ప్రాణాలు  వదిలేదే కాని, పిల్లలకోసం  తల్లిగా  మిగిలిపోయింది.

    సోఫాలో తల్లి పక్కన  కూచున్న  చైతన్య  హఠాత్తుగా తను రావడంలోగల  కారణాన్ని  టూకీగా చెప్పాడు. తల్లి కళ్ళలో  నిండుకున్న  నీలి నీడల్ని  చూస్తూ  నిజం చెప్పి  పొరపాటు చేశానా అనుకున్నాడు క్షణంపాటు, మరుక్షణం.... "నమ్మా ఎక్కడమ్మా?" వాతావరణాన్ని  తేలికపరుస్తూ  చెల్లి గురించి  అడిగాడు.

    చెల్లెలు  నమ్రతని  "నమ్మూ" అని  ముద్దుగా  పిలవడం  అతనికలవాటు.

    ఇంతలో....జలపాతం  మెట్లపై నుండి  దూకుతున్నట్టు  పరుగునవచ్చి  "అన్నయ్యా!" అంటూ మెడని  చుట్టేసి  చైతన్య  పక్కన కూచుంది నమ్రత.

    యుక్తవయసు  వచ్చినా  పసిపిల్లలా  మారాం చేసే  చెల్లెలంటూ వల్లమాలిన ప్రేమ చైతన్యకు.

    ఆ మాత్రం  అతడు ఎక్కువగా  మాటాడేడి  చెల్లెలితోనే. అందుకే ఆగకుండా  హడావిడిగా  చెల్లి ప్రశ్నల పరంపరతో  ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే  తనూ హుషారుగా  జవాబు చెబుతూ  ఆహ్లాదంగా  గడిపేశాడు చాలాసేపటి వరకు.

    "అసలు సంగతి మరిచిపోయాన్రా" అంటూ ఏదో చెప్పబోయి. తల్లిని చూసి సంశయంగా ఆగిపోయింది నమ్రత.

    సాధారణంగా  అన్నా చెల్లెళ్ళ  అల్లరిని  చూస్తూ  ఎక్కువగా ఆనందించింది అనసూయ. కాని చైతన్య చెప్పింది విన్నాక  ఆమె స్థిమితంగా వుండలేకపోయింది.

    "ఏంటమ్మా!" ఆగిపోయిన  చెల్లెలికేసి  చూశాడు.

    "అన్నయ్యా! నిజమే....ఫారెస్టు  ఆఫీసరుగారి  అందం అడవికాచిన  వెన్నెలైపోతుంది సుమా!" అంది బోలెడంత  జాలిపడుతూ.

    ఏదో చెప్పబోయి  మళ్ళీ  మరేదో  మాట్లాడుతున్న చెల్లెలిని చూస్తూ.

    "అలా ఎవరన్నారు?" అన్నాడు  ఎవరనేదీ  తెలిసినా.

    "నీ చకోర పక్షి!"   

    అతడి పెదవులు  మృదువుగా  విచ్చుకున్నాయి.

    "ప్రతిరోజూ ఆకాశంలోని  చద్రుణ్ణి  చూస్తూ  దీనంగా  ముఖం పెడుతుంది. మేఘాలు అడ్డమొస్తే  అమాంతం కళ్ళనీరు పెట్టుకుంటుంది." మేడపైన  ద్వారం  చాటున  నిలబడి  ఉడుకుమోత్తనంగా  చూస్తున్న ప్రీతిని ఉద్దేశించి అంది.

    "అయ్యో పాపం!" అన్నాడు. అంతే బాధగా. ప్రీతిమేడమీద వుందన్న  విషయం  అతడూ  గమనించాడు.

    "మరేం....మేఘాల కేసి  తదేకంగా  చూస్తుందా. చూస్తూనే హఠాత్తుగా 'జాలిలేని  ఓ మేఘమా! నల్లమల అడవిలోవున్న  ప్రియుడికి  నా ఊసులు  చెప్పుమా' అంటూ  సోలో  ఒకటి  శివరంజని రాగంలో  పాడుతూ రేయంతా  నిలబడుతుంది. పాపం! ఈ బాధకు తాళలేని  మేఘాలు  నీ వరకూ  రాకముందే  కరిగి కన్నీరుగా మారి నేలపైకి జారిపోతున్నాయి" అలసిపోయినట్టుగా  మాటల్నాపి  పైకి  చూస్తూ  గొంతు స్థాయిని  తగ్గించి "వెళ్ళన్నయ్యా! ప్రేమంతా ప్లేటులో నైవేద్యంగా  పేర్చి ప్లేటోని లవ్ తో దారుణంగా ఎదురు చూస్తుంది" అంటూ చెయ్యి పట్టుకుని బలవంతంగా పైకి లేవదీసింది.                   

    వంట గదిలోవున్న  అనసూయకు  అన్నా చెల్లెళ్ళ  మాటలన్నీ స్పష్టంగా  వినబడుతూనే  వున్నాయి. సామాన్యంగా  అయితే  తనూ సమీపంలో వుండి కూతురి అల్లరిని, చైతన్య మృదువుగా చెప్పే  జవాబుల్ని వింటూ  తృప్తిగా నిట్టూర్చేది. కాని, ఇప్పటి  ఆమె పరిస్థితి వేరు.

    కొడుకు చెప్పిన విషయంతోనే  ఆమె సగం  సత్తువని  పోగొట్టుకుంది. నూరేళ్ళ తన సౌభాగ్యం నడివయసులో  నట్టేట కలిసినా, కడుపున పుట్టిన  పిల్లలకోసం  గుండె మంటని  చల్లార్చుకుంటూ  బ్రతుకుతున్న  స్త్రీ ఆమె. కొడుకు చెప్పింది విన్నాక  ఎందుకో  ఆమె మనసు  కీడును శంకిస్తోంది. ఎంతటి ధైర్యవంతురాలయినా  ఆమె ఆడది. మాతృత్వం కోసం  మనసులోని విషాదాన్ని  గుప్తంగా  దాచుకుని, వున్నవాళ్ళకోసం  ఉన్నన్నాళ్ళూ  బతకాలని  ఉవ్విళ్ళూరుతున్న  ఓ నిర్భాగ్యపు తల్లి.

    ఇప్పుడు  అనుకోని  దేదన్నా  జరిగితే....

    ఆ ఆలోచన భరింపశక్యం  కానిదై, ఉబికివస్తున్న  కన్నీళ్ళు పిల్లలకు  కనిపించకూడదని  ఓ వ్యాపకాన్ని సృష్టించుకుని  వంటగదిలో అడుగుపెట్టింది. బయటికి రావాలని లేదు.

    మరో పదిహేను  నిముషాల్లో  స్నానం  చేసిన  చైతన్య  కుర్తా పైజామాల్ని  వేసుకుని హాల్లో చెల్లిగాని, తల్లిగాని  కనిపించకపోవడంతో  మేడ మీదకి  నడిచాడు.

    నమ్రత, ప్రీతి క్లాస్ మేట్స్  కావడంతో  కంబైన్డ్ స్టడీస్ పేరిట ప్రీతి ఎక్కువగా  ఆ ఇంటిలోనే  గడుపుతుంది.

    చైతన్య మేడమీది  గదిలోకి  వెళ్ళేసరికి  ప్రీతి ఎందుకో  పగలబడినవ్వుతోంది. చైతన్యను  చూడగానే  నవ్వాపి ముఖాన్ని  సీరియస్ గా మార్చి "వెళ్ళొస్తాను" అంటూ  పుస్తకాలను  చేతిలోకి తీసుకుని  నమ్రతకేసి చూస్తూ అంది.

 Previous Page Next Page