పత్రికాఫీసునుంచి మోటార్ బైక్ పై వెళుతున్న త్యాగి టక్కున బ్రేక్ వేశాడు ఎదురుగా నిలబడ్డలిజిని చూస్తూ "మీరా....."
"ఏమిటి....... నేను మీరాబాయిలా కనిపిస్తున్నానా"
"అదికాదు ....." మృదువుగా నవ్వేడు "మా ఆఫీసుముందు కాపు కాసారేమిటి?"
"జర్నలిస్టునిగా...... న్యూస్ కోసం పడిగాపులుకాయటం అలవాటైంది....."
"తెలివైనజర్నలిస్టు న్యూస్ కోసం కాపుకాయకూడదు...... న్యూస్ సృష్టించాలి......"
"ఆపేయండి మహానుభావా నేను వచ్చింది మీ కోసం ...... ఇక సెక్యూరిటీ నుంచి మీకోసం ఫోన్ చేద్దామనుకుంటుండగా మీరే బయటికి వచ్చారు. పదండి" వెనుక సీటుపై కూర్చుంది. బండి కదిలింది.
"బాగున్నారా"
"బాగోలేదు" అన్నాడు టక్కున "ఏమిటో?"
"బిజీగావున్నానో ఖాళీగావున్నానో తెలుసుకోకుండా అలా వెనకకూర్చుని పదండి అంటూ ఆదేశించడం......"
"న్యూస్ ని సృష్టించే వ్యక్తి ఎప్పుడూ ఖాళీగా వుండడని తెలుసు ...... అందుకేనిజమైన బిజీమేన్ అవసరమైతే ఖాళీ చేసుకోగలడని కూడా తెలిసి మీ వెనుకకూర్చున్నది."
"ఎక్కడికెళదాం ....."
"ఏదన్నా పార్కుకి"
బైక్ టేంక్ బండ్ పై వెళుతుండగా అంది "ఇందిరా పార్క్ బెటరనుకుంటాను."
"అంతకన్నా మునిగిపోయిన బుద్దుడ్ని చూస్తూ కూర్చుంటే బెటరు కదూ."
"కనిపించడుగా....."
"కనీసం వినిపిస్తాడు ....." ఆమె జవాబు చెప్పకముందే అన్నాడు త్యాగి "అవును మిస్ లిజీ ...... హింసావాదాన్ని యిష్టపడక, కళ్ళముందు జరుగుతున్న రక్తపాతాన్ని చూడలేక కోరి నీటిలోకి జారిన బుద్దుడుకలిపితే చాలాకథల్ని చెబుతాడనుకుంటాను.....ఏమిటీ మాట్లాడటంలేదు....."
"మునిగిపోయాను నేను కూడా."
"ఎందులో?"
"ధ్యానంలో."
"బహుశా పరధ్యానం అయ్యుంటుంది"
అప్పటికే ఇందిరాపార్కు ఆవరణలో బండిని ఆపిన త్యాగి స్టేండు వేస్తూ అన్నాడు "అవునా"
"కాదు."
"మరి."
"ఆలోచిస్తున్నాను."
"ఏమిటీ?"
"మీకూభావుకత్వం వుందే అని."
"ఏం...... నేను మనిషిలాకనిపించడం లేదా?"
"అందరుమనుషులలో భావుకతవుండదు"
"పొరపాటు" చిరు వెలుగుల మధ్య ఓ పచ్చికపై కూర్చుంటూ అన్నాడు" అందరు రాక్షసులలో వుండదూ అనాలి"
"అదేమిటి"
"అవును లిజీ......స్పందన వున్నవాడే మనిషి అయితే ప్రతి మనిషీ భావుకుడు కావాలి. భావుకులు కాని వాళ్ళు రాక్షసులు అయితే అందులోనూ మాటకోసం తననుతాను బలిచేసుకున్న బలి చక్రవర్తి, అభయం కోరిన పక్షికోసం శరీరం కోసి ఇచ్చిన శిబిచక్రవర్తులూ భావుకులే అని మనం గ్రహించాలి"
తదేకంగా చూసింది.
"వెల్" అలవాటు లేని బిడియం చుట్టుముట్టిందేమో తలతిప్పుకుంటూ "నా ప్రశ్నకి జవాబు ఆలోచించారా?" గుర్తు చేసాడు తను అడిగింది.
రెండు క్షణాల్లో నిశ్శబ్దం తర్వాత అంది "ఒకడు అధునాతణంగా అలంకరించుకున్న వ్యక్తి పర్సు పోయిందని తన వూరు వెళ్ళటానికి పదిరూపాయల సహాయం చేయమన్నాడు. మరొకడు జవసత్వాలుడిగిన భిక్షగాడు- ప్రాణాపాయంలోవున్న మనవడ్ని డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళటానికి పది రూపాయల దానంచేయమన్నాడు. ఎవరో ఒకరికి సహాయం చేయాలనుకున్న నేను ఎవరికీ డబ్బివ్వాలి..... అంతేగా?"
"అవును......"
"బాగా ఆలోచించాక నిర్ణయించుకున్నాను."
"ఏమని?"
"జవసత్వాలు డిగిన భిక్షగాడికే సహాయం చేయాలని."
"ఎందుకని....."
"భిక్షగాడుగా."
"ఆ పేరు పెట్టుకోక పోయినా అవసరంలోపడ్డ యువకుడూ భిక్షగాడి లాగే యాచించాడుగా."
"అదికాదు ...... డబ్బులివ్వకపోతే భిక్షగాడి మనవడు చనిపోయే అవకాశముంది. "సమయానికి యింటికివెళ్ళకపోతే కొడుకేమయ్యాడో తెలీని అతడి తల్లికి గుండె ఆగిపోయే ప్రమాదముంది."
"ఆ యువకుడికి అలాంటితల్లి ఒకతుందని మీరు చెప్పలేదు" ఉక్రోషంగా అంది.
"ఇంత ఆలోచించాక యిప్పుడు ఫ్రెష్ గా అతడి తల్లిగురించి చెప్పడం నన్ను మిస్ లీడ్ చేయడమే"
"మీరు జవాబు ఆలోచించడంలోనే మిస్ లీడైపోయారు లిజీ"
"ఆలోచించమన్నారుగా....."
"కాబట్టి ఆలోచించడమేనా.....మరి కొన్ని వివరాలు సేకరించాలని ప్రయత్నించారా? దశాభ్దాలుగా మన ఆలోచనా పరిధిని సంకుచితం చేస్తున్న హిపోక్రాటిక్ అప్రోజ్ లో మీరూ ముందుకు సాగిపోయారు తప్ప విశ్లేషణకి సిద్దపడలేదు. భిక్షగాడు అన్నా సెంటిమెంటల్ పాయింట్ నే జీర్ణించుకునిలేని వాడికి దానం చేయటం పుణ్యంఅనే సూత్రాన్నేఅమలు చేస్తున్న ఫీలింగ్ తో జవాబుని సిద్దం చేసుకున్నారే తప్ప ప్రశ్నల్లో క్లారిటీకోసం మీరు ప్రయత్నించలేదు. ఇదే ఈ వ్యవస్థ చేసుకున్న దురదృష్టం. నలుగురు నడిచేతోవలో నడవడం ఓ సాంఘిక నిబద్దత. సొంతంగా అలోచించడం తిరుగుబాటు. ఈ రెండు సూత్రాలూ సంఘాన్ని ఎంతబలంగా సాధించిశాసిస్తున్నదీ తెలియచెప్పటానికి మీ జవాబే అందమైన ఉదాహరణ. ఏం రోజూ భిక్షాటనతో బ్రతికే మనిషి కన్నా అనూహ్యమైన ఆపదలో చిక్కుకుని తొలిసారి అభిమానాన్ని చంపుకుని మీముందు చేతులు చాచిన ఆ యువకుడిదే దైన్యమైన పరిస్థితి అని ఎందుకు అనుకోకపోయారు. మీరు కాదంటేరోజూ తిరస్కారాలమధ్య బ్రతికేభిక్షగాడి కన్నా అతడే ఎక్కువ కలవర పడతాడని ఎందుకు వూహించలేకపోయారు"
కన్విన్స్ అవుతూ కూడా మొండిగా అంది "అలా అందంగా అలంకరించుకుని ముష్టెత్తుకునే అబ్బాయిల్ని చాలామందిని చూశాను."
"అయితే"
"అందులో నిజమెంతో తెలీదుగా."
"మరిభిక్షగాడు చెప్పిందాంట్లో నిజమెంతో తెలిసిపోయిందా, అతనూ అబద్దంచెప్పి వుండొచ్చుగా..... దట్స్ వేర్ యూ హేవ్ బీన్ మిస్ లీడ్ మిస్ లిజి....."
తత్తరపడిన లిజీని చూస్తూ అన్నాడు" అసలు యిద్దరూ చెప్పిన దాంట్లో నిజమెంతుందో తెలియకుండా ఓ కంక్లూజన్ కి వచ్చేస్తారు. అదే ఏ జర్నలిస్టయినా చేయకూడనిది....."
నివ్వెరపోయి చూసింది.
"కోపమొచ్చిందా?"
"అహ...... వ్యక్తిగానే తప్ప జర్నలిస్టుగా జవాబు ఆలోచించనందుకు సిగ్గుగా వుంది." "నో" సీరియస్ గా అన్నాడు "అంత తొందరగా ఓ అభిప్రాయానికి రావడమూ
జర్నలిస్టుకి కూడనిదే....."
"నమస్కారం....." చేతులు జోడించింది" మీతో తర్కం నావల్లకాదు."
"అసలే అలిసిపోయినట్టున్నారు....."
"అదేంలేదు."
"అదేమిటి పాపం...... ఊరేగింపులో అప్పారావుని పట్టుకుని ఇంటర్వ్యూ చేసారుగా."
ఉలిక్కిపడింది. "అంటే....... అప్పుడు మీరు అక్కడే వున్నారా?"
"ఉండటమే కాదు...... లాఠీ ఛార్జిలో అంతా పరుగెడుతుంటే మీరు ఫుట్ పాత్ మీది ఓ పాన్ షాపులో తలదాచుకోవడమూ చూశాను."
"నేనేం తలదాచుకోలేదు" ఆ తర్వాత యింకేం మాటాడాలో తోచలేదేమో ఉడుకు మోత్తనం అంది "పైగా నేను ఆడపిల్లనిగా."
"అలాంటప్పుడు ఈ ప్రొఫెషన్ లో ఎందుకు అడుగుపెట్టారు."
"బుద్దితక్కువై....."
"పెద్దగా బాధపడాల్సినపనిలేదు."
ఇదీ చురకలాగే అనిపించిన లిజి మరేదో అనబోతుండగా మృదువుగా నవ్వాడు త్యాగి.
"అవును మిస్ లిజీ ...... కరెన్సీ నోట్లకీకల్లు సీసాలకీ అమ్ముడుపోయి ఓట్లు వేసే నిస్సహాయులైన జనం అర్హతలకన్నా అవకాశవాదానికే పట్టంకట్టే ఛాన్సిచ్చినమన ఫ్లెక్సిబుల్ రాజ్యాంగం, సంఘానికి వుపయోగపడని అశాస్త్రీయ విద్యా విధానం...... వేలిముద్రల రాజకీయ నాయకులచేతిలో అస్త్రాలుగా మారిన పోలీసు బలగం.....మేధస్సుకి ఖరీదు కట్టుకుని అదే బ్రతుకనుకునే మేధావి వర్గం ...... మాఫియాకింగ్స్ చేతి ఆసరాతో నడుస్తున్న ప్రభుత్వాలూ, కాలిపోతున్న సృజనాత్మకత, దగాకోరు బ్యూరోక్రసీ, కర్మసిద్దాంతాన్ని వల్లించేమన ఇతిహాసాల్లాంటి షిట్ పేరుకున్న ఈ వ్యవస్థలో తమ రక్తతర్పణాలతో సాధించిన స్వరాజ్యం స్వార్ధపూరిత వ్యక్తుల ఆలోచనలలో తగలబడిపోతుంటే మీరొక్కరే బుద్దితక్కువ గల వ్యక్తిగా ఆలోచించాల్సిన ఆగత్యం లేదు. గతం గురించి బాజావాయించుకునే మనహీన సంస్కృతిలో సీతారామరాజులు మళ్ళీ మళ్ళీ హత్య చేయబడుతుంటారు. వెలకట్టలేనివారి ఆత్మార్పణలు క్రమంగా మృతి స్వప్నాలను దాచుకున్న కఠినబాక్సులై శతకోటికాంతిసంవత్సరాలదూరం దాకా దేనికి మనంవారసులమో తెలీనిదుస్థితికి నెడుతూనే వుంటాయి" అన్నాడు త్యాగి.
మంత్రముగ్ధలా చూస్తూవుండిపోయిందామె.
వర్తమానంలేనివాడే గతంగురించి మాటాడతాడన్న సత్యానికి అసలు రూపంలా అతడు సాక్షాత్కరిస్తుంటే యిలాంటివాళ్ళని ఈ వ్యవస్థ ఎంతకాలం మననివ్వగలుగుతుంది అనుకుంటూ అడిగింది, "ఈ రోజు రేపు గురించి ఎక్కువకలవర పడుతున్నారనుకుంటాను"