Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 14

    రూప గాభరాగా "ఆంటీ.....ఏమయింది? అయన మీకు బాగా తెలుసా" అంది.
    సుమతి ఒక్క క్షణంలో తేరుకుని. "ఆ తెలుసు....బాగా తెలుసు....అయన లాయరే గదా" అంది తడబడి. మరో లాయరు కొడుకు మీద కేసు పెట్టాలని సుమతి సందేహిస్తుందేమో, తోటి లాయరుతో విరోధం అవుతుందని కేసు అంగికరించదేమోనని రూప గాభారపడింది.
    "రామనాధంగారి కొడుకా యీ సురేష్! ఇంతవడయ్యాడన్నమాట.....తండ్రికి తగ్గ తనయుడయ్యాడన్నమాట. వాండర్ ఫుల్ . బహుశా కొడుకు తరపున తండ్రే కేసు తీసుకుంటాడు. మా ఇద్దరికీ పోటీ అన్నమాట. బేష్! చూద్దాం గెలుపు ఎవరిదవుతుందో. రూపా! అన్నట్టు మనం కోర్టు నోటిసిచ్చేముందు ఒకసారి వెళ్ళి సురేష్ తండ్రిని కల్సుకుని మాట్లాడి పరిస్థితి వివరించి చెప్పు. ఆ తండ్రి ఏమంటాడో విను, కొడుకుని మందలించి నీకు సహాయపడగలడేమో అడిగి చూడు.
    మన వైపు నుంచి మనం అన్ని ప్రయత్నాలు చేశాకే కోర్టు కెక్కినట్టుండడం మంచిది. రేపే వెళ్ళి ఆయన్ని కలుసుకో! ఆయన ఏమన్నది రేపు ఒకసారి వచ్చి చెప్పు. ఈలోగా నేను కేసు గురించి ఆలోచిస్తాను. కేసు పెట్టేముందు ఇలా పాయింట్లు చూడాలి గదా. అబ్బ అప్పుడే పన్నెండయింది ఒంటరిగా ఎలా వెడతావు-పద నిన్నింటి దగ్గర దించి వస్తాను" అంది
    వంటావిడని నిద్రలేపి ఆవిడని తోడు తీసుకుని రూపని దింపి రావడానికి బయలుదేరింది సుమతి.
    "ఆంటీ! నాకు యింట్లోంచి బయటికి వెళ్ళడానికి పర్మిషన్ దొరకడం లేదు సురేష్ యింటికంటే అమ్మ అసలు ఒప్పుకోదు. ఎలా ఆంటీ? అమ్మా వాళ్ళకి ఇలా మిమ్మల్ని కలుసుకున్నట్టు, కేసు పెట్టదలచినట్లు యిప్పటినించి చెప్పడం మంచిదంటారా?" సాలోచనగా అడిగింది రూప తోవలో.
    సుమతి ఒక్కక్షణం ఆలోచించింది. "ఇప్పుడే చెపితే వాళ్ళు ఒప్పుకోరు. తను పరువు, కూతురి భవిష్యత్తు నాశనం అవడానికి ఏ తల్లి తండ్రులిష్టపడతారు. కోర్టు కేక్కితే అంతా బయటికి వచ్చి నీకింక యీ జన్మకి పెళ్ళి కాదన్న భయం వాళ్ళకుంటుంది. అందువల్ల నిన్ను, నీ ఆలోచనని సమర్ధించిన నన్ను దుయ్యబట్టి మన ప్రయత్నానికి అడ్డు తగలచ్చు. అంచేత ఇప్పుడు చెప్పడం మంచిది కాదు. ఎలాగో ఏదో వంకన రేపు సురేష్ యింటికేళ్ళు, ఇలాగే రేపు రాత్రి పదిగంటలకి మా యింటికి రా. ఆఖరిసారిగా మనం అన్నీ డిస్కస్ చేసి నేను నోటిసు తయారు చేస్తాను".
    మాటల్లో ఇల్లు వచ్చింది. రూప గుమ్మం దగ్గర విడిచి చెయ్యి నొక్కి అభిమానంగా భుజం తట్టి సెలవు తీసుకుని వెనక్కు తిరిగింది సుమతి. రూప చప్పుడు లేకుండా తాళం తీసి లోపలి కెళ్ళింది.
    "ఎక్కడికే బయలుదేరావు?" ముస్తాబుయి చెప్పులు వేసుకుంటున్న రూపని తీక్షణంగా చూసింది పద్మావతి.
    "అమ్మా ఒక్కసారి సురేష్ వాళ్ళింటికెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి. అరగంటలో వచ్చేస్తాను."
    "ఏమిటి.....ఇంకా సిగ్గులేకుండా వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడతావా? ఏం మాట్లాడతావే" కరకుగా అడిగింది.
    "అంతా వాళ్ళ వాళ్ళకి తెలియాలి. నే వెళ్ళి మాట్లాడాలి."
    "చాలు చేసిన నిర్వాకం చాలు. నీ వెళ్ళి మాట్లాడినంత మాత్రాన ఆ తండ్రి మంగళసూత్రం కట్టించడు. మీ నాన్నకి తెలిస్తే చంపుతాడు. నోరుమూసుకులోపలికేళ్ళు. ఇప్పటికే మీ నాన్న చేతిలో తిట్లు తినలేక చస్తున్నాను. ఈ సంగతి తెలిస్తే నా ప్రాణం తీస్తారు. నే పడలేని గోల. వెళ్ళాలంటే మీ నాన్నని అడిగి వెళ్ళు పద్మావతి కోపంగా అంది.
    రూప తల్లివంక ఒక్కనిమిషం చూసి "అమ్మా! ఇది నా జీవిత సమస్య. నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను. నాకు అడ్డు చెప్పకు. నాన్న అడిగితే నేనే చెపుతాను జవాబు" తల్లి జవాబుకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది రూప.
    కూతురి మొండితనానికి, ఆ ధైర్యానికి విస్తుపోయి చూస్తూ వుండిపోయింది పద్మావతి.
    లాయరు రామనాధంగారిది మేడ ఇల్లు. ఆయనకి లాయరుగా సంపాదించినదే కాక పిత్రార్జితం కాస్తో కూస్తో వుంది. ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు ఆయనకి. పెద్దకుతురికి మాత్రం పెళ్ళి అయింది. పెద్దకొడుకు ఇంజనీరింగు పాసయి మొన్ననే ఉద్యోగంలో చేరాడు. సురేష్ తో బాటు ఆడపిల్లలంతా ఇంకా చదువులలో వున్నారు. పెద్ద స్థితిమంతులు కాకపోయినా దేనికి లోటులేని సంసారం వారిది.
    రూప వాళ్ళింటికి వెళ్ళేసరికి వీధి వరండాలో రామనాధంగారు కూర్చుని కాఫీ తాగుతున్నారు అప్పుడే కోర్టునించి వచ్చి, అయన భార్య శారదాంబ పక్కనే మరో కుర్చీలో కూర్చుని మాట్లాడుతోంది. రామనాధంగార్ని, చూడగానే సురేష్ తండ్రినిపోలాడని పోల్చింది రూప. నలబై ఏళ్ళ వయసులోనూ మంచి రంగులో వడ్డు పొడుగ్గా భారీగా వున్నడాయన. బట్టతల అయినా మంచి వర్చస్సుంది అయన మొహంలో. ఆయన ముందు అయన భార్య చాలా పొట్టిగా పిలగా చామనఛాయ రంగులో అనాకారిగా వుందనిపించింది రూపకి.
    గేటు దాటి లోపలికొచ్చిన రూపని ఇద్దరు కుతూహలంగా చూశారు. కూతురికోసం ఎవరో స్నేహితురాలు వచ్చి వుంటుందనుకున్నారు.
    "నమస్కారమండి " అంది రూప జంకు గొంతు లేకుండా.
    "ఎవరికోసం అమ్మాయి? మా నళిని కోసమా?" అంది శారదాంబ.
    "కాదండీ నేను.....సురేష్...."
    "ఓహ్ సురేష్ క్లాస్ మెట్ వా? ఏం కావాలి ఏదన్నా నోట్సులు అవి....వాడింట్లో లేడే" అంది మళ్ళి ఆవిడే రూపని కుతూహలంగా చూస్తూ.
    "నేను అతనికోసం రాలేదు. మీతో మాట్లాడాలని పనుండి వచ్చాను."
    రామనాధం గారి వంక సూటిగా చూస్తూ అంది రూప. అయన ఆశ్చర్యంగా "నాతో మాట్లాడాలా!?" అన్నారు.
    :అవునండి" అంది రూప.
    ఆయన, భార్య మొహాలు చూసుకున్నారు. "ఏ విషయంలో?" అన్నారాయన
    కాస్త గంభీరంగా "మీ సురేష్ విషయం" రూప సూటిగా అంది.
    మరోసారి ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. ఇద్దరు మొహాలు రంగులుమారాయి.
    "మా సురేష్ విషయం....ఏమిటది? ఇంతకీ నివేవరి అమ్మాయివి?" ఆయన ప్రశ్నలో కుతూహలంతో పాటు ఆరాటం తొంగిచూసింది.
    "మీతో కాస్త రహస్యంగా ఒక విషయం చెప్పాలి. ఇక్కడే మాట్లాడవచ్చా?"
    అయన ఒక్క నిమిషం ఆలోచించి కుర్చిలోంచి లేచి "లోపలికి రా అమ్మాయి. ఒసేయ్ నా ఆఫీసు గదిలోకి తిసికేళ్ళు ఈ అమ్మాయిని"అన్నారాయన.
    లోపలికెళ్ళగానే రూప తన వివరం, సురేష్ కి, తనకి మధ్య జరిగింది అంతా సూటిగా చెప్పేసింది. అంత వింటున్న భార్యాభర్తల మొహాలు పాలిపోయాయి.
    కలవరపడ్తు ఇద్దరూ మొహాలు చూసుకున్నారు. రూప అంతా చెప్పడం పూర్తి చేయగానే రామనాధంగారు తన లాయరు తెలివితో చప్పున మొహంలో భావం మార్చేసి గంభీరంగా "అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు?" అన్నారు తెలివిగా.

 Previous Page Next Page