Previous Page Next Page 
మొగలిబాకు పేజి 14

   

    సముద్రం ఎదుట ఇసకలో రెండువందలమంది ఆడా, మగా స్టూడెంట్స్ కూర్చున్నారు. వాళ్ళందరూ ఆర్ట్స్ కాలేజీలో వివిధ క్లాసులు చదువుతున్న స్టూడెంట్స్. బి.ఏ. ఫైనలియర్ స్టూడెంట్స్ లో ఓ ఐదుగురు విద్యార్ధులు, ఓ నలుగురు విద్యార్ధినులు గుంపుకు ఎదురుగా కూర్చున్నారు.
   
    విద్యార్ధుల్లో ఒక కుర్రాడు లేచి నిలబడ్డాడు- అతడి పేరు వాసుదేవ్.
   
    "మైడియర్ స్టూడెంట్స్.....ఇవాళ మన యూనివర్శిటీలో జరిగిన డేవిడ్, దివ్యల సంఘటన భారతదేశపు ప్రేమ చరిత్రలోనే మాయని మచ్చ - యూనివర్సిటీళ చరిత్రలో కొండంత మచ్చ. డేవిడ్, దివ్యల ప్రేమ చావుకు కారణం ఎవరు? మతాల్నీ, కులాల్నీ పట్టుకుని ప్రాకులాడే చాందసవాదులా? ఈ చాందసవాదుల్తో నిండిపోయిన ఈ వ్యవస్థా? ఎవరు కారణం? చెప్పండి"
   
    "ఈ వ్యవస్థే కారణం....ఈ వ్యవస్థే కారణం....." విద్యార్ధినులు ఒక్క పెట్టున అరిచారు.
   
    "కాదు.....వ్యవస్థ కారణం కాదు.....తాము కట్టిందే వేదమని నమ్మే తమ చుట్టూ తాము మతం, కులం, గీతలు గీసుకుని బతుకుతున్న తల్లిదంద్రులే కారణం.....ఇప్పుడు చెప్పండి.....ఎవరు కారణం" ఆవేశంగా ప్రశ్నించాడు వాసుదేవ్.
   
    "అవును......తల్లి దంద్రులే కారణం....." మళ్ళీ ఆడపిల్లలు అరిచారు.
   
    ఆ అరుపులకి అంతెత్తున అరిచాడు వాసుదేవ్.....
   
    "చూడండి.....ఆడ స్టూడెంట్స్ - మీకు బుద్దిలేదు. నేనేది చెపితే అదే కరెక్టని మీరు అరవడం కాదు కావలసింది, ఆలోచించండి.....ఆలోచించి అరవండి....."    
   
    ఆ మాటకు అక్కడ గంభీరమయిన వాతావరణం నెలకొంది.
   
    ఆ మాటకు ఒక్క పెట్టున నారాయణరావు లేచాడు.
   
    "చూడండి స్టూడెంట్స్.....పాత సినిమాలో పాటను మీరు మరచి పోయుంటారు. ప్రేమించుట పిల్లల వంతు__దీవించుట పెద్దలవంతు. ఇది నేను చెప్పిన మాట కాదు......పెద్దలు చెప్పిన మాట.....తాము చెప్పిన మాటకు.....విరుద్దంగా పెద్దలు ప్రవర్తించడం, ఆంద్రదేశంలోనే కాదు. భారతదేశంలో-కానేకాదు-ప్రపంచంలో పెద్దలందరకూ, ఘోర అవమానం కాదంటారా__మన రాష్ట్రంలోని యువతీ యువకులందరూ కులాతీత, మతాతీత పెళ్ళిళ్ళు చేసుకోవడం ద్వారా పెద్దలకు బుద్ది చెప్పాలి. ఇదొక ఉద్యమంలా సాగాలి__" అప్పటికే నారాయణరావు బుర్ర మొద్దుబారిపోయింది. ఏం చెప్పాలో అర్ధంకాక, పిచ్చి పిచ్చిగా అందరివేపూ చూడడం ప్రారంభించాడు.
   
    స్టూడెంట్స్ అందరూ ఒక్క పెట్టున చప్పట్లు కొట్టారు. ఆ దెబ్బతో నారాయణరావు పులైపోయాడు.
   
    "మైడియర్ స్టూడెంట్స్__నాకు పంతం వస్తే, ఏం చేయడానికయినా నేను రెడీ__పెద్దలను ఎదిరించే, ఈ మతాతీత, కులాతీత వివాహ ఉద్యమంలో నేను, హోల్ హార్టెడ్ గా పార్టిసిపేట్ చెయ్యడమే కాకుండా, నేనొక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటానని, అందుకోసం, అవసరమయితే ప్రాణత్యాగం చేస్తానని కూడా మీకు మనవి చేస్తున్నాను."
   
    "ప్రాణత్యాగం చేస్తే, పెళ్ళెలా చేసుకుంటావురా కన్నా?" ఎవరో వెనకనుంచి అరవడంతో అందరూ జల్లుమని నవ్వారు.
   
    "సారీ__పెళ్ళి చేసుకుని ప్రాణత్యాగం చేస్తా" మళ్ళీ కంగారుగా అన్నాడతను.
   
    ఆ మాటకు అందరూ పెద్ద పెట్టున ఒక్కసారిగా నవ్వేసరికి__మొఖాన్ని షేక్స్ పియర్ ముఖంలా పెట్టుకుని కూర్చుండి పోయాడు నారాయణరావు.
   
    కొద్దిసేపయ్యాక-
   
    మోతీసాహూ అనే అమ్మాయి లేచి నిలబడింది. ఆ అమ్మాయి బి.ఎల్ ఫస్టియర్ స్టూడెంట్.
   
    "మైడియర్ స్టూడెంట్__మన నారాయణరావుగారు. ఆవేశంగా మాట్లాడి నప్పటికీ, ఆయన ప్రోబ్లమ్ ని అర్ధం చేసుకోలేదని నాకనిపిస్తోంది. ఒక అమ్మాయి, అబ్బాయి మతాతీతంగా, కోలాతీతంగా ప్రేమించుకోవడం, పెద్దవాళ్ళకు నచ్చకపోతే, వాళ్ళకు దూరముగా పారిపోయి పెళ్ళిచేసుకోవటం-ఈ ఇన్సిడెంట్ మీద యిప్పటికీ చాలా సినిమాలొచ్చాయి నిజజీవితంలో జరిగాయి కూడా.....మన యువతరంలో చేవ, సత్తా వుంటే, మతాతీత ప్రేమద్వారా, పెద్దవాళ్ళ వ్యవస్థలో మార్పు తీసుకురావాలి.....ఆ మార్పుదిశగా మనం ఉద్యమం చేపడితే బావుంటుంది"
   
    అమ్మాయిలందరూ హోరుమని చప్పట్లు కొట్టారు- కొంతమంది ఉత్సాహం ఆపుకోలేక విజిల్స్ వేసారు.
   
    మోతీలక్ష్మి చెప్పిన పాయింట్ తో వాసుదేవ్ ఏకీభవించాడు.
   
    ఆ తర్వాత విద్యార్ధులందరూ తాము చేపట్టే ఉద్యమం ఎలా వుండాలో అనే విషయమై చాలాసేపు చర్చలు జరిపారు-అనేక విధాలుగా తర్జన భర్జనలు పడ్డారు.
   
    మర్నాడు రంగస్థలం-ఆర్ట్స్కాలేజీ ఆడిటోరియంలోకి మారింది. గ్రూపులు గ్రూపులుగా చర్చలు జరిగాయి.
   
    ఆ చర్చ తర్వాత......
   
    "డేవిడ్, దివ్యల ఆత్మశాంతికోసం, పెద్దలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేవదీయటానికి చిత్తశుద్దితో నేను అంగీకరిస్తున్నాను. ఈ విషయంలో ఏ పరిస్థితుల్లోనూ రాజీపడే అవకాశం లేదు ఎవరికీ భయపడ్డం గానీ, వెనక్కి తొలగిపోవడంగానీ జరగదని యూనివర్సిటీమీద వాగ్దానం చేసి చెబుతున్నాను"
   
    విద్యార్ధుల సామూహిక ప్రమాణాలు జరిగిన తర్వాత.....
   
    ఆర్ట్స్ కాలేజీలోకి అడుగుపెట్టాక ఎప్పుడూ క్యాంటీన్ లోనే తప్ప క్లాసు ముఖం చూడని మహమ్మదాలీ లేచి....
   
    "మైడియర్ ఫ్రెండ్స్.....పెద్దవాళ్ళకు బుద్ది చెప్పాలంటే ఒకటే మార్గం. ఇక్కడ సమావేశమైన రెండువేలమంది కుర్రాళ్ళూ, అర్జంట్ గా రెండువేలమంది అమ్మాయిల్ని మొదట ప్రేమించేసి, వరసగా బీచ్ లో, పాటలూ, అవీ పాడేసుకొని, ఆ తర్వాత రేపు మళ్ళీ మార్చి నెలలో సిటీలోని కళ్యాణ మండపాలన్నీ మనమే బుక్ చేసేసుకుని, పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇంత అర్జంట్ గా పనులన్నీ జరగకపోతే తప్ప పెద్ద వాళ్ళలో బుద్దిరాదు" అతగాడి ప్రపోజల్ కి కొంతమంది హోరుమని చప్పట్లు కొట్టారు.
   
    ఎలక్షన్ లలో మహమ్మదాలీ చేతిలో ఓడిపోయి, సరయిన సమయము కోసం ఎదురు చూస్తున్న జిన్నాగాడికి జుత్తుముందుపుట్టి తర్వాత తల పుట్టిందో, తల ముందుపుట్టి జుత్తు పుట్టిందో వాడి ఫ్రెండ్స్ కి గొప్ప సందేహం.
   
    "మైడియర్ స్నేహితులారా! కొంతమంది అతి తెలివితో వాళ్ళ స్వార్ధ ప్రయోజనాల కోసం మన విద్యార్ధి ప్రేమ ఉద్యమాన్ని ఆదిలోనే నీరు కార్చడానికి చూస్తున్నారు.....రెండువేలమంది మగవాళ్ళు, రెండు వేలమంది ఆడవాళ్ళను ఏకకాలంలో ప్రేమించడం ఎలా సాధ్యం.....మీరే చెప్పండి-ఈ మహమ్మదాలీ మాటలు విని మోసపోవద్దు స్టూడెంట్స్ లారా! మోసపోవద్దు" మళ్ళీ చప్పట్లు మార్మోగిపోయాయి.
   
    జిన్నా మాటలకు, మహమ్మదాలీ సపోర్టర్-'సరదా పటేల్' అన్నా కుర్రాడు బట్టతల తడుపుకుంటూ లేచి నిలబడ్డాడు.
   
    "మైడియర్ ఫ్రెండ్స్.....కాబోయే యూనివర్సిటీ లీడర్ యువనేత మా మహమ్మదాలీ మీద కొంతమంది విమర్శకులు గుప్పించడం నేరం. ఇలాంటివాళ్ళకు విద్యార్ధి ఉద్యమాలమీద నమ్మకం లేదని మనవి చేస్తున్నాను. ఆర్ట్స్ కాలేజీలో జిన్నాలాంటి స్వార్ధపరులు లెక్చరర్ లను ప్రొఫెసర్ లను కాకపట్టి, స్టూడెంట్స్ లీడర్స్ గా చెలామణి అయిపోతున్నారు తప్ప, నిజానికి వారేమీ కాదని మీకు తెలుసు....అందుచేత....." సరిగ్గా అదే సమయంలో__
   
    "నోర్మూసుకో బిడ్డా.....ముందు పాయింట్ గా రా" అని అరిచేసరికి అందరూ గొల్లున నవ్వి వంత పాడారు.

 Previous Page Next Page