Previous Page Next Page 
అసావేరి పేజి 14

    ఓ మూల మంగ నిలబడి వుంది.
   
    చిత్రంగా మంగ కళ్ళు నీళ్ళను వర్షిస్తున్నాయి.
   
    ఆ రాత్రి తర్వాత శంకుని చూడటం ఇదే మళ్ళీ! కానీ ఇలా చూడలేకపోతూంది.
   
    "అమ్మా...." శంకూ పెదవులు గొణుగుతున్నాయి. అవయవాలు సహకరించనట్టు కదలాలని ప్రయత్నిస్తూ ఓడిపోతున్నాడు.
   
    "నాన్నా....శంకూ పెదవులు గొణుగుతున్నాయి. అవయవాలు సహకరించనట్టు కదలాలని ప్రయత్నిస్తూ ఓడిపోతున్నాడు.
   
    "నాన్నా....శంకూ...." ఇంకా బ్రతికేవున్నందుకు ఆనందమో....ఇలాగాయినా బ్రతికితే చాలన్న ఆరాటమో లక్ష్మమ్మ గొంతు రుద్దమైపోయింది "ఓరే....చిట్టితండ్రి....తప్పంటే తెలీని పసివాడివే! నిన్నిలా బాధపెట్టడానికి వాళ్ళకి చేతులెలా వచ్చాయిరా? పట్టుకుని తిట్టినా పల్లెత్తు మాటననివాడివే! ఏమన్నావని నిన్నిలా ఒరేయ్....నా ముద్దుల కన్నా....మాట్లాడరా....నీ కోసం బ్రతుకుతున్న ముసలి బామ్మనిరా.... అసలేమైందిరా ...." కుమిలిపోతూంది. ఊపిరందనట్టు తల్లడిల్లిపోతూంది.
   
    "బా.....మ్మా...." అప్పటికే కళ్ళు తెరిచిన శంకూ ఆ స్థితిలోనూ బామ్మ ఏడుపును తట్టుకోలేకపోతున్నాడు. "నేను....అసలు....నేను ఏ తప్పూ చేయలేదే" రొప్పుతున్నాడు. ఒంటిని నులిమే బాధకో, బామ్మ ప్రస్తుత స్థితికో శంకూ కళ్ళలోనూ నీళ్ళు తిరిగాయి "ఒట్టు బామ్మా.....నేను బాగా చదువుకుని పెద్దోడ్నయిపోతున్నాను కధే....నేను...తప్పు లెందుకు చేస్తాను" మనసులోని భావాన్ని సరిగ్గా వ్యక్తం చేయలేని నిస్సహాయతకి తనూ నలిగిపోతున్నాడు సరిగ్గా.
   
    లక్ష్మమ్మ వెక్కిపడుతూనే శంకూ జుట్టును సవరిస్తూంది.
   
    అప్పుడు చూశాడు మంగని. "నిజం మంగా....నేనస్సలు తప్పుచేయలేదు....ఒట్టు బామ్మకి నువ్వయినా చెప్పు మంగా....."
   
    ఇక్కడ తప్పన్న పదానికి ప్రాపంచికమైన నిర్వచనం తెలీని శంకూ మంగని ప్రాధేయపడుతున్నాడు.
   
    మంగ కళ్ళనుంచి జలజలా నీళ్ళు రాలేయి.
   
    ఏమని చెప్పగలదు? శంకూని బహుశా చాలామందికన్నా ఎక్కువగా మొన్నరాత్రే తెలుసుకున్న మంగ శంకూ తప్పుచేయగల సమర్ధుడు కాడని ఎలా స్పష్టం చేయగలదు?
   
    "కాలేజీలో గొడవ పడ్డారా" అడిగింది మంగ.
   
    "అహ....రవి నన్నల్లరి చేసాడు....అయినా నేనేం అనలేదు."
   
    "మరెందుకు....మరెందుకు శంకూ....రవి నీ మీద ఎందుకు కత్తిగట్టాడు" ఎవరూ జవాబు చెప్పలేక ప్రశ్న ఇది. లాలనగా మంచాన్ని చేరుకుంది. అమలా లాలిస్తున్నట్టు చూసింది. "చాలా గొప్పింటోళ్ళు శంకూ సర్దా పుడితే చాలు ఏమన్నా చేస్తారు...చేయగలరు దానికి పెద్ద కారణం అదనతే...." ఆ కుటుంబం గురించీ, అందులోని మనుషుల గురించీ చాలా తెలిసిన మంగ స్వగతంలోలా చెప్పుకుపోతూంది.
   
    "బామ్మా....మరేమో...." ఏదో చెప్పాలని మధనపడుతున్నాడు.."ఈ సంగతి ఎవరికీ చెప్పకేం....ముఖ్యంగా సురేంద్రకి....ఎందుకంటే నేనంటే బాగా ఇష్టంగా...తెలిస్తే రవితో కొట్లాడతాడన్న మాట...అందుకని నేను సైకిలు మీదనుంచి పడిపోయాన్ని చెబుతాను."
   
    "పిచ్చిపిల్లాడా" ఇలాంటి నిస్సహాయస్థితికి తట్టుకోలేకేమో మంగ కళ్ళనుంచి నీళ్ళు మరింతగా ఉబికాయి. "ఒంటినిండా గాయాలైతే సైకిలు మీదనుంచి పడిపోయావంటే నమ్మేస్తాడా నీ స్నేహితుడు. అయినా ఈ పాటికే ఊరంతా పొక్కిపోయి వుంటుంది. చేసింది రవిబాబు కాబట్టి, ఏమన్నా చేయగల పెద్దింటి బిడ్డ కాబట్టి, చూసినా ఎవరూ జోక్యం చేసుకోరు. పెదవి విప్పరు. అది ఇక్కడ ఆనవాయితీ. కానీ....సురేంద్రకి తెలిస్తే బహుశా నీ మీద ప్రేమతో కదిలిపోతాడేమో! ఒప్పుకుంటాను ఆ తర్వాత గొడవ పెట్టాడంటే నష్టపోయేది మళ్ళీ నువ్వే అవుతావు. అందుకే ఏదో అబద్దం చెప్పి, ఈ విషయం దాచడమే నయం."
   
    మరుసటిరోజు కాలేజీకి తీసుకెళ్ళడానికి వచ్చిన సురేంద్రకి అబద్దం చెప్పింది లక్ష్మమ్మ.
   
    ఆ తర్వాత రెండు రోజులపాటు కాలేజీకి వెళ్ళలేదు శంకూ.
   
    ఒక వాస్తవం మరుగున పడిపోయింది.
   
    ఒక చిన్న ప్రయోగం ద్వారా ఆకతాయిగా ఆడుకోవాలనుకున్న వెంకట సురేంద్ర చెప్పిన విషయం విని కొద్దిగా ఆందోళనపడ్డాడు. ఎందుకో శంకూకి తగిలిన గాయాలకి సైకిలు మీదనుంచి పడటం కారణం కాదేమో అనిపించింది. కానీ స్నేహితుడయిన రవి దగ్గర ఆ ప్రసక్తిని తేలేకపోయాడు.
   
    అందరికన్నా ఎక్కువగా అలజడి చెందింది సావేరి.
   
    ఆ రాత్రి అన్నయ్య రోషంగా వెళ్ళాక శంకూపై అఘాయిత్యం చేస్తాడేమో అని భయపడింది. కానీ అడగలేకపోయింది.
   
    ఒకవేళ మరుసటి శంకూ కాలేజీకి వచ్చివుంటే దిగులు చెందక పోయేదేమో కాని రెండు రోజులూ రాలేదు.
   
    కాలేజీకి అడుగుపెట్టింది మొదలు కారిడార్ లో నిలబడి అతడి కోసం ఆశగా ఎదురుచూడటం అతని ఆలోచనలతోనే క్లాస్ రూంలో అడుగుపెట్టటం అక్కడున్నంతసేపూ శంకూ గురించే ఆందోళన పడటం....
   
    ఇదే రెండు రోజులపాటు ఆమె దినచర్య.
   
    నలభయ్ ఎనిమిదిగంటలపాటు కలవరపడింది.
   
    రెండువేల ఎనిమిదివందల ఎనభై నిమిషాల పాటు అతడి ఆలోచనల్లోనే కలత చెందింది.
   
    లక్షా డెబ్బైరెండు వేళ ఎనిమిది వందల సెకండ్లపాటు శంకూ తలపులతో తల్లడిల్లిపోయింది.
   
    కానీ ఎలా తెలుసుకోవడం?
   
    ఎవర్నని అడగడం....అహం అడ్డొచ్చింది అయినా ఆర్తి అహాన్ని జయించింది.
   
                                            *    *    *    *
   
    "మంగా!"
   
    రాత్రి ఏడు గంటలవేళ పనులయ్యాక ఇంటికి బయలుదేరబోయిన మంగ తల తిప్పి చూసింది సావేరివేపు "ఏంటమ్మా...."
   
    "మరేమో...." వడలిపోయిన నందివర్ధనం లా చాలా నీరసంగా కనిపిస్తూంది సావేరి. "ఏం లేదులే..." అడిగే సాహసం చేయలేక పోయింది.
   
    "ఏంటమ్మా" మంగకీ తొందరగా వెళ్ళాలని వుంది. ఈ రెండు రోజులూ శంకూ సేవలతోనే చాలాసేపు గడిపింది. అతడ్ని నవ్విస్తూ, లాలిస్తూ...."తొందరగా చెప్పండమ్మా, వెళ్ళాలి."
   
    "అయితే వెళ్ళు...." అలిగినట్లు తల తిప్పుకుంది దేన్నైనా అరిచి గీ పెట్టయినా సాధించే సావేరికి ఇలాంటి నిస్సహాయస్థితి అలవాటు లేనిది. అందుకే ఏ క్షణంలో అయినా ఏడ్చేట్టుంది. "వెళ్ళమంటుంటే"
   
    "ఏమిటి తల్లీ...." మృదువుగా నవ్వేసింది మంగ. తోబుట్టువులే వుంటే ఆ తోబుట్టువుల్లో అందరికన్నా చిన్నది చాలా అందమైనదీ, ఆకతాయిదీ అయ్యుంటే, అచ్చు సావేరిలా వుండి ఉండేది "నా దగ్గర దాపరికమేంటి...."
   
    "మరి తొందరగా వెళ్తానంటున్నావుగా?" పెదవుల్ని ఉక్రోషంగా ముడుచుకుంది.
   
    "అలా అంటే ఆలస్యం చేయకుండా అసలు సంగతి చెబుతావని."
   
    "సంగతేంటి....గిల్టీగా కిటికీ దగ్గరకు నడిచి తన మొహంలో భావాలు కనిపించకుండా చీకట్లోకి చూస్తుండిపోయింది.
   
    "అయితే ఏమీలేదా?" అమంగ ఆత్మీయంగా భుజంపైన చేయి వేసింది "నాకు తెలుసు"
   
    "ఏమిటి నీకు తెలిసింది....?" ఓరగా చూసింది తెచ్చిపెట్టుకున్న కోపంతో.
   
    "ఎక్కువగా వస్తున్నట్టున్నాడు."
   
    "ఎవరు?"
   
    "అందమైన అబ్బాయి. అదే అస్తమానం ఆలోచనల్లో వస్తున్నాడన్నావుగా."
   
    పెదవుల్ని బిగించింది. యిక నిభాయించుకోలేనట్టు వెన్నెల్లా నవ్వేసింది.
   
    "నిజమే కదూ?"

 Previous Page Next Page