ఇక ఉద్రేకపూరితమైన సన్నాయి వాద్యం, వారితో పోటీపడి బ్యాండువాళ్ళు అవుట్లూ, ఆకాశంలో రంగుదీపాల పువ్వులను వెదజల్లే తారాజువ్వలు, రోడ్డుకు ఇరువైపులా వున్న ఇళ్ళలోంచి స్త్రీ పురుషులు గుమ్మాలలోంచి, డాబాలమీద నుంచి తిలకించటం, కొందరు ముందుకు వచ్చి గంగాధరంగారితో అభినందన పూర్వకంగా మాట్లాడి వెళ్ళటం_ యీ ఆనవాయితీలన్నీ యథాప్రకారం జరుగుతున్నాయి.
భారతికి ముళ్ళపందిరిమీద కూర్చున్నట్లుగా వుంది. యీ వేడుక అంతా ఆమెకు ఎంతో ఎబ్బెట్టుగా, అనాగరికంగా తోచింది. ఇదంతా తన పెనిమిటి ఎలా భరిస్తున్నాడు? అనుకోకుండా అతనివైపు రెండు మూడుసార్లు చూసింది ఫుల్ సూట్ లో కూరుకుపోయి, అస్తిమితంగా కూర్చున్న అతను యీ ఆనందంగానీ, చిరాకుగానీ ఏవీ పంచుకోనట్లు, యీ వికారాలతో తనకేమీ సంబంధం లేకుండా ఏదో భావ ప్రపంచంలో విహరిస్తున్నట్లు కనబడ్డాడు. తనకోసం అంత కలవరించిన వ్యక్తి, తనను పెళ్ళిచేసుకోవటం కోసం క్రుంగి కృశించిపోయిన వ్యక్తి తన వైపు ఓరచూపులు చూడడేం. తనను పలకరించడేం, పొరపాటున జరిగి పోయినట్లు తన శరీరానికి అతని శరీరం తాకేటట్లు చేయడేం_అని ఆశ్చర్యపోయింది భారతి. అతను వట్టి జడుడా అనుకుంది. ఎప్పుడో ఉద్రేకం వచ్చినప్పుడు ఉప్పెనలా బయటపడటం తప్ప, ఇతనికి భావాలూ, అనుభూతులూ లేవేమో అని తలపోసింది.
ఊరేగింపు ముగిసి, ఇంటికి వచ్చేసరికి ఒంటిగంట దాటింది. అలసిపోయిన శరీరంతో తన ప్రక్కమీదకు చేరి పడుకున్న భారతికి, మల్లిక తన ప్రక్కనే పడుకుని పరిహాసం చేయటంగానీ, చెవిలో రహస్యాలు చెప్పటంగానీ అట్టే తెలియలేదు. "పో కొంటే!" అని మాత్రం అని ఓ ప్రక్కకి తిరిగి కొద్దిక్షణాల్లో నిద్రలో మునిగిపోయింది.
మరునాటి సాయంత్రం పెద్ద పార్టీ జరిగింది. ఊళ్లోని ఆబాలగోపాలమూ ఇరుగు పొరుగు గ్రామాల నుండి కూడా చాలా మంది అయిన వారూ వచ్చారు. విశాలమైన పందిరి అంతా పలురకాల స్త్రీ పురుషులతో, చుట్టుపక్కాలతో కళకళలాడిపోతూంది.
సారథినీ, భారతినీ రెండు పెద్ద సోఫాలలో కూర్చోపెట్టారు. అతనివైపు క్రీగంటచూసి ఫుల్ సూట్ లో మునిగిపోయినట్లు కనబడుతున్న అతని వాలకానికి కష్టంమీద నవ్వాపుకుంది భారతి. మీకు దణ్ణం పెడతానుగానీ సూటుమాత్రం ఎప్పుడూ ధరించకండి బాబూ పైజామా, లాల్చీ వేసుకోండి హాయిగా. అదే మీకు నచ్చింది' అని తనకూ, అతనికీ మొదటిసారి జరగబోయే సంభాషణలోనే చెప్పాలనుకుంది.
ఎవరెవరో పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారు. కానుకలు ఇస్తున్నారు. పూలదండలు వేస్తున్నారు వచ్చింది మగవారైతే సారథితో ఆమె మెళ్ళో వేయించి, కానుకలు సమర్పించి, అభినందించి వెళుతున్నారు.
అబ్బ! ఎన్ని కానుకలవి! యెంతెంత ఖరీదైనవి! ఒక ప్రక్క రాశిలా పోగవుతున్నాయి. అవన్నీ చూస్తూంటే భారతికి కళ్ళు చెదిరిపోయాయి.
అభినందించటానికి అతిథి రాగానే ,లేచి నిల్చోవటం, ఆ వ్యక్తి వెళ్ళిపోయాక తిరిగి కూర్చోవటం, ఇంతలో మరొకరు రావటం__ఈ విధంగా కొన్ని వందలసార్లు గుంజిళ్ళుతీసి ఆమె అలిసిపోయింది. నీరసం ముంచుకు వచ్చింది. ఇంతలో దగ్గర్లోనే స్థంభానికి ఆనుకుని నిలబడ్డ మల్లిక కనిపించి ఆమెవంక నిస్సహాయంగా చూసింది. ఆమె అవస్థ గ్రహించినట్లు మల్లిక జాలిగా చూడటం మినహా ఏమీ చేయలేక పోయింది.
అంతలో ఒక అతిథి వచ్చారు. ఆయన బహుశా గంగాధరంగారికి ముఖ్య స్నేహితుల్లో ఒకరై వుండాలి. ఆయన స్వయంగా చెయ్యి పట్టుకుని దంపతుల దగ్గరకు తీసుకువచ్చారు. మల్లికవైపు చూస్తూన్న భారతికి ఎవరో రావటం అలికిడి బట్టి తెలిసి, యాంత్రికంగా లేచి నిల్చున్నది గానీ, ధ్యాస నిల్పి వచ్చినవారివైపు చూడలేదు. అతిథి సారథిని అభినందించి ,తన చేతిలోని ప్యాకెట్ అతని కందిచ్చి భారతి వంక తిరిగి ఒక నిమిషంపాటు లాగే చూస్తూ వుండిపోయాడు తరువాత "కూర్చుందురుగాని రండి" అన్న గంగాధరంగారి పిలుపుతో మేల్కొన్నట్లయి, ఒక చిరునవ్వు నవ్వుకుని వెనక్కి మరలాడు.
అంత దగ్గర్లో మామగారి గొంతు వినిపించి భారతి ఉలికిపడి అటుకేసి చూసింది. గంగాధరంగారి ప్రక్కనే పాతకాలంనాటి దానిలా కనిపిస్తూన్న కోటు ధరించి ఒక వ్యక్తి నడిచి వెడుతున్నాడు. నడి వయసు దాటి వుంటుంది. వెనక నుంచి చూస్తూంటే ఆయన్ని ఎప్పుడో చూసినట్లనిపించింది గానీ. అంత ఆలోచించినా ఎవరో గుర్తు తెచ్చుకోలేకపోయింది. తరువాత వరసగా కుర్చీలో కూర్చున్న మనుషుల మధ్య ఆ వ్యక్తి ఎక్కడో కూర్చుండి పోవటం చేత అతని ముఖం కనిపించలేదు.
తరువాత ఓ ప్రఖ్యాత సంగీత విద్వాంసుడి పాటకచేరి మొదలై, ఆ సంగీతం ఎంతో వీనులవిందుగా వుండి రక్తి కట్టడంచేత, అది వినటంలో నిమగ్నురాలయింది భారతి. ఆమె సహజంగా సంగీతమంటే చెవి కోసుకుంటుంది. అందులో ఈరోజు ఆ విద్వాంసుడు తన్మయుడై మైమరిచి పాడేస్తున్నాడు.
'నేను ఏదో పాడతానుగానీ మధుర మనోహరంగా పాడటం చేతకాదు. అన్నట్లు మావారు వయొలిన్ అద్భుతంగా వాయిస్తారటగా. వారి దగ్గర కూర్చుని చక్కగా ఫిడేలు వాయించటం నేర్చుకోవాలి." అనుకుంది భారతి.
తరువాత ఎప్పటికో సభ అయిపోయింది.
మరునాడు గౌరీపతిగారు కూతుర్నీ, అల్లుణ్నీ తన ఊరికి తీసుకెడతానని చెప్పారు సమయం చూసుకుని వియ్యంకుడితో.
గంగాధరంగారు ఫేము కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చుని, పైపు పొగ వదులుతూ "మీ ఊరికా? ఇప్పుడెందుకూ?" అన్నారు.
గౌరీపతిగారికి నీరయిపోయినట్లయింది. ఒక రకంగా చూస్తే పెళ్ళి జరగవలసిన పద్ధతిలో కాకుండా మగపెళ్ళివారి అజమాయిషీలో జరిగినమాట నిజమే. సహజమైన పద్ధతిలో ఏదీ జరగలేదు. అయినంత మాత్రంచేత ఒక్కసారయినా అల్లుణ్ణి తమ ఇంటికి పంపించకపోతే ఎలా?
"ఈ పెళ్ళి సందర్భంలోనే వధూవరులిద్దరూ మా ఇంట్లో కాలుపెడితే మా ముచ్చట కూడా తీరిపోతుంది. అందుకని...." అన్నారు గౌరీపతిగారు నచ్చ చెబుతూన్నట్లుగా.
గంగాధరంగారు ఒక నిమిషం మౌనంగా వూరుకుని "అయితే రెండురోజులు పోయాక ఆ ఏర్పాటు చూస్తాను" అన్నారు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ వియ్యంకుడి ముఖంవైపు చూడటంగానీ, ఆయనని'అండీ' అని సంబోధించటంగానీ జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఓ గోడతో మాట్లాడుతున్నట్లుగా ప్రదర్శికమైంది ఆయన వైఖరి.
ఆ మాటలకే గౌరీపతిగారు కొండెక్కినంత సంతోషించి 'చిత్తం, అలాగే....అయితే నాకు చందరాలలో అవసరంగా నెరవేర్చవలసిన పనులు కొన్ని వున్నాయి. నేనివాళే సెలవు తీసుకుంటాను. రెండు రోజుల్లో అల్లుణ్ణీ, అమ్మాయినీ పంపిద్దురుగాని" అన్నాడు.
"అలాగే" అని వియ్యంకుడి ముక్తసరి సమాధానం.
ఆయనకు నమస్కారం చేసి అక్కడి నుంచి ఇవతలకు వచ్చేశారు గౌరీపతిగారు. కూతుర్ని వెతుక్కుంటూ వెళ్ళాడు.
ఓ గదిలో భారతీ, మల్లికా కబుర్లు చెప్పుకుంటూ కనబడ్డారు.
"అమ్మా భారతీ!" గాద్గదిక కంఠంతో అని, తెలియని ఆవేశంతో వారి దగ్గరకు నడిచాడాయన.
ఆయన కంఠమలా ధ్వనించటం చూసి భారతి చలించి ఆయన వంక విస్తుబోయి చూస్తూ లేచినిలబడింది. "ఎందుకని అలా వున్నారు, నాన్నా?" అని అడుగుదామనుకుంది మొదట కాని వెంటనే మనసు మార్చుకుని, "అబ్బ! ఎన్నాళ్ళు నాన్నా ఈ ఊళ్లో. నాకు విసుగ్గా వుంది. మనం చందరాల వెళ్ళిపోదాం నాన్నా అంది గారాబంగా.
గౌరీపతిగారు ఆమె శిరస్సుమీద చేయివేసి లాలనగా నిమురుతూ, "ఆ విషయం గురించే మరో రకంగా చెప్పటానికి వచ్చానమ్మా. అసలు నిన్నూ, అల్లుణ్ణి తీసుకునే వెళ్దామనుకున్నా నీవేళ. వియ్యాల వారేమో నిన్నింకా రెండురోజులు వుంచుకోవటానికి ముచ్చట పడుతున్నారు. మరి నాకేమో అక్కడ కరణీకమూ, అదీను వేగిరం వెళ్ళి చక్కబెట్టవలసిన వ్యవహారాలనేకమున్నాయి. పిన్నిని వుంచి వెళుతున్నాను ఏమంటావు?" అన్నాడు.