Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 13

    అంచేత ఆ విషయం బయటి ప్రపంచానికి ఏక్సిడెంట్ గా ఉండిపోయినా, చరిత్రలో మాత్రం మరుగున పడలేదు. ఈనాటికీ ఎవరో ఒక వృద్దుడు బాధగా ఆ విషయం తన మనవలతో చెప్పుతూనే ఉంటాడు. దురద్రుష్టకరమయిన విషయం ఏమిటంటే, ఇంత హృదయ విదారకమైన గాధ విన్న ఆ మనవలలో ఎవరికీ- పౌరుషంగానీ, ప్రతీకారవాంచగానీ రాగాలక పోవటం. వాళ్ళూ బాధపడేవారు. చాలామందికి కళ్ళు చెమ్మగిల్లేవి. ఆ కళ్ళు తుడుచుకొని అదే స్థలంలో కట్టిన ఫ్యాక్టరీలో పనిచెయ్యటానికి గొర్రెల మందల్లా వెళ్ళేవారు.    
    ఆదిశేషయ్య కుటుంబమంతా సజీవంగా దహింపబడ్డాక, శ్రేష్టకి జ్వరం వచ్చింది. ఆ జ్వరంలో అతనికి వింతవింత భయంకర మూర్తులు కనుపించారు. అంచేత వెంటనే ఆదిశేషయ్య విగ్రహం ప్రతిష్టింపించి దానికి భక్తితో పూజలుచేసి, ఆ తర్వాతనె ఫ్యాక్టరీకి శంఖుస్థాపన ప్రారంభించాడు. గౌరీనాధశ్రేష్టీ గొప్ప భక్తుడు.    
    రాజవల్లి నగరాన్ని తన రెండవభార్య పేరుమీదుగా నిర్మించాడు గౌరీనాధశ్రేష్టి. ఆ టౌన్ లో రైల్వేస్టేషన్ ఉండటానికికూడా కారకుడు ఆయనే.    
    శ్రీధర్ శర్మ తాము వస్తున్నట్లు ముందుగా ఉత్తరం వ్రాశాడు స్టేషన్ లో విమల, శకుంతల, శర్మ దిగి నగరంలోకి నడవపోతుండగా తెల్లటి బట్టలలో ఉన్న ఒకతను నమస్కరించి సామాను అందుకోబోయాడు.        
    "ఎవరు నువ్వు?" అన్నాడు శర్మ.    
    "రాణీగారి డ్రైవర్ నండి. దొరసానిగారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు."    
    'ఇంకా 'రాణి' 'దొరసాని' అనే పేర్లు వినపడుతూనే ఉన్నాయా?' తనలో తను ఆశ్చర్యపోయింది విమల.    
    సామాను అందుకుని జీప్ లో పెట్టాడు డ్రయివర్. "ఈ ప్రాంతాలలో జీప్ లుంటే తప్ప కార్లు లాభం లేదండి!" అన్నాడు వివరిస్తున్నట్లు.    
    ఆ విషయం త్వరలోనే అర్ధమయింది విమలా శర్మలకి. అన్నీ ఎగుడు దిగుడు రోడ్లు. ఒక్కరోడ్డూ సరిగాలేదు. ఇంతలో ఏదో పెద్దకొండ ఎక్కినట్లుగా ఉంటుంది. అంతలో మరింత అగాధంలోకి జారిపోతున్నట్లుగా ఉంటుంది. అరణ్యాలను చీల్చుకొని వెళ్ళుతున్నట్లుగా ఉంది రోడ్దు అటూ ఇటూ దట్టంగా పెరిగిన ఏవో రకరకాల వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు. కొంతదూరాన చెంగుచెంగున ఎగురుతున్న జింకలు.    
    విమల కుతూహలాన్ని గమనించి, "ఈ అరణ్యంలో పులులూ ఏనుగులూ కూడా ఉన్నాయండి. పగలు రావుగాని, రాతఃరి అప్పుడప్పుడు రోడ్డుమీదకి వచ్చేస్తుంటాయి. అందుకే రాత్రి యీ దారిలో ఎవరూ ప్రయాణం చెయ్యరు" అని చెప్పాడు డ్రయివర్    
    విచ్చలవిడిగా పరచుకొన్న ఆ అరణ్యంలో ఏదో వింత ఆకర్షణ ఉంది. కృత్రిమాలంకరణాలన్నీ వదిలేసి ప్రకృతి సహజ సౌందర్యంతొ కవ్విస్తున్నతుగా వుంది. ఒక్కసారిగా ఎగిరి ఆ ప్రకృతి ఒళ్లో దూరాలన్నంత ప్రలోభం కలుగుతోంది. అతని దారి దాటి నగరంలోకి రాగానే కనపడేది ఫ్యాక్టరీలు.    
    అసలు రాజపల్లి నగరమంతా ఫ్యాక్టరీలే అన్నంత పెద్దవిగా ఉన్నాయి అవి. మిగిలిన టౌన్ అంతా ప్యాక్టరీలో పనిచేసే వాళ్ళ చిన్న చిన్న గుడిసెలె! అక్కడక్కడ పెంకుటిళ్ళు, రెండే రెండు డాబాఇళ్ళు వున్నాయి. ఆ టవునంతా కలిసి మహానగరాల్లోని ఒక లొకాలిటీ అంతలేదు. కానీ అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. పోస్టాఫీసుంది దారిలో డ్రయివర్ వాటిని చూపించాడు.    
    రాణి రాజవల్లి ఇంటిముందు ఆగింది జీప్. అది ఇల్లుకాదు. పెద్ద భవనం. కాంపౌండ్ గేట్ నుంచి ఇంచుమించు అరమైలు దూరం ఉంది. ఆ భవనం. ఆ అరమైలు దూరంలోనూ - బత్తాయి, పంపరపనస, పనస, మామిడి, జీడిమామిడి మొదలైన ఫలవృక్షాలున్నాయి. వాటిమధ్య చిన్న చిన్న కూరగాయాల పళ్ళున్నాయి. పూలమొక్కలు అసలు లేవు. వృక్షాల మధ్యగా భవనం ముందుకి దారి ఉంది.    
    జీప్ కాంపౌండ్ గేటుముందు ఆగగానే కాకీబట్టల్లో తుపాకీ పట్టుకుని ఉన్న ఒకడు గేటు తెరిచాడు. ఆ తుపాకీ చూసి ఆశ్చర్యపోయింది విమల. వృక్షాల మధ్యగా జీప్ భవనం ముందుకు పోతుంటే, మళ్ళీ అరణ్యమద్యంలోంచి పోతున్నట్లే అనిపించింది విమలకి.    
    జీప్ భావన సింహద్వారం ముందు ఆగింది. అక్కడినుంచి పైకి మెట్లున్నాయి. ఆ మెట్ల మొదట్లో రెండు పెద్ద ఏనుగుల బొమ్మలున్నాయి రాతివి.
    విమల, శకుంతల, శర్మ దిగేసరికి ఇద్దరు ఆడవాళ్ళు చేతిలో బంగారు చెంబుల నిండా నీళ్ళతో ఎదురొచ్చారు.    
    "మేం రాణిగారి దాసీలం, దయచెయ్యండి. కాళ్ళు కడుక్కోండి" అన్నారు.    
    వాళ్ళను విభ్రాంతితొ చూసింది విమల. వాళ్ళు స్వయంగా దాసీలం అని చెప్పుకొన్నా నమ్మలేక పోతోంది. వాళ్ళిద్దరూ పెద్దాపురం సిల్కు అద్దకం చీరలు కట్టుకున్నారు. ఇద్దరి మెడలలోనూ రెండు పేటల బంగారు గొలుసు ఉంది. రెండు__ రెండు జతల బంగారు గాజులున్నాయి.    
    వాళ్ళూ విమలను అంతే వింతగా చూసారు మామూలు వాయిల్ చీరా, మెళ్ళో సన్నని బంగారు గొలుసు, చేతులకు మట్టిగాజులు.    
    బంగారు చెంబులలో ఉన్న నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటూంటే, విమలకి చిత్రంగా భయంవేసింది. శర్మ చెయ్యి గట్టిగా పట్టుకుంది. శర్మకీ ఆశ్చర్యంగానే ఉంది. ఉత్తరాన్ని బట్టి గొప్పవాళ్ళు అనుకున్నాడు కానీ, ఇది ఏదో పాతకాలం రాణివాసంలాగే ఉంది.    
    కాళ్ళుకడుక్కుని దాసీలు చూపగా ఇద్దరూ భవనంలో ప్రవేశించారు. ముందుగా ఎదురెదురుగా అమర్చిన నిలువుటద్దాలతో పాలరాతి గచ్చుతొ పెద్ద హాలు. ఆ హాలులో ఆధునిక పద్దతిలో సోఫాలు అమర్చి ఉన్నాయి. మధ్యలో పెద్ద తీపాయిలు నాలుగున్నాయి. మొత్తం ఎనిమిది పెద్దసోఫాలు ఉన్నాయి ఆ గదిలో సోఫాలమధ్య సైడ్ టేబిల్స్ కూడా అమర్చారు.    
    హాలు దాటాక పరదా తొలగించి లోపలి గదులలోకి దారితీసారు దాసీలు. అన్ని గదులలోను నిలువుటద్దాలు ఎదురెదురుగా అమర్చిఉన్నాయి. ఒక అద్దంముందు నిలబడితే ఎవరి వెనుకభాగం వాళ్ళకు కనిపిస్తుంది అది ఆఫీసుగదిలా ఉంది. ఒక మూల నేలమీద ఒక డెస్క్ ఉంది. దాని వెనుక కంబళి ఉంది. డెస్క్ మీద సిరాబుడ్డి, కలం ఉన్నాయి. కానీ, అక్కడెవరూ కూర్చుని లేరు.    
    ఆ తర్వాతి గదిలో ఉంది రాణి రాజవల్లి. విమలను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, "రా అమ్మా!" అని చేతులు జాపింది.

 Previous Page Next Page