.....భరద్వాజకి ఎన్నో అనుమానాలు కలిగినాయ్. ఆమె అంత అందంగా వుండేదా? ఆమెకీ ఇతడికీ సంబంధం ఏమిటీ? ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమెని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు?
అదే ప్రశ్న అడిగాడు.
మూడ్ నుంచీ బైటపడి యాజీ నవ్వాడు. "అందం ప్రసక్తి లేదు. ఆ మాటకొస్తే ఆమె నాకన్నా ఆరేడేళ్ళు పెద్దది కూడా."
భరద్వాజ మరింత ఆశ్చర్యపోయి "అయితే ఆమెకి యిప్పుడు అరవై పైగానే వయసుంటుంది."
"అవును."
"మరెందుకు కలుసుకోవటం?"
"మీరందరూ మర్చిపోయినా, నాకు జ్ఞాపకం వున్నా ఒక పదం కోసం."
"ఏమిటది?"
"సెంటిమెంటు."
స్పీకర్లోంచి వస్తూన్న పాత అయిపోవటంతో ఆ హాలులో నిశ్శబ్దం అలుముకుంది. భరద్వాజ కళ్ళెత్తి అతడివైపు చూశాడు. యాజీ దృష్టి యింకా కిటికీలోంచి బయటికే వుంది. అతడు చెప్పాడు.
"కొన్నాళ్ళక్రితం అనుకోకుండా నాకీ ఆలోచన వచ్చింది. ఒక నవలాకారుడిచేత దీన్ని కథగా వ్రాయిస్తే ఆమె చదువుతుంది కదా-అని! అప్పుడే 'ఎవరు మంచి రచయిత' అని వెతకటం మొదలు పెట్టాను. ప్రథమస్థానంలో మీరు వున్నారని తెలియగానే మిమ్మల్ని కలుసుకోవటానికి మనసాపుకోలేక అర్దరాత్రి వచ్చేశాను."
"పత్రికలో ఆమె గురించి ప్రకటన ఇవ్వొచ్చుగా" అన్నాడు భరద్వాజ.
"ఇవ్వొచ్చు. కానీ ఆమె పేరు చెప్పాలి. నా పేరు చెప్పాలి. ఆమె మనవలూ, వుంటే మునిమనవలూ చదువుతారు. నా పేరు బయటికి వచ్చిందంటే పేపరు వాళ్ళ అభూత కల్పనలకి అంతేవుండదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక అందమైన రహస్యాన్ని అందరితో పంచుకోవటం నాకిష్టం లేదు."
భరద్వాజ హుషారుగా "కథ ఇప్పుడు చెప్తారా? తర్వాత చెప్తారా?" అని అడిగాడు.
"మీరు వింటానంటే ఇప్పుడే. కానీ ఇక్కడొద్దు. కార్లో అలా తిరుగుతూ మాట్లాడుకుందాం పదండి" అంటూ *EFTS ద్వారా డబ్బు చెల్లించి లేచాడు.
ఇద్దరూ కార్లో కూర్చున్నాక డ్రైవర్ ముందు సీటుకీ, వెనుక సీటుకీ మధ్యవున్నా సౌండ్ ఫ్రూఫ్ తెర దించి కారు పోనిచ్చాడు.
రెండు నిమిషాల తర్వాత యాజీ కథ చెప్పటం ప్రారంభించాడు.
దాదాపు గంటసేపు అతడి కథ ఎక్కడా ఆగకుండా సాగింది. మధ్యలో అక్కడక్కడా మాత్రం జ్ఞాపకాల పుటల్లోకి తొంగి తొంగి చూడటంకోసం ఆగాడు.
అంతసేపూ కారు గమ్యం లేకుండా నడుస్తూనే వుంది. వెనుక జరిగే సంభాషణ ముందు డ్రైవర్ కి వినిపించటం లేదు.
కథ పూర్తి చేసి సీటు వెనక్కి వాలుతూ యాజీ భరద్వాజవైపు 'ఎలా వుంది' అన్నట్టూ చూశాడు.
చాలాసేపటి వరకూ భరద్వాజ ఏమీ మాట్లాడకుండా, "యాజీ! నిన్న రాత్రి మేరు మా యింటి గుమ్మం దగ్గిర నిలబడి, వచ్చిన పనిసూటిగా ఏ ఉపోద్ఘాతం లేకుండా ఎలా చెప్పారో నేనూ అలాగే చెప్తాను. మనిషి జీవితంలో సంఘటనలకి పాఠకుల్ని చదివించేటంత డ్రామా వుండదు" అన్నాడు.
"నేను చెప్పిన కథ చుట్టూ అందమైన అల్లిక పేనటం మీ వంతు. దానికి కొన్ని మార్పులూ చేర్పులూ చేర్చండి. ఏది ఏమైనా మనకి కావల్సింది ఆమె దీన్ని గుర్తించడం" అని ఆగి తిరిగి అన్నాడు. "మనిషి జీవితంలో అనుభవాలకి అందమైన అల్లికే 'నవల' అని నా అభిప్రాయం."
"కానీ మీ కథ ఎవరు చదువుతారు?"
"ఈ వయసులో ఆమె చదివే ఛాన్సు నూటికి పది మాత్రమే. అయినా మన ప్రయత్నం మనం చెయ్యాలి. మీరెంత నిర్మొహమాటంగా మాట్లాడుతున్నారో,
__________________________________________________________________________________________________
* పది సంవత్సరాల క్రితమే CREDIT CARD SYSTEM వస్తుందని ఆర్ధిక శాస్త్రవేత్తలు వూహించారు. ప్రస్తుతం చాలా మంది, హైదరాబాద్ - విజయవాడలాంటి పట్టణాల్లో డబ్బుకి బదులు ఈ కార్డులు ఉపయోగించటం అందరికీ తెలుసు. ఇలాగే 1995 - 2000 కల్లా EFTS (ELECTRONIC FUND TRANSFER SYSTEM) వచ్చి కరెన్సీ ఉపయోగం పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పుడు డబ్బు బదులు DINER CARDS ఎలా పెట్టుకుంటున్నామో అప్పుడు పర్సుల బదులు ఎలక్ట్రానిక్ టెర్మినల్స్ పెట్టుకుని బజారెళతాం అన్నమాట. కేవలం పెద్ద మొత్తాలే చెక్కులద్వారా చెల్లింపబడతాయి.
___________________________________________________________________________________________________
నన్నూ అంత నిర్మొహమాటంగా మాట్లాడనివ్వండి. నేను చెప్పిన ఒక మామూలు సాధారణ కథకి పెద్ద మొత్తంలో మీకు రాయల్టీ ఇవ్వటానికి పత్రికలవాళ్ళు ఇష్టపడకపోవచ్చు. నా వల్ల మీరు నష్టపోవటం నాకిష్టం లేదు. ఈ కథ ప్రచురింపబడినా ప్రచురించకపోయినా దీనిమీద రాయల్టీ నేను ఇస్తాను."
ఆ మాటలకి భరద్వాజ మొహం ఎర్రబడింది. దెబ్బతిన్నట్టు "మీరు నన్ను అవమానం చేస్తున్నారు" అన్నాడు.
"భరద్వాజా! మీ సమయం విలువయింది. నాదీ విలువయిందే. అందుకని వ్యాపారం మాట్లాడుకుందాం. ప్రచురణతో సంబంధం లేకుండా మీరు నాకో నవల వ్రాసివ్వబోతున్నారు. చెప్పండి! దానికి మీకెంత సమయం పడుతుంది?"
"మీరు చెప్పిన కథ చిన్నదే కాబట్టి అయిదారు రోజులు పట్టవచ్చు."
యాజీ తలమునకలయ్యేటంత ఆశ్చర్యంతో "అంతేనా.....నేనెక్కడో చదివాను. పుడమితల్లి ఒక గడ్డిపోచని ప్రసవించడానికి ఎంత కష్టపడుతుందో, ఒక రచయిత తన మనసులోని భావాన్ని బైటికి తీయటానికి అంత కష్టపడతాడని" అన్నాడు.
"నేను కాబట్టి అయిదారు రోజులు! ఇంకొకరయితే రాత్రి కూర్చుని ప్రొద్దున్నకి వ్రాసిచ్చేస్తారు. ఇక్కడ క్వాలిటీకాదు ముఖ్యం. నువ్వెన్ని వేలు వ్రాశావు - నేనెన్ని వేలు వ్రాశానూ అన్నది."
"దయచేసి ఈ ఒక్కసారికి అలా వ్రాయకండి."
"లేదు లేదు. సిన్సియర్ గా వ్రాస్తాను."
కారు భరద్వాజ ఇంటిముందు ఆగింది.
"వారంరోజుల తరువాత కలుస్తాను గుడ్ నైట్" అని అతడు కారు దిగబోతుంటే, యాజీ అతడి చేతిలో చిన్న కాగితం పెట్టాడు.
"ఏమిటిది?"
"చెక్కు డెబ్బయి అయిదు వేలకి."
"మైగాడ్! దీనిమీద నా పేరు వ్రాసివుందే. ఎప్పుడు వ్రాశారు? యిప్పటివరకూ మనం మాట్లాడుకుంటూనే వున్నాంగా."
"మీ డిన్నర్ అయ్యాక మీకు కథ చెప్తాననీ, మిమ్మల్ని వ్రాయటానికి ఒప్పిస్తాననీ నాకు నమ్మకం వుంది భరద్వాజా! మళ్ళీ దీనికోసం యింకొంచెం సమయం వృధా చేయటం ఎందుకని ఏకంగా చెక్కు పెట్టుకొచ్చాను. రచయితలకీ, వ్యాపారస్తులకీ ఆ మాత్రం ముందుచూపు వుండాలి.....ఏమంటారు? తొందరగా పూర్తి చెయ్యండి. బెస్ట్ ఆఫ్ లక్ - గుడ్ నైట్."
* * *
నవల పూర్తి చెయ్యటానికి అతడికి అనుకున్న దానికంటే వారంరోజులు ఎక్కువ పట్టింది. ఆ తరువాత యాజీకి ఫోన్ చేసి, ఆ మరుసటిరోజు కలుసుకున్నాడు.
భరద్వాజ చాలా హుషారుగా వున్నాడు. యాజీతో కరచాలనం చేస్తూ "మనం అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. అంతేకాదు. మరొక శుభవార్త" అని కూర్చుంటూ అన్నాడు.
"ఏమిటీ?"
"దీన్ని ప్రచురించటానికి పత్రికాధిపతులు వప్పుకున్నారు" అన్నాడు. ఆ మాటల్లో, 'మీకు డబ్బు నష్టం ఏదీ లేదు సుమా' అన్న సూచన కూడా వుంది. అతడు నిజాయితీగానే యాజీకి సాయం చేద్దామనుకుంటున్నాడు.
"నేనూ చాలా ఆత్రంగానే వున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే యిప్పుడే చదివేస్తాను."
"తప్పకుండా"
యాజీ ఇంటర్ టి.వి.లో సెక్రటరీకి ఒక గంటసేపు డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పాడు.
చదవటం ప్రారంభించాడు.
దాదాపు పాతిక నిమిషాలు గడిచినయ్.
యాజీ చదవటం పూర్తిచేసి గాఢంగా విశ్వసిస్తూ వ్రాతపత్రిని బల్లమీద పెట్టాడు. భరద్వాజ ఆత్రంగా అతడి మొహంలోకి చూశాడు.
యాజీ మొహంలో ఏ భావమూ లేదు. లక్ష లాభం వచ్చినా, కోటి నష్టం వచ్చినా ఒకేలా వుండటం యాజీలాటి వాళ్ళకి అలవాటు. అందువల్ల అతడి అభిప్రాయం తెలియలేదు. యాజీ మౌనాన్ని భరించలేక, భరద్వాజ థానే "ఈ నవలపట్ల మావాళ్ళు చాలా సంతృప్తి వెలిబుచ్చారు. ఇది గొప్పగా సక్సెస్ అవుతుందని మా కంప్యూటర్ కూడా చెప్పింది" అన్నాడు.
యాజీ మొహంలో అకస్మాత్తుగా మార్పు కనపడింది.
"కంప్యూటరా?" అన్నాడు.
భరద్వాజ ఇబ్బందిగా చూసి, "ఒక రచన మార్కెట్ లోకి విడుదల చేయబోయే ముందు అది ఎంతలా విజయవంతం అవుతుందీ అన్నది కంప్యూటర్ ద్వారా కనుక్కుంటాం" అన్నాడు.
కొంచెంసేపు ఆలోచించి యాజీ లేచి "మీ కభ్యంతరం లేకపోతే మీ కంప్యూటర్ ని ఒకసారి చూద్దామా" అని అడిగాడు.