"కుదర్దు....ఈ అవమానం భరించటం అస్సలే కుదర్దు...." రోషంగా పాపారావు కూడా ప్రిన్సిపాల్ దగ్గిరకి పరుగున వెళ్ళాడు. కానీ అక్కడ సావేరి ఎవరమ్మాయో చెప్పిన ప్రిన్సిపాల్ "చర్య తీసుకోవటం అసలే కుదరదు..." అనేసరికి "ప్రస్తుతం ఇది మాత్రం కుదురుతుంది" అనుకుంటూ నోరు మూసుకుండిపోయారు.
అక్కడ సరాసరి అమ్మాయిల రెస్ట్ రూమ్ కి వెళ్ళిన సావేరి ఉక్రోశంగా పుస్తకాలని టేబుల్ పై గిరాటేసి మంచినీళ్ళు తాగాలని ఓ మూలనున్న సింక్ దగ్గరికి నడిచింది.
సరిగ్గా ఇదే అదను కోసం చూస్తున్న వెంకట లోనికి వచ్చాడు. ఆమె టెక్స్ట్ బుక్ లో ఓ కాగితాన్నుంచాడు.
అప్పటికి చూడలేదు సావేరి!
* * * *
సగంలో ఆగిన కావ్యంలా పగలు అంతరించి చీకటి ఆవరించింది.
పరుపుపై అలా ఎంతసేపటినుంచి బోర్లాపడుకుందో, ఆ గదిలోని లై టెవరు వెలిగించారో కూడా గుర్తులేదు సావేరికి.
కాలేజీనుంచి కారులో వచ్చేటప్పుడు అన్నయ్య రవి అడిగాడు జరిగిందాన్ని గురించి! లెక్చరర్ కి బుద్ది చెబుతానని చెప్పి బుజ్జగించబోయాడు కూడా! దేనికీ జవాబు చెప్పలేదామె.
అసలు ప్రతి చిన్న దానికీ ఎడా పెడా మాటలతో కోపాన్ని ప్రకటించే సావేరి ఇప్పుడు ఎక్కువ మూగదానిలా వుండిపోతూంది. ఈ మార్పుకి అరం రవి సైతం వూహించలేకపోతున్నాడు.
ముక్కు చివర్నే కోపంగల సావేరికి చిన్నా పెద్ద తారతమ్యం తెలీదు! అలా పెంచాడు ఆమె తండ్రి!
ఆ విషయం రవికి తెలుసు కాబట్టి సావేరి తనంతట తానుగా చెబితేనె లెక్చరర్ చేత క్షమార్పణలు చెప్పించాలనుకున్నాడు.
చెంపలకి దిగువగా నలుగుతున్న తలగడ అరలిప్తపాటు శంకూ కందిన మోమునే గుర్తుచేసిందో లేక అలవోకగా లెక్చరర్ మాటే గుర్తుకు వచ్చిందో ఆమె పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి.
"కెమికల్ బాండ్...."
"రసాయనిక బంధం..."
ప్రేమంటే అదేనా...ఏమో ఆమెకీ తెలీదు.
ఒక పరమాణువునుంచి మరొక పరమాణువుకి ఎలక్ట్రానులు బదిలీ ఓ మనసుల నుంచి మరో మనసు భావాల మార్పిడిలాంటిదే అయితే....
రెండు పరమాణువులు ఎలక్ట్రానులను సమిష్టిగా పంచుకోవటం వలెనే వాటి ఆర్బిట్స్ లో ఎలక్ట్రానులు జతకూడటం నిజమైతే యిద్దరు పరస్పరం యిష్టపడే వ్యక్తుల మధ్య విడదీయలేని ఓ అయస్కాంతపు శక్తి ఉద్భవిస్తుంది. అదే వారి భావాల్ని ఒక్కటిగా మార్చుతుంది.
ప్రేమన్నదీ కెమికల్ బాండ్ లాంటిదే అన్న సత్యం పూర్తిగా తెలీని ఇక్కడ సావేరి చేసింది అలవోకగా కెమిస్ట్రీ టెస్ట్ బుక్ అందుకోవడం....
అప్పుడు జారిపడింది ఓ కాగితం....
"ఓ ముద్దిస్తావా.....శంకూ...."
ఆమె చెంపలు కెంపులయ్యాయి.
మరోసారి చదివింది.
ముద్దపప్పులా నిలబడ్డ శంకూ ముందు నిలబడి అడుగుతున్నట్టుంది.
ఛీ...పాడు....
ముందు కోపమొచ్చింది.
మరుక్షణం ఒడలంతా అది పులకింతలతో లేక కలవరింతతో కంగారుగా చూసింది.
ఆమె చాలా ధైర్యంగల ఆడపిల్ల...! అయినా యిప్పుడు వణికిపోయింది.
అది కూడా కాదు! ఆ చిన్న వాక్యం మనసును తాకి శరీరంలోని ఏ కొత్త ద్వారాల్నో తెరుస్తున్నట్లుగా అవుతూంది!
చించేయాలని వుంది. కానీ ఆ పని చేయలేకపోతూంది.
బిడియంగా నయినా శంకూని యిష్టపడే సావేరి ఆ కాగితాన్ని చించుంటే కథ మరోలా వుండేది.
ఆమె జాగ్రత్తపడేలోగా రవి అక్కడకు వచ్చాడు.
అసంకల్పితంగా ఆ లేఖ అతడి దృష్టిలో పడింది.
"ఏమిటిది?" రవి పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
ఇలాంటి సన్నివేశం తొలిసారి! అందుకే తత్తరపడింది. జవాబు చెప్పలేకపోయింది.
"వాడికెన్ని గుండెలు.....?"
ఇక్కడ సావేరి యిష్టాయిష్టాల గురించి రవి అడగలేదు. కనీసం అంత ధైర్యవంతురాలయిన సావేరీ చెప్పలేకపోయింది.
రవి బయలుదేరాడు పాశుపతంలా....
శంకూ యింటికి వెళ్ళాడు....ఊరంతా గాలించాడు.
చివరికి ఏటి ఒడ్డునుంచి చీకటిలో తిరిగొస్తున్న శంకూ మామిడి తోపు సరిహద్దుల్లో కనిపించాడు.
అంతే....
శంకూ తూలాడు డొక్కలో బలంగా తగిలిన దెబ్బతో.
మసక చీకటిలో జరుగుతున్నదేమిటో ముందు అర్ధం కాలేదు.
కానీ అమ్మా అనే ఓ మూలుగు శంకూ నోటినుంచి అసంకల్పితంగా బయటకు వచ్చింది.
"బాస్టర్డ్...." మరో దెబ్బ బలంగా తగిలింది ఈసారి పొట్ట మీద కాదు. చెంపపై...బూటుకాలు తాకిడికి చిట్లిన లేమావి చిగురుటాకులా శంకూ బుగ్గపై ఓ గాటు రక్తాన్ని చిమ్మింది.
గొంతునుబట్టి అర్ధమైపోయింది శంకూకి తనపై దాడి చేస్తున్నదెవరన్నదీ....
మొన్న కాలేజీలో ఉట్టిగా ఉడికించాడు. ఇప్పుడు కారణం చెప్పకుండా దారుణంగా కొడుతున్నాడు.
బాధను ఓర్చుకోలేకపోతున్నాడు శంకూ.
కనీసం తను ఏ తప్పు చేసిందీ చెబితే బాగున్నని అనుకుంటూనే అంత బాధలోనూ "రవీ...."నీరసంగా పిలవబోయాడు.
ఆ పిలుపు బయటికి రాకముందే పిడికిలి పెదవుల్ని పచ్చడి చేసింది.
గిర్రున కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఇలాంటి సన్నివేశాన్ని ఏనాడూ ఎదుర్కోని శంకూ నీరసంగా చేతులు జోడించి ప్రాధేయపడాలనుకున్నాడు. కానీ అవకాశం ఇవ్వటంలేదు రవి.
ఓ మూల పూసిన అడవి పువ్వుపై అంత పగెందుకో బోధపడటం లేదు. ఇక్కడో ఋషి హృదయంగల పసిమనస్సుపై రాయని శిలాక్షరాలలా రాక్షసత్వం తిరుగుబాటు చేసింది. ఒక్కో అంగం కమిలిపోతుంటే అధో విజయంగా దుర్మార్గం కరాళనృత్యం చేసింది.
నీరసం....నిస్త్రాణ....
ఆరిపోయే వెన్నెల పారాణిలా నేలపై ఒరిగాడు శంకూ నిస్తేజంగా.
రవి కదిలాడు సగర్వంగా....
ఎవరో చూశారది చాటుగా.....
ఎదురురాగల సాహసం చేయలేకపోయినా పరుగునవెళ్ళి లక్ష్మమ్మకి చెప్పారు.
* * * * *
అర్దరాత్రి గడుస్తూంది....
అపశ్రుతిణి తాగి గొంతు మూగపోయిన రాగవీణలా శంకూ మూలుగుతున్నాడు.
కొలిమి నిప్పుల్లో కాలిన మనిషిలా శంకూ కమిలిన ఒంటిని చూస్తుంటే లక్ష్మమ్మకి కళ్ళనీళ్ళు ఆగటంలేదు.
అప్పటికే ఆచార్లుని పిలిచి గాయాలకీ కట్టు కట్టించింది కాని, ఇలా ఎందుకు జరిగిందో ఊహించలేకపోతూంది.
చేసిందెవరో తెలిసింది. కానీ నిలదీయగల శక్తి ఏది?
తప్పు చేసిన సామన్యుడ్ని చక్రవర్తులు దండిస్తారనే తెలుసు....కానీ తప్పంటే తెలీని పసికూనే! ఎందుకిలా శిక్షింపబడ్డాడు? గూటిలో దాక్కుని ఎప్పుడోగాని రెక్కల్ని కదిలించి బయటకెగరని ఈ చిన్న పిచ్చుకపై ఇంతలా బ్రహ్మాస్త్రం సంధించడానికి చేతులెలా వచ్చాయి?