Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 12

                                 


    "వద్దు-వద్దు" అని అరిచారు కొంతమంది స్త్రీలు.
    "పోనీ కాంగ్రెస్ (క్యూ) అభ్యర్ధి అంగముత్తుకి వేద్దామా?"
    "వాడికా! వాడు రోడ్డుమీద కనబడ్డ ఆడాళ్ళ మంగళసూత్రాలు లాక్కుని పారిపోతాడు కదా!"
    "పోనీ కాంగ్రెస్ (పి) అభ్యర్ధి సంగతేమిటి?"
    "వాడికసలు చదువేలేదుగా! బండిలో కూరగాయలమ్మేవాడు!"
    "అయితే ఇండిపెండెంట్ రామ్ సింగ్ మాటేమిటి."
    "వాడా? వాడి దగ్గర నుంచీ మొన్నేగా పోలీసులు స్మగుల్డ్ సామాను పట్టుకుందీ?"
    దాంతో జనార్ధన్ కి చిరాకేసుకొచ్చింది.
    "సోదరులారా! ఇలా అందరికీ వంకలు పెట్టం నాకేం నచ్చలేదు. మనదేశంలో ఎలక్షన్ లొ నిలబడేవారందరూ ఇంచుమించుగా ఇలాంటివారే! వాళ్ళలోనే మన ఓటు ఎవరొకరికి వేయక తప్పదు" అన్నాడు విసుగ్గా.
    అందరూ మళ్ళీ తర్కంలో పడ్డారు.
    చివరకు అందరూ కలిసి గోపాల్రావుకే ఆ బాధ్యత అంటగట్టారు.
    మా నియోజకవర్గంలో నిలబడ్డవారందరిలోనూ ఎక్కువ చదువుకున్నవాడూ, తక్కువ మర్డర్ లూ, రేప్ లూ, జేబుదొంగతనాలూ, స్మగుల్డ్ వ్యాపారం చేసేవాడూ అయిన అభ్యర్ధిపేరు సూచించాల్సిందిగా ఆదేశించారు.
    వాళ్ళ ఆదేశం మేరకు మేము ముగ్గురం అన్ని పోలీస్ స్టేషన్లకూ వెళ్ళి అతి తక్కువ నేరాలు చేసిన అభ్యర్ధి పేరు గాలించి విజయం సాధించాం!
    మా నియోజక వర్గంలో పోటీచేస్తున్నవాళ్ళందరిలోకీ శంకర్ దాదా ఒక్కడే అందరికంటే ఎక్కువ చదువుకున్నాడు (రెండోక్లాసు) అలాగే అతనొక్కడే అతి తక్కువ మర్డర్లు చేశాడు. (రెండొందల ఆరు) అతి తక్కువ రేప్ లు చేసింది కూడా అతనే (పదహారు) అతి తక్కువ కాలం జైల్లో ఉన్నది కూడా అతనే (ఆరేళ్ళు) మరి చూస్తూ చూస్తూ వాడికెలా ఓట్లువేస్తాం? కానీ ఓ పక్క శంకర్ దాదా కత్తులతో కాలనీ అంత స్వైరవిహారం చేసే దృశ్యంకూడా మా కళ్ళ ముందు కనబడుతోంది. చివరకు ఎవరికీ వోటు వేయకూడదని నిర్ణయించుకున్నాం.
    అయితే ఈ విషయం ఎలా తెలిసిందో గాని సిరాజుద్దీన్ కి తెలిసింది. ఆ రాత్రి అతగాడు మా కాలనీకొచ్చి అందరినీ అర్జంటుగా బయట సమావేశపరచేశాడు.
    "ఖబడ్దార్! వోట్లు  నాకేస్తామని వాదాచేసి గిప్పుడు పల్టాయించి పోతారు? నీయవ్వ మీకు మంచిగా బుద్దిజెప్త! నేనెసుంటోడ్నో మీకెరుకలేదు!" అంటూ వార్నింగిచ్చాడు.
    ఎవ్వరం మాట్లాడలేదు.
    "అగో! మాట్లాడరు? సరే బిడ్డా! నేన్ జూసుకుంట! పదండ్రి!" అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
    ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రలేదు భయం!
    తెల్లారుజామున ఎవరో కెవ్వున కేకలు పెట్టేసరికి అందరం ఉలిక్కిపడిలేచి బయటకు పరుగెత్తాం!
    తీరాచూస్తే శాయీరామ్ కి కలవచ్చిందట- తనని సిరిజుద్దీన్ చంపుతున్నట్లు- అందుకని వెర్రికేకలు పెట్టాడట.
    ఎలాగోలా తెల్లారింది.
    అందరం వోటింగ్ చేయడానికి బయలుదేరాంగానీ కాలనీ బయట సిరాజుద్దీన్ శిష్యులు కర్రలు తీసుకుని నిలబడి కనిపించారు.
    "ఏయ్! సాయంత్రం వరకూ కాలనీ వోళ్ళెవరూ బయటకు రాకండ్రి! వచ్చిన్రో కిరికిరవుతది!" అన్నారు బెదిరింపుగా.
    వాళ్ళతో గొడవెందుకని అందరం మళ్ళీ ఇళ్ళల్లోకొచ్చేశాం.
    తీరా మధ్యాహ్నం రెండవుతుండగా కాలనీ అంతా శంకర్ దాదా తాలూకూ రౌడీలూ నిండిపోయారు.
    "నీ యవ్వ! మంచిగ చెప్తే ఇనరుబే? లేండ్రి! నడవుండ్రి వోట్లెయ్యనికి!" అంటూ అరవసాగారు.
    "అయ్యా ఓట్లేస్తే సిరాజుద్దీన్ మమ్మల్ని చంపుతానంటున్నాడండీ" అన్నాడు జనార్ధన్.
    "ఇగో- ఇదంతా మాకు తెల్వదు- మంచిగా చెప్పినాం ఇనకుంటే మీదే జుమేదారి" అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
    సాయంత్రం మూడవుతుండగా మళ్ళీ కాలనీవాళ్ళందరం అత్యవసర సమావేశం జరిపాం.
    "ఆ రౌడీ వెధవల్తో ఎందుకొచ్చింది? వెళ్ళివాడికే వేసేద్దాం పదండి" అన్నాడు శాయీరామ్.
    చూస్తూ చూస్తూ వాడినా ఎన్నుకునేది?" అన్నారొకరు.
    "మనచేత్తో మనమే కళ్ళుపొడుచుకుంటామా?" అందింకొకావిడ. గోపాల్రావ్ రెండుచేతుల్తో తల పట్టుక్కూచున్నాడు.
    మరో అరగంట తర్వాత నాకో అయిడియా వచ్చింది.
    "సోదరులారా! త్వరగా పోలింగ్ బూత్ కెళదాం పదండి. వెళ్ళి బాలెట్ పేపరు వెనుక ముద్రవేసి వచ్చేద్దాం దాంతో మన ఓట్లన్నీ 'ఇన్ వాలిడ్' అవుతాయ్ ఎవరికీ వేయలేదన్న సంతృప్తి మనకూ ఉంటుంది- వాడికే వేశామనివాడు అనుకుని మనజోలికి రాకుండా ఉంటాడు-"
    అందరూ నా ఆలోచనకు చప్పట్లుకొట్టారు. కొంతమందీలలు కూడా వేశారు. వెంటనే ఎలక్షన్ బూత్ కి ఊరేగింపుగా వెళ్ళాం.
    కానీ పదినిమిషాల్లో వెనక్కు తిరిగిరావాల్సివచ్చింది. కారణం అప్పటికే మా ఓట్లు ఎవరో వేసేశారు.
    ఆ మర్నాడు రాత్రి మా కాలనీకొచ్చిన పెద్ద ఊరేగింపు చూడ్డానికి అందరం బయటకొచ్చి నిలబడ్డాం! శంకర్ దాదా పెద్దకార్లో దండల మధ్య నిలబడి అందరికీ నమస్కరిస్తున్నాడు. "శంకర్ దాదా జిందాబాద్!" అంటూ కేకలు మార్మోగిపోతున్నాయి. అప్రయత్నంగా అక్కడ గుమికూడిన మేముకూడా అరిచాము.
    "శంకర్ దాదా జిందాబాద్!"
                                                                                         

                           *    *    *

 Previous Page Next Page