"ఏమిటి? రౌడీ వెధవకు మనం ఓట్లెయ్యాలా? అయ్యో ఏంకాలమొచ్చింది" ఒకావిడ అంటోంది.
"ఇలా ఎవడు బడితే వాడే నిలబడితే ఎలా?"
"మన కాలనీలొ అందరూ గ్రాడ్యేట్లు, పోస్ట్ గ్రాడ్యేట్లు ఉండి- అందరూ కలసి అక్షరం ముక్కరాని రౌడీకా ఓట్లు వేసి గెలిపించడం-" ఇలా రకరకాల వ్యాఖ్యలు గుప్పుమని చెలరేగాయి. శంకర్ దాదా వెళ్ళిపోగానే శాయీ రామ్ మైక్ దగ్గరకొచ్చాడు.
"సోదర సోదరీమణులారా, ఇప్పుడు అనుకోని పరిస్థితి ఎదురయింది మనకి. శంకర్ దాదా ఓట్లు తనకే వేయమని వార్నింగిచ్చాడు. వేయకపోతే ఏం జరుగుతుందో మనందరం తేలిగ్గా ఊహించవచ్చు. వాళ్ళ గాంగ్ వాళ్ళందరూ కత్తులు తీసుకుని మన కాలనీ అంతా స్వైరవిహారం చేసేస్తారు. అంచేత మనం ఇంతకుముందు శ్యామల్రావుగారి కిచ్చినమాట ఉపసంహరించుకుందాం, ఏమంటారు?"
యాదగిరి లేచి నిలబడ్డాడు.
"మీ రూరికే పరిష్కారమవుతున్నారుగానీ మనం వాడికి వోటు వేయలేదన్న విషయం శంకర్ దాదాకెట్లా తెలుస్తుందివయ్యా?
"పిచ్చాడిలాగున్నావ్- మనలో కాలనీ పక్కనున్న పోలింగ్ బూత్ లొ వోట్లు లెక్కట్టేప్పుడు తెలీదూ?"
"తెలిస్తే ఏం జేస్తాడంటావ్?"
"కత్తులు- స్వైరవిహారం- మనలో వెయ్యిమందికి కత్తిపోట్లు, పాతికమంది దుర్మరణం- ఇలా సాగిపోతుంది ఆ మర్నాడు పేపర్లో వార్త" అన్నాడు రంగారెడ్డి.
అందరూ నిశ్శబ్దం అయిపోయారు. మీటింగ్ అర్ధంతరంగా ముగిసిపోయింది.
"సోదరులారా, తిరిగి మనందరం వచ్చే ఆదివారం ఇక్కడ కలుసుకుని ఎవరికి వోటు వేయాలో ఫైనల్ గా నిర్ణయించుకుందాం" అన్నాడు శాయీరామ్. అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరారు.
నాల్రోజులన్నా అవకముందే కాలనీవాళ్ళందరూ బలవంతంగా అర్ధరాత్రి సమావేశం జరపాల్సివచ్చింది. అందుక్కారణం సిరాజుద్దీన్ అనే అభ్యర్ధి. అతగాడు తన తాలూకూ వందమంది అనుచరులతో కాలనీని చుట్టుముట్టి అందరికీ కర్రలుచూపి లాక్కొచ్చారు. శాయీరామ్ కళ్ళును నులుముకుంటూ సమావేశం ప్రారంభించాడు.
"సోదరులారా! మన నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్ధి శ్రీసిరాజుద్దీన్ గారి విన్నపం వల్ల- మనం అర్జంటుగా....
"విన్నపం గాదువయ్యా- జబర్ధస్తే చేసినా! గట్ల చెప్పనీకి భయమేమున్నది చెప్పు" అన్నాడు సిరాజుద్దీన్ పౌరుషంగా.
"ఆ! అదే బలవంతంగా మనల్నిక్కడ సమావేశపరచడానికి కారణం ఏమిటిటంటే మన కాలనీ వాళ్ళందరూ ఆయనకే ఓట్లు వేయాలని ఆయన అభ్యర్ధిస్తున్నారు."
"ఇగో- గదే గలత్ మాట! నాకేం గర్జ్ వయ్యా బతిమాలానికి? జబర్ధస్త్ జెప్తున్న. పూరా వోట్ నాకే ఎయ్యాల్న! ఏమంటున్న? ఎయ్యకుంటే కత్తితో కిరికిరవుతది! సమజయిందా?"
"ఆ, అయింది సార్? ఇంత క్లియర్ గా చెప్పాక ఇంక అర్ధమవకుండా ఎలా ఉంటుంది?"
"అయితే నా గురించీ, నేనంతకు ముందు చేసిన ప్రజాసేవ గురించి కూడా చెప్పు ఆళ్ళకు" అన్నాడు సిరాజుద్దీన్.
"సోదరులారా! సిరాజుద్దీన్ గారి గురించి మీకు వేరే చెప్పనవసరం లేదు. ఆయన కూడా చిన్నప్పటి నుంచీ జైలు కెళ్తూనే వున్నారు. ఈ రోజున కూడా నిజానికి జైల్లోనే ఉండాల్సింది గాని మన ఓట్లకోసం జామీను మీద వచ్చారు. ఆయన అంతర్రాష్ట్రీయ జేబుదొంగ అన్న విషయం మీరు పేపర్లలో చూసేవుంటారు! లేదా అనుభవ పూర్వకంగానయినా గ్రహించివుంటారు. కేవలం తనొక్కడే సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ స్కీము క్రింద ప్రారంభించిన "పిక్ పాకెట్" సంస్థ నేడు అనేక వేల మంది సభ్యులతో కిటకిటలాడిపోతోంది. అప్పుడు సంవత్సరానికి పాతికవేలు టర్నోవర్ ఉంటే ఇప్పుడది ఇరవై కోట్ల రూపాయలకు చేరుకుంది. "సిరాజుద్దీన్ గారిది మంచి మనసు" అనడానికి నిదర్శనం ఆయన ఆ సంస్థ ద్వారా ఎంతో డబ్బు ఇంకా సంపాదించే అవకాశం ఉన్నా- ఆ వృత్తిని మానేయడం! నిజంగా ఎంతో గొప్పవిషయం ఇది. కామధేనువు లాంటి వృత్తినెవరయినా వదులుకోగలరా- ఒక్క సిరాజుద్దీన్ గారు తప్ప."
అందరూ తప్పట్లు కొట్టారు.
"ఇగో- తాలీ జబాయించితే నేను ఖుష్ అవుతాననుకోకండ్రి కాలనీలోని ఓట్లన్నీ నాకేపడాల్న! ఇయాల్టినుంచి ఈ కాలనీలోకి ఇంకెవళ్ళూ రాకుండా మా షాగిర్దీల్ని పహారాపెడ్తున్న! ఇంకెవళ్ళమాటా ఇనకండ్రి. ఇంకెవళ్ళకీ వోటెయ్యకండ్రి. సమజయిందా?"
"అయింది" అన్నాయి కొన్ని గొంతులు.
"ఇకపోండ్రి! ఓట్ల ఇసయంల నకరాలు చేస్తే మాత్రం కత్తితో కిరికిరవుతది" సిరాజుద్దీన్ వెళ్ళిపోయాడు.
అతని శిష్యులు ఇద్దరు మాత్రం అక్కడేగస్తీ తిరగసాగారు. అందరం నిశ్శబ్దంగా ఎవరిళ్ళకు వాళ్ళు చేరుకున్నాం.
ఆదివారం రానేవచ్చింది.
కాలనీ వాళ్ళందరూ సమావేశానికి హాజరయ్యారుగానీ ఎవరిమొఖాన్నా కళలేదు. ఎవరూ బిందెల గురించీ, స్టీలు గిన్నెల గురించీ, చీరలగురించీ మాట్లాడటం లేదు.
"సోదర సోదరీమణులారా! ఎవరెంత బెదిరించినా మన కాలనీ ఓట్లన్నీ కొద్దోగొప్పో చదువూ సంస్కారమున్న శ్యామల్రావ్గారికే వేయాలని అందరూ అభిప్రాయం వెలిబుచ్చారు" అని గోపాల్రావ్ చెప్పగానే అంతటా తప్పట్లు మార్మోగిపోయాయ్. సరిగ్గా అప్పుడే టాక్సీలోంచి దిగాడు శ్యామల్రావ్.
ఆయన వెనుకే ఆయన కొడుకు "ఈరిగాడూ జిందాబాద్" అని అరుస్తూ మా మధ్యకొచ్చాడు.
అందరూ నిర్ఘాంతపోయారు. శ్యామల్రావ్ చిరునవ్వుతో మాట్లాడసాగారు.
"సోదర సోదరీమణులారా! నేను కాంగ్రెస్ (జడ్) అభ్యర్ధి అయిన ఈరిగాడినే బలపరుస్తూ పోటీ నుంచి విరమించుకుంటున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కనుక మీ అందరి ఓట్లు కూడా ఈరిగాడికే వేస్తారని ఆశిస్తాను." అనేసి నమస్కారం చేసి వెళ్ళిపోయారు.
అందరూ మొఖాలు పాలిపోయాయ్.
"మోసం, దగా ఈరిగాడి దగ్గర లక్షరూపాయలు కొట్టేసి విత్ డ్రా అయిపోయాడు" అన్నాడు రంగారెడ్డి.
"ఆ! లక్షరూపాయలు కొట్టేశాడా?" అరిచారు అందరూ.
"అవును నిన్న ఈరిగాడి మనుషులే స్వయంగా చెప్పారుగాని నేను నమ్మలేదు" కొద్దిసేపు అంతా కోలాహలంతో నిండిపోయింది.
కేవలం లక్షేకాదు. ఎలక్షన్ లో నిలబడ్డ ప్రతి అభ్యర్ధికీ గవర్నమెంట్ ఇచ్చే న్యూస్ ప్రింటూ, పెట్రోలూ, వోటర్స్ లిస్టు లు, టెలిఫోన్ సౌకర్యం ఇవ్వన్నీకూడా శ్యామల్రావ్ గారు బ్లాకులో అమ్ముకుని పది లక్షల రూపాయల వరకూ సంపాదించాడని, ఆ తరువాత ఆయనకొన్న ఇల్లూ చేసిన కూతురి పెళ్ళీ ఋజువుచేశాయ్.
కొద్దిసేపు అంతా కోలాహలం-
"ఇంతకూ ఇప్పుడు మన ఓటు ఎవరికి?" అడిగారు కొందరు.
"ఈరిగాడికే వేస్తే సరి" నేను సలహా ఇచ్చాను.
"నీకెంత ఇచ్చాడు వాడు?" ఎవరో అరిచారు. నేను సైలెంటయిపోయాను.
"ఈరిగాడా! వాడుచేసేది సారావ్యాపారం. కల్తీసారాతో ఆ మధ్య అరవైమంది నిటపా కట్టించాడు. వాడు ప్రజాప్రతినిధా?"