"ఆ పార్కు ఎక్కడుందో నాకు తెలియదండి" అన్నాడు రాయుడు.
"శారదా విలాస్ కాఫీ క్లబ్ పక్కసందులోంచి వెళ్ళి కుడి పక్కగా తిరిగితే వస్తుందా పార్కు" అన్నాడు రచయిత.
"శారదా విలాస్ కాఫీ క్లబ్ ఎక్కడో నాకు తెలీదండి."
రాయుడు ఆశ్చర్యంగా "అది ఈ ఊళ్ళో చాలా పేరున్న హోటలని విన్నాను. అది నీకు తెలియక పోవడమేమిటి?" అన్నాడు.
"నేనెప్పుడూ హోటల్సుకు వెళ్ళలేదండీ" అన్నాడు సుబ్బారావు.
"నువ్వీ వూళ్ళో ఎన్నేళ్ళనుంచి ఉంటున్నావు?" అనడిగాడు రాయుడు.
"నేనిక్కడే పుట్టి పెరిగాను" అన్నాడు సుబ్బారావు. కానీ ఎప్పుడూ హోటళ్ళకు వెళ్ళలేదు. అక్కడ పరిశుభ్రత ఉండదు. నేనేం తిన్నా యింట్లో చేసినవే తింటాను. ఎప్పుడైనా మా యింట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వంట చేసుకోవడం నాకూ వచ్చు. ఇంకా బయట తినవలసిన అవసరమేముంది చెప్పండి!"
"పోనీ, నేను దారి చూపిస్తే గుర్తుంచుకుని రాగలవా? లేకపోతే ఊళ్ళోని దారులు కూడా నీకు సరిగ్గా తెలియవా?" అన్నాడు రచయిత.
"ఏదారైనా ఒక్కసారి చూస్తే పట్టేస్తాను. సువర్ణా టాకీస్ కి ఒక్కసారంటే ఒక్కసారి వెళ్ళాను. ఎప్పుడో ఎనిమిదేళ్ళక్రితం. ఈ పళంగా తీసుకు వెళ్ళమంటే తీసుకువెళ్ళగలను" అన్నాడు సుబ్బారావు గర్వంగా.
"నువ్వు సినిమాలు కూడా చూడవా?" అన్నాడు రాయుడు.
"సినిమాలు చూస్తే చెడిపోతారని మా అమ్మ అంటుంది. మా పక్కింట్లో ఓ బామ్మగారున్నారు. ఆవిడ వచ్చిన అన్ని సినిమాలూ చూస్తుందండి. ఆవిడ సినిమా చూసి మా అమ్మకు కథ చెబుతుందండి. అప్పుడు నచ్చితే మేమూ ఆ సినిమాకి వేదతాము. ఈ మధ్య మా అమ్మకి సినిమాల పిచ్చి ఎక్కువయిందండి. రెండేసి నెలలకో సినిమా చూస్తున్నాం" అన్నాడు సుబ్బారావు.
"చాలా బాగుంది." అని రాయుడు రచయిత వైపు తిరిగి "ఇతని మన కార్లో తెహేసుకువెళ్ళి నేతాజీ సుభాస్ చంద్రబోస్ పార్కు చూపించి ఆఫీసు దగ్గర దిగవిడిచి వెనక్కొచ్చేయ్" అని__"నువ్వు మాత్రం సాయంత్రం అయిదింటికి అక్కడ వుండాలి. మరచిపోకు" అన్నాడు సుబ్బారావుతో.
"నా ఆఫీసు పావు తక్కువ అయిదు దాకా ఉంటుందండి. వెంటనే పార్కుకు వచ్చేస్తానండి. ఆఫీసు కది ఎంత దూరంలో ఉంటుందో. తెలియదండి మరి."
"ఫరవాలేదులే__నీ ఆఫీసు నుంచి అక్కడికి పది నిముషాల నడక కూడా ఉండదు" అన్నాడు రాయుడు.
రచయిత, సుబ్బారావు వెళ్ళిపోయారు.
తర్వాత రాయుడు సూర్యముఖిని కలుసుకుని ఏం చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం సూర్యముఖి సుహాసినికో ఉత్తరం పంపించింది. సరిగ్గా అయిదుంపావుకి సుహాసిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కుకి రావాలి. సంతకం ప్రభాకరం అని పెట్టింది. అలాగే సుహాసిని పేరుతో ప్రభాకరానికీ అలాంటి ఉత్తరమే రాసి పంపించింది.
ఇదంతా అయ్యాక సాయంత్రం నాలుగింటికి ఆమె ప్రభాకరానికి ఫోన్ చేసింది__"డియర్! అయిందింటికి ఓసారి మా యింటికి రాగలవా?"
"ఎందుకు?" అన్నాడు ప్రభాకరం.
"నేనో కొత్తరకం నృత్యభంగిమ నేర్చుకున్నాను. ముందుగా క్లబ్బులో ప్రదర్శించే ముందు అది నీ ముందు ప్రదర్శించాలని నా కోరిక!" అంది సూర్యముఖి.
మగాళ్ళకు మత్తెక్కించే కొత్తరకం నృత్యభంగిమలు అభ్యసించడం సూర్యముఖి ప్రత్యేకత. ఆడవాళ్ళ రకరకాల పోజుల్లో చూడటం ప్రభాకరం ఆసక్తి. ఫోన్ కాల్ వింటూనే అతను ఆవేశపడ్డాడు. "కానీ డియర్! సాయంత్రం నాకో అపాయింట్ మెంటుంది."
"సారీ చెబుతూ చీటీ పంపిస్తే పోదూ?" అంది సూర్యముఖి.
ప్రభాకరం అలాగే చేయాలనుకున్నాడు.
రాయుడి కార్యక్రమం పక్కగా ఏర్పాటయింది. ఇందులో సుహాసినికి అనుమానం కలుగదు. ప్రభాకరం రమ్మన్నాడనే ఆమె అనుకుంటుంది. సారీ చెబుతూ పంపే ఉత్తరం చూశాక మొదటి ఉత్తరం ప్రభాకరమే రాశాడన్న నమ్మకం బలపడుతుంది. ఎటొచ్చీ ఆ ఉత్తరం ఆమె పార్కుకి బయల్దేరినాక అందాలి. అలా జరిగే ఏర్పాటు కూడా రాయుడు చూసుకున్నాడు. ప్రభాకరం పంపిన మనిషిని కాసేపు ఆపడమే కదా కావలసింది. రాయుడి వ్యవహారానికిప్పుడు చాలా మంది ఏజంట్లున్నారు.
రాయుడు,. రచయిత ఇంట్లోనే కూర్చున్నారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కుకి సాధరణంగా జనం వెళ్ళరు. ఆ రోజుకు అక్కడ ఒక వాచ్ మన్ ని ఏర్పాటు చేశాడు రాయుడు. సుబ్బారావుని తప్ప ఇంకెవ్వరినీ లోపలకు వెళ్ళనివ్వకూడదని ఏర్పాటు. ఆ వాచ్ మన్ కీ! రామగోపాల్ కీ పరిచయం చేశారు. రామగోపాల్ అక్కడేం జరిగిందీ రిపోర్టు తయారుచేస్తాడు. అతడితోపాటు మోనికా కూడా ఉన్నదని వేరే చెప్పనక్కరలేదు.
సరిగ్గా అయిదింటికి సుబ్బారావు పార్కుదగ్గర అడుగుపెట్టాడు. వాచ్ మన్ అతన్ని చూసి "మీ పేరు సుబ్బారావా?" అనడిగాడు.
"అరే - నా పేరు మీకెలా తెలుసు?" అని ఆశ్చర్యపడ్డాడు సుబ్బారావు.
"లోపలకు వెళ్ళండి" అన్నాడు వాచ్ మన్.
సుబ్బారావు లోపలకు వెళ్ళాడు. లోపల ఎక్కడా ఎవ్వరూ జనం కనబడలేదు. "ఇక్కడ నేనొక్కదినే ఉన్నాను. కాబోలు" అని స్వగతంలో అనుకున్నట్లు పైకి అన్నాడతను.
ఓ పొదల చాటున దాగివున్న రామ్ గోపాల్ అది జర్మన్ భాషలోకి అనువదించి మోనికాకు చెప్పాడు. మోనికా వెంటనే రాసుకుంది.
సరిగ్గా అప్పుడే పార్కు పక్క గోడదూకి నలుగురు రౌడీలు వచ్చి సుబ్బారావుని చుట్టుముట్టారు. సుబ్బారావు వాళ్ళ వంక చూసి "నన్ను రాయుడుగారు పంపారు. నాపేరు సుబ్బారావు. మీరు నాకోసమే వచ్చారా?" అనడిగాడు.
"అవును నీ కోసమే వచ్చాం" అన్నాడో రౌడీ.
"నాతో ఏం పనో చెబుతారా?" అన్నాడు సుబ్బారావు వినయంగా.
"మమ్మల్ని చూస్తే మా పనేమిటో తెలియడం లేదూ" అన్నాడు యింకో రౌడీ.
"లేదండి" అన్నాడు సుబ్బారావు వినయంగా.
"నీ జేబులోంచి చెయ్యి బైటకు తీసి నీ వాచీ ఇలా గివ్వు" అన్నాడో రౌడీ.
"అయ్యో, నా దగ్గర వాచీ లేదే!" అన్నాడు సుబ్బారావు దిగులుగా.
"వాచీ లేకుండా ఎలా వుంటున్నావయ్యా" అన్నాడు రౌడీ ఒకడు చిరాగ్గా.
"వాచీ టైము తెలుసుకుందుకే కదండీ, ఇంట్లో మా నాన్నగారి వాచీ ఉంది. ఆదాయాన యానాం ఫ్రెంచివారి హయాంలో ఉండే రోజుల్లో అక్కడ కొన్నారు. ఆయన పోయాక ఆయన జ్ఞాపకార్ధం మా అమ్మ ఉంచుకుంది. అది బైటకు పట్టుకెడితే ఏ దొంగాళ్ళయినా పట్టుకుపోతారని ఆవిడ భయం అందుకని జాగ్రత్తగా పెట్టెలోపెట్టి ఉంచుతుంది. ఇంట్లో టైము కావాలంటే అది చూసుకుంటాం. ఆఫీసులో అయితే అసలు సమస్యేలేదు. అక్కడే గడియారం ఉంది. కానీ దాని అవసరమే ఉండదు. లంచవరుకీ, ఆఫీసు క్లోజింగ్ టైము కీఠంచనుగా అంతా కుర్చీల్లోంచి లేచిపోతారు. బయట ఉన్నప్పుడు- ఎండనుబట్టి, నేను కరెక్టుగా టైం చెప్పగలను. అంతగా మబ్బులు పడితే - దారినపోయే వాడి నెవర్నడిగినా టయిం చెపుతాడు. అవును మీ చేతికి వాచీ కనబడుతోంది. మీకు నా వాచీ ఎందుకండీ?" అని ఎంతో అనుమానంగా అడిగాడు సుబ్బారావు.