Previous Page Next Page 
విషవలయం పేజి 11

    కాని విజయ యీ బెదిరింపులకి లొంగే ఘటం కాదు. ఆదరించినకొద్దీ రెచ్చిపోయే స్వభావము ఆమెది. "వీళ్ళా? నన్ను మందలించేది?" అన్నట్లు ఓ మందహాసం చేసింది, ఆ గదిలో కూర్చుని మరునాడు ఆమె అక్కడి నుంచి అదృశ్యమై పోయింది. రంగనాధంగారబ్బాయి కృష్ణమూర్తి కనబడలేదు.

    బలరామయ్యగారు పరవళ్ళు తొక్కాడు. "శని విరగడయిపోయింది. అది మళ్ళీ యీ గుమ్మములోకి వస్తే కాళ్ళు విరగ్గొడతాను" అన్నాడు.
   
                                      4

    తెల్లవారింది. సూర్య కిరణాలు కిటికీ చువ్వల మధ్యనుంచి వచ్చి గదిలో పడుకున్న సత్యమూర్తి ముఖంమీద పడుతున్నాయి. రాత్రంతా సరిగ్గా నిద్రపట్టక ఏ నాలుగ్గంటల వేళప్పుడో కునుకు పట్టటంవల్ల అతనికి మెలకువ రావటము లేదు. గది బయటనుండి పనివాడు చంద్రయ్య, ఒక రెండు మూడు నిమిషాలు తతపటాయించి "బాబుగారూ! బాబుగారూ!" అని పిలిచాడు.

    సత్యమూర్తి బద్దకంగా కళ్ళు విప్పాడు. తను విశాఖపట్నములో లేడు, ఇది తమ యిల్లు.

    తలుపులు తెరుచుకొని బయటకు వచ్చాడు.

    "రాత్రి మీరు వచ్చిన సమయానికి వెధవది- నిద్రపట్టేసింది బాబూ తెలీలేదు" అని చంద్రయ్య సిగ్గుపడుతూ సంజాయిషీ చెప్పుకుంతున్నాడు.

    "నాన్నగారు నిద్ర లేచారా?" అనడిగాడు సత్యమూర్తి.

    "లేచారు బాబూ. కాని అయ్యగారు చాలా బలహీనముగా వుంటున్నారు. ఎప్పుడోగాని మాట్లాడరు కూడాను. మొహం కడుక్కుంటారా?"

    "మొదట నాన్నిగార్ని చూసి వస్తాను" అని సత్యమూర్తి తండ్రి గదివైపు బయల్దేరాడు.

    వీరభద్రం ఎదురుగా వచ్చాడు.

    ఆగి "ఎప్పుడు వచ్చారు?" అని ప్రశ్నించాడు.

    "రాత్రి" అని బదులు చెప్పి సత్యమూర్తి ముందుకు నడిచాడు.

    బలరామయ్యగారు మంచంమీద పడుకుని పైకి చూస్తున్నారు.

    అప్పుడు చూశాడు తండ్రిని స్పష్టంగా. మనిషి సగానికి సగము తగ్గిపోయినట్లు అనిపించాడు. ముఖం పూర్తిగా శుష్కించిపోయి కళాకాంతులు నశించిపోయాయి. ముఖమీద పరచుకున్న మృత్యు చిహ్నాలు చూసి సత్యమూర్తి కదిలిపోయాడు.

    అలికిడి విని ఆయన తలత్రిప్పి చూశాడు. కొడుకుని చూడగానే ఆయన కళ్ళలో రవ్వంత కాంతిరేఖ పొడసూపింది.

    ఆయన పెదాలు కదలినై, "కులాసాగా వున్నావా?" అన్న ప్రశ్న ఎంతో క్షీణంగా వచ్చింది.

    సత్యమూర్తి తల వూపాడు.

    "పరీక్షలు బాగా రాశావా?"

    "రాశాను"

    బలరామయ్యగారు ఒక నిమిషము కొడుకు ముఖం వైపు చూస్తూ మౌనముగా వూరుకుని "అక్కడ గది ఖాళీచేసి వచ్చావా?" అని అడిగాడు.

    సత్యమూర్తికి వెంటనే ఏం జవాబు చెప్పాలో తెలీక తికమక పడ్డాడు.

    "ఇంకా లేదు.." అన్నాడు నసుగుతున్నట్టుగా.

    "అయితే సామాను కూడా అంతా తెచ్చేసుకోలేదన్నమాట..."

    "లే...!"

    బలరామయ్యగారు ఆశ్చర్యపడి, ప్రేమ, మందలింపు కూడిన స్వరముతో "సామానుకోసము మళ్ళీ అంత దూరము వెళ్ళటం - రైలు ఖర్చులు దండుగ గదుట్రా. అదీగాక అనవసరముగా అద్దె డబ్బులు దండుగ" అని మళ్ళీ కొడుకు ఏమయినా నొచ్చుకుంటాడన్న అనుమానముతో "పోనిలే, దాన్ని గురించి బాధపడకు, వెళ్ళు. ముఖ అదీ కడుక్కో" అన్నారు.

    అసలు తండ్రికి సీరియస్ గా వుందని టెలిగ్రాం రావటంవల్ల తను యిక్కడికి అనవసరంగా పరుగెత్తుకు వచ్చాడు. ఆయన కేమో సీరియస్ గా వున్నమాట నిజమే. తనా జబ్బు విషయం ఎత్తి పరామర్శ చేయవలసిన అగత్యం వున్నట్లు అతనికి స్పురించింది. కాని ఎలా? అలాంటి ప్రస్తావనలు తమ ఇద్దరి మధ్య రావటం అంతకుముందు సంభవించలేదు. ఆ ప్రసక్తి ఆయన తీసుకు వచ్చినా సరిపోయేది. తను ఏదో రెండు మూడు ముక్కలు మేళవించి యీ బరువును దించుకునేవాడు. అతనలాగే ఒకటి రెండు నిమిషాలు అక్కడే నిలబడి, ఏదో మాట్లాడటానికి ప్రయత్నించి, విఫలుడై మెల్లిగా అసంతుష్టి హృదయముతో యివతలకి వచ్చేశాడు.

   
                                  *    *    *
   

 Previous Page Next Page