Previous Page Next Page 
జీవాత్మ పేజి 11


    "హాయిగా, ప్రశాంతంగా ఎంజాయ్ చేసేలా, జంట నగరాల హడావిడికి దూరంగా వెళ్ళేటువంటి ట్రిప్ ఫిక్స్ చేయ్" లేస్తూ అన్నాడు మహదేవ్.
    
    "అలాగే" కుర్చీలోంచి లేస్తూ అన్నాడు అభిరాం హుషారుగా.
    
                                                            *    *    *    *    *
    
    "ఇంకా టిఫిన్ చేయవేం రా?" స్నానం చేసి డ్రస్సయి కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్న అభిరాంని అడిగింది అతని అమ్మమ్మ సుమతమ్మ.
    
    "మహదేవ్ వస్తానన్నాడు. వస్తే యిద్దరం కలిసి తింటాం. ఈరోజు అలా సరదాగా తిరిగొద్దామని అనుకుంటున్నాంలే."
    
    "సరే నీ ఇష్టం" అందామె.
    
    ఇంతలో మహదేవ్ బైక్ సౌండ్ వినిపించడంతో అభిరాం బయటకి నడిచాడు.
    
    "చెప్పిన టైం కంటే ఓ పావుగంట ముందే వచ్చేశావే" వాచీ చూసుకుంటూ అన్నాడు అభిరాం.
    
    "ఇంట్లో ఒకటే బోర్ అందుకే త్వరగా వచ్చేశాను" అని అభిరాం చేతిలోని పుస్తకం వంక చూశాడు మహదేవ్.
    
    'క్షుద్రనాదం' అనే నవలది.
    
    "నీకెంత చెప్పినా మానవేం.... ఆ దెయ్యాలూ, భూతాల నవలలే చదువుతావు ఎప్పుడూ?" అన్నాడు.
    
    అభిరాం తేలిగ్గా నవ్వేసి "నీ మోటార్ బైక్ లోపల పెట్టేయ్. నా మారుతీలో వెళదాం" అన్నాడు.
    
    "ఎక్కడికి వెళదామంటావ్...?" తన బైక్ ని అభిరాం వాళ్ళ కాంపౌండ్ లోకి తీసుకొచ్చి లాక్ చేస్తూ అడిగాడు మహదేవ్.
    
    "టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం."
    
    "చేసేశానురా"
    
    "అమ్మమ్మ పెసరట్టూ, ఉప్మా చేసిందిరా.... వద్దంటే నీ ఇష్టం"
    
    "అలాగా! అయితే పద...." ఉత్సాహంగా లోపలికి నడుస్తూ అన్నాడు మహదేవ్. ఆమె చేసిన పెసరట్టూ, ఉప్మా అంటే చాలా ఇష్టం అతనికి.
    
    "ఏమిటి మహదేవ్బాబూ బాగున్నావా?" అతన్ని చూడగానే ఆప్యాయంగా పలకరించింది సుమతమ్మ.
    
    "బాగున్నాను అమ్మమ్మా! నీ ఆరోగ్యం ఎలా వుంది?" ప్రశ్నించా డతను.
    
    "దేవుడి దయవలన బాగానే వుంది బాబూ" అంటూ ఇద్దరికీ ఉప్మా పెసరట్టు ప్లేట్లలో పెట్టి అందించింది.
    
    "ఉప్మా, పెసరట్టు తింటే నీ చేత్తో చేసినవే తినాలి అమ్మమ్మా" అంటూ ఓ ముక్క పెసరట్టుతో పాటు ఉప్మా తిని అన్నాడు మహదేవ్.        
    
    "అది సరే! ముఫ్ఫయ్ దగ్గరికి వచ్చేస్తున్నాయి మీ వయస్సులు....మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారయ్యా...?" అందామె చిన్నగా నవ్వుతూ.
    
    "చేసుకుంటాం అమ్మమ్మా! బ్రహ్మచారులుగా వుండిపోంలే" రోజుకో వందసార్లన్నా, ఆ మాటనందే నిద్రపోని సుమతమ్మతో విసుగ్గా అన్నాడు అభిరాం.
    
    "ఏ వయస్సులో జరిగిపోవలసిన ముచ్చట ఆ వయస్సులో జరిగి పోవాలి. మా కాలంలో మీ ఈడు వాళ్ళకి యిద్దరు, ముగ్గురు పిల్లలుండేవారు. ఏమిటో ఈ రోజులు, ముఫ్ఫైలు- నలభైలు దాటిపోయాక మగవాళ్ళు,  పాతిక ముఫ్ఫయ్ లు దాటాక ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు."
    
    "అబ్బబ్బా" చికాగ్గా అన్నాడు అభిరాం.
    
    "సర్లే! మీ యిష్టం నాయనా ఏదో పెద్దదాన్ని ఛాదస్తం" నిష్టూరంగా అందామె.
    
    "చేసుకుంటాం అమ్మమ్మా! వచ్చే యేడు కల్లా మా పెళ్ళిళ్ళు అయిపోతాయి. అప్పుడు నువ్వు విశ్రాంతిగా మాకు పుట్టిన పిల్లలతో ముచ్చట్లాడుకోవచ్చు..." ఆమెని అనునయిస్తూ అన్నాడు మహదేవ్.
    
    ఆమె అక్కడ్నుంచి కదిలింది.
    
    ఇద్దరూ టిఫిన్ చేయడం పూర్తయ్యేసరికి, వేడిగా కాఫీలు అందించిందామె.
    
    "అమ్మమ్మా! మేం బయటకు వెళుతున్నాం. మళ్ళీ తిరిగి వచ్చేది రాత్రికే. కాబట్టి నీకు ఒక్కదానికే వంట చేసుకో" కాఫీ తాగి కప్పు టేబుల్ మీద వుంచి అన్నాడు అభిరాం.
    
    "అలాగే" అందామె.
    
    "వస్తాం అమ్మమ్మా" అంటూ లేచారు అభిరాం, మహదేవ్ లు.
        
    "మంచిది పెందలాడే వచ్చేయండి" అంది సుమతమ్మ.
    
    "అలాగేలే!" అన్నాడు అభిరాం.
    
    గేట్లు తెరిచి, కారులో కూర్చుని స్టార్ట్ చేసి బయటికి తీసుకొచ్చాడు కారుని. మహదేవ్ గేట్లు వేసేసి కారు డోర్ తీసి అభిరాం పక్కన కూర్చోగానే ముందుకు దూసుకుపోయింది కారు.
    
    "టిఫిన్ చేస్తున్నప్పుడు అడగటం మర్చిపోయాను. ఎక్కడికెళుతున్నాం మనం?" అడిగాడు మహదేవ్.
    
    "వరంగల్"
    
    "వరంగలా?"
    
    "అవును."
    
    "అంత దూరమెందుకురా?"
    
    "స్పీడుగా వెళితే టూ అవర్స్ లో వుంటామక్కడ."
    
    "అక్కడికే ఎందుకు....?"
    
    "అక్కడ చూడదగ్గది అద్భుతమైన శిల్పసంపదతో పాటు అలనాటి శిల్పులు నిర్మించైనా రాజసౌధం వుంది. అది చూసిన తరువతః వరంగల్ కి దగ్గరే వున్న హనుమకొండలో కాకతీయులు కట్టించిన 'వేయి స్తంభాల' గుడిని కూడ చూద్దాం"
    
    "ఓకే! నేనూ వాటి గురించి విన్నాను. కానీ చూడలేదు. ఇంతవరకూ"
    
    "ఓ ఆర్కిటెక్చర్ గా నీకీ ట్రిప్ ఆనందాన్ని కలిగిస్తుందనే అనుకుంటున్నాను నేను"
    
    "గుడ్! నువ్వింతకు ముందు చూశావా?" అడిగాడు మహదేవ్.
    
    "లేదు. ఒకటి రెండుసార్లు మా ఎగ్జిక్యూటివ్స్ వాటి గురించి చెప్పారు అంతే. నాకూ ఇదే మొదటిసారి" 'టైం' చూసుకుంటూ అన్నాడు అభిరాం.    

    ఎనిమిదింపావు అవుతోంది సమయం. అభిరాం గేర్ మార్చి, ఏక్సిలేటర్ బలంగా అదిమాడు. అంతే.... అమాంతంగా స్పీడందుకుంది కారు.

 Previous Page Next Page