ఇక వారి గురించి పట్టించుకోదల్చుకోలేదామె.
చిన్నన్న దగ్గిరకి వెళ్ళి "పోలీస్ స్టేషన్ కి వెళ్తావా అన్నయ్యా" అంది. యధాలాపంగా తలెత్తిన అతడికి, మొదట కొంచెంసేపు ఆమె మాట్లాడుతున్నదేమీ అర్ధంకాలేదు.
"పోలీస్ స్టేషన్ కా ..... ఈ రాత్రా" అన్నాడు అయోమయంగా.
"అవునన్నయ్యా! ఆయన ఒక్కరే వుంటారు. అంతా హఠాత్తుగా జరిగిపోయింది. నువ్వెళ్ళి ఒకసారి కనపడితే ధైర్యం."
అతడికేం చెప్పాలో తోచలేదు. బహుశ ఏ సాకు వెతకాలా అని ఆలోచిస్తున్నట్టున్నాడు. కొంచెంసేపుండి "ఇంతరాత్రి పోలీస్ స్టేషన్ లోకి రానిస్తారో లేదోనే" అన్నాడు. అతడికి వెళ్ళటం ఇష్టంలేదని మాటల్లోనే తెలిసిపోతోంది.
ఇంతలో అతడి భార్య! తన వదిన దూరంగా ఎవరితోనో చిన్న కంఠంతో, తనకి కాస్త వినపడేలా "అన్నీ కొత్త కొత్తవి వొస్తున్నాయమ్మా ఈ ఇంట్లోకి! ఈ పోలీసులు, అరెస్టులు మేమింతకు ముందు ఎరగం. అన్నట్టు వదినా - లాకప్పులో పడుకోవటానికి చాపా దిండూ ఇస్తారా?" అంది.
"చాపా దిండా? ఇంకా నయం. మా వూళ్ళో ఒకతన్ని పట్టుకెళ్ళి చావచితక్కొట్టార్ట వదినా."
ఇదంతా ఏదో కథలో, పుస్తకంలో చదివితే, 'ఛా యిలా జరుగుతుందా? మనుష్యులు ఇలా మాట్లాడతారా?' అనుకునేది. కానీ కళ్ళముందు జరుగుతున్న సంఘటన అది.
ఈ లోపులో మామగారు ఆమె దగ్గిరకొచ్చి, "మనం వెళ్దామా అమ్మా" అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంతో ఆయనవైపు చూసి అంతలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు సంతోషంతో, "అలాగేనండీ" అంది. ఆ మాత్రం ఆసరా దొరికితే చాలు ఆమె సాగిపోగలదు.
మామగారితో కలిసి మొదటి రాత్రి పోలీస్ స్టేషన్ కి వెళుతున్న పెళ్ళికూతుర్ని చూసి బుగ్గలు నొక్కుకున్నారు బంధువులు. "నేను వెళ్తానులే" అన్నాడు అన్నలేచి.
"వద్దులే అన్నయ్యా, అంతరాత్రి పోలీస్ స్టేషన్ కి రానిస్తారో లేదో-" మందలింపుగా అని బయల్దేరింది.
అప్పుడే ఇన్ స్పెక్టరు మిగతా ఫార్మాలిటీస్ పూర్తిచేసినట్టున్నాడు. వచ్చిన ఇద్దర్నీ చూసి ఆశ్చర్యపోయాడు ముఖ్యంగా పెళ్ళికూతుర్ని చూసి.
"ఒకసారి మేము ఆయన్ని కలుసుకోవచ్చా ఇన్ స్పెక్టరుగారూ" అడిగింది.
"ష్యూర్-ష్యూర్" అన్నాడు అతడు. "లాకప్ లో పెట్టలేదు. గదిలో బల్లమీద పడుకొమ్మని చెప్పాను" అని లోపలి తీసుకువెళ్తూ- "సారీ నాకు మీ ఫస్ట్ నైట్ అని తెలీదు. కానీ రూల్స్ ని నేనూ ఏం చెయ్యలేను" అన్నాడు. దోషివున్న ప్రదేశం వరకూ వెళ్ళి 'జాలి' వల్లో, మరే కారణంవల్లో అతడిని అరెస్టు చెయ్యకపోతే, ఆ విషయం పై అధికారులకి తెలిస్తే, కారణాలు ఏమైనా ముందు సస్పెండ్ చేయటం ఖాయం. ఇన్ స్పెక్టరుకి క్రికెట్ అంటే కొద్దిగా ఇంటరెస్టు వుంది. రాయన్న పేరు వినివున్నాడు. అదీగాక తను అరెస్టు చేసిన పరిస్థితిపట్ల మనసులో ఏ మూలో కాస్త గిల్టీ ఫీలింగ్ కూడా వున్నట్టుంది.
కిరణ్మయి మామగారికి మాత్రం ఇది వింతగా వుంది. ఆయనకి తెలిసినంతలో పోలీస్ స్టేషన్ అంటే అక్కడందరూ యమభటుల్లా లాఠీల్తో కొడుతూ వుంటారనే అభిప్రాయం వుంది. డానికి కాస్త భిన్నంగా వుంది ఇక్కడ పరిస్థితి. ఆయన పోలీస్ స్టేషన్ కి రావటం ఒక విధంగా మంచిదే అయింది. లేకపోతే, ఆ రాత్రంతా కొడుకుని చిత్రహింసలు పెడుతున్నట్టు ఏమేమో వూహించుకుని బాధపడేవాడు.
ఈ సంఘటనతో అందరికన్నా బాగా కదిలిపోయినవాడు రాయన్న, క్రీడాకారులు, కళాకారులు పైకి ఎలా కనపడినా లోపం చాలా సున్నితంగా వుంటారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో మొదట అతదికేమీ అర్ధంకానంతగా మెదడు మొద్దుబారిపోయింది. ఏదో ట్రాన్స్ లో వున్నవాడిలా భార్యతో చివరిసారి మాట్లాడి ఇన్ స్పెక్టరు తో నడిచాడు. పోలీస్ స్టేషన్ లో ఒంటరిగా కూర్చున్నాక, మబ్బులు విడిపోయినట్టు ఒక్కొక్కపొరా విడిపోయి వాస్తవం ఎదురుగా నిలబడి నవ్వసాగింది.
భవిష్యత్తు సమూలంగా నాశనం అయిపోయింది - అన్న సంగతి కొట్టిచ్చినట్లు కనపడుతోంది. ఇక సభ్య సమాజంలో మామూలు మనిషిగా తిరగలేడు. రేపు కోర్టులో నేరం రుజువైతే ఉరిశిక్షో, యావజ్జీవ కారాగారశిక్షో తప్పదు. క్రికెట్ లో శిఖరాలు ఎక్కాలన్న కోర్కె పూర్తిగా తొలగిపోయింది. ఇక అది అసంభవం.
క్రమక్రమంగా అతడి మనసు వ్యధాభరితమైపోయింది. ఆ పోలీస్ స్టేషన్ బల్లమీదే కూర్చొని తనలోతానే 'అయ్యో-అయ్యో' అని చాలాసార్లు అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయానికి కిరణ్మయి, తండ్రితో సహా రావటం కనిపించింది. ఆశ్చర్యంతో, తన కళ్ళని తానే నమ్మనట్టు చూశాడు.
ఆ క్షణం అతడు మానసికంగా ఎంత క్రుంగిపోయి వున్నాడంటే, అంతరాత్రి తనకోసం 'తనవాళ్ళు' రావటం ఎంతో రిలీఫ్ అనిపించింది ఆ ఉద్వేగంలో నోటమాట రాలేదు.
కిరణ్మయి అతడి స్థితిని సరిగ్గా అంచనా వేసింది. అందుకే ఆమె అన్న మరుసటిరోజు ప్రొద్దున్న వెళ్దామంటే వప్పుకోలేదు. ఆ శూన్యపు రాత్రి అతడు 'రెక్' అవకుండా "నీ వెనుక మేమున్నాము" అన్న దైర్యం వాళ్ళ రాకద్వారా అతనికి కలిగింది.
భార్యాభర్తలిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మాట్లాడుకోవటానికి కూడా అంత అవసరమైన మాటలేమీ లేవు. ఒకర్నొకరు చూసుకున్నారు. ఆమె కళ్ళతోనే ధైర్యం చెప్పింది. తండ్రి మాత్రం కొడుకుతో రెండు మాటలు మాట్లాడాడు. కొడుక్కంటే ఆయనే ఎక్కువ బేజారుగా వున్నాడు.
ఆయన వెళ్ళాక కిరణ్మయి అతడి దగ్గిరగా వచ్చింది. "రేపు ప్రొద్దునే లాయర్ దగ్గరికి వెళతాను. బెయిల్ ప్రయత్నిస్తాను" అని నవ్విందామె. ఆ సమయంలో ఆ నవ్వు - అతడికెంతో చిత్రంగా ఉహూ- చిత్రం కూడా కాదు - దానికన్నా అతీతమైన భావాన్ని కలుగచేసింది. నువ్వు తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అన్న భావం.
ఆ తరువాత ఆమె చేతిలో పాకెట్ అతడి బల్లమీద పెట్టింది.
"ఏమిటిది?"
"అరటిపళ్ళు స్వీట్లు.... మీరు రాత్రి నుంచీ ఏమీ తినలేదు." అని, ఆమె అక్కడనుంచి కదిలి వచ్చేసింది. అతడి తడికళ్ళు తన దృష్టిలో పడినట్టు అతడు గ్రహించటం ఇష్టం లేనట్టుగా.
* * *
వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి తెల్లవారు ఝామున మూడయింది.
కిరణ్మయికి ఆశ్చర్యం కల్గించిన విషయం ఏమిటంటే, పెళ్లింట్లో అందరూ ని-ద్ర-పొ-తు-న్నా-రు! అప్పుడెవరైనా కొత్తగా అక్కడ ప్రవేశిస్తే మూడు గంటల క్రితమే అక్కడో ఘోరం జరిగిపోయిందని కలలో కూడా అనుకోరు. అంత ప్రశాంతంగా వుందాయిల్లు. ఆమె మనసులో యేమూలో ముల్లు గుచ్చుతున్నట్లు వుంది.
ఆ ముసలాయన అయితే, ఒక్కసారిగా వందేళ్ళు వృద్దాప్యం మీదకొచ్చిపడినట్టు వడలిపోయాడు. కొందరయితే- పైకి కనపడరు లోలోపలే ఎంతో ఆత్మీయత పెంచుకొంటారు. మొగవాళ్ళలో ఇలాంటివారు ఎక్కువ వుంటారు.
స్త్రీలు దీనికి వ్యతిరేకం. ఎక్కువ ఆత్మీయత "ప్రదర్శిస్తారు" లోతు వుండదు. ఈ సంగతి ప్రేమికుల విషయంలో కాదు. ముసలి మామలపట్ల కోడళ్ళ విషయంలోనూ, తమ్ములపట్ల పెళ్ళయిన అక్కల విషయంలోనూ ఇది ఎక్కువ కనపడుతుంది.
ఆ రాత్రి మరిక ఆమె నిద్రపోలేదు.
ఆ గడిలోకి కూడా వెళ్ళలేదు. పెరట్లోకి వెళ్ళబోయింది. ఆమె ఎటు వెళుతుందా అని ఊపిరిబిగపట్టి చూస్తున్న ముత్తయిదువ అప్పుడే కళ్ళు తెరిచి, "అదేమిటమ్మా లోపల పడుకోలేకపోయావా?" అంది ఆప్యాయత నిండిన కంఠంతో.
అదే - కిరణ్మయిగానీ ఆ గదిలోనే పడుకోవటానికి వెళ్ళివుంటే, బుగ్గలు నొక్కుకుని "చూశారా అమ్మా- చోద్యం మొగుడు జైలుకెళ్తే పూల మంచంమీద పవళించింది" అని ప్రచారం చేసి వుండేది.
కిరణ్మయి దీన్నంతా పట్టించుకోలేదు. విమర్శ-మెచ్చుకోలు అనేవి అవతలివారి ప్రవర్తనకు, మానసిక స్థాయికీ ప్రతీకలు. వాటికి ఇంట్రెన్సిక్ విలువలేదు. మానసిక స్థాయినిబట్టి మనల్ని ఆనందింపజేయడం, బాధపెట్టటం - అంతే .....అందుకోసమే పని కొస్తాయవి.
ఆమె పుస్తకాల రాక్ లోంచి ఒక పుస్తకం తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. ఎప్పుడూ ఆక్కడే కూర్చుని ఆమె చదువుకునేది. జామచెట్టుకు కట్టిన లైటు వెలుతురు చీకటిని పారద్రోలలేకపోతూంది. మూడున్నర కావొస్తూంది సమయం. ఆమె వెంటనే చదవటం ప్రారంభించలేదు. చెట్టుకి తల ఆన్చి చాలాసేపు కళ్ళు మూసుకుని వుండిపోయింది.
వెళ్తూ వెళ్తూ భర్త అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి.
"ఎప్పుడైనా మనలో ఒకరు ఏదో ఆలోచనలో వున్నప్పుడు రెండోవాళ్ళు 'ఏమిటిప్పుడు నువ్వు ఆలోచిస్తున్నది' అని అడిగితే, వాళ్ళు ఆ క్షణం ఏమాలోచిస్తున్నదీ నిస్సంకోచంగా చెప్పాలి అనుకున్నాం. గుర్తుందా కిరణ్మయీ! ఈ రాత్రంతా ప్రతీసారీ నేనే అడుగుతూ వచ్చాను. ఒక్కసారి కూడా నువ్వు నన్నేమీ అడగలేదు. అడక్కపోయినా నేనే చెపుతున్నాను. ఇప్పుడు నేనేం అనుకుంటున్నానో తెలుసా కిరణ్. కనీసం నా భార్య అయినా నన్ను నమ్మితే చాలు అనుకుంటున్నాను."