Previous Page Next Page 
మణిదీపం పేజి 10

    పల్లవి దురదృష్టం అదేమో, రమణమ్మ ఒకనాడు హఠాత్తుగా పోయింది హార్ట్ ఎటాక్ తో.

    పల్లవి ఒంటరిపక్షి అయిపోయింది.

    మదన్ కి అడ్డు అదుపు లేకుండా పోయింది. భార్యకీ, తనకీ మధ్య శిఖండిలా వున్న మనిషి పోయిందని సంబరపడిపోయి విజ్రుంభించి పల్లవిని వేపుకు తినడం మొదలుపెట్టాడు.

    అన్నిటికీ తప్పులు వెదకడమే!

    దేవుడికి ముందు దీపం పెట్టి మొక్కుతున్నా తప్పే. "ఆహాఁ! పతివ్రత! చేసేవి శివపూజలు. దూరేవి దొమ్మరి గుడిసెలు" అంటూ గుండెకు గురిపెట్టి శూలాలు విసిరేవాడు.

    పల్లవి కన్నీరు పెట్టని రోజు లేదు.

    పులిమీద పుట్రలా మరో బాధ మొదలైంది పల్లవికి.

    మదన్ కి మరదలు వరుసైన ఒకామె ఈమధ్యే వైధవ్యాన్ని పొందింది. ఆవిడకి పిల్లలు లేరు. ఆమెకు అత్తగారినుండి భరణం వచ్చే ఏర్పాటు చేస్తానని, అందుకు లాయర్ని మాట్లాడానని చెప్పి ఆమెను చేరదీసాడు.

    వాళ్ళిద్దరూ గదిలో కార్డ్స్ ఆడుతుంటే, టీ.వీ. చూస్తూ కబుర్లాడుకుంటూంటే పల్లవి వేడివేడిగా టీలు, టిఫిన్లు చేసి తీసికెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే దెబ్బలు, తిట్లు.

    బరితెగించినట్టుగా దాన్ని సినిమాలకీ, షికార్లకీ తీసికెళ్ళడం.

    ఇదొక నిత్య నరకం! చిత్రహింస!

    ముగ్గురు పిల్లలతో ఇక్కడినుండి బయటపడలేదు.

    ఆనాడు అత్తగారి మాట విని ఉద్యోగంకోసం గట్టిగా ప్రయత్నించి వుంటే బాగుండేది.

    ఇప్పుడా అవకాశం లేదు. ఏజ్ బార్ అయిపోయింది.

   
                               *    *    *    *


    "ఈ కథలో పల్లవి నేనే డాక్టర్ గారూ! ఎన్నోసార్లు అనుకున్నాను పిల్లలను చంపి నేను చావాలని. చేజేతులా పిల్లల్ని చంపలేకపోయాను. పిల్లల్ని విడిచి నేనొక్కదాన్ని చావలేకపోయాను. నా సమస్యకు పరిష్కారం ఏమిటి! మీరిచ్చే జవాబు మీద నా జీవితం ఆధారపడి వుంది. ఇట్లు- ఒక అజ్ఞాత పాఠకురాలు."

    డాక్టర్ అరవింద్ కథ ముగించి బరువయిన మనసులో పత్రిక మూసేసరికి అర్చన రాజు, అరుణోదయ చతురంగ బలంతో బందీ అయిపోయింది.

    "కథ చదివారా?" అర్చన అడిగింది, ఇంట్లోకి వెళ్ళి టీ తెచ్చి అతడికి యిస్తూ.

    "ఆఁ! చదివాను."

    "మీరైతే ఈ సమస్యకు ఏం సమాధానం చెబుతారు?"

    "భార్యను నిష్కారణంగా అనుమానించి అనేది ఒక రకమైన మానసిక వ్యాధి. మందులవల్ల, హిప్నోథెరపీవల్ల బాగుచేయవచ్చు. ఈ సమాజంలో నూటికి పదిమంది అయినా మదన్ లాంటి మానసిక రోగులు వున్నారు.

    అయితే ఆశ్చర్యం ఏమిటంటే వలలు రోగులుగా కనిపించరు. చూసేవాళ్ళకు అదివాళ్ళు సహజ స్వభావం అనిపిస్తుంది. అది వాళ్ళ సహజ స్వభావం అని, అది చస్తేగానీ వదలదని, వాళ్ళ పాలబడ్డ పల్లవిలాంటి వాళ్ళు తమ రాత ఇంతేనని పళ్ళ బిగువున ఆ బాధలు భరిస్తుంటారు. నిజానికి అలా భరించాల్సిన అవసరంలేదు. అలాంటి రోగులను మంచి సైక్రియాట్రిస్ట్ కు చూపి బాగుచేసుకోవచ్చు."

    "వాళ్ళని సైక్రియాట్రిస్ట్ దగ్గరికి పట్టుకుపోయి చూపించడం ప్రాబ్లం కదా? అదంత సులభంగా జరిగే పనికాదు. అతడి సంగతి పక్కకు పెట్టండి, పల్లవి వున్న విషమ పరిస్థితికి పరిష్కారం ఏమిటి?"

    "చావు మాత్రం పరిష్కారం కాదు."

    "ముగ్గురు బిడ్డల తల్లి!ఎక్కడికీ పోలేదు. బతకలేదు."

    "ఎక్కడికీ ఎందుకు పోలేదు? ఈ ప్రపంచం యింత విశాలంగా వుంది" అన్నాడు అరవింద్.

    "ఎంత విశాలమైనా ఒక్క అడుగు కూడా ఆమెది కాదు. ఆమెది కానిచోట ఆమె ఒక్క నిమిషం కూడా నిలువలేదు."

    "ఈ ప్రపంచంలో ఏదీ ఎవరికీ పుట్టుకతోనే స్వంతం కాదు. శ్రమతో, ఆత్మ విశ్వాసంతో తమది చేసుకోవాలి ఒక స్త్రీ మినిస్టర్ సీటులో కూర్చున్నా, ఒక స్త్రీ కలెక్టర్ సీటులో కూర్చున్నా దాని వెనుక ఎంతో శ్రమ, పట్టుదలా వుంటాయి."

    "పుట్టిల్లు, మెట్టినిల్లు కాక మూడో స్థానంలో స్త్రీ పాదం మోపి నిలబడాలంటే మాటలు కాదు. ముఖ్యంగా భర్త విడిచిన స్త్రీ బయటికి వస్తే ఊరుమ్మడి బ్రతుకు అయ్యే ప్రమాదముంది."

    "కనబడితే చాలు మీదపడి కసకస తినేసే పులిలాంటి క్రూరమృగాలున్న కీకారణ్యంలో సైతం జింకలూ, నెమళ్ళూ, కుందేళ్ళూ సహజీవనం చేస్తాయి. ప్రతి క్షణం ప్రమాదంలో వున్నాయని వాటికితెలుసు. తెలుసు కాబట్టే అడుగడుగునా అప్రమత్తంగా వుండి బ్రతుకు పోరాటం సాగిస్తాయి. ఈ సమాజం కూడా ఒక కీకారణ్యమే, అప్రమత్తత, ఆత్మ విశ్వాసం వుంటే ఎక్కడయినా జీవించవచ్చు. భర్త అంత నిర్దాక్షిణ్యంగా బాధిస్తున్నప్పుడు అతడినే పట్టుకు వేలాడాల్సిన అవసరం ఆమెకు లేదు."

 Previous Page Next Page