Next Page 
అందరూ దొంగలే  పేజి 1

                                 

                    

                  అందరూ దొంగలే ....   

                                                                                  -మల్లిక్

 


   
    రాత్రి....దాదాపు ఒంటిగంటైంది!! అతను పరుగులు తీస్తున్నాడు. ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాడు. అంటే అతన్ని ఎవరో గూండాలు తరుముతూంటే  వాళ్ళనుండి  తప్పించుకోవడానికి  పరిగెత్తడం  అని కాదు.

    ఎందుకంటే ...అతనే ఓ పేద్ద గూండా!కాదు  కాదు ...గూండా కాదు! అతనో పేద్ద గజదొంగ!!!

    గజదొంగ గంగులు ...గంగులు మీద  దోపిడీలు, మానభంగాలు, హత్యలూ, స్మగ్లింగ్ లూ ఇలా బోల్డన్ని క్రిమినల్ కేసులున్నాయి . అతను మోస్ట్ వాంటెడ్  క్రిమినల్ ...డెడ్ ఆర్ అలైవ్ !`  
                
    గంగులు ప్రాణభయంతో పరుగులు తియ్యడానికి కారణం అతన్ని తరుముతూ పోలిసు జీపు. ఆ జీపులో పోలీస్ కమీషనర్  లింగారావ్ , అతని ప్రక్కనే ఇన్స్ పెక్టర్   అప్పారావ్, వెనకాల నలుగురు కానిస్టేబుల్స్ .

    అదేం విచిత్రమోగానీ  జీపు  ఎనభై కిలోమీటర్ల  వేగంతో వెళ్తున్నా ఇరవై  కిలోమీటర్ల  వేగంతో పరిగెత్తుతున్న గజదొంగ గంగుల్ని అందుకోలేకపోతోంది . కమీషనర్  లింగారావ్ కి ఇరిటేషన్ వచ్చేసింది . అతను జీపు డ్రయివర్ ని తినేసేలా   చూస్తూ చిరాగ్గా అడిగాడు .

    "ఏంటీ నీ డ్రయివింగ్...గంగులుకి  మైలుధూరం   వెనకాల నడుపుతున్నావ్ ?" అసలు ఎంత స్పీడ్ లో వెళ్తున్నావ్ ?"

    "ఎనభై కిలోమీటర్ల స్పీడ్ లో సార్ !" చెప్పాడు డ్రయివర్.

    "అదీ సంగతి ...వాడు ఇరవైలో పరిగెత్తుతుంటే నువ్వు ఎనభైలో వెళితే ఎలా ? కాస్త స్పీడ్ తగ్గించు"అరుస్తూ అన్నాడు .

    డ్రయివర్  స్పీడ్ తగ్గించాడు .జీపు మెల్లిమెల్లిగా గజదొంగ గంగుల్ని సమీపించసాగింది.

    "సార్! ఇప్పుడు మీరు షూట్ చెయ్యొచ్చు సార్ !" వెనకనుండి ఓ కానిస్టేబుల్ సలహా ఇచ్చాడు.

    "ఆ...!" అని బాధగా అరుస్తూ కమీషనర్ నెత్తిమీద ఠపాఠపామని అరడజను మొట్టికాయలు వేసుకున్నాడు.

    కమీషనర్ లింగారావ్ కి అతిగా కోపం వచ్చినా, బాధ కలిగినా అలానే మొట్టికాయలు వేసుకుంటాడు.

    కమీషనర్ అలా మొట్టికాయలు వేసుకునేసరికి  సలహా ఇచ్చిన కానిస్టేబుల్ కంగారుపడ్డాడు .

    "ఏం సార్ ...నేనేమైనా తప్పుగా మాట్లాడానా ?!" భయంభయంగా అడిగాడు .

    "కాదు ...కరెక్టుగా  మాట్లాడావుగానీ  నీతో సలహా చెప్పించుకోవాల్సివచ్చిందే అని చెడ్డ బాధేసింది"అంటూ టోపీ ఎత్తి నెత్తి రుద్దుకున్నాడు.

    ఇన్స్ పెక్టర్  అప్పారావ్ అతనివంక జాలిగా చూశాడు. "ఎంత భాధ కలిగినా మీరంత గట్టిగా నెత్తిన మొట్టేస్కుంటే మీకే చాలా ఇబ్బంది సార్ !" అన్నాడు కమీషనర్ తో.

     "ఏది ఇబ్బందిగా వుంటుందో, ఏది సుఖంగా వుంటుందో నాకు తెల్సు.నువ్వు అతిగా మాట్లాడితే మళ్ళీ మొట్టికాయలు వెయ్యాల్సి వస్తుంది" అన్నాడు కమీషనర్ లింగారావ్.

    అలాగైతే మీ తలకాయే బొప్పికడ్తుంది సార్!" వినయంగా పలికాడు అప్పారావ్.

    "నేను మొట్టికాయలు వేసేది నా తలమీద కాదు ...నీ తలమీద " క్రూరంగా చూశాడు కమీషనర్ లింగారావ్.

    ఇన్స్ పెక్టర్ అప్పారావు నాలుక్కర్చుకున్నాడు.

    జీపు గజదొంగ గంగుల్ని మరికాస్త సమీపించింది.కమీషనర్ లింగారావ్ రివాల్వర్ గంగులుకి గురిపెట్టాడు. జీపులోని  అందరూ చెవులు మూసుకున్నారు.

    కమీషనర్ గురిచూసి ట్రిగ్గర్ నొక్కాడు.

    "క్లచక్!"

    రివాల్వర్ పేలలేదు.కమీషనర్ లింగారావ్ అయోమయంగా రివాల్వర్ వంక చూశాడు.

    "అదెందుకు పేలలేదో నాకు తెల్సు సార్!" ఉత్సాహంగా అన్నాడు అప్పారావ్.

    "ఎందుకు పేలలేదు?" అడిగాడు కమీషనర్ లింగారావ్ .

    "అందులోని బుల్లెట్స్ నేనే తీసేశాను సార్ !"

    కమీషనర్ "ఆ..." అని బాధగా అరుస్తూ తలమీద మళ్ళీ ఠపా ఠపా మొట్టుకున్నాడు.

    "బుల్లెట్స్ ఎందుకు తీసేశావ్...ఏం? గజదొంగ గంగుల్తో కుమ్మక్కయ్యావా?" కోపంగా అరిచాడు.

    "అబ్బే అదేం కాద్సార్...మొన్నీ మధ్య ఓ పోలీసాఫీసర్ రివాల్వర్ క్లీన్ చేస్తూంటే అది పొరపాటున పేలి చచ్చాడు కద్సార్! అందుకని మీ సేఫ్టీ గురుంచి మీ రివాల్వర్ లో బుల్లెట్స్ నేనే తీసేశాను సార్!" అప్పారావ్ వినయంగా సమాధానం చెప్పాడు.

    "అఘోరించావ్...ఆ బుల్లెట్స్ ఇలా   తే!...అంటూ చెయ్యి చాచాడు కమీషనర్ లింగారావ్.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ జేబులోంచి బుల్లెట్స్ తీసి కమీషనర్ కిచ్చాడు.కమీషనర్ లింగారావ్ రివాల్వర్ ని లోడ్ చేసి మళ్ళీ పరిగెత్తుతున్న గంగులుకి గురిపెట్టాడు.    జీపులోని అందరూ మళ్ళీ కళ్ళూ, చెవులూ మూసుకున్నారు. కమీషనర్ ట్రిగ్గర్ నొక్కాడు.

    "ఢాం..." పెద్ద శబ్దంచేస్తూ రివాల్వర్ పేలింది. అందరూ కళ్ళు తెరిచి చూశారు. గంగులు అలాగే రెట్టించిన వుత్శాహంతో పరుగులు తీస్తున్నాడు.

    "అ..."బాధగా అంటూ కమీషనర్ లింగారావ్ నెత్తిన ఓ మొట్టికాయ మొట్టుకుని మరోసారి గంగులికి రివాల్వర్ గురిపెట్టాడు.మళ్ళీ అందరూ కళ్ళూ, చెవులూ మూసుకున్నారు.కమీషనర్ ట్రిగ్గర్ నొక్కాడు.

Next Page