ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్న అమ్మాయిలకోసం అమృతవల్లి నడుపుతున్న హాస్టలు అది.
అర్దరాత్రి పన్నెండు గంటలవుతోంది.
"వద్దు! వద్దు! వద్దు!" అంటూ చటుక్కున పక్క మీద లేచి కూర్చుంది సుకన్య. మొహం కందిపోయి ఎర్రగా వుంది. చూపులు విహ్వలంగా వున్నాయి.
మనసులోని అశాంతితో, మగత నిద్రపోతున్న లత మేలుకుని త్వరత్వరగా సుకన్య మంచం దగ్గరకి
నడిచింది.
"వద్దు! నన్నేం చెయ్యొద్దు! ప్లీజ్!" అంటోంది సుకన్య.
లతా సుకన్య భుజం పట్టుకుని బలంగా కదిపింది. "సుకన్యా! సుకన్యా!"
మెలకువ వచ్చింది సుకన్యకి. కళ్ళు పెద్దవి చేసి లత వైపు చూస్తూ. "నాకు భయంగా ఉంది లతక్కా!" అంది వణుకుతున్న గొంతుతో.
"ఎందుకు భయం? ఏం భయం లేదు, నేనున్నాగా?"
"రేపొద్దున్న అతను..." అంటూ ఆపేసింది సుకన్య.
"ఎవరూ ఇందాక వచ్చినవాడేనా? వాడేదో చేస్తాడని భయపడుతున్నావా? నువ్వుత్త పిచ్చి పిల్లవి!"
సుకన్య అలా చూస్తూనే ఉంది.
"వాడు నీవంటిమీద చెయ్యి వెయ్యలేడని నేను స్టాంప్ పేపరు మీద రాసిస్తాను. సరేనా! పడుకో!"
సుకన్య పడుకోలేదు. తెల్లవారితే అతను కనబడతాడేమోనని హడలిపోతూ ఉంది.
లత లైటు ఆర్పేసివచ్చి, సుకన్య మంచంమీదే తనుకూడా పడుకుని, వీపుమీద చెయ్యి వేసి రాస్తూ ఉంటే, సుకన్య కళ్ళు మూసుకుంది.
లతకి మనసు అదోలా అయిపోయింది.
ఆడపిల్లలని వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనియ్యకుండా, ఈ మొగాళ్ళు చనువుగానో చొరవగానో, స్నేహంగానో, దౌర్జన్యంగానో వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి, అద్దాల షాపులో ఎద్దు జొరబడినట్లు ఛిన్నాభిన్నం చేసెయ్యడం ఎందుకు? కనీసం ఒక్క అమ్మాయి బతుకన్నా బుగ్గిచెయ్యకపోతే తమ మొగతనానికి సార్ధకత లేదనుకుంటారా వీళ్ళు?
కోపంతో లత పెదిమలు బిగుసుకున్నాయి.
* * *
అంతకు కొద్ది నెలలముందు -
ఎంప్లాయిమెంటు ఎక్స్చేంజి దగ్గర మందలు మందలుగా కూర్చుని ఉన్నారు జనం.
ప్లాస్టిక్ కవర్లో పెట్టిన సర్టిఫికేట్లు భద్రంగా పట్టుకుని ఒక పక్కగా కూర్చుని ఉంది లత. టెన్తు క్లాసు పూర్తవగానే ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో పేరు రిజిస్టర్ చేయించుకున్న తరువాత టైపూ, షార్ట్ హాండ్, టెలిఫోన్ ఆపరేషన్ కూడా నేర్చుకోడంవల్ల, త్వరత్వరగానే ఇంటర్వ్యూలకి పిలుపులు వస్తున్నాయి. కానీ ఉద్యోగమే రావడం లేదు.
అసలు ఉద్యోగం వస్తుందా తనకి?
ఏమో!
ఇంతమంది నిరుద్యోగులుండగా, తఃనకంటే బోలెడు చదువులు చదివి. బోలెడు డిగ్రీలు సంపాదించినవాళ్ళే సంపాదన లేక సతమతమై పోతూంటే.....
తనకి ఉద్యోగం ఎలా వస్తుంది?
ఇక్కడ కూర్చున్న చాలామంది అమ్మాయిలతో తనకు ముఖపరిచయం ఉంది. వాళ్ళలో సగం మందికి పైగా గ్రాడ్యుయేట్లు!
"మీరేం చదివారు?" అంది పక్కనే కాశ్మీరు సిల్కుచీరె అమ్మాయి. 'ఇంటర్మీడియెట్ పూర్తి చేసాను' అంది లత పాదాలవైపు చూసుకుంటూ, సాదా నైలాన్ చీర అంచు పాదాలని తాకుతోంది. కాళ్ళకి వేసుకున్న హవాయ్ చెప్పులు కొద్దిగా పాతబడి వున్నాయి.
పక్కమ్మాయి తేలిగ్గా చూసింది. 'నేను బి.ఏ. పాసయ్యాను. ఇంతవరకూ దిక్కులేదు' అంది.
తన తక్కువ చదువుని సమర్ధించుకోడానికి ప్రయత్నిస్తూ. "టైపు హయ్యరూ, షార్టుహాండు లోయరూ, పీ యం బీ ఎక్స్ కూడా కంప్లీట్ చేశాను" అంది లత.
అవతలి అమ్మాయి మొహం కొద్దిగా వాడింది.
"నేను అవేమీ నేర్చుకోలేదు. అసలు ఈదరిద్రపు క్లర్కు ఉద్యోగాలకి రావల్సి వస్తుందనుకోలేదు. లక్షణంగా ఎమ్మే చదువుకుని.." అని ఏదో చెప్పబోయిందా అమ్మాయి.