Next Page 
శతదినోత్సవం పేజి 1

                                 

       

                            శతదినోత్సవం

            
                                                     కొమ్మనాపల్లి గణపతి రావు

 

                                     

 


    సైలెన్స్  !


    మంగ కేక తో ఆ లోగిలి ప్రతిధ్వనించింది.


    పెళ్ళి చూపులకని వచ్చిన గోపాలరావు దంపతులు గుసగుసలు మాని అందోళనగా చూశారు కొడుకు కన్నారావుకేసి.


    
    :అమ్మాయిగారు ఏ క్షణంలో అయినా గదిలో నుంచి బయటికి రావచ్చు." మంగ హెచ్చరించింది మరోసారి.


    స్వేదంతో తడిసిపోతున్నకన్నారావు తల్లితో అన్నాడు రహస్యంగా_"ఇదేం డిసిప్లెనే? మనం పెళ్ళిచూపులకని వచ్చినట్టు లేదు కోర్టులో అడుగు పెట్టినట్టుంది."


    "నీ మొహం! నోర్మూసుకుని పడుండు" అంత రహస్యంగానే కోపాన్ని ప్రదర్శించింది కన్నారావు తల్లి. "మనం వచ్చింది మాములు ఇంటిక్కాదు. రావు బహుద్దూర్ రామ్మోహనరావుగారి కొడుకు వీర్రాజు గారితో వియ్యమందటానికి పదేకారాల మాగాణి, ఓ డజను ద్రాక్ష తోటలు పట్నంలో రెండు సినిమా హాల్సు వున్నా వీర్రాజు గారి కూతురంటే మాటలు కాదు!"


    "అది కాదే! వీర్రాజు గారు ఓ మూలకూర్చుని మీసాలు దువ్వుకుంటుంటే మధ్య ఈపనిమనిషి మంగేమిటి, మూడు నిమిషాలకో సారి యిలా కేకలుపెడుతుంది?" గొణుగుతున్నట్టుగా అన్నాడు కన్నారావు.


    "అవి జమిందారీ సంప్రదాయాలు లేరా బడుద్దాయ్! నువ్వు కాస్త ఈ పెళ్ళి చూపులు గట్టెక్కించు, కోట్ల ఆస్తి."


    "సంపెంగ నూనె వాసనేమిటి?" అనుమానంగా అడిగాడు కన్నారావు ముక్కు రంద్రాల నిడివి పెంచుతూ.


    "నీక్కాబోయే మామగారు రాసుకునుంటారు ఎంతైనా జమిందారీవంశంగా!"


    "మళ్ళీ సైలెన్స్!" మంగ చేత వాచీ చూసుకుంటూ అంది "మరో అరనిమిషం."


    "ఇదేమిటే? ఉపగ్రహానికి ముందు కౌంట్ డౌన్ లా ఈ గొడవంతా! టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు కన్నారావు.


    "ష్.....మాట్లాడకు!" మూతి పోట్లు పోడిచినంత చేసింది కన్నారావు తల్లీ.


    ఇప్పుడు వీర్రాజుగారు కూడా వాచి చూసుకుని క్షణంపాటు మెడ మెట్లకేసి తిలకించి, మళ్ళీ మీసాలు సవరించుకోడంలో నిమగ్నమయ్యాడు.


    చెమటతో తడిసిపోతున్నాడు కన్నారావు తండ్రి.


    గోవారు గ్రామంలో పెద్ద భూస్వామిగా కన్నారావు తండ్రి గోపాలరావుకూ పెద్ద పేరే వుంది కానీ. వీర్రాజు అంత కాదు.


    అసలు వీర్రాజు ఆషామాషీ వంశానికి చెందినవాడు కాడు. డల్హౌసి కాలం నుంచి ఆ కుటుంబానికి బ్రిటిష్ ప్రభుత్వంతో గొప్ప సంబంధ భాంధవ్యాలున్నాయని ప్రతీతి.


    డల్హౌసికి ఆ రోజుల్లో ఉబ్బస వ్యాధి ఉందో, లేదో తెలీదు కాని, నెలకో రోజు ఈలోగిలికి వచ్చి, ఈ ఉళ్ళోనే చెట్ల మందేదో తింటూ, వీర్రాజు గారి ముత్తాతతో చెట్టా పట్టాలేసుకు తిరిగేవాడని ఊరు వాడా చెప్పుకునేవారు.


    అలా బ్రిటిషు గవర్నరు జనరల్సుతో నుంచి స్నేహం ఉండబట్టే పది పన్నెండు పరగణాలదాకా తమ పేర రాయించుకున్న వీర్రాజు వంశం, ప్రస్తుతం ల్యాండ్ సీలింగ్ సమస్యతో చాలావరకు పేదలకు కాక భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పి, ఇప్పటికి కోట్లకు పడగలెత్తిన వంశంగా ప్రస్తుతి పొందుతుంది.


    ఇది తెలియబట్టే గోపాలరావు చాలా సిఫార్సుల ద్వారా పెళ్ళి కావాల్సిన వీర్రాజు ఒక్కగానొక్క కూతురికి ఎమ్మే చదివిన తన కొడుకు కన్నారావును కట్టబెట్టాలని విశ్వప్రయత్నం చేస్తూ ఇదిగో, ఈరోజు పెళ్ళి చూపులకు వచ్చాడు.


    అలా అని వీర్రాజుకు ఉన్నది ఒక్కర్తే కూతురు కాదు. ఆమె కంటే పెద్దవాడైన మరో అబ్బాయి ఉన్నాడు. పెళ్ళికి సిద్దంగా. పల్లెకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లిలో కాలేజి లెక్చరర్ గా పని చేస్తున్న కొడుకు ఉదయ్ కన్నా కూతురు 'కిన్నెర' గురించే ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్నాడు వీర్రాజు.


    దానికి కారణం నాలుగు తరాల్లో ఆ వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్ల అయినందుకు మాత్రమే కాదు అసాధారణమైన అందం, తెలివిగల అమ్మాయిని ముందు ఓ ఇంటి కోడలిని చేయాలనీ.


    అలాగని పెళ్ళిచేసి మెట్టినింటికి పంపడం అయన అభిమతం కాదు. ఆమె మెచ్చినవాడ్ని ఇల్లరికం అల్లుడిగా యింట్లోనే ఉంచుకోవాలనుకుంటూన్నాడు.   

Next Page