"అలా చేస్తే ఆ ఫిలిం నిర్మాతలూ, డైరక్టర్లూ ఎందుకొస్తారు? ఆ మంత్రిగారు వాళ్ళందరినీ రానక్కర్లేదని చెప్పేస్తారు."
"రాకపోతే పోనీండి! డ్రామా బాగా వస్తుంది కదా?"
"పిచ్చివాడా! మనక్కావాల్సింది డ్రామా బాగా రావటం కాదు! ఆ డ్రామా పెద్దోళ్ళూ, గొప్పోళ్ళు చూడటం! చూసి మన ఇన్ స్టిట్యూట్ లో పిల్లలు కొంతమందికి సినిమాల్లో అవకాశం ఇవ్వటం! నీక్కూడా సినిమా ఛాన్స్ వచ్చినా రావచ్చు."
"ఆ సంగీతే హీరోయిన్ గా వేస్తే సినిమా ఛాన్స్ కాదుగదా, ఎవడూ స్టేజికి రాసే ఛాన్స్ కూడా ఇవ్వడు సార్."
"నీకెందుకు? నీ డ్రామా అద్భుతంగా వుందని పొగిడి జనంలో నుంచి ఓ పెద్దమనిషి నీకోసం ప్రత్యేకంగా అయిదువేల రూపాయల బహుమతిని ఎనౌన్స్ చేసే ఏర్పాటు కూడా చేశాను. అలాంటప్పుడు ఆ డ్రామా బాగుండలేదని ఇంకెవడనగలడు?"
సింహాద్రి ఆనందంగా చూశాడు. "నిజంగా నాకు అయిదువేల బహుమతి ఇస్తారా సార్?"
"స్టేజి మీద వరకూ నిజమే గానీ, నిజంగా కాష్ ఇవ్వరు. అదొక పబ్లిసిటీ స్టంట్ అన్నమాట. ప్రస్తుతం అన్నిచోట్లా ఇలాంటి పద్ధతులే ఫాలో అవుతున్నారు."
సింహాద్రి నీరసపడిపోయాడు. అంతా తనూహించినట్లే జరిగింది. డ్రామా సర్వనాశనం అయిపోయింది. అదీ కేవలం సంగీత వల్లే అలా అయ్యింది.
ముందు వరుసల్లో కొట్టుకుంటున్న వాళ్ళందరినీ పోలీసులు బయటకు లాక్కెళ్ళిపోయారు. మంత్రిగారు, సినీ ప్రముఖులు వేదిక మీదకెక్కారు.
అందరూ ఆ కార్యక్రమం అద్భుతంగా ఉందని పొగుడుతున్నారు.
సంగీతకు రెండు సినిమాల్లో పాత్రలు ఇవ్వబోతున్నట్లు ఇద్దరు నిర్మాతలు, డైరక్టర్ లు ప్రకటించారు. ఆఖర్లో ఓ వ్యక్తి జనంలో నుంచి లేచి వచ్చి అంత గొప్ప విప్లవాత్మకమైన రచన చేసిన ఆ నాటక రచయితకు అయిదువేల రూపాయల బహుమతి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
మిగిలిన కొద్దిమంది పోలీసులూ తప్పట్లు కొట్టారు.
సంగీతకు, మంత్రిగారికి చాలా ఖరీదైన మెమెంటోలు బహూకరించారు. మిగతావారికి చౌకబారు బొమ్మల్నిచ్చారు.
సింహాద్రి తన బహుమతి చిన్న ఆవు బొమ్మ తీసుకుని స్టేజి వెనుకవేపుకి నడుస్తోంటే ఆ అమ్మాయి పలకరించింది.
"ఎక్స్ క్యూజ్ మీ...."
సింహాద్రి వెనక్కు తిరిగి చూశాడు. పంజాబీ డ్రస్ లో ఉన్న ఓ అమ్మాయి తన వెనుకే వస్తోంది.
"నమస్తే! నా పేరు శోభ....! నేను జంట నగరాలకు కల్చరల్ రిపోర్టర్ ని!"
"గ్లాడ్ టు మీట్ యూ" ఏమాత్రం ఆసక్తి లేకుండా అన్నాడతను.
"ఈ డ్రామా రచయిత సింహాద్రిగారు మీరేకదూ?"
"దురదృష్టవశాత్తు నేనే"
"నో నో! అలా అనకండి"
"అలాగే అంటాను. వళ్ళుమండిందంటే బూతులు కూడా మాట్టాడేస్తాను. నా సంగతి మీకు తెలీదింకా."
"అయ్యయ్యో! ఐ పిటీ యూ"
"ఐ డోంట్ పిటీ మై సెల్ఫ్"
"చూడండీ! మీరు ఈ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో సినిమా రచయితగా ట్రైనింగయ్యారని ప్రిన్సిపాల్ గారు చెప్పారు"
"అంతా అబద్ధం! కేవలం నా డ్రామా వాళ్ళు వేస్తారని అలా నేను స్టూడెంట్ నని చెప్పడానికి ఒప్పుకున్నాను."
"అంటే మీరసలు ఆ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ స్టూడెంటా, కాదా?"
"అసలా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఒకటుందనేది మొన్నటివరకూ తెలీదు నాకు."
` "దిసీజ్ టూమచ్! ఇంత కుంభకోణం జరుగుతోందా ఇక్కడ?"
"అవన్నీ నాకు తెలీదు. నన్నేం అడక్కండి."
"మీరు ఎంతకాలం నుంచి రచనలు చేస్తున్నారు?"
"నా మూడో ఏట నుంచి! లేకపోతే ఏమిటండీ ఆ ప్రశ్నలు? ఇదే నా మొదటి నాటకం అని చెప్తూంటే మళ్ళీ దూరదర్శన్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళలాగా మున్సిపాలిటీ ప్రశ్నలేస్తారేమిటి?"
"ఓహో! ఇదే మీ మొదటి రచనా?"
"అవును"
"ఎంతకాలం పట్టింది మీకీ రచన చేయడానికి?"
"మూడు రోజులు"
"ఇది రాస్తున్నప్పుడు మీకేమనిపించింది?"
"అదిగో! మళ్ళీ దూరదర్శన్ స్టాండర్డ్ మున్సిపాలిటీ ప్రశ్న వేస్తున్నారు. ఆ బహుమతి అందుకున్నప్పుడు మీకేమనిపించింది? రాస్తున్నప్పుడు మీకేమనిపించింది? పాడుతున్నప్పుడు మీకేమనిపించింది? మీ డ్రామా చూస్తున్నప్పుడు మీకేమనిపించింది? ఇలాంటి అతితెలివి ప్రశ్నలేయకండి! నాకు చిరాకు."
శోభన వేసింది. "మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు"
"మీ ప్రశ్నలలా తయారుచేస్తున్నాయి నన్ను"
"నిజం చెప్పాలంటే నేను దూరదర్శన్ ఇంటర్వ్యూలు చూశాకే నేర్చుకున్నాను ప్రశ్నలేయటం."
"ఆ విషయం వేరే చెప్పఖ్ఖర్లేదు. మీ ప్రశ్నలు చూస్తుంటేనే తెలిసిపోతోంది."
"మీ నాటకంలో హీరోయిన్ సంగీత గురించి మీ అభిప్రాయం ఏమిటి?"
"అది నేను బయటకు చెప్పలేను"
ఆమె ఆశ్చర్యంగా చూసింది.
"ఎందుకని?"
"దానివల్ల అవతల వ్యక్తులకన్నా ముందు మీరే కెవ్వున కేకలు వేసి పారిపోవాల్సివస్తుంది."
"అంటే? ఆమె గురించి అంత ఘోరంగా చెప్పాల్సివస్తుందా?"
"దారుణంగా చెప్పాల్సి వస్తుంది"
"మీ డ్రామా ఇంత పెద్ద ఫ్లాప్ అవడానికి కారణం ఏమిటి?"
"ఆ హీరోయిన్ ఉంటే ఇదే కాదు, ఏ డ్రామా అయినా ప్లాపే అవుతుంది."
"మీరు కొత్తగా రచనలు చేయదలచుకున్నవారికిచ్చే సందేశం ఏమిటి?"
"అదిగో! మళ్ళీ దూరదర్శన్ ప్రశ్నలు."
"ఈ ప్రశ్న కూడా మంచిది కాదా?"
"పరమ జుగుప్సాకరమైన ప్రశ్న ఇది"