Previous Page Next Page 
దావాగ్ని పేజి 9


    వాళ్ళు హాల్లోకి వెళ్ళేసరికి అప్పటికే కిందికి వచ్చాడు యిందాక బాల్కనీలో కనబడ్డ పెద్దమనిషి.... డబ్బుతో, పవర్ తో వచ్చిన ఆత్మవిశ్వాసం ఆయనలో అణువణువునా కనబడుతోంది.

 

    "నా పేరు బాబూ రాజేంద్రప్రసాద్.... బాబూజీ అని పిలుస్తారు అందరూ. నువ్వెవరమ్మా?"

 

    "నేను కేప్టెన్ వినీల"

 

    "నువ్వు ఈ బీదవాడి ఇంట్లోకి... రావాలని ప్రయత్నించడానికి కారణమేమిటో?" అన్నాడాయన చిరునవ్వుతో.

 

    చెప్పింది వినీల.

 

    ఆయన మొహంలో అపనమ్మకం కనబడింది.

 

    "ఈజిట్? సో: ఇదేదో థ్రిల్లర్ సినిమా కథ వింటున్నట్టు ఉంది. కారు యిక్కడిదాకా వచ్చి మాయమైపోయిందా? ఆర్ యూ ష్యూర్?"

 

    తల పంకించింది వినీల.

 

    "కేప్టెన్ వినీల అంటే ఏమిటమ్మా? ఆర్మీలో కేప్టెన్ వా నువ్వు?" అన్నాడు ఆయన వివరాలు తెలుసుకోవడం మొదలెడుతూ.

 

    "కాదు. నేను ఇండియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్ ని"

 

    ఆయన దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. ఆయన మొహంలో కనబడుతున్న భావం చూస్తే, యింక తదుపరి ప్రశ్న "నువ్వెప్పుడన్నా పిచ్చాసుపత్రిలో ఉండి వచ్చావా?" అని అయివుంటుందేమో అనిపించింది వినీలకి.

 

    సానుభూతిగా వినీల వైపు చూస్తూ అన్నాడు బాబూజీ.

 

    "సో: ఒక హంతకుడు కార్లో పారిపోయాడు.... నువ్వు అతడ్ని తరుముకుంటూ మారుతీ కార్లో వచ్చావ్. ఆ కారు నా యింటి ముందుకు రాగానే నేల మింగేసినట్లు అదృశ్యమైపోయింది. అయితే ఇప్పుడేం చెయ్యాలంటావ్ ? కారుకోసం యిల్లంతా వెదకుతావా?"

 

    "మీ కభ్యంతరం లేకపోతే:"

 

    భుజాలెగరేశాడు ఆయన.

 

    "సరే పద: ఇద్దరం వెతుకుదాం: యెక్కడ? కిచెన్ లో మొదలెడదామా? వరండాలోనా?"

 

    వినీల పెదిమలు బిగుసుకున్నాయి. ఆయన తననో వెర్రిదానిలా చూస్తున్నాడని అర్థమయింది. మాట్లాడకుండా వెనక్కి తిరిగి ఇంటి చుట్టూ ఎకరాలమేర పెరిగి వున్న తోటవైపు దారితీసింది. వినీల వెనకనే వచ్చాడు బాబూజీ.

 

    కొద్ది అడుగులు వెయ్యగానే హఠాత్తుగా ఆగిపోయింది వినీల.

 

    ఎదురుగా -

 

    ఒక పాతికేళ్ళ యువకుడు గార్డెన్ ఛెయిర్ లో కూర్చుని వున్నాడు. చాలా అందంగా ఉన్నాడతను.

 

    అతనికి ఎదురుగా ఉన్న గ్లాస్ టాప్ టేబుల్ మీద ఒక చిన్న రైలు బొమ్మ చిన్న చిన్న పట్టాలమీద సర్కిల్స్ కొడుతోంది.

 

    అతను దాన్ని చూస్తూ సంబరపడిపోతున్నాడు అచ్చు చిన్న పిల్లాడిలా.

 

    అతడి పక్కన గడ్డిలో యెన్నెన్నో బొమ్మలు గుట్టగా పోసి ఉన్నాయి ఒక నౌఖరు వెండి గిన్నెలో పెరుగన్నం పట్టుకొని పక్కన నిలబడి స్పూన్ తో అతనికి తినిపించాలని ప్రయత్నిస్తున్నాడు.

 

    "ప్రతాప్ బాబూ: ఇంకొక్క ముద్ద తినండి. ఈ ఒక్క ముద్దా: ఆఁ అనండి:"

 

    "తోడేలు కథ చెప్పు: తింటాను..." అన్నాడు ఆ ప్రతాప్ అనే యువకుడు మంకుగా.

 

    తోడేలు కథ చెబుతూ, మధ్యమధ్యలో స్పూన్ తో మీగడ పెరుగన్నం అతని నోటికందిస్తున్నాడు నౌఖరు.

 

    కొన్ని ముద్దలు తిని, ఇంక ఆపేశాడు ప్రతాప్ రైలు బొమ్మని కాలితో క్రిందికి తోసేసి, రెండు కాళ్ళూ బల్లమీద బార్లాజాచి పెట్టుకొని వెనక్కి వాలాడు.

 

    "ఇంకొక్క ముద్దబాబూ:" అన్నాడు నౌఖరు.

 

    "నేను ఊర్కే తింటానేమిటి?"

 

    "మరేం కావాలి బాబూ: కొత్త కోతి బొమ్మ తెచ్చిస్తాను... తింటారా?"

 

    "వద్దు: నాకు అది తెచ్చియ్:" అన్నాడు ఆకాశంలో అర్జెంటుగా పరుగెత్తి పోతున్నట్లు కనబడుతున్న చందమామను చూపిస్తూ.... అలా అంటూనే జేబులోని కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకున్నాడు అతను.

 

    నౌఖరుకి నిలువుగుడ్లు పడ్డాయి.

 

    "వార్నాయనోయ్: భలే పితలాటకం పెట్టేసినావు బాబూ: నాకు డజనుమంది సొంతపిల్లలున్నారుగానీ నీలాగా పీక్కుతినే వాడొక్కడూ లేడు సామీ:" అని గొణుక్కుంటూ, అంతలోనే అతను సమీపించిన యజమాని బాబూజీని చూసి అత్యంత భక్తిశ్రద్ధలు ప్రకటిస్తూ ఒదిగి నిలబడ్డాడు నౌఖరు.

 

    నోరు తెరుచుకొని ఇదంతా చూస్తోంది వినీల.

 

    "హలో మంకీ:" అన్నాడు ప్రతాప్ వినీలను చూడగానే.

 

    నిర్ఘాంతపోయింది వినీల.          

 Previous Page Next Page