Previous Page Next Page 
హ్యూమరాలజీ - 3 పేజి 9


    "బాంక్ వాళ్ళం కాదు సర్పంచ్ సాబ్! సోషల్ సర్వీస్ వాళ్ళం!"

 

    "సోషల్ సర్వీసా! గిదేందో కొత్తగెళ్ళినట్లున్నది? మీరు మాకు అప్పులు గిట్ట ఇస్తరా?" అనుమానంగా అడిగాడు.

 

    "నోనో- అప్పులిచ్చే సంస్థకాదు మాది. సంఘసేవ చేస్తామన్న మాట" అంటూ రంగారెడ్డి వివరించబోయేలోగానే అందరూ మూక్కుమ్మడిగా లేచి ఎవర్దారిన వాళ్ళు వెళ్ళిపోబోయారు.

 

    "థూ నీయవ్వ పైసలియ్యనికి వచ్చినోండ్లు కాదంట"

 

    మేము హడావుడిగా అందరినీ చుట్టుముట్టి రెండు నిముషాలు మా మాటలు వినమని బ్రతిమాలాంగానీ వాళ్ళు మమ్మల్నీ తీసుకుంటూ పారిపోయారు.

 

    సర్పంచ్ మమ్మల్ని చూసి జాలిపడ్డాడు.

 

    "ఇగో ఈడ మావోండ్లు ఎట్లున్నారంటే వచ్చినోండ్లు పైసలయిన ఇయ్యాలె- గుడంబయిన తాగిపించాలె! లేకుంటే నువ్వేం జెప్పినగానీ ఇనరు."

 

    "దిసీజ్ టూమచ్!" అన్నాడు శాయిరామ్ ఇంగ్లీష్ లో.

 

    "మరి మేము వాళ్ళను ఎడ్యుకేట్ చేయటానికొచ్చాం కదా! ఇదంతా వాళ్ళ బాగుకోసమేకదా!" అన్నాడు రంగారెడ్డి.

 

    "బాగు గురించి జెపుతున్నవ్! మంచిగనే ఉన్నది! మగర్ గిందుల నీకేమీ ఫాయిదా లేకుండానే ఉన్నదా? అహా! ఒక్కమాట అడుగుతా!"

 

    మేము అదిరిపడ్డాము.

 

    "అరె! ఇదంతా సోషల్ సర్వీస్ అని జెప్పినాం గదువయ్యా! ఇంక ఫాయిదా ఏడకెళ్ళుంటది?" కోపంగా అడిగాడు యాదగిరి.

 

    సర్పంచ్ మొఖంలో రంగు మారిపోయింది.

 

    "ఇగో సోషల్ సర్వీసుగానీ, మరింకేదైనాగానీ ఇయ్యాళ్ళేపు పైసల్లేకుండా ఎవళ్ళు జేస్తారువయ్యా? ఈడెవళ్ళూ చెవిల ఫూల్ పెట్టుకుని లేరు సేఠో! మస్తుమందిని చూసినాం! మీకు ఆర్టీసీవోళ్ళిచ్చే పైసల్లో సగం మాకియ్యండ్రి! మీరేం జెప్పినాగానీ ఇంటాం! గంతనేగాని ఫుక్కట్ గా ఇననికి ఈడెవళ్ళూలేరు పోండ్రి" అనేసి తనదారిన తను వెళ్ళిపోయాడు.

 

    అందరం అతనిని మళ్ళీ చుట్టుముట్టి బ్రతిమాలాం అసలు విషయమంతా చెపుతూ.

 

    చాలాసేపటి తర్వాత కన్విన్స్ అయాడతను.

 

    "మీరెవళ్ళూ పైసల్దినటం లేదని నాకు భరోసున్నదివయ్యా! కానీ ఈ ఊరోండ్లు మాత్రం ఇనరు. ఆళ్ళువచ్చి మీరు చెప్పెడిది ఇనాన్లంటే ఒక్కటే రాస్తా ఉన్నది."

 

    "ఏమిటది?" ఆత్రుతగా అడిగాడు శాయిరామ్.  

 

    "మీతోని కలసి ఈడకొచ్చిన ఈ పోరిలున్నయ్ గదా! ఆళ్ళను డాన్స్ చేయమను! బరాబర్ వస్తారందరూ!"

 

    ఆమాట వింటూనే పార్వతీదేవి, రాజేశ్వరి, సావిత్రమ్మ ముగ్గురూ వులిక్కిపడ్డారు.

 

    "ఏమిటి? మేము డాన్స్ జేయాలా? ఏం పిచ్చిపిచ్చిగా ఉందా? మేమెట్లా కనబడుతున్నాం నీకు?" అంటూ అతనిమీద విరుచుకుపడేసరికి సర్పంచ్ కంగారుపడి పోయాడు.

 

    "గట్ల గరమౌతారేందమ్మా! సోషల్ సర్వీస్ అంటున్రు గదా డాన్సులు చేస్తారనుకొని దాన్ని గురించ చెప్పిన! ఇష్టం లేకుంటే జేయకండ్రి! మీ మీటింగ్ కి పబ్లిక్ గావాల్నన్నారని అయిడియా జెప్పినా!"

 

    మేము మాట్లాడుతూండగానే చాలామంది ఊరోళ్ళు నెత్తిన కూరగాయల బుట్టలతోనూ, పాలడబ్బాలతోనూ, బస్ స్టాండ్ దగ్గరకు వెళుతూ కనిపించారు.

 

    మేమూ వాళ్ళదగ్గరకు చేరుకుని మా ప్రచారం ప్రారంభించాం.

 

    "ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారూ ప్రభుత్వమూ మీమీద జాలితోనే, మీరు ప్రమాదాలకు గురి కాకూడదనే మీకు మనవి చేస్తోంది. కేవలం ఆర్టీసీ బస్ ల్లోనే ప్రయాణం చేయండి. మీ ప్రాణాలను కాపాడుకోండి."

 

    వాళ్ళందరూ మొఖాలు చూసుకున్నారు.

 

    "ఆర్టీసీవాళ్ళు కేవలం మీ కోసమే పాసింజెర్ సర్వీస్ లు నష్టం వస్తోన్నా నడుపుతున్నారు" చెప్పాడు రంగారెడ్డి.

 

    "ఆమాట నిజమేనే! పద్దినాల కిందట పాపం ఇరవై అయిదుమంది మెదక్ డిస్ట్రిక్ట్ ల లారీ ప్రమాదం జరిగి ఖతమయిపోయిన్రు!" అన్నాడొక ఊరతను మా మాటలు సపోర్టుచేస్తూ.

 

    ఆ మాటతో మాకు చాలా బలం వచ్చినట్లయింది.

 

    వెంటనే లారీలు, లేక ఇతర పైవేట్ వాహనాలమీద ప్రయాణం చేయుట వలన కలిగే నష్టములు అన్న సబ్జెక్ట్ మీద అరగంట చెప్పిందే చెపుతూ ఉపన్యాసం ఇచ్చాడు రంగారెడ్డి.

 

    "నేను సినిమాలో హీరోవేషం వేయడానికి మద్రాసు వెళుతున్నప్పుడుకూడా లారీ యాక్సిడెంట్ లో ఒకడు చనిపోయినట్లు పేపర్లో చూశాను" అన్నాడు జనార్ధన్.

 

    ఆమాట అనటంతోనే కొంతమంది జనార్థన్ చుట్టూ మూగారు.

 

    "ఏ సిన్మాలో ఏసినావు నువ్వు?" అడిగాడో స్టూడెంట్.

 

    జనార్ధన్ జవాబు చెప్పకుండా సిగరెట్ వెలిగించుకుంటూ సినిమా హీరోలా ఆ పక్కనేవున్న చెట్టుమీద చేయివేసి వెనక్కు తిరిగి చూశాడు.

 

    "ఒకటేమిటి? ఆరు సినిమాలు!" అన్నాడు చాలా నిర్లక్ష్యంగా.

 

    ఈలోగా ఓ ఇసుకలారీ పెద్దగా హారన్ కొట్టుకుంటూ వచ్చి ఆగింది.

 

    మరుక్షణం అందరూ బుట్టలతో, పాలడబ్బాలతో ఎగబడి లారీ ఎక్కసాగారు. మాకు మతిపోయినట్లయింది.

 

    "సోదరులారా! లారీలలో ప్రయాణం చేయకండి! మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు. మా సర్వ్ ప్రకారం లారీలో ప్రయాణించేవారిలో నూటికి పదిహేనుమంది లారీ ప్రమాదాల్లో చనిపోతున్నారు" అన్నాడు శాయిరామ్.

 

    వాళ్ళ మొఖాల్లో మార్పు కనిపించింది.

 

    అది చూసి యాదగిరి వుత్సాహం పుంజుకున్నాడు.

 

    "ఇగో- మీకు తల్లున్నది, నాయనున్నాడు, భార్యున్నది, పిల్లగాండ్లున్నారు. నువు లారీ ప్రమాదంలో చచ్చిపోయినావంటే గీళ్ళందరి గతేం కావాలి? పరిషానౌతరా లేదా? మొన్న యాక్సిడెంట్ ల పోయినోండ్ల సంగతేమాయె? తననికి తిండి గిట్టలేక రోడ్లమీద వడిన్రన్నట్లు- ఎవళ్జూస్తరువయా వాళ్ళను. లారీలోళ్ళు జూస్తరా? గదే నువ్వు ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ ల జచ్చివావనుకో! గవర్నమెంటూకుకుంటదా? ఖామోషుంటదా? బరాబర్ నీవోండ్లకు పైసలిస్తది! మీ పిల్లగాండ్లకు కొలువులిస్తది"  

 

    యాదగిరి స్పీచ్ చాలా పవర్ ఫుల్ గా పనిచేసింది.

 

    రెండు నిమిషాల్లో అందరూ లారీ దిగిపోయి కింద నిలబడ్డారు.

 

    లారీవాడు మావంక కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు.

 

    సరిగ్గా అప్పుడే దూరంగా దుమ్మురేపుకుంటూ వస్తోన్న ఎర్రబస్ కనిపించింది.

 

    "చూసిన్రా! నేను జెప్పలే! ఆర్టీసీవోళ్ళు మీ గురించే మంచిగ బస్ ళు ఏసిన్రని! ఆరామ్ తోటి సీట్ల కూర్చుని శహర్ పోవాలె! బేఫికర్ గుజరాయించాలె!"

 

    అందరూ మావేపు అభినందన పూర్వకంగా చూశారు.

 

    "అవ్ సార్! ఇన్ని దినాలు పాగల్ గాండ్ల లెక్క లారీల్లోనే పోతున్నాం!" అన్నాడొకతను.

 

    అందరం చూస్తుండగానే ఎర్రబస్ కిటకిటలాడుతూ బయటకు వేలాడుతున్న జనంతో ఆగకుండా వెళ్ళిపోయింది.

 

    "రోకో రోకో" అని అరుస్తూ అందరం బస్ వెనుక పరుగెత్తాంగానీ బస్ ఆగలేదు. మాకు కోపం కూడా ఆగలేదు.

 

    "యాదిగిరీ నెంబర్ నోట్ చేసుకో! ఆర్టీసీ ఎమ్ డీ గారికి చెపుదాం ఈ బస్ సంగతి!" అన్నాడు రంగారెడ్డి ఆవేశంగా.

 Previous Page Next Page