Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 8


    "నీకో విషయం తెలుసా? ఇంతకు ముందే మా ఫ్రెండ్ లక్ష్మణరావు స్కూటర్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయి - హాస్పిటల్లో చేరాడట ! నా బెస్ట్ ఫ్రెండతను. అయినా నేను వెళ్ళానా ?  లేదు ! ఎందుకని ?" అంటూ మళ్ళీ కిటికీ బయటనుండి ఎవరయినా మాట్లాడతారేమోనని ఎగిరి దూకి బయటకు చూశాడు.

    అక్కడి నుంచీ జవాబు రాలేదీసారి ! దాంతో గర్వంగా వెనక్కు తిరిగి మళ్ళీ సీట్లో కొచ్చికూర్చున్నాడు.

    అప్పుడు వినిపించింది కిటికీ బయట గొంతు.

    "ఎందుకంటే నువ్వుట్టి వెధవ్వి కాబట్టి."

    రామలింగం ఈసారి ఎగిరి దూకలేదు. అతని దృష్టి అప్పుడే గదిలో కొచ్చిన మురళీ మీద పడింది.

    "సార్ ! అర్జంటుగా మా బంధువులింటి కెళ్ళాలి."

    రామలింగానికి అర్ధమయ్యింది. ఇవాళ ఈ గాంగ్ అంతా కలిసి తనను మస్కా కొట్టి రాత్రంతా రోడ్ల వెంబడి తిరుగుదామని ప్లాన్ వేసుకున్నారు. కానీ రాత్రంతా రోడ్ల వెంబడి తిరుగుదామని ప్లాన్ వేసుకున్నారు. కానీ తననా వీళ్ళు మోసగించేది ! ఇలాంటి వాళ్ళను తన సర్వీసులో చాలా మందిని చూశాడు.

    "అలాగా ! నేనూ అర్జంటుగా మా బంధువులింటికెళ్ళాల్సి ఉందోయ్." అన్నాడు చిరునవ్వు నటిస్తూ.

    "ఎందుకండీ ?" వినయంగా అడిగాడు మురళి.

    "నువ్వెందుకు మీ వాళ్ళింటికి వెళ్ళాలనుకుంటున్నావో, నేనూ అందుకే." వెక్కిరింపుగా అన్నాడు రామలింగం.

    "అంటే మీ చెల్లెలుగారు కూడా ఎవరితోనయినా లేచిపోయారా సార్ ?" ఇంకా వినయంగా అడిగాడు చిరంజీవి.

    రామలింగం అదిరిపడ్డాడు.

    "ఏమిటి కూశావ్ ?"

    "అవున్సార్ ! నేనెందుకు వెళుతున్నానో మీరూ అందుకే వెళుతున్నానన్నారు కదా ? మా చెల్లులు ఎవడితోనో లేచిపోయిందని మావాళ్ళు కబురు చేశారు. మరి మీ చెల్లెలూ ఎవడితోనో లేచిపోయిందనేగా అర్ధం ?

    రామలింగం నోట మాట రాలేదు. తను ఇంత కాలం నుంచీ ప్రయోగిస్తున్న ఈ అద్భుతమయిన టెక్నిక్ - ఇప్పుడింత ఘోరంగా ఫెయిలయిపోవడం చాలా బాధగా వుంది.

    "డోంటాక్ నాన్సెన్స్" అన్నాడు గట్టిగా  అరుస్తూ.

    "సరదాగా అన్నారా ? సీరియస్ గా అన్నారా ?" మీదకొస్తూ అన్నాడు మురళి.

    "సీరియస్ గానే అన్నాను. ఏం చేస్తావ్ ?" అన్నాడు రామలింగం మరింత సీరియస్ గా.

    "అయితే సరే ! ఇలాంటి విషయాలు సీరియస్ గా కాకుండా జోకులా మాట్లాడితే మాత్రము డొక్క చీరేస్తాను" అని వెనక్కి తగ్గాడు మురళి.

    దాంతో వళ్ళు మండి "వెళ్ళండి ఇద్దరూ. గెటౌట్" అని అరిచాడు రామలింగం.

    "థాంక్యూ సార్ ! ఇంత తేలిగ్గా మా ఇద్దరికీ పర్మిషనిస్తారనుకోలేదు. మీరు నిజంగా పైకి ఎంత రాయో లోపల అంత మురికి. నో నో - లోపల అంత లిక్విడ్!. వస్తాం సార్!"

    ఆగండి ! మీకు పర్మిషన్ ఇవ్వలేదు. రూములో నుంచి వెళ్ళమని ..."

    "వచ్చేప్పుడు పీచుమిఠాయి తెస్తాం లెండి. టా...టా."

    "ఇదిగో - మర్యాదగా ఆగండి ! నాక్కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా ?"

    "తెలుసు ! కుక్కలా మొరుగుతావ్ ?" అంటూ కిటికీ బయట నుంచి మళ్ళీ గొంతు వినిపించేసరికి రామలింగం మళ్ళీ చిరుతపులిలాగా కిటికీ దగ్గరకు దూకాడు. కానీ క్షణం ఆలస్యం అయింది. ఖాళీ వరంగా వెక్కిరించింది.


                         *    *    *

    "అడిగో అతనేనే" అంది రాధ. గాంగ్ మొత్తం ఆగిపోయింది. మొత్తం ఆరుగురు అమ్మాయిలు.

    ఎదురుగా మురళి నడుచుకుంటూ  వస్తున్నాడు. అవతని వాళ్ళు ఒకరికన్నా ఎక్కువ వుంటే సాధారణంగా ఆడపిల్లల్ని తలెత్తి చూడడు. అదీ గాక ఇప్పుడు అతడు మంచి మూడ్ లో లేడు. అతడి పేరు మీద ఆగంతకుడు పోస్ట్ మాన్ దగ్గిర సంతకం పెట్టి (ముమ్మూర్తులా తనదే) తన మని ఆర్డర్ తీసేసుకున్నాడు.

    తల వంచుకుని నడవటానికి అది కూడా ఒక కారణం.

    "చూస్తావేమిటే" అంది రాజేశ్వరి.

    మిగతా వాళ్ళందరూ జరగబోయే దానికోసం ఎదురు చూస్తున్నట్టు మౌనంగా వున్నారు.

    రాధకు వణుకు పుట్టుకొచ్చింది.

    "అడుగో వచ్చేస్తున్నాడు." అంది శాంత.

    అందరి కళ్ళూ అతని మీదకు మళ్ళినయ్.

    "అతన్ని 'ఏమండీ!' అంటూ పిలు ! దగ్గరకొచ్చాక చెంప చెళ్ళుమనిపించు __" రాధ చెవిలో చెప్పింది జానకి.

    రాధ భయంగా అతనివేపు చూసింది. అతను వాళ్ళు నుంచున్న వరండా దగ్గరగా వచ్చేశాడు.

    "ఊ ?" రాధ భుజం మీద ఒక్క పోటు పొడిచింది శాంత.

    "ఏవండీ !"  అని పిలిచింది రాధ వణుకుతున్న స్వరంతో.

    మురళీ ఠక్కున నిలబడిపోయాడు. ఆ అమ్మాయెవరో పిలుస్తోంది. తననా కాదా అన్న అనుమానం వచ్చింది.

    "మిమ్మల్నే" అంది రాధ మళ్ళీ శ్యామల ఓ పోటు పొడవగానే.

    "మురళీ కేమీ అర్ధం కాలేదు.

    "నన్నా" అంటూ ఆమె వేపు రెండడుగులు వేశాడు.

    అంతే ! ఆమె ఓ అడుగు ముందుకేసి అతని చెంప చెళ్ళుమనిపించింది.

 Previous Page Next Page