"ఏం జాబ్?"
మూలగా వున్న ఎలక్ట్రిక్ గిటార్ దగ్గర కెళ్ళి వాయించటం ప్రారంభించాడతను.
"ఎమ్మే సోషియాలజీ చదివి గిటార్ వాయిస్తున్నావా?"
డార్క్ డెవిల్ ప్లే చేయటం ఆపేశాడు. విస్కీ బాటిల్ తీసుకుని రెండు గ్లాసుల్లో పోశాడు.
"మాన్ ఈజే సోషల్ యానిమల్! ఎవడీ మాటండి? అరిస్టాటిల్ గాడు - నాకేక్కడయినా కనిపించనీ మర్డర్ చేసేది ఖాయం."
"ఎందుకు?"
"యానిమల్ ని అలా అవమానాపరిచినందుకు మందు కొడతావా?"
"అకేషన్ లేందే కొట్టను"
డార్క్ డెవిల్ త్వరత్వగా ఆలోచించాడు.
"మనం చాలా రోజుల తరువాత కలుసుకున్నాం."
"అయితే ఓ.కే....." గ్లాసు తీసుకున్నాడు. "నీకెలా అలవాటయిపోయిందిది?"
"ఒకరోజు త్రీ ఎసేస్ లో క్యాబరే షోకి - గిటార్ వాయిస్తుంటే - అద్భుతంగా వుందని ఒకడు యాభయ్ నోటు విసిరాడు నా మీద ,తీరా చూస్తే వాడు లలిత్ గాడు. వాడి గాళ్ ఫ్రెండ్ తో వచ్చాడు."
"లలిత్ అంటే మనిద్దరం పరీక్షల్లో వాడికి కాపీలందించాం.'
"ఎగ్జాట్లీ! వాళ్ళ ఫాదర్ ఏం.పీ. కదా! అందుకని ఐ.ఏ.ఎస్ కి సెలక్టయ్యాడు. వాడితో ఫైటింగ్ చేసినప్పుడు తగిలిందిది " దెబ్బ చూపుతూ అన్నాడు.
"పైటింగ్ చేశావా?"
"అవును"
"ఎందుకు ?"
"కాన్ ప్లిక్ట్ ఈజే కాంషస్ యాక్షన్!
కాన్ ప్లిక్ట్ ఈజే పర్సనల్ యాక్టీవిటీ!
"కాన్ ప్లిక్ట్ లాక్స్ కంటున్యుటీ!
"కాన్ ప్లిక్ట్ ఈజ్ యూనివర్సల్!
బాస్టర్డ్! పలకరిస్తే నేనెవరో తెలీదు పొమ్మన్నాడు. ఒకే ఒక్క గుద్దుతో వెళ్ళి మిలటరీ మేజర్ భార్య వళ్ళో పడ్డాడు. పావుగంట సేపు పైటింగ్ చేశాం. ఆఖర్లో - బాస్టర్డ్! మిగిలిన బాటిల్ తీసుకుని ముఖం మీద కొట్టాడు."
బయట వ్యాన్ ఆగిన చప్పుడయింది. ఇద్దరు యువకులు దిగి గదిలో కొచ్చారు.
"కమింగ్ బాస్! కమింగ్" అన్నాడు డార్క్ డెవిల్. వాళ్ళు ఎలక్ట్రిక్ గిటార్ తీసుకెళ్ళి వ్యాన్ లో పెట్టారు.
డార్క్ డెవిల్ ముఖం కడుక్కుని తల దువ్వుకున్నాడు.
"మ్యారేజ్ లో ప్రోగ్రాం ఇవ్వాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు?"
"నీ యిష్టం"
"ఎల్లుండి రా......! డేబనీర్ బార్ లో వుంటాను. రాత్రి పన్నెండు లోపల ఎప్పుడయినా సరే...."
గదికి తాళం వేసి వెళ్ళి వ్యాన్ లో కూర్చున్నాడు. లోపల యింకా బోలెడు మంది డార్క్ డెవిల్స్ వున్నారు.
"మరిచిపోయాను. మొన్న నీ పక్కనున్న పిల్ల టేర్రఫిక్ షేప్! వదిలెయ్యకు. సోషియాలజీలో ఏమన్నాడు! ఇటీజ్ కల్చర్ దట్ మేక్స్ ది హ్యూమన్ ఏ యానిమల్ మాన్! ఆ పిల్ల వండరపుల్ కల్చర్!"
చొరస్తా దగ్గరకు చేరుకున్నాడు సురేష్. జనం ప్రవహించడం ప్రారంభమైంది. అన్ని వైపులా నుంచి అన్ని వైపులకు కలగా పులగంగా కొన్ని వేల శబ్దాలు, స్వరాలూ, కొన్ని వేల శబ్దాల్ని, స్వరాల్ని ఖండిస్తూ.
"వాడిని మర్డర్ చేస్తాను చూడు......"
"సైకిల్ చైన్ వూడిపోయింది"
"మన మీద మా వారికి అనుమానంగా వుంది."
"పెన్సిలిన్ రియాక్షన్ యిచ్చిందట పాపం......"
వాటిల్లో నుంచి బయటపడి "30-24-28" అనుకున్నాడతను.
తులసి, దీప దగ్గరికి వచ్చారు.
"ఎంతసేపయింది వచ్చి?" అలసిపోయిన కళ్ళతో మరింత అందముగా మరింత సెక్సీగా వుంది తులసి.
"ఇప్పుడే"
దీప సురేష్ వైపు చూడకుండా వుండడానికి ప్రయత్నిస్తోంది.
"దీపాజీ! ఎలా వుంది?"
"ఏమిటలా వుంది?"
"అదివరక్కూ, ఇప్పటికి తేడా?"
ఆమె ముఖం ఎర్రబడింది.
"నేను వెళుతున్నాను" చరచరా నడిచింది.
"పద వెళ్దాం"
బస్ స్టాప్ కిటకిటలాడిపోతోంది.
"మా బాస్ కి మన సంగతి తెలిసిపోయింది...." నెమ్మదిగా అంది తులసి.
"వాడు నీకు చేస్టిజీ బెల్ట్ కట్టినట్లు గుర్తులేదే......"
అతని చేతిమీద గట్టిగా గిల్లిందామె.
"మాకో - టైపిస్ట్ రమీలా చెప్పిందట. మనం రోజూ యిక్కడ కలుసుకోవటం చూస్తోంది కదా! జెలసీ...."
"అయితే రేపట్నుంచీ ఒకరోజు నువ్వూ, ఒకరోజు రమీలా."
బస్ వచ్చింది.
కండక్టర్ సురేష్ ని గుర్తుపట్టాడు.
"అడ టిక్కేట్లా? మగ టిక్కేట్లా?"
"ఆడే......"
ఇంటికి చేరుకొని లోపలికి అడుగు పెడుతోంటే గంగాభవాని వచ్చి గడప దగ్గర నిలబడింది. "మీ కోసం ఎవరో వచ్చారు. " పక్కకి తప్పుకుంటూ అంది "మీరు వస్తారు వుండమని చెప్పి కూర్చోబెట్టాను."
సురేష్ నవ్వాడు.
"మీ ఋణం వుంచుకొను. ఏదొక రోజు తీర్చేస్తాను. ఏదో ఒక విధంగా......."
ముసలాయన లోపలికొచ్చాడు.
అతని మాట ఆగిపోయింది. ముఖం రంగు మారిపోయింది.
"రెండు రోజుల్నుంచి వెతుకుతుంటే ఇప్పటికి దొరికింది ఇల్లు" అన్నాడతను. తులసి సురేష్ వైపు చూస్తోంది వివరాల కోసం.
గంగాభవానీ విజయగర్వంతో కసిగా, తృప్తిగా చూస్తోంది.
"నువ్విలాంటి నీచమయిన పని చేస్తావనుకోలేదు ....." ముసలాయన కోపంగా అన్నాడు.
"ఆ గది మా యిద్దరికీ చాలదు. అందుకని ఖాళీ చేశాను." అన్నాడు సురేష్.
"ఖాళీ చేయలేదు. అర్ధరాత్రి పారిపోయావు! ఆరు నెలల అద్దె ఎగ్గొట్టి."
"నాతొ పాటు ఆ గదిలో వున్న మిగతావాళ్ళ దగ్గర వసూలు చేసుకో నాకేం సంబంధం లేదు."
"మిగతా వాళ్ళెవరు?" ఆశ్చర్యంగా అడిగాడు.
"దోమలు. నల్లులు, ఎలుకలు, ఈగలు, పిల్లులూ, గబ్బిలాయిలూ వీటన్నిటినీ నేనా రూమ్ లో దిగక ముందునుంచే వుంచావు."
"మర్యాదగా నా బాకీ తీరుస్తావా లేదా?"
"మరి ఆ పశు పక్షాదుల సంగతేమిటి......? వాటిక్కుడా , నేనెందుకు కట్టాలి?"
తులసి కల్పించుకుంది.
"ఎంత కట్టాలి మీకు?"
"మూడొందల అరవై"
"నెలక్కొంత చొప్పున తీసుకోటానికి వప్పుకున్నట్లయితే నేను కడతాను."
"వద్దు తులసీ! నాకు ఉద్యోగం రాగానే నేను కడతాను."
ముసలతను తల అడ్డంగా వూపాడు. "వద్దు! ఆమెనే కట్టనీ....."
"ఎందుకని?"
"నీకు ఉద్యోగం రాదు"
గంగాభవానీ నవ్వింది గట్టిగా సురేష్ వినేట్లు. ఆమె సంగతి చూడాలి ముందు.
"తులసి కూడా ఇద్దరికీ ఒకేసారి కట్టలేదు. ఒక నెల గంగాభవానీ గారికి , ఒక నెల మీకూ కడుతుంది."
గంగాభవానీ నవ్వు ఆగిపోయింది.
"మా అద్దె ఆపటానికి వీల్లేదు" అంది కఠినంగా.
"అయితే ఆ విషయం మీ ఇద్దరూ తేల్చుకుని మాతో చెప్పండి. తులసి జీతంతో మాత్రం నెలకు కొంత మొత్తం ఒకరికే కట్టడానికి సాధ్యమవుతుంది."
గంగాభవానికి ఉక్రోషం వచ్చింది.
"అలా అయితే ఇల్లు ఖాళీ చేయండి."
తులసి ఆమెను చూసి నవ్వింది.
"సురేష్ సంగతి మీకు తెలీదా?"
సురేష్ నవ్వాడు. "ఇంకా నేను పూర్తిగా చెప్పందే."
గంగాభవాని శాంతించింది.
"నన్నెప్పుడు రమ్మంటారు మళ్ళీ?" అడిగారు ముసలాయన.
'అయిదారు నెలల తర్వాత వస్తే మొత్తం ఒకేసారి తీరిపోతుంది" అన్నాడు సురేష్.
"ఎలా?"
"ఈలోపల మీరేగిరిపోతారని గట్టి నమ్మకం నాకు."
"ఫస్ట్ తారీఖు సాయంత్రం రండి' అంది తులసి.
అతను వెళ్ళిపోయాడు.
'ఇలాంటి మనిషిని ఎన్నుకుని పొరపాటు చేశారు మీరు" అంది గంగాభవాని తులసితో.
"మార్కెట్లో వున్నవాటిల్లో యిదే బెస్ట్ శాంపుల్ అనిపించింది" నవ్వుతూ అంది తులసితో."
"కావాలంటే మీరూ ప్రయత్నించండి" అన్నాడు సురేష్.
గంగాభవాని కోపంగా వెళ్ళిపోయింది.