అక్కడ జరుగుతున్న హడావిడికి బొచ్చుకుక్కపిల్ల స్క్వీకీ బెదిరిపోయి, పరుగిడిపోతున్న హంతకుడికీ, అతన్ని వెంటాడుతున్న వినీలకి దారి ఇస్తున్నట్టు ఒకమూల దాక్కుని వాళ్ళిద్దరూ తనని దాటిపోగానే వాళ్ళవెంట తనూ పరుగిడటం మొదలుపెట్టింది.
నాలుగేసి మెట్లు ఒక్కసారిగా దిగుతూ క్షణాల్లో గ్రౌండ్ ప్లోర్ చేరుకున్నాడు హంతకుడు. ఎంట్రన్స్ దగ్గరే ఒక నలుపు కారు ఆగి వుంది దానిలో కూర్చుని కారు స్టార్టు చేశాడు. ముందుకి దూకినట్లు పరుగెత్తింది కారు.
వినీలది వైట్ మారుతీ డీలక్స్ కారు అక్కడే వుంది దాన్నింకా గ్యారేజ్ లో పెట్టలేదు తను.
ముందూ వెనుకా ఆలోచించకుండా మారుతీలో కూర్చుని దాన్ని ముందుకు ఉరికించింది వినీల
స్పీడందుకుంది మారుతీ. హంతకుడి కారుని తరమడం మొదలుపెట్టింది.
టర్కీ, రోమ్. కలకత్తా నగరాలలో ట్రాఫిక్ మహా గందరగోళంగా వుంటుందని ప్రసిద్ధి ట్రాఫిక్ కి సంబంధించినంతవరకూ ఆ మహానగరాల కోవలోకి చేరుతున్నది హైదరాబాద్. మనుషులు, పశువులు, మోటారు వాహనాలు. సైకిళ్ళు, తోపుడుబళ్ళు విచక్షణా రహితంగా, విచ్చలవిడిగా విహరిస్తున్నట్టు కనబడుతున్న ఆ ట్రాఫిక్ లోంచి ఎక్స్ పర్టులా కారు నడుపుతూ పోతున్నాడు హంతకుడు:
భూమిమీదే విమానం కడుపుతోన్నంత వేగంగా పోనిస్తోంది పైలెట్ వినీల.
కొద్దినిమిషాల్లోనే బొంబాయి రోడ్ ఎక్కింది హంతకుడి కారు. అరగంట తర్వాత కుడిచేతివైపుకి మళ్ళి తర్వాత ఎడమచేతివైపుకి మళ్ళి ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ని సమీపించింది.
ఆ రోడ్ లో అనేకానేకమైన ఫ్యాక్టరీలు వున్నాయి. ఫ్యాక్టరీల తాలూకు షెడ్లు పొగగొట్టాలు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. ఆ కాంపౌండ్ వాల్ లో ఉన్న భవంతి కూడా దూరం నుండి చూడటానికి ఒక కంపెనీలానే వుంది. కానీ కాదు. అదొక నివాస భవనం.
అక్కడ మలుపు తిరిగింది హంతకుడి కారు.
సరిగ్గా పదిహేను సెకండ్ల తర్వాత అక్కడికి చేరుకుంది వినీల నడుపుతున్న మారుతీ కారు ఆమె మొహంలో ఆశ్చర్యం కనబడింది.
అక్కడ మలుపు తిరిగిన కారు కనబడటంలేదు.
అదృశ్యమైపోయింది.
ఎలా? ఎలా మాయమైపోయింది అది?
విస్మయంగా అటూ ఇటూ చూసింది వినీల
మామూలుగా ఇళ్ళకి వుండే గేట్ లకి మూడింతలు ఎత్తుగా వుంది ఆ ఇంటి గేటు.
గేటుకి లోపల ఒకడూ, బయట ఒకడుగా గార్డులు నిల్చునున్నారు. యూనిఫారంలో ఉన్నారు ఇరువురూ. బెల్టులలో రివాల్వర్లున్నాయి. కాంపౌండ్ వాల్ లోపల ఒక మూలగా పెద్ద పొగగొట్టంలా కనబడుతున్న వాచ్ టవరు వుంది దానిమీదకూడా ఒకడు సాయుధులైన గార్డ్ వున్నాడు.
గేట్ కిపక్కగా "బాబూ రాజేంద్రప్రసాద్" అని తళతళ మెరుస్తున్న ఇత్తడి అక్షరాలు అమర్చి వున్నాయి: బాబూ రాజేంద్రప్రసాద్ అంటే ఇండియాలోని అతిపెద్ద పారిశ్రామిక వేత్తలుపదిమందిలో ఒకడు అని తెలుసు వినీలకి.
అపారమైన ధనంతోపాటు, అపారమైన ఇన్ ఫ్లుయెన్స్ కూడా వుందతనికి.
బయట నిలబడి వున్న గార్డు వినీలవైపు తీక్షణంగా చూస్తున్నాడు.
"ఒక నల్లకారు ఇటు వచ్చింది చూశావా? ఎటు వెళ్ళింది?" అంది వినీల.
"ఇటువైపు కార్లేమీ రాలేదు" అన్నాడతను రూడ్ గా.
"కొద్ది సెకండ్ల క్రితం ఇటు వచ్చిందది. నేను దాన్ని తరుముకుంటూ వచ్చాను. ఇక్కడ ఈ ఇల్లు తప్ప మరేమీ లేదు. అంతా ఖాళీస్థలం. కారు ఈ ఇంట్లోకే వెళ్ళి వుండాలి"
గార్డు ఆమె వైపు నిర్లక్ష్యంగా చూసి, జవాబు చెప్పడం కూడా అనవసరం అన్నట్టు నిలబడ్డాడు.
"నేను ఓసారి లోపలికెళ్ళి చూడాలి" అంది వినీల.
కిమిన్నాస్తిగా వూరుకున్నాడు గార్డు
గేటు దగ్గరకి నడిచింది వినీల.
గార్డు మొరటుగా ఆమె చెయ్యిపట్టుకొని ఆపేశాడు.
"వదులు" అని ఆడపులిలా పెనుగులాడింది వినీల. వినీలను బలంగా నెట్టేశాడు గార్డు.
వినీలను బలంగా నెట్టేశాడు గార్డు.
అప్పుడు వినబడింది మేఘం గర్జిస్తున్నట్లు ఒక కంఠం.
"బహదూర్: ఆ పిల్లతో ఏమిటా మోటుప్రవర్తన ? ఆమెని లోపలికి రానియ్:"
తలఎత్తి చూసింది వినీల. బంగళా బాల్కనీలో నిలబడివున్నాడు ఒక పెద్దమనిషి.
వెంటనే వినీలని వదిలేసి, వినయంగా గేటు తెరిచాడు గార్డు. రెండో గార్డు మరింత వినయంగా ఆమెకి దారి చూపిస్తూ లోపలికి తీసుకెళ్ళాడు.