Previous Page Next Page 
అశ్వభారతం పేజి 8


    "చాలా చిత్రంగా వుంది....అంతా నాకు...." అనురాగ్ ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.

    "ప్రస్తుతం నా బిజినెస్ దాన్ని వెతికి పట్టుకోవడమే"

    "మీ బాస్ ఎవరు?" అనురాగ్ అడిగాడు.

    "వృత్తి రహస్యం...."

    "మరి చాలా చెప్పారే...."

    "నీమీద నమ్మకం_ దాచుకోలేని దుర్బలత్వం."

    "పోనీ ఆ మరోవ్యక్తి ఎవరు...."

    "మనుష్యుల ప్రాణాలతోనూ, డబ్బుతోనూ ఆడుకునే ఇద్దరు కోటీశ్వరుల మధ్య ఈ సంవత్సరాంతంలో కొన్ని పోటీలు జరగబోతున్నాయి. ఆ పోటీ వాళ్ళకో సరదా. ఆ సరదా ఒక మనీగేమ్, ఒక డెత్ గేమ్, ఆ గేమ్ లో నేనూ పావునే నీవు కావచ్చు. ఎందుకంటే ఆ ఫోటో తీసింది నీవేగనుక. జాగ్రత్తగా వుండు.

    "ఆ డెత్ గేమ్ లో భాగంగా మోతీని ఒక వర్గం హత్య చేస్తే, అదే ఫోటోని, అదే వివరాల్ని సంపాదించటం కోసం ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు దివ్యతేజను ఇంకో వర్గం హత్యచేసింది. ఆ వర్గం మనిషిని నేనే. నేనతన్ని హత్య చేయబోలేదు, నా ఎటాక్ కి అతను చావడు, కానీ నేను వచ్చాక అవతల వర్గం మనుష్యులు హత్య చేసుంటారని నా అనుమానం. ఆ చావు నా మీదకు ఎవర్ని ఉసిగొల్పుతుందో చెప్పలేను. హత్యలకు దూరంగా పనులు చేసుకోవడం నా అభిమతం. కానీ ఏం చేయగలం! అయితే తీగ కదిలింది డొంక కదలడం ప్రారంభమైంది. అసలు ఫోటో తీసిందెవరన్న తొలిప్రశ్న రెయిజ్ అవుతుంది. అప్పుడు ఇక టార్గెట్ నీవే...." చెప్పడం ఆపాడు సుదర్శన్.

    ఎందుకో చాలాసేపట్నుంచి సుదర్శన్ మొహంలో దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. పదేపదే తనవేపే చూట్టం కూడా గమనించక పోలేదు అనురాగ్, ఆ చూపుల్లో ఏదో భావం__ప్రత్యేకంగా ఇదీ అని వ్యక్తీ కరించలేని ఆత్మీయతా భావం.

    "మరి నేను వెళ్ళొస్తాను...." సుదర్శన్ లేచాడు. అనురాగ్ కూడా లేచాడు. అంతకు ముందులా డబ్బువేపు చూడలేదు.

    "ఇవన్నీ రహస్యాలు....మీతో ఎందుకు చెబుతున్నానంటే...." ఒక క్షణం గొంతుకేదో అడ్డుపడ్డట్టు ఆగిపోయాడు.

    దగ్గరగా వచ్చాడు అనురాగ్ భుజంమీద చేయివేసి ఆప్యాయంగా నిమిరాడు. ఒక క్షణం మౌనంగా వుండిపోయి ఆ తరువాత అన్నాడు. "నాకు నీలాంటి తమ్ముడే ఒకడున్నాడు....అచ్చం నీలా....కాని అవిటి వాడు. ఎలా అయ్యాడో తెలుసా? మా నాన్న బాధ్యత లేకుండా గుర్రపు పందేలు ఆడేవాడు వ్యసనపరుడికి కొడుకు గురించే పట్టదు. వాడు అవిటివాడుగా, నేనిలా.... వాడ్ని, ఓ చెల్లెల్ని__తల్లిని, మొగుడు వదిలేసిన అక్కను పోషించేందుకు తయారయ్యాను. దేన్నైతే అసహ్యించుకుంటున్నానో అందులోనే నేనో క్రిమినల్ టాస్ ని. అదే జీవితం...." లేచాడు సుదర్శన్.

    బ్రీఫ్ కేసు చేతిలోకి తీసుకున్నాడు. మౌనంగా రెండడుగులు వేసాడు. వెనుతిరిగి అన్నాడు. "నీవు బ్రతకాలి.... ఎందుకో తెలుసా. నడవలేని నా తమ్ముడి గురించి, వాడు నడుస్తున్నట్లుగా భ్రమించేదానికి నీ నడక ఒక తృప్తినిస్తుంది గనుక. నీకు వీలైతే నన్ను నీ అన్నలా భావించు. ఓసారి మా ఇంటికి రాగలవా....? ఇదిగో నా ఇంటి అడ్రస్సు. కరుడుగట్టిన నాకు నిన్ను ఎలా అడగాలో అభ్యర్ధించాలో తెలియదు. ఈ యాభై వేలు ఉంచుకో__నీవిచ్చిన వివరాల కోసం గాదు. అన్నగా నీకు నా బహుమానం.... క్రిమినల్ నే అయినా ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. నీ కోసం అబద్ధం చెబుతాను. ఈ యాభై వేలు ఇవ్వబట్టే అతను వివరాలందించాడని చెబుతాను. ఆ గుర్రం ఎక్కడుందో ఒక 20 రోజుల్లో కనుక్కోలేకపోతే నేనుండకపోవచ్చు," అంటూనే గిరుక్కున వెనుదిరిగి దగ్గరగా వచ్చి అనురాగ్ కాళ్ళ ముందు వాలిపోయాడు. అనురాగ్ ప్యాంటుని పైకిలాగి ఆప్యాయంగా అనురాగ్ కాళ్ళను నిమిరాడు.

    ఈ చర్యకు కదలిపోయాడు అనురాగ్. కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. సుదర్శన్ లేచి నిలబడ్డాడు, తడితేరిన కళ్ళు,

    ఎప్పుడూ ఏదో ఫోటో గ్రాఫ్స్ డబ్బు అని వెంపర్లాడే అనురాగ్ కూడా కదిలిపోయాడు.

    ఆ యాభై వేలు తీసుకోవద్దనుకున్నాడు. మరలా ఏదో గుర్తొచ్చి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

    "బ్రతికుంటే మరలా ఎప్పుడయినా కలుద్దాం...." అంటూ వడివడిగా నడిచి చీకట్లో అదృశ్యమైపోయాడు సుదర్శన్.

    అనురాగ్ అలాగే కాటేజ్ ముందు నిలబడిపోయాడు. ఏం జరుగుతోంది....? ఎందుకు జరుగుతోంది? మొదట పరిచయంలోనే సుదర్శన్ ఎందుకు తనను ఆకట్టుకున్నాడు....?

    హాబీకోసం సరదాగా తీసిన ఒక గుర్రం ఫోటో ఇద్దరి వ్యక్తుల హత్యకు ఎందుకు దారితీసింది....? ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయి.

    ప్రేమ, ఆప్యాయత అంటే తెలియని తనకు తొలిసారి ప్రేమంటే తెలిపింది ఆషా. ఆ తన ఆషా తండ్రిని చంపారు, దివ్యతేజను చంపారని తెలియగానే తనలో కల్గిన షాక్ ని బయటపెట్టలేకపోయాడు తను.

    తను ముందుగా ఆషాను కలవాలి....

    అర్దరాత్రి కావటానికి మరికొద్ది నిముషాల ముందే అనురాగ్ ఆ డబ్బు తీసుకుని బయలుదేరాడు.


                               *    *    *


    హైదరాబాద్ మెహదీపట్నం ప్రాంతంలో చిన్న సందులో ఒక రేకుల షెడ్ లో ఉదయం ఐదు గంటలకు ఓ కురువృద్దుడు నిద్రలేచాడు. వయస్సు దాదాపు డెబ్భై వుంటుంది. సన్నగా పీలగా వున్నా దృడంగా వున్నాడు. ఆ వయసులోనూ యువకుడిలా వేగంగా నడవగలడు__అంతే వేగంగా ఆలోచించగలడు.

    బరువుగా లేచే అతని కనురెప్పల క్రింద డేగలాంటి కళ్ళు__ ఎదుటివాడ్ని అంచనా వేయటానికి_ ఆవలించగానే పేగులు లెక్కించేంత వాడిగా__

    అతని జీవిత ధ్యేయం. ఏమిటో ఎవరికీ చెప్పడు_ భార్యకు కూడా చెప్పడు. చాలా ఆలశ్యంగా పుట్టిన ముద్దుల కూతురు త్రివేణికి కూడా.

    కుటుంబ ఖర్చులకు డబ్బు ఎలా సంపాదిస్తాడో కూడా ఎవరికీ తెలియదు....తను ఎవరి దగ్గర చనువు తీసుకోడు- తన దగ్గర కూడా ఎవర్నీ తీసుకోనివ్వడు.

    పెరిగిన తెల్లటిగెడ్డంపై వేళ్ళు వేసుకుని నిమురుకుంటూ ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లుగా కనిపిస్తాడు.

    వీటన్నిటి మధ్య కూడా అతనేదో లక్ష్యంకోసమే బ్రతుకుతున్న ఫీలింగ్__ఇది కేవలం త్రివేణికి మాత్రమే అదే లక్ష్యమో తెలుసుకోవాలని ప్రయత్నించి విసిగిపోయి అదే తరహ మనస్తత్వాన్ని అలవర్చుకున్న త్రివేణి గాంధీ హాస్పిటల్ లో హౌస్ సర్జన్ గా చేస్తోంది.

    ఎప్పుడో ఎంతో కొంత డబ్బు తెస్తాడు. దానిలో నాల్గవ వంతు మాత్రమే ఇంట్లో ఇస్తాడు. కేవలం 800. మరి 2400 ఏంచేస్తాడో కూడా తెలియదు_ చెప్పడు. మరలా చెడు అలవాట్లేం లేవు. రోజు మొత్తంలో ఓసారి గ్లాసు పాలు, ఓ యాభై గ్రాములు వేరుశనగగింజలు, రెండు చపాతీలు అంతే....

    రోజూలాగే ఐదుగంటలకు నిద్రలేచిన శుక్రాచార్య అరగంటపాటు ఆసనాలు వేసి లాల్చీ, పైజామా వేసుకున్నాడు భార్య ఇచ్చిన గ్లాసు పాలు త్రాగాడు.

    ఎదురుగా వచ్చిన కూతుర్ని దగ్గరకు తీసుకొని తలనిమిరి "కేవలం బతకడంకోసం తినకు_ బతకడంకోసం నిద్రపోకు_ ఏదో సాధించడానికి బ్రతుకు. నీకు నేనేం ఆస్తీ ఇవ్వను_ ఇవ్వగలిగినా_ఎలా బ్రతకాలో చెబుతాను_"

    కూతురు గడ్డం పట్టుకుని తలపైకెత్తి నుదుటిమీద ఆప్యాయంగా ముద్దెట్టుకొని చిరుమందహాసం చేసి వదిలేసాడు.

    మరుక్షణంలో రోడ్డుమీద వడివడిగా నడుస్తున్నాడు శుక్రాచార్య.

    అరగంట తర్వాత చేతిలో చెతస్కోప్ పట్టుకొని బస్ స్టాప్ కి బయలుదేరింది త్రివేణి_ పచ్చని మేని ఛాయ, కోలమొహం వెడల్పాటి నుదురు, సంపూర్ణత్వం నింపున్న చూపులు_ ఎప్పుడూ గంభీరంగా ఏదో ఆలోచిస్తూ వైద్యవిజ్ఞానానికి అందని జబ్బులపై ఆలోచనలతో గడుపుతుందేతప్ప వయస్సువల్ల కలిగే వ్యామోహం, కోర్కెలు ఎప్పుడూ ఆమె దరిచేరవు అది జడత్వమా__?

    ప్రిజిడిడా....?

    స్పందనా రాహిత్యమా....!

    అది తన తండ్రి సహచర్యంలో అలవడిందా....?

    ఏమో ఏదీ ఇది ఆని తెలుయదుం.

    కాని తన దృష్టిలో తన తండ్రి ఓ హీరో_ మగాడంటే ఇలానే ఉండాలనే ఓ నిర్దుష్టమైన అభిప్రాయం.

    ఎప్పటికైనా తండ్రి లక్ష్యమేమిటో తెలుసుకోగలిగితే చాలన్న పట్టుదల__

    హాస్పిటల్ లోకి ఎంటర్ అయి రిజిష్టర్ లో సంతకంచేసి తన ప్రియమిత్రురాలైన ఆషాకోసం వాకబు చేసింది. ఆమె షడన్ గా బొంబాయి వెళ్ళిపోయినట్లు తెలిసింది. అన్నిటికీమించి ఆఖరున నిన్న మాటే ఆమెను నిర్ఘాంత పరిచింది.

    ఆషా తండ్రిని ఎవరో హత్యచేశారని....

    త్రివేణి మనస్సు బాధతో మూల్గింది. ఆ ఆలోచనతోనే వార్డ్ లోకి నడిచింది, ఆ వార్డే తన జీవితాన్ని మలుపుతిప్పుతుందని ఆమె ఊహకు అందని విషయం.


                              *    *    *


    ఉదయం ఎనిమిది గంటలు కావస్తోంది. డాక్టర్ నాయర్ క్లినిక్ కి బయలుదేరేందుకు తయారవుతున్నాడు.

    శుక్రాచార్య నడుచుకుంటూనే బంజారాహిల్స్ లో వున్న నాయర్ ఇంటికి వచ్చాడు.

    నాయర్ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు. చాలాకాలం కాలిఫోర్నియాలో క్యాన్సర్ రిసర్చి ఇనిస్టిట్యూట్ లో పనిచేసాడు.

    ప్రపంచంలో వున్న అతికొద్దిమంది ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుల్లో ఒకడు.  

 Previous Page Next Page