"ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంచెమయినా స్వార్ధం చూసుకోకుండా, యంత్రంలాగా ఇంటికోసం కష్టపడుతున్నాను. చివరికి దక్కిన ప్రతిఫలం ఇదీ! సరే! ఇంకమీదట అసలు ఉద్యోగంకోసం ప్రయత్నమే చెయ్యను. గుమ్మం కదలనే కదలను. నా మూలంగా మీ పరువు ప్రతిష్టలెందుకు పాడవాలి?"
తీక్షణంగా వేద అలా అనేసరికి అందరి గుండెలు కొన్ని నిమిషాలు దడదడలాడాయి. నిజానికి ఆ క్షణంలో అందరి మనసులనూ వేధిస్తోంది ఒక్కటే సమస్య. వేద సంపాదన లేకపోతే కుటుంబం ఎలా గడుస్తుందా అన్నది. ఆ బెంగతో కలిగిన చికాకు అందరూ తలో రకంగా బయటకి కక్కారు.
"శక్తి ఉన్నన్ని రోజులూ మీకోసమే యంత్రంలా పాటుపడ్డాను. ఇప్పుడు శక్తి ఉడిగి మంచాన పడ్డాక ఎండిపోయిన పాడిగోవును కసాయి వాడికమ్మినట్లు నన్ను చిత్రవధ చెయ్యండి" ఏడుపొక్కటి తక్కువగా అన్నాడు తండ్రి. మనసు కలతపడినా మొండిగా అక్కడినుంచి వెళ్ళిపోయింది.
రోజులు దొర్లుతున్నాయి. ఆ కుటుంబంలో మొదటిసారిగా అందరికీ ఆకలిబాధ ఏమిటో తెలియసాగింది. ఇదివరలో కనీసం పచ్చడి మెతుకులన్నా ఉండేవి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఖాళీకడుపుతో పడుకోవలసివస్తోంది. కూర ముఖం చూసి చాలారోజులైంది ఇంటిలోవాళ్ళు. ఆకుకూర పులుసులూ, చింతపండు పచ్చళ్ళు ఎక్కువయ్యాయి. అది దొరకటమే మహాభాగ్యమనే దశకు చేరుకున్నారు__అభిమానం చంపుకొని తల్లీ, తండ్రీ, అన్నా ముగ్గురూ మళ్ళీ వేదను ఉద్యోగ ప్రయత్నం చెయ్యమని బ్రతిమాలారు. కానీ వేద మొండికెత్తింది. ఉద్యోగం చెయ్యను, కాక చెయ్యనని ఖచ్చితంగా చెప్పింది-నీరసంతో తల్లికి గుండెజబ్బుకూడా మొదలైంది. తిండికే గతిలేకుండా ఉంటే ఇంకా వైద్యంకూడా ఎక్కడ?
జ్ఞానస్వరూప్ కోపంగా 'మీరంతా ఇలా తిని కూచుంటూంటె, నేనొక్కణ్ణి సంపాదించి పెట్టలేను' అన్నాడు.
వేద శాంతంగా నిశ్చింతగా "పెట్టకు" అంది. మరింత మండిపోయింది అతడికి.
"పెట్టకపోతే ఎక్కడినుంచి వస్తుంది పొట్టకి?" అన్నాడు వెటకారంగా.
వేద తన పెద్ద కళ్ళెత్తి అన్న ముఖంలోకి చూస్తూ "అంతేగద! పొట్టకి లేకపోతే చస్తాను" అంది.
ఆ సమాధానానికి గతుక్కుమన్నాడు అన్న. వెంటనే ఏ సమాధానమూ స్పురించక చికాగ్గా చచ్చేది నేనొక్కడినీ అయితే ఏనాడో చద్దును అన్నాడు. అప్పటికీ చలించలేదు వేద. కోపంగా నేలను తంతూ వెళ్ళిపోయాడు అతడు.
ఆరోజు అమితానందంతో వచ్చి అక్కను కౌగిలించుకొంది గీత- సరియైన తిండిలేక వడలిపోయిన ఆ ముఖంలో వెల్లివిరిసిపోతున్న ఆనందానికి కారణం తెలియక "ఏమిటమ్మా!" అంది వేద__
"నేను ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చానక్కయ్యా."
"కంగ్రాట్యులేషన్స్."
"నేను మెడిసన్ చదువుతాను."
"ఎందుకు? బోలెడు డబ్బు సంపాదించడానికా? ఈరోజుల్లో మెడికల్ గ్రాడ్యుయేట్స్ కి కూడా ఉద్యోగాలు దొరకటంలేదు తెలుసా?"
"అందుకుకాదు. బీదప్రజలకి సేవచేస్తాను."
"అందమయిన ఊహలు! అమాయకమయిన ఊహలు! కానీ, వీటికి వాస్తవానికి ఎంతో దూరం?"
దీర్ఘంగా నిట్టూర్చింది వేద. గీత ముఖంలో వికాసం మంత్రించినట్లు మాయమయింది.
"నేను ఉద్యోగం చేస్తానక్కా! ఇంటర్ కి ఉద్యోగం దొరకదూ? అందులో నేను స్టేట్ ఫస్ట్__"
నిజాయితీతో అడుగుతున్న అందమైన ఆ పసిముఖాన్ని చూసి అదిరిపోయింది వేద. గీత చెక్కిలిపైన చిన్న దెబ్బకొట్టి "తొందరపడకు!" అంది.
ఆ మరునాటినుంచే మళ్ళీ ఉద్యోగప్రయత్నాలు ప్రారంభించింది__
6
ఒక చోట ఇంటర్వ్యూకోసం వెయిట్ చేస్తూండగా కనిపించాడు శ్రీనివాస్.
వేదను చూడగానే ముఖం వికసించగా "హలో! ఏం చేస్తున్నారు? మీకు ఇంకా ఉద్యోగం దొరకలేదన్న మాటేగా. ఎక్కడా కనిపించటం లేదేం?" అన్నాడు గబగబ-వేద నవ్వి "అంటే మీరు నాకోసం చూస్తున్నారా?" అంది.
"ఉద్యోగాల వేటతోపాటే, మీ వేటనూ....ప్చ్! రెండూ ఫలించలేదు. సరే! ఇప్పుడు చెప్పండి ఎక్కడెక్కడ ఉద్యోగాలకోసం ప్రయత్నించారు?"
"ఒక్క ఉద్యోగంకోసం కూడా ప్రయత్నించలేదు."
"అదేం?"
"మావాళ్ళు ఇల్లు కదలద్దొన్నారు?"
"ఓ! అంటే పెళ్ళి చేయాలనుకుంటున్నారన్నమాట! సంబంధం కుదిరిందా?" అదొకమాదిరిగా అడిగాడు. ఫక్కున నవ్వింది వేద__
"ఈ ఇంటర్వ్యూ అయిపోయాక ఎక్కడైనా కూచుని మాట్లాడుకుందాం. అన్నీ చెప్తాను."
"థాంక్యూ! మీ ఇంటర్వ్యూ ముందరయితే, మీరు నాకోసం బస్ స్టాప్ లో వెయిట్ చెయ్యండి. నాది ముందైతే నేను వెయిట్ చేస్తాను."
ఒప్పుకుంది వేద__ఇంటర్వ్యూలో శ్రేనివాస్ పేరుకంటె ముందుగానే వేదను పిలిచారు-ఇంటర్వ్యూ పూర్తికాగానే బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసి, అక్కడి సిమ్మెంట్ అరుగుమీద కూచుంది. గంటతర్వాత కాని శ్రీనివాస్ రాలేదు. "సారీ చాలా ఆలస్యమయిపోయింది. ఈ ఇంటర్వ్యూ భాగవతం మీకు తెలియనిదేముందీ? అడ్డమైన ప్రశ్నలూ అడుగుతారు ఇయ్యదలచుకున్న వాళ్ళకే ఇస్తారు-ఆశ చావక మనం ఈ ఆఫీసుల చుట్టు తిరుగుతూ ఉంటాం?" అన్నాడు శ్రీనివాసు రాగానే.
కంగారుగా రావటంవల్ల కాబోలు, నుదుటికి చెమటపట్టింది. అది రుమాలుతో తుడుచుకుంటూ "ఎక్కడికి వెళదాం?" అన్నాడు.
"ఏదయినా హోటల్ లో కూచుందామా?"
వేదకు తల పగిలిపోతోంది. కాస్త కాఫీ తాగాలని ఉంది. శ్రీనివాస్ జేబు తడుముకుంటూ "హోటల్ చాలా సందడిగా వుంటుంది. మాట్లాడుకోవటానికి బాగుండదు" అన్నాడు. పరిస్థితి వెంటనే అర్ధం చేసుకుంది వేద. "అవునవును, హోటల్ లో ఏమీ మాట్లాడుకోలేము పోనీ ఎక్కడికో ఎందుకు? ఇక్కడే కూచుందాం?" అంది, అతడుకూడా ఆ అరుగుమీదే కూచుని "ఇప్పుడు చెప్పండి" అన్నాడు.
"చెప్పేందుకేం లేదు. మావాళ్ళు నా కారణంగా తమ కుటుంబ ప్రతిష్ట చెడిపోతోందని బాధపడ్డారు. అందుకని ఉద్యోగం చెయ్యననీ, ఇల్లు కదలననీ మొండిపట్టు పట్టాను."
"అదా!" ఆశ్చర్యంతో నోరు తెరిచిన అతనికి వేదను ఎలా ఓదార్చాలో అర్ధంకాలేదు.
"చాలా చిక్కిపోయారు!" అన్నాడు వేదను జాలిగా చూస్తూ....
వేద మాట్లాడలేదు. కటిక ఉపవాసాలున్న రోజులను ఆ సమయంలో గుర్తు తెచ్చుకోవటం ఇష్టం లేకపోయింది. వేద మౌనాన్ని అతడు మరొక రకంగా అర్ధంచేసుకున్నాడు ఉద్రేకంగా.... "బాధపడకండి, అపనిందవల్ల మీ జీవితం నాశనం కానీయను. నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను."
ఫక్కున నవ్వింది వేద, ఎంతటి అమాయకత్వం? పెళ్ళి చెయ్యటానికికాని, చేసుకోవటానికికాని తనవైపునుంచి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇన్నాళ్ళతరువాత తన మొండి పట్టుదల సడలించుకుని తను ఉద్యోగానికి ఎందుకు వచ్చినట్లు?
వేద నవ్వుకు చిన్నబుచ్చుకుంటూ "ఉద్యోగం సద్యోగం లేని నేను పెళ్ళి చేసుకుంటాననటం హాస్యాస్పదంగానే ఉంటుంది లెండి. కానీ, కొంత ఆలస్యంగానైనా నాకు ఉద్యోగం దొరకదంటారా? ఇంతకూ,__అసలు మీకు ఇష్టమైతేనేలెండి! మీలాంటి అందమైన అమ్మాయికి ఎన్నో ఆశలుండవచ్చు" అన్నాడు శ్రీనివాస్.
వేద మృదువుగా "ఈ అమ్మాయికి అనవసరపు పగటి కలలు కనే అలవాటు లేదులెండి."
"నేను నవ్వింది అందుకుకాదు. ప్రస్తుతం నేనున్నా పరిస్థితుల్లో పెళ్ళి మాట చాలా హాస్యాస్పదంగా తోచింది-" అంది.
ఇద్దరూ కబుర్లలో పడ్డారు-వేద బస్ వచ్చినప్పుడల్లా వేద లేవటమూ, శ్రీనివాస్ "కూచోండి!" అనటమూ, శ్రీనివాస్ లేచినప్పుడల్లా వేద "కూచోండి!" అనటమూ, అతడు కూచోవడమూ అలా జరిగింది. అలా ఆ బస్ స్టాపును తమ సంకేత స్థలంగా చేసుకొని, ప్రేమికులు కాలేని ఆ ప్రేమికులిద్దరూ ఎన్నెన్నో కబుర్లు చెప్పుకున్నారు__హాస్యాలాడుకున్నారు__ వెక్కిరించుకున్నారు__చివరకు చీకటి పడుతుండగా దిగులూ, ఆనందమూ కలగా పులగంగా నిండిన గుండెలతో విడిపోయారు. బస్ లో కూచోగానే తలనొప్పి - ప్రారంభమైతే, "ఇందాకటినుంచీ ఇది ఎక్కడికి పోయిందీ?' అనుకుంది వేద- 'కాఫీ-కాఫీ__' అని నరాలన్నీ ఆక్రోశిస్తుంటే, దిగులుగా నిట్టూర్చి కిటికీలోంచి బయటికిచూస్తూ కూచుంది. ఉద్యోగాలవేట-అప్లికేషన్లు- ఇంటర్వ్యూలు - నిరాశానిస్పృహలు....
జయపాల్ ఇండస్ట్రీస్ లో కేవలం స్త్రీలకొరకే కొన్ని ఉద్యోగాలు ప్రకటించబడ్డాయి. వేద వెంటనే అప్లయి చేసింది. అక్కడ రిటెన్ టెస్టు కూడా ఉందని ప్రకటించటంవల్ల సెలక్షన్ మెరిట్ మీద ఆధారపడి వుండవచ్చునని ఆశపడింది. రిటెన్ టెస్టు రాసి బయటకు వచ్చాక "చాలా బాగారాసాను" అంది ఉత్సాహంగా. వేదతోపాటు పరీక్ష రాసిన ఒక అమ్మాయి దిగులుగా నవ్వి "ఈ రిటెన్ టెస్టులన్నీ వట్టి పై పై స్టంట్లు. నిజంగా పని జరగాలంటే, వెళ్ళి జయపాల్ గారిని కలుసుకోవాలి" అంది - ఈ విషయం విని వేద ఆశ్చర్య పడలేదు. అనేక ఉద్యోగాలకు ప్రయత్నం చేసి ఉన్న ఆమెకు ఈ లోపాయికారీ వ్యవహారాలన్నీ తెలుసు. ఐతే ఈ ఉద్యోగానికి "రిటెన్ టెస్టు" ముందు పెట్టడంవల్ల ఇక్కడైనా రికమెండేషన్స్ బాధ తప్పుతుందేమోనని ఆశపడింది. ఆ ఆశ అడియాస అయింది. ఒక గంటసేపు ప్రవేశం కోసం పడిగాపులు పడ్డాక జయపాల్ ఆఫీస్ లోకి ప్రవేశం లభించింది ఆమెకి. మూడు టెలిఫోన్లలో ఒకసారే మాట్లాడుతున్నాడు జయపాల్. అలా మాట్లాడుతూనే ఆమెని కూచోమని సైగచేసాడు. ఆ ఒక్కక్షణంలోనే తనను నఖశిఖపర్యంతం పరీక్షించినట్లు అనిపించింది ఆమెకి. కూచుంది, తనకీ అతనికీ మధ్య చాలా పెద్ద టేబిల్....అంతదూరం నుంచి ఆ టేబిల్ మీదుగానే ఆమెని చూపులతో పరీక్షిస్తున్నాడు జయపాల్. ఒకవంక టెలిఫోన్ లో మాట్లాడుతూనే ఆమె ఉండగానే అక్కడికి ఏదో పనులమీద ఇద్దరు ముగ్గురు వచ్చారు.