Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 7

    అలాంటి వాతావరణంలో శ్రీనివాస్ ఒక్కడే గంజాయి వనంలో తులసిమొక్కలా కనిపించాడు. మిగిలినవాళ్ళలా హాస్యాలాడడు. తననేకాదు ఎవరినీ ఆకలిగా చూడడు. తలవంచుకుని తన పనేదో తను చేసుకుపోతాడు. ఒక పాత సైకిల్ తో తప్ప జీవితంలో మరిదేనితోనూ ప్రమేయంలేదా అన్నట్లు ఉంటాడు.
    ఆరోజు అతను వర్క్ చేసుకొంటూ 'అబ్బా!' అని కణతల నొక్కుకోవటం గమనించింది. అది చాలాసార్లు నొక్కుకొన్నాడు. కళ్ళుకూడా ఎర్రగా ఉన్నాయి. ముఖం వడిలినట్లుగా ఉంది. లేచి అతని సీట్ దగ్గరకు వచ్చి 'తలనొప్పిగా ఉందా?' అని అడిగింది. అతడు తలఎత్తి వేదను ఆశ్చర్యంగా చూసాడు.
    "నా దగ్గర తలనొప్పి మాత్రలున్నాయి కావాలా!"
    "ఇవ్వండి"
    బేగ్ లోంచి రెండు మైక్రోఫైన్ ఆస్ప్రో బిళ్ళలు తీసిఇచ్చింది. వేసుకుని మంచినీళ్ళు తాగాడు.
    "అంత తలనొప్పిగా వున్నప్పుడు సెలవు పెట్టెయ్యకపోయారా?"
    "నాది టెంపరరీ అపాయింట్ మెంట్! ఇంప్రెషన్ పోతుందేమోనని భయం. నాకీ ఉద్యోగం చాలా అవసరం. మా కుటుంబానికి ప్రస్తుతం నా సంపాదనే ఆధారం."
    నిట్టూర్చింది వేద.
    "అదేం?"
    "మనందరి కథలూ ఒకటే అయినందుకు...."
    "పేదవాళ్ళ కథల్లో ఒక కథకు మరొక కథకు పెద్దతేడా ఉండదు."
    తన సీట్ లోకి వచ్చి కూచుంది వేద.
    ఆ సాయంత్రం బస్ స్టాప్ దగ్గర నిలబడిఉన్న వేదని చూసి తన సైకిల్ దిగాడు శ్రీనివాస్. ఎందుకో ఏమాత్రం భయం కలగలేదు వేదకి. అతని చూపులూ, వాలకమూ అలా లేవు.
    "మీరిచ్చిన టాబ్లెట్స్ కి థాంక్స్, నా తలనొప్పి తగ్గిపోయింది."
    "దానిదేముందిలెండి!"
    "మీ బేగ్ లో ఆ టాబ్లెట్స్ అంత రెడీగా ఎలా ఉన్నాయి?"
    "ఉంచుకుంటాను."
    "ఎందుకూ? మీకు తరచు తలనొప్పి వస్తుంటుందా? డాక్టర్ కి చూపించుకోపోయారా?"
    "డాక్టర్ కి చూపించుకోనక్కరలేదు. నాకు తలనొప్పి తరచు ఎందుకు వస్తుందో చెప్పమంటారా?"
    "అభ్యంతరం లేకపోతే చెప్పండి."
    "మానేజర్ చూపులను ఎదుర్కొన్నప్పుడల్లా వస్తుంది. ఆ తరువాత ఈ మాత్రలు మింగిగాని పనిచెయ్యలేను."
    "బ్రూట్!" చీదరించుకుంటూ ఉద్రేకంగా అన్నాడు.
    "మీ ఇల్లు ఇక్కడికి దగ్గిరేనా?" సంభాషణ మార్చాలని అంది. అతడు నవ్వుతూ తన ఇల్లెక్కడో చెప్పాడు. వేద గుండె బాదుకుంటూ "అమ్మయ్యో! అంతదూరమూ సైకిల్ మీద వెళతారా?" అంది.
    "బస్ ఛార్జీలు కలిసొస్తాయని" నవ్వుతూ సైకిలెక్కి వెళ్ళిపోయాడు. ఎలాంటి పరిస్థితుల మధ్యనైనా నవ్వుతూ ఉంటాడు అనుకుంది.
    రెండు నెలలు గడిచాయి. ఆ కాలంలో వేదా, శ్రీనివాస్ ల మధ్య ఒకరినొకరు కలుసుకున్నప్పుడల్లా  చిరునవ్వులు నవ్వుకునే వరకూ పరిచయం పెరిగింది. తోటిగుమాస్తాలు కొందరు వేదతో సరదాగా మాటలు కలపాలని ప్రయత్నించారుకానీ వేద ముభావంగా వుండటంతో ఆ ప్రయత్నం విరమించుకోవలసి వచ్చింది. అలాంటి వేద శ్రీనివాస్ ని చిరునవ్వుతో పలకరించటం వాళ్ళలో అసూయను రేపింది. గుసగుసలు ప్రారంభమయ్యాయి. "ఛీ! చదువుకున్న మొగవాళ్ళు కూడా చదువుకోని అప్పలమ్మలా తయారౌతున్నారు" అని లోలోపల చీదరించుకుంది వేద. ఈ గుసగుసల విషయం శ్రీనివాసుకి తెలుసో తెలియదో కాని అతడెన్నడూ ఆ ప్రస్తానవ వేదముందు తేలేదు.
    ఆరోజు వర్క్ ముగించుకొని ఫైల్స్ సర్దేసి టేబిల్ ముందునుంచి లేవబోతున్నాడు శ్రీనివాస్. అతడి ముందుకొచ్చి నిలబడింది వేద. 'ఏమిటి' అన్నాడు. తన చేతిలో ఉన్న కాగితాల కట్టలు చూపించి "ఇవన్నీ ఇపుడు టైపు చెయ్యమన్నారు బాస్!" అంది. వెనుకటి అనుభవం గుర్తుకొచ్చి నిలువునా వణికిపోయింది.
    "అదేం చాలా ఐపోతున్నారు? ఒంట్లో బాగులేదా?" ఆశ్చర్యంగా అడిగాడు. వేద సమాధానం చెప్పలేకపోయింది.
    "నేను సాయం చెయ్యనా?"
    "ప్లీజ్!"
    వేద చేతిలో వున్న కాగితాలలోంచి సగం తానందుకొని చకచక టైపు చెయ్యసాగాడు శ్రీనివాస్. ఇద్దరూ కలిసి పనిని అరగంటలో పూర్తిచేసారు.
    "బాస్ కి నేనివి ఇచ్చి ఇచ్చేవరకూ ఉండరూ!" ప్రాధేయపడుతున్నట్టుగానే అడిగింది. కాదనలేకపోయాడు శ్రీనివాస్. ఈలోగా మేనేజర్ సెక్షన్ లోకి వచ్చాడు. శ్రీనివాస్ ను చూసి ఆశ్చర్యంగా 'మీరేం చేస్తున్నారు' అన్నాడు.
    "జస్ట్ హెల్ప్__"
    "కానీ మీది ఈ సెక్షన్ కాదే?"
    "కాదులెండి. ఊరికే సాయం చేసాను."
    "ఓహో ఆఫీసుటైం అయిపోయినా ఆఫీసులో కూచుని సాయం చేసేటంత "ఫ్రెండ్స్' అన్నమాట మీరు?" అతడి కంఠంలో మాటలలో  వ్యంగ్యం ఇద్దరికీ అర్ధమయింది. ఇద్దరికీ మనసు కలుక్కుమంది. టైప్ చేసిన కాగితాలు మేనేజరు కప్పగించి ఆఫీసులోంచి బయటపడింది వేద. ఆమెకోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు శ్రీనివాస్. 'పాపం? నా కారణంగా మీరూ మాటలు పడవలసివచ్చింది' అని నొచ్చుకుంటూ.
    "ఫరవాలేదులెండి! మీ ఆరోగ్యం ఎలా ఉంది? అవసరమయితే రేపు సెలవుతీసుకుని ఇంట్లో రెస్టు తీసుకోండి."
    "ఏం ఫరవాలేదు గండం గడిచింది బయటపడ్డాను" అని సంకోచిస్తూనే తన వెనుకటి అనుభవం చెప్పింది.
    "అందుకే ఈరోజు అంతగా భయపడ్డాను. పనికేం? ఇంకా ఇంత పనిచెయ్యగలను."
    "ఛీ! రోజులు ఎలా తయారౌతున్నాయి? డబ్బుతో అధికారం కొనుక్కొని ఆగుప్పెట్లో అందరినీ నలిపెయ్యాలనుకొంటున్నారు కొందరు. ఎందరో, ఎన్ని రకాలుగానో, దురన్యాయాలకె బలైపోతూ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి మగ్గిపోతున్నారు."
    "ఈ ప్రైవేట్ కంపెనీలలో మరీ దారుణం. అడిగేవాడు లేడు."
    "ఎక్కడ చూసినా ఏదో ఒకటి భరింపరాని కుళ్ళుతో లుకలుకలాడిపోతోంది ఈనాటి సమాజం." ఇద్దరూ ఏదో దిగులు నిండిన మనసుతోనే విడిపోయారు.
    వారం తిరగకుండా ఇద్దరికీ వూస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి.
    బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నందుకు, నైతిక విలువలదృష్ట్యా తొలగించవలసి వచ్చిందని సారాంశం.
    ఆ ఆర్డర్స్ చూసుకొని కన్నీళ్ళు నిగ్రహించుకోవటం ఇద్దరికీ చాలా కష్టమైంది. ఆఫీసులో చాలామంది పైకి సానుభూతి మాటలు మాట్లాడుతూ లోలోపల నవ్వుకోవటం స్పష్టంగా తెలుస్తోంది. ఈ సమాజంలో యెదుటివారి కష్టాలను చూసి నవ్వుకొనేవారే ఎక్కువమంది.
    మొదటిసారిగా ఇద్దరూ పార్కులో కూచున్నారు. ఇళ్ళకు వెంటనే వెళ్ళలేక ....
    "మీకు నా పరిస్థితి తెలియదు. ఉద్యోగం పోయిందంటే...." అని ప్రారంభించబోయాడు శ్రీనివాస్. వేద నీరసంగా నవ్వుతూ "తెలియక్కరలేదు, ఊహించగలను. మీరే అన్నారు__పేదవాళ్ళ కథలన్నీ ఒక్కలా ఉంటాయి" అంది.
    ఆ దుఃఖంలో ఇద్దరూ ఒకరికొకరు మరింత సన్నిహితులయ్యారు. అంతటి దుఃఖంలోనూ ఆ సాన్నిహిత్యం కలిగించిన హాయి వారి మనసులకు గిలిగింతలు పెట్టింది.
    వేద తండ్రికి తన ఉద్యోగం పోయిన విషయం చెప్పదలచుకోలేదు. నెమ్మదిగా మరో ఉద్యోగం సంపాదించుకున్నాకే చెప్పాలనుకుంది. కానీ, జ్ఞానస్వరూప్ వేదకు ఉద్యోగము పోయిన విషయమూ, అందుకు కారణమూకూడా చెప్పేశాడు. అన్నగా అతడు చెల్లెలికి అండగా నిలవకపోయినా, చెడిపోయిన చెల్లెల్ని....కాదు....తను చెడిపోయిందనుకొంటూన్న చెల్లెలికి బుద్ధిచెప్పే బాధ్యత మాత్రం స్వీకరించాడు.
    "లోకంలో ఎందరు ఆడపిల్లలు ఉద్యోగాలు చేసుకోవటంలేదూ? అందరూ ఇలాగే ఉన్నారా?" అని ఛీదరించుకున్నాడు. లోకంలో వున్న ఉద్యోగాలు చేసుకుంటున్న ఆడపిల్లలందరి విషయమూ తనకే తెలిసినట్లు.
    "ఇప్పటికే ఎలా పెళ్ళవుతుందా! అని బెంగతో ఛస్తుంటే, ఇక ఇలాంటి తిరుగుళ్ళుకూడా మొదలయితే పెళ్ళెలా ఔతుందీ?" అన్నాడు. అక్కడికి వేద పెళ్ళికోసమే తను ప్రయత్నిస్తున్నట్లు: మనసు మండి అన్నీ వింది వేద.
    మంచంలో ఉన్న తండ్రి తలకొట్టుకుంటూ "ఛీ! ఛీ ఇలాటి అప్రతిష్ట ఇంటావంటా లేదు" అని కంటగించుకున్నాడు.
    "అవును! వయసు మీరుతోన్నా పెళ్ళిచెయ్యకపోతే, ఆడపిల్లలు ఏం చేస్తారు మరీ?" అని సానుభూతి ప్రకటించింది పాతకాలపు తల్లి.
    ఇంక భరించలేకపోయింది వేద. మొదటిసారిగా ఇంటిలో అందరికీ ఎదురు తిరిగింది. 

 Previous Page Next Page