బుట్టని పైకి లాక్కుని, స్క్వీకీని గదిలోదింపి, దానికి బిస్కెట్లు రెండు పెట్టింది వినీల. తర్వాత మళ్ళీ యధాలాపంగా కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది.
ఆ అపార్ట్ మెంట్స్ లో చాలా చిత్రమైన ప్రవృత్తిగల మనుషులు ఉన్నారు. తమాషాగా వుంటాయి వాళ్ళ మాటలూ, చేష్టలూ.
ఒక కిటికీమీద పడింది వినీల దృష్టి. అది వృద్ధ దంపతుల బెడ్ రూము. వాళ్ళిద్దరికీ మూడేళ్ళనుంచి మాటలు లేవుట. వాళ్ళిద్దరూ ఒకే మంచంమీద పడుకున్నారు గానీ వ్యతిరేకమైన దిశలో పడుకున్నారు. భార్య తలపెట్టుకున్న వైపు తన కాళ్ళు పెట్టాడు ముసలాయన. ఆయన తలపెట్టుకున్న వైపు తన కాళ్ళు పెట్టింది ముసలావిడ.
అది చూడగానే ఫక్కున నవ్వొచ్చింది వినీలకి.
ఇంతలో...
అప్పటిదాకా మూసివున్న ఒక కిటికీ తలుపు చటుక్కున తెరుచుకుంది ఆ అపార్ట్ మెంట్ లో కొత్తగా పెళ్ళయిన ఓ జంట వుంటున్నారు.
అలిసిపోయినట్లున్న ఆ కుర్రాడు చుట్టూతా ఓసారి పరికించిచూసి "ఇంకా తెల్లారలేదు" అని భార్యతో చెప్పి మళ్ళీ తలుపులేసుకున్నాడు.
ఆ అమ్మాయి అర్థనగ్నంగా వుంది. అతని వంటిమీద అసలు బట్టలే ఉన్నట్టు లేదు.
నిన్నరాత్రీ, మొన్నరాత్రీ కూడా అలాగే అయింది వాళ్ళకి. వాళ్ళు బెడ్ రూంలో దూరి తలుపులు బిగించుకొని అప్పటికి రెండు రోజులు అయింది.
వినీల చెంపలు కొద్దిగా ఎర్రబడ్డాయి.
చటుక్కున చూపును మరల్చుకుంది వినీల.
అప్పుడామెకి కనబడింది ఆ దృశ్యం.
ఆ ప్లాట్ లో -
ఒక బాచిలర్ గర్ల్ వుంటోంది. ఏదో కంపెనీలో సెక్రటరీగా పని చేస్తోంది తను. ఎప్పుడు చూసినా మహా ఉత్సాహంగా, నవ్వుతూ తుళ్ళుతూ ఉండే ఫన్ లవింగ్ టైపు తను.
ఆరోజు లేట్ గా ఇంటికి వచ్చినట్లుంది ఆ అమ్మాయి ఇంటికి వచ్చీ రాగానే స్టీరియో పెద్ద వాల్యూమ్ తో ఆన్ చేసింది. స్కర్టూ టాపు చకచకా విప్పదీసింది. బలే డాన్స్ చేస్తున్నట్లు ఒక పొడుగాటి కాలుని పైకెత్తి షూ విప్పి పడేసింది. తర్వాత రెండోకాలు ఎత్తి రెండో షూ కూడా తీసి పడేసింది. బ్రా, ప్యాంటీన్ తోనే డాన్స్ చేస్తూ పనులు చేసుకోవటం మొదలు పెట్టింది.
హఠాత్ గా ఆమె వెనుక ఒక మనిషి కనబడ్డాడు.
అతని చేతిలో -
తళుక్కుమని మెరిసింది పదునైన నైఫ్. మరుక్షణంలో ఆ నైఫ్ ఆ అమ్మాయి వీపులో బలంగా దిగబడింది. చావుకేక ఆ అమ్మాయి గొంతులో నుంచి బయటికి రాకుండా ఎడమ చేతితో నోరునొక్కాడతను.
కొయ్యబారిపోయి ఇదంతా చూస్తోంది వినీల.
సరిగ్గా అదేక్షణంలోనే -
ఆ హంతకుడు కూడా తలెత్తి కిటికీలోంచి బయటికి చూశాడు.
అప్రయత్నంగానే ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.
బిగుసుకుపోయింది వినీల.
అతను కలవరపడ్డాడు. తర్వాత ఒక నిశ్చయానికొచ్చినట్లు నైఫ్ ఆ అమ్మాయి శరీరంలోంచి బయటికి లాగి మరో రెండుసార్లు పొడిచి, కత్తితో సహా బయటికి పరుగుదీశాడు.
అప్పటికి స్పృహ వచ్చింది వినీలకి. కర్తవ్యం జ్ఞాపకం వచ్చినట్లు అయింది. ఒక్క అంగలో టెలిఫోన్ ని చేరుకుంది తను. తక్షణం పోలీసులకి ఫోన్ చెయ్యాలి.
రిసీవర్ ఎత్తింది.
ఇంతలో-
గుమ్మందగ్గర అడుగుల చప్పుడు వినబడింది. తలతిప్పి చూసింది వినీల.
తలుపు దగ్గిర నిలబడి వున్నాడు హంతకుడు. తను పొరపాటున డోర్ సరిగా వేసినట్లు లేదు. మరుక్షణంలో అతను భీకరంగా గర్జించి నైఫ్ తోసహా వినీల మీదకి లంఘించాడు.
వినీల మామూలు ఆడపిల్ల కాదు. కరాటే ఎక్స్ పర్టు. అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ఆమె ఒంటికాలిమీద గిర్రున వెనక్కి తిరిగి కుడికాలు ఎత్తి ఒక్క కిక్ ఇచ్చింది.
కానీ...
కరాటే కిక్ ఇవ్వడానికి చీరె సరైన డ్రెస్ కాదు. కాలుని కావలసినంత ఫ్రీగా కదల్చలేకపోయింది వినీల. ఎత్తవలసినంత పైకి ఎత్తలేకపోయింది. ఆమెగనుక ఆ కిక్ ని పుల్ ఫోర్సుతో గనుక ఇచ్చి వుంటే ఆ దెబ్బకి హంతకుడు గింగిరాలు తిరిగి కిందపడిపోయి ఉండేవాడు.
కానీ వినీల చీరకట్టుకుని ఉన్నందువల్ల కిక్ లో ఊపుతగ్గి, ఆమె పాదం అతని భుజాన్ని ఒరుసుకుంటూ పోయింది.
బాలెన్స్ తప్పి కిందపడ్డాడతను మరుక్షణంలోనే బంతిలా లేచి నిలబడ్డాడు. కానీ ఆమె ఇచ్చిన కిక్ అతనికి మరో హత్యా ప్రయత్నంచేసే ధైర్యాన్ని తగ్గించేసింది. అదృష్టవశాత్తు దెబ్బ తప్పించుకోగలిగాడు గానీ ఆమెకి కరాటే బాగా వచ్చన్న సంగతి అతనికి అర్థమైపోయింది. అందుకని తలుపువైపుకి బాణంలా దూసుకుపోయాడు. అతన్ని వెంటాడి పరుగు తీసింది వినీల. ఆ సమయంలో ఆ అపార్ట్ మెంట్స్ లో ఉన్న చాలామంది టీవీలో హిందీ సీరియల్ చూస్తూ ఉండటంవల్ల జరుగుతున్నది ఎవరూ గమనించలేదు.