Previous Page Next Page 
శారద పేజి 7


    ఈ సమాధానం రవికి నచ్చలేదు. అన్నాడు "నేను మనస్ఫూర్తిగా అన్న మాటలను నీవలా కొట్టిపారేయటం చాలా బాధాకరంగా వుంది రాగిణీ! నీకు ఆస్తివుంది. సంసారసౌఖ్యం అనుభవించకుండానే భర్త చనిపోయాడు. ఈ లోకంలో నా అన్నవారెవరూ లేరు. నీ జీవితాన్ని నాశనం చేసుకోవలసిన అవసరం నీకు లేదు. అందుచేత నీ జీవితాన్ని ఒక సుఖపూరితమైన బాటలోకి ప్రవేశపెట్టుకోవడానికి ప్రయాసపడ్డావు. కానీ ముళ్ళకంచెల్ని దాటటంలో నీవు చేసిన పొరపాటే ఈ ప్రమాదానికి దారితీసింది. అది పొరపాటు అను. పాపం అంటే ఒప్పుకోను. కాస్తో కూస్తో చదువుకున్నదానివి అయివుండి కూడా కాలుజారావు. ఇంతకీ అతన్ని గనుక వెతికిపట్టుకుని పెళ్ళి చేసుకోగలిగితే నువ్వు మామూలు స్త్రీవే.

 

    "ఆయనా? బ్రతికుండగా నా కళ్ళకు కనబడడు."

    ఇప్పటికి రవికి భయంవేసింది. తన మాటల్లో ఆమెకు హాని కలిగించేది ఏమైనా వున్నదో లేదో తెలియదు. ఆ క్షణంలో అతని మస్తిష్కంలో ఏదో మెరుపు మెరిసింది. ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత ఆమెవంక నిశితంగా చూడటం జరిగింది. తనకంటే వయస్సులో చిన్నది. కళాకాంతులు లేక పాలిపోయివున్న ఆమె వదనం జీవస్మృతిని వ్యక్తం చేస్తోంది. ఓ కన్నీటికణం దక్షిణనేత్రంలో నాట్యం చేస్తోంది. అది జారి భూమిపై పడితే భూమి దద్దరిల్లటమే కాక, పగులుతున్నంత భయభ్రాంతులు ఆవహించాయి.

    "రాగిణీ!" అన్నాడు.

    "చెప్పండి."

    "నువ్వెవరో నాకు తెలియదు. బహుశా ఓ అపాయాన్నుంచి నిన్ను కాపాడటం వల్ల కాబోలు ఇంత జోక్యం కలిగించుకోవటం జరిగింది. ఇలా వంటరిగా జీవితయాత్ర సాగించటం ఎంత దుర్భరమో ఊహించగలను. నా గది అడ్రసు యిస్తాను. ఎప్పుడైనా అవసరమైతే కబురు చెయ్యి. అవసరమైతేనే సుమా!" అన్నాడు.

    సరేనని ఆమె తల ఊపి అతని చిరునామా తీసుకుంది. అతను బయటకు వచ్చేశాడు.

    చాలారోజులు అతను రాగిణిని చూడలేదు. కానీ ఆమెను చూద్దామన్న ఉత్కంఠ అతనిలో కలుగక కాదు. అది నిర్వివాదాంశం. చాలాసార్లు బీచ్ లో తిరిగాడు. ఆమె కనిపించలేదు. శశీ, అతనూ కలిసి ఓ సాయంత్రం బీచ్ లో కూర్చున్నారు. ఆ సమయంలో ఓ స్త్రీ వాళ్లకు ఎదురుగా వస్తోంది. రవి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అతని ముఖాన కత్తివాటుకు నెత్తురుచుక్క లేకుండా పోయింది. ఆమె నిశ్చయంగా రాగిణి. శశిముందు భీతికి, అవమానానికి లోనయ్యే సందర్భం నేటికి ఆసన్నమైంది. రాగిణి కృతఘ్నురాలు కాబోదు! నిస్సందేహంగా తనను పలకరించి తీరుతుంది. ముందుగా విష్ చేస్తుంది కాబోలు! నుదుటిమీద చోటు చేసుకున్న చెమటబిందువులు తుడుచుకున్నాడు. ఆ నీళ్ళు తనని చూసి నవ్వినట్లుగా తోచాయి. శశిముందు తాను భయపడేందుకూ, సిగ్గిలేందుకూ ఎప్పుడూ ఏమీ కారణం వుండబోదని అనేకసార్లు చేసుకున్న దృఢనిశ్చయం ఏమయింది? తను స్వతంత్రుడు కాదా? ఆ ఆలోచన పూర్తి కాకముందే ఆ స్త్రీ దగ్గరకు వచ్చేసింది. అతను బ్రతికాననుకున్నాడు. బ్రతికానని అనుకున్నందుకు తర్వాత కించపడ్డాడు. ఆ స్త్రీ రాగిణి కాదు. కనీసం రాగిణి అంత అందగత్తె కాదు. ఆమె రాగిణి కానందుకు అనంతరం బాధపడ్డాడు.

    ఆ రాత్రి తనగదిలో పడుకుని అటూఇటూ దొర్లుతూంటే అతని అంతరంగం పొర్లించిన భావాలూ, బాధలూవర్ణనాతీతం. తాను ఎంతటి దుర్భలమానస్కులు? ఎంత సులభంగా పట్టుదలలకూ, ఆవేశాలకూ గురి జౌతున్నాడు? తనని చూసి లోకం నవ్వుతుందేమో? ఎవరైనా తనలో అంతర్భూతమైవున్న బాధ్యతను పసిగట్టివేస్తే? తక్షణం తన తల భూమిలోకి కృంగిపోవలసిందే. అయినా మానరాదు. అది బాధ్యత. అది సులభతరం కాదు. ఈ సంఘర్షణలో చివికిచివికి నశించిపోయినా పోవచ్చు. పోతే పోనీ, తనచుట్టూ తిరుగుతున్న మనుషులు వికటాట్టహాసం చేయవచ్చు. చేస్తే చేయనీ. చిన్నక్క మరుపు తలుపుల చాటునుంచి ఏడ్చింది. వెనువెంటనే విచారంగా నవ్వింది. అతనికి కన్నీళ్ళు తిరిగాయి. అనుకున్నాడు "చిన్నక్కా! ఎవరు ఏమైనా అనుకోనీ. నువ్వే నన్ను తిట్టు. నేను ఆనందంగా స్వీకరిస్తాను. కానీ ఆనాటి దృశ్యం నేను మరిచిపోను. నీ ధన్యతకు జోహారు చేస్తాను. కానీ అందులో కనబడకుండా మెదులుతున్న తుఫానుగాలుల్ని సృజించి కలత చెందకుండా వుండలేను."     

    "చిన్నక్కా! నాన్నలేడు, అమ్మలేదు. నువ్వు అన్నిటికంటే మిన్నవంటే ఏడుస్తావు. కానీ ఆ ఏడుపు నీ అవస్ధను గ్రహించి నేను అలమటిస్తున్న వ్యధా స్వరూపంకంటే మిన్న కాదేమో. అవును. కాదు, అందుకే నేను ఈ ఊబిలోకి దూకటానికి ఆయత్తపరుచుకుంటున్నాను. అందుకు పరిస్థితులు అనుకూలించాయి. కానీ నీ చేతులతోనే నన్ను నిమరాలి. నీ సంతృప్తిచూసి నేను నవ్వాలి."   

    అతను కన్నీటి ప్రవాహాన్ని అరికట్టుకోలేకపోయాడు. మెల్లగా లేచి నిలబడి లైటు వేశాడు. కొంకెన వున్న చొక్కా వేసుకుని, బయటకు వచ్చాడు. తలుపులు మూస్తూంటే తన జ్ఞానచక్షువులు కూడా మూసుకుపోతున్నట్లు తీవ్ర అనుభూతి చెంది మనిషికూడా కంపించాడు. చాలు. ఈ సాహసంచేసి తనను తాను నీచపరుచుకోలేడు. లోపలికి వచ్చి మళ్ళీ మంచంమీద వాలిపోయి "రాగిణీ! నన్ను క్షమించు" అని ప్రార్ధించుకున్నాడు. కానీ అది మనస్ఫూర్తిగా కాదని సందేహం పొడమటం శోచనీయాంసం.

    వారంరోజులు రవి కాలేజీ ఎగ్గొట్టి తిరిగాడు. అతన్ని పట్టుకుందామని శశి, చంద్రం ప్రయత్నించి విఫలీకృతులయ్యారు. అతను బీచ్ లోకూడా ఎవరికీ కనబడలేదు. రాత్రులు గదికి వచ్చేవాడు. ఒకరోజు శశి ఈ విషయం తెలుసుకుని రాత్రి పదకొండింటివరకూ కాపుకాసింది. రవి తూలుతూ లోపలకు ప్రవేశించాడు. మనిషి చెప్పలేనంతగా నీరసించిపోయాడు. అతను మెట్టు ఎక్కుతూంటే పైన పిట్టగోడకు ఆనుకుని ఎదురుతెన్నులు చూస్తున్న శశి ఈ నూతన వ్యక్తి వాలకం చూసి బెదిరి రాత్రివేళ ఏదైనా గందరగోళం జరిగితే ఎదుర్కోవటం ఎలాగా? అను సంశయంతో తుదకు తెగించి అతను తనను సమీపించకముందే అతను ముఖంమీదకు టార్చిలైటు వెలిగించింది. నల్లగా, జీబురుగా గడ్డం, ఎర్రగా ఉజ్వలమానంగా కళ్ళు, తెల్లగా పాలిపోయిన చెక్కిళ్ళు. ఈ వ్యక్తి రవి అని ఎవరనుకుంటారు?

    "శశీ!" అన్నాడతను నివ్వెరపాటుతో.

    శశికి పెదవులు కంపించాయి. బిగ్గరగా ఏడుద్దామనుకుకుంది. ఈ దుర్భర పరిస్థితి భరించలేక గిర్రున లంఘించి పారిపోదామనుకుంది. కానీ ఈ రెంటిలో ఏమి చేయడానికీ ఆశక్తురాలుకాగా "ముందు తలుపులు తియ్యి రవీ!" అని గొణిగింది.              

 Previous Page Next Page