Previous Page Next Page 
శారద పేజి 8


    రవి తలుపులు తెరిచి, నేరం చేసినవాడిలా మంచంమీద తలవంచుకు కూర్చున్నాడు. ఆమె ఏదో కుశల ప్రశ్నలు వేసింది. అతను ముక్తసరిగా జవాబులు చెప్పాడు. మరునాడు తప్పక కాలేజికి వస్తానని అతనిచేత ఒట్టు వేయించుకుని "ఇంటివరకూ దిగబెట్టు రవీ! భయంగా వుంది" అని కోరింది.

    "ఈ రూపంతోనా?" అని నిర్ఘాంతపోయాడు రవి.

    "శశీ! నిన్ను దొంగవాడి స్నేహితురాలవని అనుకుంటారు."

    "నేను లెక్కచెయ్యను. రా!"

    "క్షమించు, రాలేను."

    శశి నిస్పృహతో తల విదిలించి "నా అసలు ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఈ రాత్రి నిద్రపట్టక కుమిలి కుమిలిపోతాను. నువ్వెందుకిలా మారిపోయావో చెప్పి తీరాల్సిందే."

    "నేను నీకు రేపు మామూలు రూపంలో కన్పించగలను. అంతకు మినహా నేను ఏమీ వ్యక్తీకరణం చేయలేను. నాకు తెలియదంటే నమ్మవేం?"

    శశి నిట్టూర్చి చేసేదిలేక అక్కడ్నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది.

    రవి గుమ్మందాకా వచ్చి చీకట్లోకి చూస్తూ నిలబడ్డాడు. "శశీ!" అన్నాడు మంద్రంగా. ఆమె వెళ్ళిపోయాక "నీవే జయిస్తావేమో కానీ!"

    మరునాటినుంచీ అతను మామూలుగానే తిరగసాగాడు. అతని ప్రవర్తన గురించి ఎవరైనా ఆక్షేపణలు పలికినా లక్ష్యం చేయలేదు. "వారం రోజుల్నుంచి నేనేం చేశాను?" అని ప్రశ్నించుకుంటే గద్గదమైన నవ్వు వచ్చింది. తను ఆవేళ మెట్లు ఎక్కుతూ తూలాడు. కేవలం నీరసంచేత అలా జరిగింది. శశి మరోవిధంగా భావించి అసహ్యించుకోలేదుకదా? తను రాగిణిని కలుసుకోలేదు. కలుసుకుంటే ఏం చేయగలిగేవాడో తెలియదు. కనీసం మామూలు మనిషి ప్రవర్తనకన్నా తన నైజం దిగజారిపోయింది. కానీ ఆమెను కలుసుకుని తమ ఇద్దరిమధ్యా వున్న సంబంధం పెంపొందింపజేసుకోవాలన్న ఆరాటం అణుచుకోలేకుండా వున్నాడు. ఇది విపరీతం, అమానుషం. మళ్ళీ ఈ సంఘర్షణకి ఏనాటికైనా అంతువున్నదా అనిపిస్తోంది. ఈ కలుగుతున్న అభిప్రాయానికి అర్ధం ఎంత తలబ్రద్దలు కొట్టుకున్నా ఒక జవాబు గోచరించలేదు. ఒక్కోసారి తన చేతుల్లోంచి తాను పారిపోతున్నాడన్న తీవ్రతకు గురి అయ్యేవాడు.   

    ఒకరోజు మధ్యాహ్నం అప్పుడే కాలేజీనుంచి వచ్చి దుస్తులు మార్చుకుంటూ వుండగా, తలుపు తట్టిన చప్పుడైంది. తెరచి చూశాడు. ఎదురుగా ఓ పన్నెండేళ్ళ కుర్రాడు నిలబడి ప్రశ్నార్ధకంగా చూస్తున్నాడు.

    "ఏం కావాలి?"

    "రవి బాబుగారంటే మీరేనా?"

    "నేనే. ఎవరు నువ్వు?"

    ఆ కుర్రవాడు మాట్లాడకుండా ఓ కవరు అతని చేతులోపెట్టి "రాగిణి అక్క ఇమ్మంది" అన్నాడు.

    రవి "సరే!" అన్నాడు. ఆ కుర్రవాడు వెళ్ళిపోయాడు.

    జీవితంలో అనుభవాల సంఖ్యకు హద్దులేనిమాట నిజమే. కానీ అది ఒకదాని వెంట ఒకటి విరుచుకుపడినప్పుడే మానవుడు తల్లడిల్లటం జరిగేది. అవి సంతోషమైనవైనా అంతే. రవిలాంటి దుర్భలహృదయుడికి చిన్నతనాన హైస్కూల్ పరీక్ష పాసయ్యానని తెలియటం, తండ్రి కెమెరా కొనియ్యటం, అదే సమయానికి ఆరునెలల తర్వాత చిన్నక్క పుట్టింటికి రావటం జరిగిన రోజున విచిత్ర, విభిన్న మనస్తత్వాలకు గురియై జ్వరంకూడా వచ్చినట్లు బాధకు గురయ్యాడు. జరిగిన ప్రతి సంఘటనా తరచి తరచి ఆలోచించుకుని, వాటి తాలూకు ఛాయాచిత్రాలు మనసులో చిత్రించుకోవటం అలవాటుగల వారి పరిస్థితి మరీ దుర్భరంగా వుంటుంది.

    "ఎంతో అవసరమనే భావిస్తాను. దయచేయండి" రాగిణి.

    "రాగిణీ!" అనుకున్నాడు రవి మూర్ఛపోయినట్లు. తనని ఆమె మరచిపోయి వుంటుందన్న భ్రాంతిచేత ఇన్నాళ్ళూ కలవరపాటులో మునిగిపోయాడు. ఆమె ఏకాకి కావటంచేత తనని గుర్తుంచుకుని కబురుచేసిందేమో! బయటకు వచ్చి అద్దె సైకిలు తీసుకుని, వాయువేగంతో త్రొక్కుకుంటూ పోయాడు.

    "రండి" అని ఆహ్వానించింది రాగిణి లోపలకు.

    సైకిలు బయట మెట్టుమీద ఆనించి, లోపలకు పోయి మెదలకుండా కూర్చున్నాడు. రాగిణి తిరిగి అదే భంగిమలో గుమ్మంమీద కూర్చుంది.

    "నన్ను ఎందుకు పిలిపించావు?"

    ఆమె బదులు పలుకకుండా మంచంమీదనే ఓ ప్రక్క పడివున్న శుభలేఖను చూపించింది. అతను అందుకుని చూశాడు. ఎవరికోసమైతే ఆమె ఆత్మహత్య కూడా చేసుకునేందుకు ప్రయత్నించిందో, అతని పెళ్ళి మరో సుందరమైన యువతితో. అడుగుభాగాన "రాగిణికి క్షమాపణలతో" అని చేతితో వ్రాయబడి వుంది. అతను విస్మయంతో, విచారంతోనూ చలించాడు. కావాలని ఆమె ముఖంవంక చూడటానికి ప్రయత్నించకుండా "మరి అతన్ని క్షమించావా?" అని ప్రశ్నించాడు. ఆమె కన్నీళ్ళు కారుస్తుందని అపోహపడ్డాడు.

    "అతన్ని క్షమించే అర్హత నాకు లేదు. అది ప్రేమించినవాళ్ళు చేసేపని.."

    "మరి నువ్వు చేసిన పనో?" అన్నాడు చకితుడై.

    "నా మొహం! మీ ముందు దాపరికం ఎందుకు రవిగారూ? ఆ రోజులలో ఏకాకినై బ్రతకటం దుర్భరమనిపించింది. నాకూ తోడూ నీడా కావాలన్న వాంఛకు దాసురాలనయాను. కేవలం దాంపత్య జీవతంమీదే నాకు మోజు. అందుకే అతనికి లోబడ్డాను" అని అసహ్యంతో తల వంచుకుంది.

    "రాగిణీ!" అన్నాడతను తత్తరపాటుతో. మళ్ళీ తమాయించుకుని "ఎంత పని చేశావు? నువ్వు చాలా విజ్ఞానవంతు రాలవనుకున్నానే!" అన్నాడు.

    "పరీక్ష తప్పినవిద్యార్థి, కృతార్ధుడైన విద్యార్థికన్నా అనుభవశాలి అవుతాడంటారు. అదే విజ్ఞానానికి త్రోవ తీస్తుంది."

    "నీ మాటల్లో నిఘూడమై వున్న భావమేమిటో?"

    రాగిణి కంగారుపడి "రవిగారూ! నాచేత అనవసరంగా ఎందుకు వాగిస్తారు? మిమ్మల్ని ఇవేళ ఇక్కడికి పిలిపించవలసిన కారణం వినండి- ఒంటరిగా కూర్చుని నన్ను గురించి తలుచుకుంటుంటే పిచ్చెత్తిపోతోంది. ఆ సమయంలో నాకు కాస్త సంతోషం కలిగించేది ఎవరా అని ఆలోచించాను. మీరు తప్ప ఆప్తులుగా ఎవరూ కనబడలేదు."

    రవి మధ్యలోనే కలుగజేసుకుని "ఎంత విచిత్రమైన సంగతి!" అన్నాడు.

    "రవిగారూ!" అంది ఆమె. "నేను బయటకు వచ్చి చాలా రోజులయింది. ఆ మధ్య ఒకరోజు వచ్చినా చీకట్లోనే తిరిగి చేరుకోవటం మీకు తెలుసు. నన్ను బయటకు తీసుకుపోయి మీ వెంట త్రిప్పగలరా?"

 Previous Page Next Page