Previous Page Next Page 
మధ్యతరగతి మనిషి పేజి 6


    టేబిల్ కి అటువైపు ఉన్న కుర్చీలాక్కుని కూర్చుంటూ "రమణా!" అని పిలిచింది మాణిక్యమ్మ.
    "ఏమమ్మా?" అన్నాడు, ఇడ్లీ తుంచి సాంబార్లులో అద్దుకుని నోట్లో పెట్టుకుంటూ రమణ.
    "అలా తింటే రుచిగా ఉండదయ్యా! మొత్తం ఇడ్లీ, సాంబారులో మెత్తగా నలుచుకొని స్పూన్ తో తిను" అంది ఆమె.
    "అలా తింటే రవ్వఉప్మా తిన్నట్టుగా ఉంటుందమ్మా. నాకిష్టం లేదు" అని తనపద్ధతిలో తినసాగాడు రమణ.
    "నీ ఇష్టం" అని, "రమణా! చంద్రానికీ పెళ్ళి నిశ్చయమైపోయింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాము. నాకు నీవూ, చంద్రం ఇద్దరూ సమానులే. ఈ ముహూర్తానికే నీ పెళ్ళి చేసెయ్యాలని అనుకుంటున్నాను. మన ఎదురింటి వెంకయ్య ఓసారి చూచాయిగా అన్నాడు నాతో. నీవు ఊఁ అంటే నిశ్చయం చేద్దాం" అంది.
    గ్లాసు ఎత్తి నీళ్ళు తాగి ఆమె ముఖంలోకి చూశాడు రమణ. ఏం చెప్పనా? అని ఆలోచించాడు. 'తను చెప్పబోయేది ఆమె మనస్సుకి నచ్చుతుందో, లేదో?' అనుకున్నాడు. 'అయినా ఎప్పటికైనా ఇది చెప్పవలసిందే, కాదంటే ఇంకొన్నాళ్ళు జరుగుతుంది. ఇప్పుడీమెకై ఈమే అడిగింది. ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదేమో?' అనుకొని చెప్పబోయాడు రమణ.
    సరిగ్గా అదే సమయానికి అటుగా వచ్చిన విశాల కళ్ళతో ఏదో సైగ చేసింది. అదిచూసిన రమణ మౌనం వహించాడు.
    "నేను పొలం వేపు వెళుతున్నానమ్మా" అని చెప్పి వెళ్ళాడు చంద్రం.
    'విశాల హెచ్చరించటం చాలామేలైంది' అనుకున్న రమణ చూద్దాంలే" అమ్మా నా పెళ్ళికిప్పుడేం తొందర?, అని లేచాడు.
    గ్లాసునిండా పాలు తెచ్చి ఇచ్చింది హనుమాయమ్మ.
    "వేడివేడి పాలలో చక్కెర తగినంతగా వేసుకుని తాగితేనే రుచి. అలాగే తగిన వయస్సులో పెళ్ళిచేసుకుంటేనే జీవితానికి శోభ. నా ఉద్దేశ్యంలో మీ ముగ్గురి పెళ్ళిళ్ళూ ఒకేసారి జరపాలని ఉంది. కానీ, విశాలకే తగిన సంబంధం రాలేదు" అంది మాణిక్యమ్మ.
    "రేపు చెపుతానులే, అమ్మా" అని వెళ్ళిపోయాడు రమణ.


                              *    *    *    


    సాయంకాలం అయిదు గంటల సమయం.
    నారింజ తోటలో మోటబావి గట్టున కూర్చుని ఉంది విశాల. కాళ్ళు రెండూ దగ్గరగా ముడుచుకుని మోకాళ్ళపై తల ఆన్చుకుని, బావిలోకి చూస్తూ, ఓచేత్తో మెల్లిమెల్లిగా ఒక్కో గులకరాయీ నీటిలోకి విసురుతూ, వాటివలన ఏర్పడే వలయాల్ని చూస్తూ, అవి క్రమంగా నీటిలో కలిసిపోటాన్ని పరిశీలిస్తూ అతనికోసం ఎదురుచూడ సాగింది.
    దాదాపు అయిదు నిమిషాలసేపు విశాలనే పరిశీలనగా చూస్తున్న రమణకి ఆమె మనస్సులో సమస్య ఎంత బలమైన వలయాల్ని సృష్టిస్తూ ఉందో అర్ధమైంది.
    "విశాలా !"
    త్రుళ్ళిపడింది విశాల.
    రమణని చూసి తృప్తిగా నిట్టూర్చింది.
    "కూర్చో!" అంది సాలోచనగా.
    "విశాలా! సమయం వచ్చేసింది. మన మనస్సులో ఇన్నాళ్ళుగా పేరుకుపోయిన ప్రేమ ఇప్పుడు బహిర్గతం కావాలి" అన్నాడు, తలకు చుట్టుకున్న గుడ్డని విదిల్చి, భుజంమీద వేసుకొని కూర్చుంటూ.
    నవ్వింది విశాల. "రమణా! ఈ పెళ్ళికి మా అమ్మ ఒప్పుకోదేమో అనే భయం ఉంది నాకు. నీకూ, అన్నయ్యకూ ఉన్న స్నేహం వల్ల, ఇద్దరిమధ్య ఉన్న ఆప్యాయతానురాగాలవల్ల అన్నయ్య ఒప్పుకుంటాడు. అన్నయ్య అమ్మను ఒప్పించగలడా?" అంది.
    నిశితంగా విశాల ముఖంలోకి చూసి, "ఇప్పుడు నేను అడుగదలచుకున్నది అది కాదు, విశాలా! ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకున్నా నన్ను పెళ్ళి చేసుకొనేధైర్యం ఉందా నీకు? ఇప్పుడిప్పుడే ఈ సమస్య రాదని, ఇంకొన్నాళ్ళు జరిగాక ఈ ప్రసక్తి వస్తే అప్పటికల్లా నీవు మేజరువయితే మనం తెగించి పెళ్ళిచేసుకున్నా ఏ అభ్యంతరమూ ఉండదనీ అనుకున్నాను" అన్నాడు రమణ.
    దిగ్భ్రాంతయి చూసింది విశాల. ఇంతవరకూ ఆమె మనస్సులో మధుర ప్రణయమూ, మధుర బృందావనాలూ, తీపికలలూ, తీయనైన అనుభవాలపై మక్కువ ఉంది. అంతేకాని భయంకరమైన అభ్యంతరాలూ, త్యాగాలూ, ఎదిరింపుపూ లేవు. ఈ మాటలు వినగానే ఆలోచనలో పడింది విశాల.
    "నీవింకా మైనరువి. ఇంకో ఆరునెలలు దాటితేకానీ నీవు మేజరువు కావు. అంతదాకా నీకు నీ వాటా ఆస్తిపై హక్కుమాట అలా ఉంచి, నేను నిన్ను మోసగించి పెళ్ళిచేసుకున్నానని కేసు పెడితే మన పెళ్ళి చెల్లదు. పైగా నేను జైలు పాలవుతాను.
    భయం భయంగా చూసింది విశాల.
    "ఎందుకలా నన్ను భయపెడతావు, రమణా! అసలు మన పెళ్ళికి అభ్యంతరాలు వచ్చినప్పటి మాటకదా? అమ్మ అన్నయ్య చెపితే అంగీకరిస్తుంది."
    ఆమె భయానికీ, ఆమె ఆలోచనా సరళికీ నవ్వొచ్చింది రమణకి.
    "ఏదైనా అభ్యంతరం అంటూ చెపితే చంద్రమే చెప్పాలి. మీ అమ్మకి కూతురు గడపదాటకుండా ఇంట్లో ఉండటమే అంగీకారం అవుతుంది. కూతురుకి నచ్చిన సంబంధం చేయటం ఆమెకిష్టమే. అడ్డంకి అల్లా మీ అన్నయ్యకే ఉండవచ్చు. ఒక పాలేరుకి - అందునా తన ఇంటి పాలేరు కొడుక్కి - తన చెల్లెల్ని ఇచ్చి చేయటం అతనికి పరువూ - మర్యాదా నష్టంగా అనిపిస్తుంది.
    "రమణా!"
    "అవును, విశాలా! నీకు లోకం తెలియదు. కులాలు భిన్నమైనా పెళ్ళిచేయరు. కులాలు కలిసినా అంతస్తులు భేదిస్తే అంగీకరించరు.
    "ఈడూ జోడూ కాకపోయినా అంతే. అన్నిటాయోగ్యమైన సంబంధమయితేనే ప్రేమ వివాహాల్ని పెద్దలు అంగీకరించేది. అదీ వాళ్ళు చూసి చేసే సంబంధాలయితే ఎన్నిలోపాలున్నా ఫర్వాలేదు. ఈ లోకం తీరే అంత." ఆవేశంగా అన్నాడు రమణ.
    అందమైన లేడిపిల్ల భయంకరాటవిలో చిక్కడిపోయినట్లుగా ఉంది విశాలపరిస్థితి. పద్మవ్యూహంలో భేదించటం తెలియని పాండవుల్లా అయిపోయింది విశాల మనస్సు. పరిస్థితుల ప్రాబల్యాన్ని కాదనలేక. విషమంగా మారుతున్న పరిస్థితుల్ని చూసి ఆమె మనస్సు చికాకు పాలై పోయింది.
    అగమ్యమైన స్థితిలో ఏదీ తోచక దుఃఖించ సాగింది.
    "విశాలా మనకిప్పుడు ఒకటే మార్గం - అన్నిటికీ మౌనం వహించటం. అంతే. వాదించి ఎవళ్ళనీ ఒప్పించలేము."
    "రమణా! నేను అమ్మతో మాట్లాడతాను. ఆమె అంగీకరిస్తే అన్నయ్య ఎదిరించలేడు."
    నిట్టూర్చాడు చంద్రం.
    చిరుచీకట్లకి ప్రాధాన్యం కల్పిస్తూ లోకబాంధవుడు అస్తగిరివాటుకు నైట్ డ్యూటీకి వెళ్ళబోతున్నాడు. డ్యూటీమారి రావలసిన చంద్రుడు ఇంకారాలేదు.
    విశాల లేచి ఇంటిముఖం పట్టింది.
    తోట అంతా ఒకసారి తిరిగిరావాలనిపించి కదిలాడు రమణ.


                                              *    *    *    


    తోటఅంతా తిరిగి రమణ ఇంటికి వెళ్ళేసరికి ఎవరో ఇద్దరు కొత్తవ్యక్తులు కనుపించారు.
    రమణ కనిపించగానే "రా, రమణా! వీళ్లు నీకోసమే వచ్చారు" అన్నాడు చంద్రం.
    "పుట్టి బుద్ధితెలిసిన నాటి నుంచీ తనవారంటూ ఎవరూలేరు" ఇప్పుడు వీళ్ళెవరా? అని ఆలోచించి, "ఏదైనా పెళ్ళి సంబంధమేమో? అనుకుని" వాళ్ళ ముఖాలలోకి చూశాడు రమణ.
    ఆ అబ్బాయికి పదహారేళ్ళ వయస్సు ఉంటుంది. ఆ స్త్రీ వయస్సు దాదాపు నలభై ఉంటుంది.
    ఆమె అతన్ని చూసి, 'బాబూ. రమణా!' అని ఆప్యాయంగా పిలిచింది.
    ఆమె పిలుపులో ద్రవిస్తున్న ఆప్యాయతకీ, ఆ ప్రసన్నతకీ మాతృప్రేమ అంటే ఏమిటో ఎరగని రమణ చలించిపోయాడు.
    "అమ్మా !"
    అప్రయత్నంగా అతను పిలిచినా పిలుపుకి ఆమెలోని మాతృత్వం అనురాగాన్ని వర్షించింది.
    "నాయనా! వీడు నీ తమ్ముడు, గోపాల్, మీ నాన్నగారు నన్ను పెళ్ళి చేసుకొనేసరికి నీవు పుట్టనేలేదు. అక్కయ్య చనిపోయినప్పుడు కూడా నేనిక్కడికి రాలేదు. అసలు నేను ఆయన భార్యననే విషయం ఈ ఊళ్ళోనే తెలియదు. భద్రాచలం యాత్రకు వచ్చిన మీ నాన్నగారు గోదావరిలో కాలుజారి మునిగిపోతున్న నన్ను రక్షించారు. ప్రాణదానం చేసినవాడే ప్రాణపతి అన్న అభిప్రాయంతో మా నాన్నగారు శ్రీరాముడి కళ్యాణం వెంటనే మా పెళ్ళీ జరిపించారు.

 Previous Page Next Page