నేను అయోమయంలో పడిపోయాను. నాకు భయం వేసింది. ఆయన కళ్ళల్లోకి చూశాను.
ఆ కళ్ళల్లో చంచలత్వం లేదు. దృఢత్వం గోచరిస్తూంది. పర్ వర్టెడ్ నెస్ తో కూడిన దృఢత్వమా?
నేను ఆలోచనలో ఉండిపోయాను. ప్రేమని గురించిన భావతరంగాలు నన్ను ఊపిరాడనీయకుండా చేస్తున్నాయి.
మనిషి ప్రేమను కోరుకుంటాడు.
ఎందుకని?
ప్రేమ లేకుండా బతకలేడు కనుక...
అందరికీ ప్రేమ కావాలి.
ప్రేమకోసం ప్రతివారికీ ఒకటే తపన తహతహలాడిపోతూ వుంటారు.
పుట్టిన పాపకు మిడిమిడి ఊహ ప్రారంభమైనప్పటినుంచీ, ఊహ పూర్తిగా తెలిశాక తల్లిదండ్రుల దగ్గర్నుంచి, తల్లిదండ్రులు పిల్లలదగ్గర్నించీ, వృద్దాప్యంలో ఆర్దికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాల క్షీణదశలో వున్నప్పుడు పిల్లల దగ్గర్నుంచి ఇంకా ఇంకా, భార్య దగ్గర్నుంచి భర్తా, భర్త దగ్గర్నుంచి భార్యా.... చాలా ఉన్నతస్థాయిలో ప్రేమను ఆశిస్తూ వుంటారు. ఆ ప్రేమను పొందలేకపోతూంటే మానసికంగా ఎంతో బాధ పడుతూ, కుమిలిపోతూ వుంటాడు. తాము భయంకరమైన అన్యాయానికి గురయ్యామన్న భావనలో ఉంటాడు.
మనం ప్రేమని ఆసిస్తున్నాం...సరే,
ఎంత ప్రేమను పంచి పెడుతున్నాం?
ఇంకా లోతుగా ఆలోచిద్దాం.
ఎంతసేపూ మనను గురించే ఆలోచన.
మనం ప్రేమించబడాలి. మనం ప్రేమించబడాలి. ఇదే తపన.
"నాదింత అమృతహృదయం ఆ విలువలకు తగ్గ ప్రేమ నాకు లభించటంలేదు. నేను ప్రేమరాహిత్యానికి గురవుతున్నాను. నాకు అన్యాయం జరిగిపోతోంది" ఇది ఎంతోమంది హృదయాల్లోని వేదన.
నేనర్ధం చేసుకున్న ఓ సత్యమేమిటంటే ప్రేమలో ఎంత భ్రమవున్నదో, ప్రేమరాహిత్యంలో కూడా అంతే భ్రమ వున్నది.
ఆ మధ్య పార్టీలో పాల్గొంటున్నప్పుడు నడివయసులో వున్న ఇద్దరు మిత్రుల సంభాషణ నా చెవిన పడింది.
"నా భార్యకు నేనంటే చాలా ప్రేమ. నన్ను విడిచి ఒక్కరోజైనా వుండలేదు. అబ్బో! తన ప్రేమ అచంచలం" అన్నాడు ఒకతను.
రెండో అతను భావయుక్తంగా నవ్వాడు.
"నీ నవ్వులో ఏదో వ్యంగ్యం కనిపిస్తోంది. నా మాటల్లో నమ్మకం కలగడం లేదా?"
"నీ మాటల మీద నమ్మకముంది. కాని అచంచల ప్రేమమీద నమ్మకంలేదు."
"అంటే?"
"నీవు వరుసగా కొన్నిరోజులపాటు ఇంట్లో డబ్బు ఇవ్వవనుకో...."
"అలా ఎందుకు చేస్తాను?"
"తప్పనిసరి పరిస్థితుల్లో.... నీకు జీతం అందలేదు. ఒక నెలకాదు, వరుసగా కొన్ని నెలలపాటు జీతమందలేదు. అనుకోకుండా నీ ఉద్యోగం పోయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకటంలేదు. నీలో నువ్వు ఎంతో తపనపడుతూ కూడా ఇంట్లో డబ్బు ఇవ్వలేకపోతున్నావు. ఇంట్లో..... సరుకులు కొంటానికీ, తిండికీ కూడా ఇబ్బందిగా వుంది."
రెండో అతని ముఖంలో రంగులు మారుతున్నాయి.
మళ్ళీ మొదటి అతను.... జీవితపులోతుల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు. "మొదట కొన్నిరోజులు నీమీద నిండుహృదయంలోంచే సానుభూతి కురిపిస్తుంది. ధైర్యం చెపుతుంది. లాలిస్తుంది. బుజ్జగిస్తుంది. ఆర్ధిక సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి. నిన్ను బుజ్జగించటం పోయి, అది భరించడంగా మారిపోతుంది."
"ప్లీజ్, ఆపు! బహుశా నేను వినలేను!"
"నో! నువ్వు వినాలి. ఈ టాపిక్ నువ్వే ఎత్తావు కాబట్టి కొన్నాళ్ళకి....ఆ పరిస్థితి ఇంకా అలాగే కొనసాగితే భరించటం కూడా కరిగిపోయి అది ఏవగింపుగా మారిపోతుంది. సంపాదనపరుడు కానివాడికి ప్రేమ లభించదు."
"నువ్వు స్త్రీజాతిని కించపరుస్తున్నావు."
"లేదు, స్త్రీజాతి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకుంటూ మాట్లాడుతున్నాను. ప్రేమ అంటే కళ్ళలో కళ్ళు పెట్టి వేరే ఇంకేపనీ లేనట్టు చూసుకుంటూ కూర్చోవటం, ఎదుటివాడి తప్పుల్ని తెలివితక్కువగా క్షమిస్తూ వుండటం, కష్టాలనుంచి విముక్తి కోసం కాకుండా, కష్టాల్లో థ్రిల్ అనుభవిస్తూ వుండడం.... ఇదికాదు ప్రేమ అంటే, పిరికితనానికి మారుపేరు కాదు. ఒక వ్యక్తి చవటగా మారుతున్నప్పుడూ, సమర్ధత నుంచి అసమర్ధతలోకి వెళ్ళిపోతున్నప్పుడు నిస్సహాయంగా వుండాలన్న సంకెళ్ళు వేసే నిబంధన ఏమీలేదు."
రెండో అతని ముఖం మరింతగా నల్లబడిపోయింది. ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసినట్లు కనిపించాడు గాని ఏవేవో భావాలు ఉక్కిరిబిక్కిరి చేసినట్లు ఆగిపోయాడు.
ఈ సన్నివేశం నాలో అనేక ఆలోచనలు రేపింది.
ప్రేమలోని నిజాలు
ఆ రాత్రి చాలాసేపు నిద్రపట్టలేదు.
ప్రపంచమంతా ఘోష పెట్టేదీ, సాహిత్యమూ, సినిమాలూ, ఇవన్నీ విరజిమ్మేదీ ప్రేమలోని వైవిధ్యపూరితమైన గొప్పతనాన్నే.
ఆ ఇద్దరు స్నేహితుల మధ్యా జరిగిన సునిశితమైన సంభాషణే నా మనసును మధిస్తోంది.
భార్యభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.
ఇప్పుడు లోపలికి వెడుతున్నాం.
వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? ఒకరి క్వాలిటీస్ ను ఒకరు ప్రేమించుకుంటున్నారా?
నా భర్త పెద్ద ఆఫీసర్.
గొప్ప డాక్టర్.
చాలా మేధావి.
పెద్ద బిజినెస్ మేన్.
ఇంకా ఇంజనీర్, ఓ కళాకారుడు, ఇంకేవేవో విశిష్ట లక్షణాలున్నవాడు.
అలాగే...
నా భార్య గొప్ప అందగత్తె.
నా మాటను జవదాటదు.
నా భార్య నన్నువెనకేసుకొస్తూ వుంటుంది.
నేను తాగివచ్చినా వూరుకుంటుంది.