Previous Page Next Page 
ఆలోచన ఒక యజ్ఞం పేజి 7


    నా భార్య అద్భుతంగా వంట చేస్తుంది.
    
    ఆమెలో చాలా సహనముంది.
    
    అంటే.. ఇద్దరూ ఒకరి క్వాలిటీస్ ను ఒకరు ప్రేమించుకుంటున్నారు. తప్పులేదు కాని క్వాలిటీ అనేది మనిషికి ఓ ఆభరణం, అలంకారం అది తప్పనిసరి అవసరం కాదంటే అది మూర్ఖత్వమే కాని కొంచెం ఆలోచించండి మన పిల్లల్ని మనం క్వాలిటీస్ ని బట్టి ప్రేమిస్తున్నామా? పిల్లలు కాబట్టి అనురాగం ఉప్పొంగే హృదయంతో ప్రేమిస్తున్నామా? పిల్లల్లో ఒకరు పైకి వస్తారు. సంతోషపడతాము ఒకరు అనుకున్న స్థాయిలో పైకి రారు. దుఃఖపడతాము. కాని ఇద్దరినీ సమానంగానే ప్రేమించగలుగుతాము.
    
    ఇక్కడ సందేహం కలుగుతోంది.
    
    ఇద్దరినీ సమానంగానే ప్రేమించగలుగుతాము.
    
    ఇది సత్యమా?
    
    జీవితంలో.... ఇప్పుడు.... ఈ దశలో.... కేవలం.... పాఠకుల్ని ఆకర్షించటానికీ, వాళ్ళని మెస్మరైజ్ చెయ్యడానికీ కాకుండా జీవితం గురించి అవగాహన కలిగించటానికి కొన్ని పచ్చినిజాలు తెలియజేయటమే ఈ వ్యాసపరంపరలోని ఉద్దేశ్యం. జీవితమంతా ఆత్మవంచన చేసుకుని బ్రతకలేం.
    
    నేను చాలా నిజాయితీగా ఆలోచించి రాస్తున్నాను.
    
    పిల్లల్ని ప్రేమించటంపట్ల తల్లిదండ్రుల ప్రేమలో చాలా వ్యత్యాసముంటుంది. పిల్లలు వారిపట్ల చూసే వాత్సల్యం, వినయవిధేయతలు, వాళ్ళ లక్షణాలు, వాళ్ళలోని అవలక్షణాలు, వాళ్ళ తెలివితేటలు, సంపాదనా చాతుర్యం, వాళ్ళ పెట్టుపోతలు.....ఇవన్నీ కాకుండా వాళ్ళపట్ల ప్రవర్తించే విధానంలో కొంత వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. అవసరమొచ్చినప్పుడు పరిస్థితులు విరుచుకుపడినప్పుడు, ఈ వ్యత్యాసాలు తాత్కాలికంగా చెరిగిపోవచ్చు. నేను చెప్పేది సున్నితమైన బేధభావాల గురించి ఇలాంటి హ్యుమిలియేషన్ అనుభవించిన అనుభవిస్తోన్న వారెందరో తమ మనుగడలో తల క్రిందులైపోతున్నారు. ఒక డాక్టరుగా ఎందరి జీవితాలో నాకు తెలుసు.
    
    "కాని పిల్లలపట్ల తల్లిదండ్రుల ప్రేమలో వివక్ష వుండదు."
    
    ఈ బలీయమైన సత్యం సత్యంగా కొనసాగుతూ వుంటుంది.
    
    మనం ఎటునుంచి ఎటు పోతున్నాం?
    
    కొంత గందరగోళపరుస్తున్నా కొన్ని సత్యాలను వెతుక్కుంటున్నాం.
    
    పెద్దల పెంపకంలో ఒకప్పుడు నిరంకుశత్వం వుండేది. ఆ నిరంకుశత్వంలో వాళ్ళు కొంత అనందాన్ననుభవిస్తూ వుండేవారు. ఇప్పుడు చాలా కుటుంబాలలో ఆ పరిస్థితి లేదు. పిల్లలకు మాట్లాడటంలోకానీ, ప్రవర్తనలోగానీ, స్నేహితుల్ని ఎంచుకోవడంలో గానీ, వాళ్ళను ఇళ్ళకు తీసుకురావటంలోగానీ, కెరీర్ విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో గానీ, పెళ్ళిళ్ళు చేసుకోవటంలోగానీ.... చాలా స్వేచ్చ వుంది. ఈ స్వేచ్చ ఎక్కడ్నుంచి వచ్చింది? ఎవరిస్తే వచ్చింది? ఎవరన్నా అనుకుని నిర్దేశించి ఈ మార్పు తీసుకొచ్చారా? లేక కాలమే పురోగతిలో ఈ మార్పులను సృష్టిస్తూ వుంటుందా? యుగధర్మంలో ఇది ఓ భాగమా? కాలానికంత శక్తి ఎక్కన్నుంచి వచ్చింది? అది సహజ పరిణామమా? లేక మనిషి ఎప్పటికప్పుడు మారిపోతూ ఆయా గుణగణాల్ని కాలానికి ఆపాదిస్తున్నాడా?
    
స్వేచ్చ!
    
    చాలా విలాసవంతమైన పదం.
    
    మనిషి నిరంతరం కోరుకునేది, అయినా అందకుండా అందుబాటులోకి రాకుండా జారిపోతూ వుండేదే... స్వేచ్చ దాన్ని గురించి విస్తృతంగా రాయాలి. సందర్భాన్ని బట్టి తర్వాత రాస్తాను. ఇప్పుడు ప్రేమ అనే మహావలయంలో వున్నాం. ఆ సబ్జెక్ట్ అలాంటిది కాబట్టి వైబ్రేషన్స్ వల్ల అటూ యిటూ కదులుతున్నాం.
    
    పిల్లల పట్ల ప్రేమ.
    
    ఆ రోజుల్లో కుటుంబంలోని పెద్దలు పిల్లలపట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తూ వుండేవారు. వాళ్ళకు ఈ కాలంలోని వారికన్నా ప్రేమ లేదనా? వాళ్ళు ఓ పద్దతిని గౌరవిస్తూ వుండేవారు. అంటే.... ప్రేమకన్నా పద్దతి బలంగా వుండేది. ఆ పద్ధతికి లోబడి వాళ్ళు వారి వారి ప్రవర్తనలను నిర్ణయాత్మకంగా నిర్దేశించుకునేవారు. పిల్లలకు ఇన్ని జతల బట్టలకన్నా ఎక్కువ వుండకూడదు. ఆహారవిహారాల విషయంలో కొన్ని ఆంక్షలకు లోబడి జీవించి వుండాలి. సినిమాలు, షికార్లు, స్నేహితుల ఎన్నిక, అలవాట్లు, వ్యాపకాలు... ఈ విషయాల్లో కొన్ని నిబంధనలుండేవి.
    
    అంటే ప్రేమను కఠినత్వం శాసిస్తూ వుండేది.
    
    కొన్ని కుటుంబాల్లో.... ఆ కఠినత్వం వాళ్ళకెంత వయసు వచ్చినా చివరిదాకా కొనసాగుతూ వుండేది. ఆ కఠిన సత్యాలలోనే ఓ రుచి అనుభవిస్తూ వుండేవారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఎదిగి, వ్యక్తిత్వాలు సంతరించుకున్నాక పెద్దలకూ, పిల్లలకూ మధ్య 'అవగాహన' అంటే చాలా పెద్ద పదమవుతుంది గానీ (అవగాహన అనేది చాలా కష్టమైన అంశాల్లో ఒకటి) కాఠిన్యం కరిగి ప్రేమ కొంత సున్నితరూపం ధరిస్తూ, కొందరిలో ఆ ప్రేమ నిశ్శబ్దరూపంలో వుంటుంది. కొందరిలో ప్రకర్షరూపంలో వుంటుంది.
    
    నిశ్శబ్ద రూపంలో ఉన్నంత మాత్రాన గొప్పదనీ, ప్రకర్షరూపంలో వున్నంత మాత్రాన తేలికైనదనీ కాదు. అది ఓ శైలి.
    
    ఇక్కడో విషయం చెప్పాలి. ఈ వ్యాసపరంపర పేరేమి పెడతారో తెలీదుగానీ, వీటిని రాయటం ప్రారంభించినప్పుడు జీవితంలో ఆలోచన..... ఆచరణ... వీటికి వారధి. ఆలోచించకుండా తీఉస్కునే నిర్ణయాలు, వాటివల్ల జరిగే అనర్ధాలు. చాలా లోతుల్లోకి వెళ్ళిపోతూ రాద్దామనుకున్నాను. ఇప్పుడూ అదే ధోరణిలో సాగుతుంది. కాని ఈ పరిధి సరిపోదనిపిస్తుంది. మనిషి జీవితరంగంలో రకరకాల దశల్లోకి దూసుకుపోతున్నప్పుడు, వివిధ ప్రకంపనలకూ, అలజడులకూ, ఆటుపోట్లకూ లోనై ఆ ప్రభావాలకు కొట్టుకుపోతున్నప్పుడు, కృంగిపోకుండా ఎదిగే శక్తిని సంపాదించగలగాలి. మనిషి ఎదగాలి. ఎదిగి తీరాలి. మనుగడ కొంతవరకు సవ్యంగా సాగిపోవాలంటే ఆ ఎదుగులను జీవితంలో ఇముడ్చుకోగలగాలి.
    
    ఎదుగుదల ఎలా వస్తుంది?
    
    వయసు వల్ల వస్తుందా?
    
    జీవితానుభవం వల్ల వస్తుందా?
    
    నిరంతర పరిశీలన వల్ల వస్తుందా?
    
    విద్యవల్ల వస్తుందా?
    
    వీటిలో ఏ ఒక్కదానివల్లా మాత్రమే రాదు.
        
    వయసు పైబడ్డవారు చాలామంది వుంటారు. కావాలంటే వారిని గమనించండి. ఏళ్ళు వచ్చినా, కుటుంబంలో చాలామంది కంటే పెద్దవారైవున్నా వాళ్ళ ప్రవర్తనలో అభిప్రాయాల్లో ఎక్కడా ఎదుగుదల కనిపించదు. అలాగే జీవితానుభవం కొందరికి జీవితాల్లో ఎన్నో అమూల్యమైన అనుభవాలుంటాయి. అనుభవాలు అనుభవాల్లానే వుంటాయి. జీవితాలు జీవితాల్లానే వుంటాయి. ఆ అనుభవంలోంచి జీవితంలోకి ఓ సత్యాన్ని ఆకళింపు చేసుకున్నట్టు కనపడదు. అలాగే నిరంతర పరిశీలన, విద్య వీటివల్ల మేధను పెంచుకుంటూ వుంటారు గానీ, మనస్సులోకి ఆ ఎదుగుదల తెచ్చుకోలేరు.
    
    ఒకసారి.... ఓ సర్జన్ జీవితం తీసుకుని నవల రాస్తున్నాను. నేను జనరల్ ప్రాక్టీషనర్ని. కొంతవరకూ పీడియాట్రీషన్ని సర్జరీ గురించి క్షుణ్ణంగా తెలుసుగాని, కొన్ని అద్భుతమైన సర్జరీల గురించి తెలుసుకునే అవకాశమంతగా లేదు. అందుకని నగరంలోని చాలా పేరు ప్రఖ్యాతులున్న, ఎన్నో సంవత్సరాలు అనుభవమున్న కొందరు సర్జన్లను కలిశాను. వారి జీవితాల్లోని అమూల్యమైన, లేకపోతే ప్రత్యేకతతో కూడిన ఆసక్తి కలిగించే సర్జరీల గురించి అడిగాను. ఎంతసేపూ అన్ని వేల ఆపరేషన్లు చేశాను. ఇన్ని వేల ఆపరేషన్లు చేశాను అంటారేగాని, "ఇదిగో, ఇది చాలా అద్భుతమైన కేసు. ఇందులోని ప్రత్యేకత ఇదీ" అని ఎంత గుచ్చి గుచ్చి అడిగినా చెప్పలేకపోయారు. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. వాళ్ళు చాలా అద్భుతమైన సర్జరీలు చేసి వుంటారు. కాని... ఆ పేషంట్ల జీవితంలోకీ, మనసులోకీ, ఆ సర్జరీలోంచి స్ఫురించే ఓ సత్యంలోకి వెళ్ళలేకపోయారు.
    
    అందుకని.... ఎదుగుదల వుండాలంటే వయసు ఇంకా ఇంతకుముందు చెప్పిన ఏ అంశంవల్లా రాదు. వీటన్నిటి క్రోడీకరణా వుండాలి.
    
    ఓ నిరంతరమైన తపన వుండాలి.
    
                                                           * * *

 Previous Page Next Page