Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 6


    "డేమ్న్ సన్న ఫే బిచ్" ఇల్లంతా కలియతిరిగి అరనిమిషంలో బయటికి పరుగెత్తుకు వచ్చాడు బర్రీస్.

 

    "సర్! షా తప్పించుకున్నాడు."

 

    "ఆర్యూ మేడ్?" ఇంచుమించుగా అరిచాడు సొలిసిటర్ జనరల్. "ఎలా? మనమంతా చూస్తూనే ఉన్నాంగా."

 

    "తెలీదు."

 

    ఇక్కడ యిలా చర్చ జరుగుతున్న సమయానికి నిర్మానుష్యంగా ఉన్న కారు ఆపమన్న డాక్టర్ మోరే కారు నడుపుతున్న కార్పొరేట్ ఏం జరుగుతున్నదీ గుర్తించేలోగానే మెడ వెనక్కి విరిచేసాడు.

 

    అసాధారణమైన శక్తి సంపన్నుడయిన శ్రీహర్ష మాత్రమే అలా తలని ఒక వృత్తంలా వెనక్కి తిప్పగల వ్యక్తి అని చాలా కొద్దిమందికి తెలుసు.

 

    రంగుని రక్తంలా షర్టుకి అంటించుకున్న శ్రీహర్ష ఆరాత్రి తప్పించుకున్నాక మరుసటిరోజు ఉదయానికల్లా కెనెడియన్ మౌంటెడ్ పోలీస్ మరో వాస్తవాన్ని గ్రహించగలిగారు.

 

    అది......

 

    ప్రముఖ నేరస్థుడైన షా ప్లాస్టిక్ సర్జరీతో కొన్ని నెలలక్రితమే రూపాన్ని మార్చుకున్నాడని.

 

    దేశమంతా అలర్ట్ చేశారు.

 

    కాని అప్పటికే ఎయిర్ ఇండియా విమానంలో ఇండియా వెళుతున్నాడు షా. శక్తితోబాటు తన మేధస్సుని సవ్యంగా వినియోగించుకునే అవకాశమే వస్తే మరో ఆర్యభట్టు కావాల్సిన తెలుగు యువకుడు శ్రీహర్ష.


                                    *  *  *


    తెల్లవారుజామున మూడుగంటలవేళ...

 

    నేలకి సుమారు ముప్పై ఆరువేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తుంది ఎయిరిండియా జంబోజెట్.

 

    దిగువ అట్లాంటిక్ ఓషన్.

 

    ఇంకా ఎన్ని గంటల ప్రయాణమో ఆలోచించడంలేదు షా.

 

    అసలు ఏ పర్యవసానం గురించి పట్టించుకునే స్థితిలో లేడు.

 

    ఒక చిన్న బాధ్యత. చేజేతులా తాను కాల్చిచంపిన భార్యకిచ్చిన ఒక చిన్న మాటకోసం ఇండియా వెళుతున్నాడు అంతే.

 

    తన మాతృదేశమైనా కానీ అంతకుమించి బంధంలేని దేశమది.

 

    జేబులోని తాళిబొట్టు బయటికి తీసాడు.

 

    అలా చూడటం అది తొలిసారి కాదు.

 

    ఒక అపురూపమైన స్మృతిలాంటి ఆ తాళిబొట్టుని రాత్రినుంచీ చాలాసార్లు చూస్తూనే ఉన్నాడు.

 

    ప్రయాణీకులంతా నిద్రపోతున్నారు.

 

    బడలికగా ఉంది.

 

    సాధ్యమైనంత త్వరలో లూసీ చివరికోరిక తీర్చి మళ్ళీ స్పెయిన్ లో అడుగుపెట్టాలి.

 

    ఆ దేశం మీద ప్రేమతో కాదు.

 

    తన ముఖ్య ప్రత్యర్థి 'కిల్లర్ పుజో'ని ఎదుర్కోటానికి.

 

    'శ్రీహర్ష దాడికి వెరపు చెందిన యూరోపియన్ బిజినెస్ టైకూన్స్ అతి ముఖ్యులయిన అండర్ వరల్డ్ కింగ్స్ తో ఒక ఒప్పందానికి వచ్చారు. రెండున్నర కోట్ల డాలర్లను చెల్లించి వీలయినంత త్వరగా షాని అంతం చేయమన్నారు. ఆ విషయం 'షా'కి తెలిసింది రెండు నెలల క్రితం.'

 

    యూరప్ కి చెందిన మాఫియా ఆ పనికి సిండికేట్ నిర్ణయించింది 'సిసీలియన్ కిల్లర్ పుజో'ని.

 

    సుమారు ఆరడుగుల నాలుగంగుళాల పొడవుతో చిన్న పర్వతంళా వుండే పుజో ప్రత్యర్థుల్ని చంపి వెంటనే ఆ వ్యక్తి గుండెని కాల్చుకుతింటాడన్న విషయం 'షా' విన్నాడేతప్ప యింతదాకా ఎదురుపడలేదు.

 

    అయితే అడ్వాన్స్ పుచ్చుకున్న 'పుజో' ముందుగా షాకి ఓ హెచ్చరిక అందించాడు ఇన్ ఫార్మర్ ద్వారా.

 

    పట్టించుకోలేదు షా.

 

    ఆ తర్వాతే జూలీ అదృశ్యమైంది.


    
    అంటే పుజో అవసరం తనకీ ఏర్పడిపోయింది.

 

    శ్రీహర్ష ఆలోచనలనుంచి యింకా తేరుకోలేదు.

 

    "నౌ యూ ఆర్ కాట్" వినిపించింది ఉన్నట్టుండి.

 

    నిద్రమత్తు వదిలినట్టు ఉలిక్కిపడ్డాడు షా.

 

    అప్పుడు చూశాడు శ్రీహర్ష...

 

    వెనుక వరుసలో ఎమర్జన్సీ ఎక్జిట్ దగ్గర కూర్చున్న పదహారేళ్ళ అబ్బాయి ఓ యువతితో ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు.

 

    ఏవో పజిల్సు చెప్పుకుంటున్నారు.

 

    "పాపం మానవుడు అదిరిపడినట్టున్నాడు" షాని చూస్తూ అంది.

 

    "గట్టిగా అనకు అక్కా!"

 

    "తెలుగువాడు అయ్యుండడులే."

 

    "అదికాదు. పాపం నిద్ర డిస్టర్బ్ అయినట్టుంది. 'రేంబో'లా చూస్తున్నాడు."

 

    "చూస్తే ఏమిటట"

 

    "నెమ్మదిగా మాటాడవే."

 

    "గాడిదగుడ్డేంకాదూ?"

 

    "నిజానికి శ్రీహర్షకి ఆశ్చర్యంగా ఉంది. అపరాత్రి దాటేక అంతా నిద్రపోతున్న ఓ ఇంటర్నేషనల్ ఫ్లయిట్ లో హఠాత్తుగా తెలుగుభాష వినిపిస్తోంది. రెప్పవాల్చకుండా చూసాడా అమ్మాయిని.

 

    ఇరవయ్ దాటని వయసు... రూపం శరత్పూర్ణిమలా వున్నా కళ్ళలో గ్రీష్మతాపంలా కనిపించే అహం...

 

    అబ్బాయి సీటులో కాస్తొంగి "అడుగో రేంబో ఈసారింకా సీరియస్ గా చూస్తున్నాడు" అన్నాడు రహస్యంగా.

 

    "చూస్తే?" ఆమె గొంతు స్థాయి పెంచింది.

 

    "నువ్వు పిలిచి కయ్యం తెచ్చేట్టున్నావ్"

 

    "ఇది అతని పడగ్గదేం కాదు జోక్యం చేసుకోవడానికి."

 

    "నిజమే" నెమ్మదిగా అన్నాడు శ్రీహర్ష.

 

    ఇప్పుడు ఆశ్చర్యపోవటం ఆమె వంతయింది. ఖర్మ... అతను తెలుగువాడే. పైగా యింతసేపూ తన సంభాషణ విన్నాడు. మరొక అమ్మాయి అయితే ఆ స్థితిలో కుచించుకుపోయేది. కాని ఒక కోటీశ్వరుడి గారాలపట్టిగా ఆమెకు ఎవరి ముందూ తలవంచడం అలవాటులేదు.

 Previous Page Next Page