Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 7


    భారతదేశంలోని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తయిన ఆమె తండ్రి కూడా ఆమెనలాగే పెంచడం విశేషం. దానికి తగ్గట్టే ఒక ఫోన్ కాల్ తో బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పే అవకాశమున్నా ససేమిరా వీలుకాదని నాలుగురోజుల క్రితం స్నేహితురాలి బర్త్ డేకి తమ్ముడితోపాటు కెనడా వెళ్ళి ఇప్పుడు తిరిగివస్తూంది.

 

    "ఏం బేబీ... గొంతు మూగవోయిందేం?" శ్రీహర్ష అడిగాడు నెమ్మదిగా.

 

    "మీ పని మీరు చూసుకోండి" హెచ్చరికలా అంది.

 

    "మీ తమ్ముడా..."

 

    "అడగడం మీపని కాదు"

 

    "నాకు ఓ జోక్ గుర్తుకొస్తూంది."

 

    "వినాలన్న ఉత్సాహం నాకు లేదు."

 

    కాని చెప్పడం నాకు అవసరం" తన సీటులోకొచ్చి కూర్చోమని ఆమె తమ్ముడికేసి చూస్తూ సంజ్ఞ చేశాడు షా. బితుకుబితుకుమంటూ వెళ్ళాడా అబ్బాయి. ఇప్పుడు ఆమె పక్కసీటులో కూచున్న షా గొంతు సవరించుకున్నాడు. "నాలాంటి భర్తకి మీలాంటి పొగరున్న ఓ భార్య వుండేది. ఇందాక మీరు అన్నట్లే మొగుడ్ని ప్రతిదానికి ఇది మీపని కాదు అనేదట" రహస్యంగా చెప్పుకుపోతున్నాడు. ఆమెను ప్రసన్నం చేసుకోడానికి ఓ రోజు మంచి చీరకొన్నాడు. ఇది మీ పనికాదు అంది విసుగ్గా. ఓరాత్రి ఆలస్యంగా ఇంటికివచ్చి నిద్రపోతున్న భార్యని డిస్టర్బ్ చేయడం ఇష్టంలేక తనే అన్నం వడ్డించుకోబోతుంటే కాళిలా భర్తమీదికి దూసుకుపోయి ఇది మీపనికాదంది. ఇది పనికాదనుకున్నాడు తనుకూడా. అంతే... ఆరాత్రి ఆమె నోరునొక్కాలని బెడ్ మీదకు వెళ్ళి చాలా గట్టిగా..."

 

    కోపాన్ని నిభాయించుకుంటూ వింటూంది.

 

    "ఆమె ఒళ్ళు హోనమయ్యేట్టుచేసి తన అధికారాన్ని చూపించబోతుంటే ఆ స్థితిలోకూడా ఇది మీ పనికాదూ అందట. అవాక్కయిపోయాడు... ఉక్రోషంగా మరెవరిపని అన్నాడు. అప్పటికి తనమాటలో అపశృతి అర్థమైందేమో సదరు యువతి యిది అచ్చంగా మీపనే అంటూ కరెక్టు చేసుకుందట."

 

    "గో అవే" రోషంగా అంది.

 

    "జోక్ నచ్చలేదా"

 

    "గెట్ లాస్ట్" అరిచింది.

 

    "ఇదేం నీ పడకగది కాదుగా" ఇందాక ఆమె అన్నవాక్యాన్నే తనూ రిపీట్ చేసాడు.

 

    "ఐ సే గెట్..."

 

    ఒక కోటీశ్వరుడి కూతురయిన దృశ్య కేకతో నిద్రపోతున్న చాలామంది ప్రయాణీకులు కళ్ళు తెరిచి చూసారు.

 

    ఎయిర్ హోస్టెస్ పరుగునవచ్చింది.

 

    శ్రీహర్ష యువతలి తన సీటుదగ్గరికి వెళ్ళేవాడే...

 

    "మేడమ్ ఏమైంది" అడిగింది ఎయిర్ హోస్టెస్.

 

    ఇక్కడే దృశ్య పొరపాటు చేసింది.

 

    ఏదో చెప్పాలన్న తొందరపాటో లేక ఓ చిన్న గెలుపుతో తన అహాన్ని చల్లార్చుకోవాలన్న దూకుడో అసంకల్పితంగా అనేసింది.

 

    "నేను నిద్రపోతుంటే యీ పెద్దమనిషి... పక్కన కూర్చుని..." ఇక్కడనుంచి వాక్యాన్ని ఎటు మళ్ళించాలో తెలీక ఆగిపోయింది.

 

    శ్రీహర్ష అవాక్కయి చూస్తున్నాడు.

 

    చాలా సరదాగా మొదలయిన చర్చ ఇలాంటిమలుపు తిరగడం అతడూహించనిది.

 

    "ఆ తర్వాతేమయింది?" అడిగాడో మధ్యవయస్కుడు.

 

    దృశ్య మౌనం మరేదో అర్థాన్ని స్పురింపజేస్తుంటే ఆ వ్యక్తి తన ప్రత్యేకత నిరూపించుకునే ప్రయత్నంగా "బా... స్ట... ర్డు..." అన్నాడు.

 

    అదింకా పూర్తికాలేదు.

 

    శ్రీహర్ష పిడికిలి అతడి గెడ్డాన్ని ముద్దుపెట్టుకుంది.

 

    కళ్ళలో పేరుకున్న ఎరుపుజీరలు శ్రీహర్షని కిల్లర్ షాగా మార్చుతుంటే పిడికిలి మరింత బిగుసుకుంది. మరో అరక్షణంచాలు అసాధారణమైన రాక్షసత్వాన్ని ప్రదర్శించగల షా చేతిలోకి అతడి పుర్రె వూడిపడటానికి.

 

    చేతులు జోడించింది ఎయిర్ హోస్టెస్.

 

    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.

 

    రెండు లిప్తల వ్యవధి.

 

    పట్టు సడలించాడు శ్రీహర్ష.

 

    ఈ వ్యక్తి ఎవరో యేమిటో తెలిస్తే ఆ తర్వాతయినా దృశ్య వూరుకునేదేమో.

 

    కాని...

 

    బాంబే ఎయిర్ పోర్టులో ఫ్లయిట్ దిగి లాంజ్ లో నడుస్తున్న దృశ్య మరోసారి తన అహాన్ని ప్రదర్శించింది అమాయకంగా.

 

    "మిష్టర్" తలవంచుకు నడుస్తున్న శ్రీహర్షని దృశ్య చూస్తూ.

 

    "నేను కావాలీ అనుకుంటే నిన్నిక్కడ కటకటాలవెనక్కి నెట్టించగలను. కాని క్షమిస్తున్నాను."

 

    ఈ వాక్యంతో అతడెంత రెచ్చిపోయాడూ అంటే క్షణంపాటు తననుతాను మరిచినట్టు అమాంతం ఆమెను దగ్గరకు లాక్కున్నాడు.

 

    ఏం జరుగుతున్నది ఆమె తెలుసుకునేలోగా బలంగా ఆమె పెదవులు చిట్లేట్టు ముద్దుపెట్టుకున్నాడు.

 

    మరోసారి అతడి భుజంపై చేయిపడింది.

 

    గిరుక్కున వెనక్కి తిరిగాడు.

 

    ఇందాక ఫ్లయిట్ లో తనపై కలియబడాలనుకున్నవాడే!

 

    ఒక్కటంటే ఒక్కటి.

 

    శ్రీహర్ష ముష్టిఘాతం అతడ్ని నేలపై పడేట్టు చేసింది.

 

    అక్కడి జనమంతా విభ్రమంగా చూస్తున్నారు.

 

    "నిన్ను కాదు" సిగ్గుతో నలిగిపోతున్న దృశ్య నేలపైబడ్డ వ్యక్తిని చూస్తూ అంది "నీలాంటి అసమర్ధుడ్ని నాకు బాడీగార్డుగా పంపిన డాడీని అనాలి."

 

    తన అసమర్ధత శ్రీహర్షముందు ఎందుకు పనికిరాకుండా పోతున్నదీ అర్థంకాని ఆ వ్యక్తి "పోలీసులకి కంప్లయింట్ చేస్తాను" అంటూ లేవబోయాడు.

 

    "సిగ్గులేకుండా అదొకటా."

 

    కస్టమ్స్ కౌంటర్ వేపు నడిచింది మొహం దించుకుని.

 

    ఈ సంఘటన ఆ తర్వాత మరిన్ని సంఘటనలకి కారణం అవుతుందో తెలీని, అసలు తెలుసుకోవాలనే ఆసక్తిలేని శ్రీహర్ష నెమ్మదిగా బయటికి నడిచి బయట టాక్సీ ఎక్కుతూంటే...

 Previous Page Next Page