బేరర్ మళ్ళీ వచ్చి మరో రెండు బీరు బాటిల్స్ తెచ్చిపెట్టాడు.
"చెప్పండి__" సుదర్శన్ తొందరపెట్టాడు.
"ఆ రోజు నేను ఫారెస్టు ఏరియాలో వున్నాను. ఫోటోస్ కోసం ఆ రోజు తెల్లవారు ఝామునే ఏరియాకు వెళ్ళాను. అపుడు ఉదయం ఆరు గంటలయింది. అక్కడ అందమైన ప్రకృతి సిద్ధమైన సరస్సు వుంది. ఆ సరస్సును వివిధ కోణాల్లో ఫోటోస్ తీస్తున్న నాకు, ఆ సరస్సుకు పది అడుగుల దూరంలో వున్న ఓ బండరాయి పక్కన ఆ గుర్రం కనిపించింది. వెంటనే దాన్ని గుర్తుపట్టాను. నుదుటిమీద పొడవాటి తెల్లటిచార, అనుక్షణం అల్లల్లాడే దాని కళ్ళు. అన్నిటికి మించి ముదురు గోధుమరంగు నలుపురంగు కలిసిన ప్రత్యేకమైన దాని కలర్ నేను గుర్తుపట్టేలా చేశాయి.
మరలా నాలో పట్టుదల పెరిగింది. ఎలాగైనా దాన్ని ఫోటో తీయాలని. అభ్యంతరం పెట్టేవాళ్ళు ఎవరయినా వున్నారేమోనని చుట్టుపక్కల చూశాను. దానికి కొద్దిదూరంలో దాని మాలి అనుకుంటాను. తాపీగా చుట్ట తాగుతూ కనిపించాడు.
అప్పుడే క్రమంగా చీకటి పల్చబడుతోంది. చుట్టుపక్కల మరెవరూ లేరు. గాఢమైన నిశ్శబ్దం. చటుక్కున కెమేరా ఫోకస్ చేయడం ప్రారంభించాను. నా చర్యను ఆ గుర్రం కనిపెట్టినట్లుగా అనిపించింది. దాని కళ్ళు వుండుండి నా వేపుకి తిరుగుతున్నాయి. దాని కళ్ళలో కనిపించే కదలికను చురుకుదనాన్ని బట్టి అది చాలా తెలివైనదనిపించింది. నేను ఫోటో తీయడం దానికిష్టం లేకపోతే అది సకిలించవచ్చు. దాంతో ఆ మాలి దృష్టిలో నేను పడవచ్చు, అప్పుడు నా ప్రయత్నం విఫలమవ్వచ్చు. అందుకే దానివేపు చూడకుండా ఎటో చూస్తున్నట్లు నటిస్తూ దాన్ని ఫోటో తీశాను. ఆ వెంటనే కెమేరా నా కిట్ లో దాచేసి నెమ్మదిగా ఆ మాలి దగ్గరకు వెళ్ళాను.
అతన్ని చిన్నగా మాటల్లోకి దింపి, ఆ గుర్రం వివరాలు అడిగాను. అతనికి నామీద అనుమానం రాలేదు. అతనికి తెలిసిన వివరాలు చెప్పాడు.
ఆ గుర్రం కెనడా నుంచి తెప్పించారని, దానిపేరు రాయల్ కింగ్ అనీ, దాని ఖరీదు దాదాపు 15 లక్షలని, దాని వయసు 30 నెలలని, దాని యజమాని ఎవరో తనకూ తెలియదని చెప్పాడు.
అతని మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఒక గుర్రం ఖరీదు పదిహేను లక్షలా....?
"నీకు తెలియదనుకుంటాను. కొన్ని గుర్రాల ఖరీదు కోట్లలో ఉంటుంది...." అన్నాడు సుదర్శన్.
ఎదుటి వ్యక్తికి తెలియని ఒక విషయం చెప్పి అతను ఆశ్చర్యపడుతుండగా చూసి గర్వపడే తత్వం సుదర్శన్ ది.
మరో బాటిల్ ఖాళీ చేసాడు అనురాగ్.
ఒకింతసేపు ఆగి మరలా చెప్పడం ప్రారంభించాడు. తను చాలా క్యాజువల్ అనుకున్న సంఘటన అతనికంత ఆసక్తిని కలిగించడం అనురాగ్ కి ఆనందంగానూ! ఆశ్చర్యంగానూ వుంది. "ఆ తర్వాత నేను అడవిలోకి వెళ్ళిపోయాను. లోన అడవి మధ్యలో వున్న డీర్ పార్క్ దగ్గర కొన్ని ఫోటోస్ తీస్తున్న సమయంలో ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుదిరిగి చూశాను. ఓ అమ్మాయి చాలా అందమైన అమ్మాయి గబగబ నావేపే నడిచివస్తోంది. ఆ అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదు." చెప్పడం ఆపాడు, మగ్ లో మిగిలిన బీరు గబగబా తాగి మూతి తుడుచుకుని సిగరెట్ వెలిగించి మరలా చెప్పడం ప్రారంభించాడు.
"ఆ అమ్మాయి రూపం ఇప్పటికీ కళ్ళముందు మెదుల్తోంది ఆ అమ్మాయి ఎలా వుందని అడగరేం? మీరడగక పోయినా చెబుతాను ఎందుకంటే ఆ అమ్మాయి అంత అందంగా వుంది కనుక. ఆ అమ్మాయి జీన్స్ ఫేంట్, టీ షర్టు వేసుకుంది. బాబ్డు హెయి, షర్టు పైన రెండు బటన్స్ పెట్టుకోకపోవడంవల్ల బ్రా వేసుకోకపోవడం వలన ఆమె స్థనద్వయం పచ్చగా, ఎత్తుగా, బరువుగా వూగుతూ ఓహో....ఫెంటాస్టిక్ ఆ దృశ్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను...." ఆ దృశ్యాన్ని కళ్ళముందుకు తెచ్చుకునే ప్రయత్నంలో కళ్ళు మూసుకుని తన్మయత్వంలో వున్న అనురాగ్ ని చూస్తుంటే సుదర్శన్ కి కోపం వచ్చిందిగాని తమాయించుకున్నాడు. "ఆ అమ్మాయి కళ్ళు మత్తుగా వున్నాయి. దగ్గరగా వచ్చాక సీరియస్ గా నావేపే చూస్తూ అడిగింది హిందీలో. ఆ గుర్రాన్ని ఫోటో తీశావా....? అని.
ముందసలు తీయలేదనే అందామనుకున్నాను కాని అబద్ధం ఆడలేకపోయాను. అవును....తీశాను అని చెప్పాను. ఆ ఫిల్మ్ ఇచ్చేయమని అడిగింది కోపంగా నా వేపు చూస్తూ.
ఎందుకు అడిగాను.
ఆ గుర్రాన్ని ఫోటో తీయకూడదన్నది.
అది రిస్ట్రిక్టెడ్ ఏరియాగానీ, ప్రొహిబిటెడ్ ఏరియాకాని కాదు. ఆ ఏరియాలో వున్న ఆ గుర్రం కూడా అంతేనని చెప్పాను. అది ప్రైవేటు ప్రాపర్టీ....అలా పర్మిషన్ లేకుండా తీయకూడదని, ఇచ్చేయమని అంది.
ఆ ఫోటోలు నేనెక్కడా అమ్మనన్నాను.
అయినా అనవసరం....అని మాట్లాడుతూనే మెరుపుకంటే వేగంగా నా మెడలో వేలాడుతున్న కెమేరాని లాగేసుకుని బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి బర్రున ఫిల్మ్ లాగేసింది. ఇదంతా నేనూహించలేదు. అంత వేగంగా వుంది ఆమె కదలిక.
ఆ వెంటనే వెనుదిరిగింది వెళ్ళేందుకు. నా కెమేరాను ఎవరయినా ముట్టుకుంటే నాకు నచ్చేంత కోపం, వెళ్తున్న ఆమెను జబ్బపట్టుకుని ఆపి, వెనక్కులాగి చాచిపెట్టి కొట్టాను. అది వూహించని ఆమె కొద్దిగా తూలి, అంతలోనే తేరుకుని జేబులోంచి పిస్టల్ బయటకు తీసింది.
నిన్ను చంపెయ్యడం పెద్ద సమస్యకాదు. కాని నాకు ఆర్డర్స్ లేవు. అవిలేకుండా నేనేం చేయలేను కనుక నీవు బ్రతికిపోతున్నావ్...." అంటూ విసురుగా నేలను తన్నుతూ వెళ్ళిపోయింది.
మూడ్ అవుటయిన నేను ఆమె వెనకే బయలుదేరాను. ఆమె అక్కడికి దగ్గరలోనే ఉన్న టూరిస్ట్ డిపార్ట్ మెంట్ వారి గెస్ట్ హౌస్ లోకి వెళ్ళింది. నేనూ అక్కడే దిగాను కనుక కామ్ గా నేను నా రూమ్ లోకి వెళ్ళిపోయాను.
కాని ఆ అమ్మాయికి తెలియని విషయం ఒకటుంది__ఆ అమ్మాయి ప్రాగ్ చేసిన రీల్ లో గుర్రాన్ని ఎక్స్ పోస్ చేసిన నెగిటీవ్ లేదు. ఆ గుర్రం ఫోటో రీల్ లో 36వ స్నాప్ కావడంతో దాన్ని తీసి కొత్త ఫిల్మ్ లోడ్ చేశాను.
"ఆ రీల్ నా జేబులో భద్రంగా ఉంది...." చెప్పడం ఆపాడు అనురాగ్.
మధ్య మధ్యలో బీరు సిప్ చేసేందుకు, సిగరెట్ తాగేందుకు అనురాగ్ అలా ఆగిపోవడం సుదర్శన్ కి చిరాగ్గా ఉంది. అలా అని భయపెడితే టెన్షన్ ఫీలై కొన్ని వివరాలను మర్చిపోయే ప్రమాదం వుందని ఆపని చేయలేదు.
కాని అనురాగ్ చెబుతున్న వివరాల్ని సుదర్శన్ ఎంత శ్రద్ధగా వుంటున్నాడో అంతగా ఆలోచిస్తున్నాడు. ఏదో ఒక క్లూ దొరక్కపోతుందా అని.
"ఆ తర్వాత....?" సుదర్శన్ తన అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ అడిగాడు.
"ఆ టూరిస్ట్ గెస్టు హౌస్ లో కేంటిన్ కూడా వుంది. ఆ మధ్యాహ్నం నేను లంచ్ కోసం ఆ కేంటిన్ కి వెళ్ళాను. అక్కడ ఆ అమ్మాయి మరలా కనిపించింది. అప్పుడు ఆమెతోపాటు ఒక యువకుడు కూడా ఉన్నాడు. ఆమె నన్ను చూడగానే ఆ యువకుడికి నన్ను చూపిస్తూ రహస్యం చెబుతున్నట్లుగా ఏదో చెప్పింది.
నేనది వారికి అనుమానం రాకుండా గమనించాను ఆ సమయంలో. నామీద ఏదన్నా ఎటాక్ జరుగుతుందేమోనని కూడా అనిపించింది. దాన్ని ఎదుర్కొనేందుకు మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను.
అయితే నేనూహించనిది జరగకపోగా, అతను నా దగ్గరకు వచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడటం, నేను ఫోటో తీశానని చెప్పడం, ఆ అమ్మాయి కోపంలో నా రీలు పాడుచేసిందని. అయితే ఆ గుర్రాన్ని ఫోటో తీసిన రీల్ కి ఏం కాలేదని నిజం చెప్పేశాను. అతను నవ్వాడు.
ఆ వెంటనే అతను నన్ను పక్కకు తీసుకెళ్ళాడు. లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోవద్దని, అది రేస్ గుర్రం అని రేస్ గుర్రాల వెనుక భయంకరమైన ప్రమాదాలు ఉంటాయని, జాగ్రత్తగా ఉండమని చెబుతూ తనకు ఫోటో గ్రాపర్స్ అంటే ఇష్టమని అందుకే అలా చెప్పాలనిపించిందని కూడా చెప్పాడు.
అయినా ఆపుకోలేక అతన్ని అడిగాను__ఆ గుర్రం వివరాలని.
ఇండియాకి చెందిన ఒక ధనవంతుడు దాన్ని కెనడా నుంచి కొనుకున్నాడని, ఒక ప్రతిష్టాత్మకమైన పందానికి దాన్ని పంపనున్నాడని, తాము దానికి ట్రైనింగ్ ఇచ్చేందుకు రహస్యంగా వచ్చానని చెప్తూ ఇంకా లోతుకు వెళితే నీకే ప్రమాదమని నన్ను హెచ్చరించాడు. ఆ అమ్మాయి ఆ గుర్రానికి బాడీగార్డ్ అని కూడా చెప్పాడు...."
"అంతేనా....?" కాస్తంత నిరుత్సాహంగా అడిగాడు సుదర్శన్.
అనురాగ్ మాట్లాడలేదు అనురాగ్ చూపులు, ఆలోచనలు ఆ డబ్బు మీదే ఉన్నాయి.
అంతేనా....? ఆ గుర్రానికి ట్రైనింగ్ ఇచ్చే అతని పేరు....?" అనురాగ్ వెంటనే చెప్పలేకపోయాడు.
"జ్ఞాపకం రావడం లేదు....కాని....కాని...."
"వూ త్వరగా....గుర్తు తెచ్చుకొనే ప్రయత్నం చేయండి. ఈ యాభై వేలు మీవే...." అంటూ ఆ ఐదుకట్టల్ని అనురాగ్ వేపు జరిపాడు.
అదొక్కటి చెప్పగలిగితే చాలు__ఆ గుర్రం ఎక్కడుందనేది కనుక్కొనేందుకు క్షణాలు లెక్కిస్తూ అనురాగ్ చెప్పబోయే పేరు కోసం ఎదురుచూస్తున్నాడు భరించలేని టెన్షన్ తో.
ఇద్దరి మధ్య నిశ్శబ్దం....
రెండు నిమిషాలు గడిచాయి.
అప్పుడు నోరు విప్పాడు అనురాగ్.
"అతని పేరు అ....ఆ__అనంత్...." ఆ పేరు వినగానే ఆశ్చర్యపోయాడు సుదర్శన్. ఆ తరువాత భయపడ్డాడు....కంగారుపడ్డాడు. అంతలోనే తమాయించుకున్నాడు.
"అనంతా?! సుదర్శన్ ఆందోళనగా అడిగాడు.
సుదర్శన్ ఆందోళనను గుర్తించకుండానే అనురాగ్ చెప్పుకుంటూ పోసాగాడు.