ఈ దశలో కూడా అతనికి పరాజయమే ఎదురయింది. తన కళ్ళముందే డిప్లొమో హోల్డర్స్ సెలెక్టు కాసాగారు. "బి.ఇ. లను సెలెక్టు చేసుకుంటే నిలకడగా ఉండరు, మంచి ఉద్యోగం రాగానే పోతారు" ఇదీ పైకి చెప్పే కారణం. లోపాయికారి విషయాలు దేవుడికే తెలియాలి. రిజిస్ట్రేషన్ ఫీజులకీ, ఇంటర్వ్యూలకి వెళ్ళిరావటానికి తల్లివంటి మీది బంగారం కరిగిపోసాగింది, అమ్మటానికి పొలాలులేవు కనుక.
అప్పటికి తలితండ్రుల ఆశలు నీరు కారిపోసాగాయి. నిరాశతో బెంగతో తండ్రి మంచం పట్టాడు.... "ఉన్న పొలమంతా నీ చదువుకి ఖర్చుపెట్టాను. ఇప్పుడింక ఈ కుటుంబానికి నువ్వు చూపించే ఆధారమేమిట్రా?" అని కొడుకుని సతాయించసాగాడు. తల్లి చాటుమాటుగా కళ్ళు తుడుచుకోవటం మరీ ఎక్కువైపోయింది. అప్పుడిక ఏ ఉద్యోగం కనిపిస్తే ఆ ఉద్యోగానికి అప్లయి చెయ్యసాగాడు. ఇది మూడవ దశ__
చివరకు అతికష్టంమీద ఒక ప్రైవేట్ ట్యుటోరియల్ కాలేజీలో పదోతరగతి ఫేలయ్యి మళ్ళీ ప్రైవేట్ గా కట్టేవాళ్ళకి లెక్కలుచెప్పే ఉద్యోగం దొరికింది. ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటుకి. తన నెలజీతం రెండువందలూ. (పార్టుటైం ఉద్యోగం కాబట్టి) తెచ్చి తండ్రి చేతిలో పెట్టినప్పుడు ఆ తండ్రి క్షోభతో "ఒరేయ్! నీ ఉద్యోగాలకు అప్లయి చెయ్యటానికి కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజుల్లో ఇది ఎన్నో వంతురా?" అన్నాడు. జ్ఞానస్వరూప్ తలవంచుకుని వెళ్ళిపోయాడు.
అప్పటికి వేద బి.ఏ. పాసయింది. ఇంటి పరిస్థితి చూసి "నేను ఉద్యోగం చేస్తాను నాన్నా!" అంది. ఆ మాటకోసమే ఎదురుచూస్తున్న వాడిలా వెంటనే "చెయ్యి" అన్నాడు తండ్రి. అప్పటినుంచీ వేద ఉద్యోగాల వేట ప్రారంభమైంది. బి.ఏ.తో పాటుగా టైపు, షార్టుహాండూ నేర్చుకున్న వేద అన్నిరకాల ఉద్యోగాలకి అప్లయి చెయ్యసాగింది. ఇంటర్వ్యూలకు పిలుపు లొచ్చాయి. ఇక్కడినుంచీ మరో కొత్త మలుపు వేద జీవితంలో ఇంటర్వ్యూ సమయంలోనే కొందరి చూపులు తన శరీరమంతా తడుముతున్నట్లుగా ఉండేవి. ఆడపిల్లల కాలేజీలో చదివి డిగ్రీ తెచ్చుకున్న వేదకిది కొత్త అనుభవం. ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాక శరీరమంతా తేళ్ళూ జెర్రులూ పాకుతున్నట్లుగా అనిపించసాగింది. ఒక ఇంటర్వ్యూలో వేద సెలక్టు అయింది. ఒక ప్రైవేట్ కంపెనీలో సెక్రటరీ ఉద్యోగం.
కష్టాలు పడి పడి ఉన్న ఆ కుటుంబం అందుకే ఎంతో ఆనందించింది. మొదటినుంచీ కంపెనీ మానేజరు చూపులు వేదను ఇబ్బంది పెట్టసాగాయి. అదే కంపెనీలో ఎలాగైనా మేనేజర్ ప్రాపకం పొందాలని ఆరాటపడే కొందరు ఆడవాళ్ళను చూసి లోలోపల చీదరించుకుంది. లోకంలో ఎన్ని రకాల మనుష్యులు? అనుకుంది. ఒకరోజు మేనేజర్ ఇంచుమించు ఆఫీస్ టైం అయిపోతుండగా ఒక కట్ట కాగితాలు అందించాడు టైప్ చేయమని - "చేయను" అనటానికి భయం - ఉద్యోగం పోతుందేమోనని- రూల్స్ ఎక్కడున్నాయి, కాగితాలమీద తప్ప? అవన్నీ టైప్ చేసేసరికి ఆఫీస్ దాదాపుగా నిర్మానుష్యమైపోయింది. ప్యూన్ ఎక్కడో కునికిపాట్లు పడుతున్నాడు. ఇంకా వెళ్ళనివాళ్ళను తిట్టుకుంటూ! టైపుచేసిన ఆకాగితాలు పట్టుకుని మేనేజర్ గదిలోకి వెళ్ళింది. భయపడుతున్న ముహూర్తం వచ్చేసింది-మేనేజర్ వేదని కూచోమన్నాడు. వేద కూచోలేదు- "కాఫీ కావాలా" అన్నాడు అదొకలాగా నవ్వుతూ. "అక్కరలేదు సార్. నేను వెళ్ళాలి!" అంది. "ఏం? అంత తొందర?" అంటూనే చెయ్యి పట్టుకుని మీదకు లాక్కోబోయాడు-"ఛీ!" అంటూ ఆ పట్టుని విడిపించుకుని స్ప్రింగ్ డోర్ తెరుచుకుని బయటికి వచ్చేసింది. ఇంటికి వచ్చినా సర్వాంగాలూ వణుకుతూనే ఉన్నాయి....ఓ రాత్రివేళ వేద పక్కనే ఉన్న గీతకు మెలకువవచ్చి అక్క ఏడుస్తున్నట్లుగా అనిపించింది. వేద వంటిమీద చెయ్యివేసి "అక్కా" అంది. వేద ఉలికిపడి గబగబ కళ్ళు తుడుచుకుంది. మాట్లాడలేదు.
"ఏడుస్తున్నావా?" అంది గీత మళ్ళీ - అప్పటికీ సమాధానం రాలేదు.
"ఎందుకూ?" అంది - వేద గభాలున గీతవైపు తిరిగి గీతను కౌగలించుకుని ఏడ్చేసింది. అక్క ఏడుస్తుంటే, గీతకు ఏడుపొచ్చింది. అక్కాచెళ్ళెళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగలించుకుని కన్నీళ్ళలోనే పరస్పరం మౌనంగా ఓదార్చుకున్నారు. ఆ మరునాడు ఆఫీసులో ఏమవుతుందోనని భయపడింది, కానీ ఏం కాలేదు. మేనేజర్ చిరునవ్వుతోనే పలకరించాడు__అంతా మామూలుగానే ఉంది "హమ్మయ్య!" నెలాఖరువరకే నిలిచింది, ఆ ఫస్టుకే "అసమర్ధత" కారణంగా తొలగిస్తున్నామని ఆర్డర్స్ అందాయి వేదకి. కృంగిపోయింది-అదే ఆఫీసులో పనిచేస్తున్న మమత వచ్చి ఆప్యాయతనటిస్తూ "అయ్యో! నీకు వూస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయా? ఎందుకు వచ్చాయో నాకు తెలుసులే! ఈ మానేజర్ ఈ కంపెనీ ఆఫీసు అంతా తన సొంతం అనుకుంటున్నాడు__ అతడు నీపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని డైరెక్టర్లకి రిపోర్టు వ్రాసియ్యి-వాడి ఉద్యోగమే ఊడిపోతుంది" అంది.
సుశీలకూడా ఆ ఆఫీసులోనే పనిచేస్తోంది. సాధారణంగా చాలా గంభీరంగా ఉంటుంది. ఎవరితోనూ ఎక్కువ మాట్లాడదు. ఎవరూ లేని సమయం చూచుకుని వేదని పలకరించింది.
"మమత చెప్పినట్లు చెయ్యాలనుకుంటున్నావా?" అంది.
"ఆలోచిస్తున్నాను."
"నువ్వు వచ్చి నెలేఅయింది. మమత సంగతి నీకు తెలియదు. ఆమెలో మమత ఆ పేరులో మాత్రమే వుంది. ఆమెకు ఒకరిపై మమత ఉండదు. మరొకరి మమతకూ ఆమె నోచుకోలేదు. కొంగతో స్నేహం చేసి కొంగ కాలితే మంటల్లోంచి మాంసం ముక్క లాక్కునే నక్క స్నేహంలాంటిది ఆవిడ స్నేహం. నిజానికి ఆవిడ మేనేజర్ గారి చల్లని చూపుకోసం ప్రయత్నించి విఫలురాలయ్యింది. ఆ కోపం మేనేజరుమీద తనేం చెయ్యలేదు గదా! అందుకని నిన్ను సాధనంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. అవమానంతో ఆశాభంగంతో ఉన్న నువ్వు ఉద్రేకపడి ప్రతీకారానికి పూనుకోవటం సహజం. మేనేజర్ స్టాఫ్ తో అసహ్యంగా ప్రవర్తించకూడదనీ, అలా ప్రయత్నిస్తే సస్పెండ్ చెయ్యాలనీ రూలు ఉన్నమాట నిజమే. కాని నీకు తెలియనిదేముందీ? ఈ లోకంలో రూల్సన్నీ కాగితంమీదే! నువ్వు డైరెక్టర్ కి ఇస్తావు. అప్పుడు వాళ్ళు విచారణ జరిపిస్తారు, ఆ తరువాత ఏమవుతుంది? మేనేజర్ నీతో అసభ్యంగా ప్రవర్తించాడని నువ్వు రుజువు చెయ్యగలవా? అలా నీకు సాక్ష్యమిచ్చే వాళ్ళెవరైనా ఉన్నారా? అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నవాడు మేనేజరు. ఇలాంటిదేదైనా జరిగితే నీమీదే లేనిపోని అభాండాలు మోపి కోటిమంది చేత సాక్ష్యం ఇప్పించగలడు. అప్పుడు నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకో. ఇలాంటి విషయాల్లో ఆడది నోరుమూసుకోవటమే మంచిది. ఇది అన్యాయమె, కానీ అడుగడుగునా అన్యాయాలకు బలికావటమే ఆడదాని జీవితమేమో! నేను సాధారణంగా ఒకరి విషయాల్లో కల్పించుకోను. కానీ, నువ్వు చేరినప్పటినుంచి నువ్వంటే గౌరవమూ ఇష్టమూ ఏర్పడింది. ఇప్పుడు అవసరం వచ్చింది గనుక ఈమాత్రం మాట్లాడుతున్నాను". సుశీలను ఆశ్చర్యంగా అభిమానంగా చూసింది. ఎన్నిరకాల మనుష్యులు లోకంలో!
సుశీల మాటలన్నీ నిజాలు! తనకు జరిగింది ఘోరమైన అన్యాయమైనా నోరెత్తటానికి లేదు. దిగులుగా ఇంటికి వచ్చి తండ్రికి చెప్పింది, తనకు ఉద్యోగం పోయిందన్న వార్త....మంచంలోఉన్న తండ్రి ఉద్రేకపడిపోతూ "ఏం? ఎందుకు పోయింది?" అని అరిచాడు. వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? ఇలాంటి అవమానాలు ఎంత దారుణమైనవో మొదటిసారిగా అర్ధమవుతోంది, "నా అసమర్ధత కారణంగా తీసేసారట?" గొణిగింది.
"అసమర్ధత కారణంగానా? ఛీ! ఛీ! వచ్చిన ఉద్యోగంకూడా నిలబెట్టుకోలేని చేతకానివాళ్ళు!"
చీదరించుకున్నాడు తండ్రి, భగవంతుడా! ఆర్ధిక పరిస్థితులు మనిషిని ఎలా మార్చేస్తాయి? లోపలికి వచ్చి చాపమీద బోర్లా పడుకుంది. ఏడవసాగింది. ఆపుకోలేని దుఃఖానికి ఎగిరెగిరి పడుతున్న వెన్నును ఆప్యాయంగా నిమురుతూ కూచుంది గీత.
5
వేదకు ప్రతిచోట ఉద్యోగం తేలిగ్గానే దొరుకుతోంది. అది నిలుపుకోవటమే చాలా కష్టమైపోతోంది. మొగవాళ్ళందరి చూపులూ తనమీదే! తనను తినేసాలా ఉండటం వేదకు బాగా తెలుస్తోంది.
మేనేజరు, సెక్షన్ హెడ్, తోటి క్లర్క్స్, చివరికి ప్యూన్ దగ్గర నుంచీ అవే చూపులు. వేదకు తను చాలా అందమైనదాననని తెలుసు. చిన్నతనంలో ఆ మాట ఎందరినోటనో వింది. వయసు వచ్చిన దగ్గరనుంచీ నిలువుటద్దంముందు నిలబడి తనను తాను చూసుకుని మురిసిపోయేది. ఆ అవకాశమైనా తరచు వచ్చేదికాదు. ఎందుకంటే ఇంట్లో నిలువుటద్దంలేదు. ఎప్పుడైనా స్నేహితుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు చూసుకోవలసిందే! ఏ అందాన్ని చూచుకుని ఒకనాడు తను మురిసిపోయిందో, ఆ అందమే ఈనాడు ప్రాణసంకటంగా తయారయింది. తను విలాసంగా నవ్వదు. వయ్యారంగా నడవదు. చిలిపిగా చూడదు. మరి ఎందుకింత నిస్సంకోచంగా ఈ మొగవాళ్ళంతా తనను తినేసేలా తోడేళ్ళలా చూస్తున్నారు? తను కట్టుకునేవి సాదా నూలుచీరలు, వంటిమీద మట్టిగాజులు తప్ప ఏ ఆభరణాలు లేవు. చివరకు రిస్టువాచ్ అయినాలేదు. ఒక్కమాటలో తన అందంతో అణువణువునా బీదరికం ప్రత్యక్షమవుతోంది. అందుకే ఆ అలుసు తనతో పనిచేసే అమ్మాయిలు కొంతమంది మాక్సీలలోను, ఫ్రాక్స్ ల్లోనూ కూడా వస్తారు. అయినా వాళ్ళను ఎవరూ వెకిలిగా చూడరు. వాళ్ళతో అణువణువునా ఐశ్వర్యపు ఆడంబరం బుసలుకొడుతూ వుంటుంది. వాళ్ళు చాలా 'హైరికమెండేషన్' తో వచ్చినవాళ్ళట! ఆ విషయం అందరికీ తెలుసు. అందుకే వాళ్ళలా అలంకరించుకున్నా, ఎలా మాట్లాడినా వాళ్ళ జోలికి ఎవరూ పోరు. ఎటుపోయి ఎటొస్తుందోనని__ అంతంత డబ్బున్నవాళ్ళు ఇంకా హైరికమెండేషన్లమీద ఇలాంటి ఉద్యోగాలకు రావటందేనికో! డబ్బు ఉన్నవాళ్ళకే పలుకుబడి ఉంటుంది. వాళ్ళే మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఇంకా గొప్పవాళ్ళు ఐపోతారు. డబ్బులేనివాళ్ళు ఒకమోస్తరు ఉద్యోగాలుకూడా సంపాదించుకోలేక మరింత దరిద్రంతో కృంగిపోతారు.