Previous Page Next Page 
ఆత్మబలి పేజి 53


    చలపతి తేలుకుట్టినట్లు తన చెయ్యి వెనక్కు తీసుకున్నాడు.
    "ఒకనాడు మూర్ఖంగా నిన్ను పొందాలని ప్రయత్నించినా, ఇప్పుడా ఇచ్ఛ నాలో సమూలంగా నశించిపోయింది. నిన్నెంత ప్రేమిస్తున్నా, నీ ప్రేమను పొందే అర్హతలేదని నాకు తెలుసు."
    ఉమ సహనం నశించిపోయింది. "అయితేసరే! నాక్కొంచెం విషమియ్యండి."
    చలపతి నవ్వాడు. "పిచ్చిదానా! నీకు విషమియ్యటానికి నువ్వు నాకు శత్రువువా? నాపాలిటి దేవతవి. నీ దివ్యత్వం సార్థకమయ్యే అమృతాన్నే నీకందిస్తాను."
    చలపతి బయటికెళ్ళిపోయాడు. ఉమకు మళ్ళీ ఫిట్ వచ్చింది.


                                                                 33


    ఆనాడు పబ్లిక్ గార్డెన్స్ లో తనకూ, ఉమకూ మధ్య చలపతి వచ్చి నిలిచినప్పటి నుండీ కేశవ చలపతి ఇంటికి రావటం మానేశాడు. చలపతి కనిపిస్తాడేమోనన్న భయంకొద్దీ షాపుకెళ్ళటం కూడా మానుకున్నాడు. అతనికి తనిచ్చిన ఉద్యోగమూ, తను చూపుతున్న ఆదరణా అంతా అతనికి తను చెయ్యబోయే అన్యాయానికి ఇచ్చుకున్న లంచంలా అనిపించసాగింది. ఒక రకంగా నిజం కూడా అంతే! ఆనాడు చలపతి పర్స్ లో ఉమ ఫోటో లేకపోతే, తను చలపతితో స్నేహానికి ప్రయత్నించేవాడా? ఏ అర్హతలులేని అతనికి ఈ ఉద్యోగమిచ్చేవాడా? కాని అప్పట్లో తనకేవిధమైన ద్రోహచింతా లేదు. అతనికి తనే సహాయం చేసినా ఉమకు చేసినట్లే అనుకుని చేశాడు.
    ఉమతో ఆ సమావేశం ఎంత బాధాకరంగా ఉందో అంత మధురంగా ఉంది.
    ఉమకు తనపట్ల ఏ వ్యతిరేకభావమూ లేదన్నమాట! కేవలం తన సాహసాన్ని మన్నించలేకపోయింది. ముందు ఉమ మనసు తెలుసుకోకుండా పెద్దవాళ్ళను కలుసుకోవటం దేనికనుకున్నాడు. "ప్రేమిస్తున్నా" అన్న వాక్యాన్ని చాలామంది కొంత నీచార్థంలో వాడుతున్నారన్న సంగతి మరిచిపోయాడు. తన తొందరపాటు ఇంతకు తెచ్చింది.
    అయ్యయ్యో! ఎంత పొరపాటు జరిగిపోయిందీ? తిరిగి సర్దుకోవటానికి వీల్లేని పొరపాటు. ఒకవేళ తనూ, చలపతీ ఆ పొరపాటును సర్దటానికి ప్రయత్నించినా బహుశః ఉమ సర్దనియ్యదు.
    నౌకరు వచ్చి "చలపతిరావుగారు మీకోసం వచ్చారు" అన్నాడు.
    కంగారుగా "లోపలకు పంపు" అన్నాడు కేశవ. అతని సర్వాంగాలు వణుకుతున్నాయి! అసలు చలపతి ముఖం చూడటానికే అతనికెలానో ఉంది. అతనేం మాట్లాడుతాడో, దానికి తనేం సమాధానం చెప్పాలో అంతా అయోమయమనిపించింది. చలపతి లోపలికొచ్చాడు. కేశవ బెదురు బెదురుగా నవ్వాడు. కేశవముఖం చూడగానే చలపతికి తననెవరో పదునైన బాకుతో వెన్నులో పొడిచినట్లైంది. అంతలో నిగ్రహించుకున్నాడు. కేశవ బిస్కెట్లు, టీ తెప్పించాడు. చలపతి టీ మాత్రం తాగాడు.
    "కేశవరావుగారూ...!" ఏదో చెప్పబోయి ఆగాడు చలపతి.
    తలవంచుకు కూర్చున్నాడు కేశవ. ఎట్లాంటి మాటలనైనా వినటానికి సిద్ధమే నన్నట్లు.
    "మీరు మా ఉమను ప్రేమించింది నిజమేనా?"
    "నిజమే!"
    "ఆమెనిప్పుడైనా స్వీకరించగలరా?"
    కేశవ తలెత్తి చలపతి ముఖంవంక చూశాడు.
    "మీకు అన్యాయం చెయ్యటానికి బాధగా ఉంది..."
    చలపతి అత్యంత కఠినంగా అన్నాడు.
    "ఉమను ప్రేమించడానికీ, ప్రేమను ప్రకటించడానికీ అడ్డురాని కారణం ఆమెను స్వీకరించటానికి మాత్రం అడ్డువస్తుందా? ఇదా మీ ప్రేమ?"
    కేశవ ముఖం గంభీరంగా మారిపోయింది.
    "మీరు పొరపాటు పడుతున్నారు. ఉమను స్వీకరించటానికీ, న్యాయ సమ్మతంగా నాదానిని చేసుకోవటానికీ నేనెన్నడూ సిద్ధమే! అది నా అదృష్టంగా భావిస్తాను. నేను మీ విషయం ఆలోచిస్తున్నానంతే!"
    "ఇందులో ఆలోచించవలసిందేమీ లేదు. నన్ను నా మూర్ఖత్వంలో పడి ఉండనియ్యక నా మనసు నింతగా వికసింపజేసిన ఉమ మీద నాకు కసిగా ఉంది. ఇప్పటి నా సంస్కారాన్ని బట్టి నేనిలా తప్ప మరొకలా ప్రవర్తించలేను. నేను లాయరును సంప్రదించి ఉమకు విడాకులిస్తాను. వెంటనే మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారుగా!"
    "నిస్సందేహంగా!"
    "వస్తాను."
    బయటకు నడుస్తున్న చలపతిని చూస్తుంటే కేశవకు జాలీ, గౌరవమూ ఒక్కసారిగా కలిగాయి. రెండు చేతులూ జోడించి మనసారా నమస్కరించాడు.


                                       34


    "ఉమా! లాయరును కలుసుకున్నాను. మనకిద్దరికీ సమ్మతమయితే, విడాకులు లభించటం చాలా తేలికన్నాడు."
    దుఃఖంతో పూడుకుపోతున్న గొంతులో సంతోషాన్ని ధ్వనింపజేయటానికి ప్రయాసపడుతూ అన్నాడు చలపతి.
    పట్టకారుతో కూరగిన్నె దింపుతున్న ఉమ ఈ మాటలతో ఉలిక్కిపడి పట్టకారు వదిలెయ్యటంతో వేడివేడి కూరగిన్నె కాలుమీద పడి ఉమ బాధతో కెవ్వున కేకపెట్టింది. చలపతి గాభరాగా ఏదో ఆయింట్ మెంట్ తెచ్చి ఉమ కాలికి రాశాడు. ఉమ వంటింట్లో గోడకానుకుని కూర్చుండిపోయింది.
    "ఎందుకంత గాభరా ఉమా! దేనికి నీకు భయం?"
    "ఆ రెండూ కాదు. ఆవేదన." దీనంగా చలపతివంక చూస్తూ అంది ఉమ.
    చలపతి నిర్లక్ష్యంగా నవ్వాడు.
    "అలవాటయిన మార్గాన్ని వదిలి క్రొత్తమార్గాన్ని తొక్కాలంటే ఇలా ఆవేదనగానే ఉంటుంది."
    నుదురు కొట్టుకుంది ఉమ.

 Previous Page Next Page