Previous Page Next Page 
ఆత్మబలి పేజి 54

   
    "చలపతి నొక్కసారి చూసిన ఏ ఆడదీ మళ్ళీ చూడాలనుకోదు." అన్న కేశవ మాటలు చలపతి చెవులలో పదేపదే గింగురు మంటున్నాయి. వీటికి వంత పలుకుతున్నాయి ఉమ మాటలు....
    "నా కారణంగా మీ జీవితం నాశనమయిందని ఎందుకంటారూ? మీ ప్రేమను ప్రకటించే విధానం అదేనా?"
    అంటే ఉమ కూడా కేశవను ప్రేమించింది. కేశవ కొంత వివేకంతో వ్యవహరించి ఉంటే సంతోషంతో ఇల్లాలు కాగలిగేది.
    "విడాకులకు నీ సమ్మతి వ్రాతపూర్వకంగా కావాలన్నారు లాయరు." ఉమ ముఖంలోకి చూస్తూ అన్నాడు చలపతి.
    ఉమ ఆవేశంగా లేచింది.
    "ఒక్కనాటికీ అలా వ్రాసివ్వను. మీతో విడాకులు నాకు సమ్మతం కాదు."
    "వ్రాసివ్వక తప్పదు, మనసులో మరొకరిని ప్రతిష్ఠించుకున్న నీతో నేను సంసారం చెయ్యలేను."
    చేష్టలు దక్కి నిలుచుండిపోయింది ఉమ. ఉమ ముఖంలోకి చూడలేక అక్కడినుంచి వెళ్ళిపోయాడు చలపతి.
    ఆ సాయంత్రమే తన అంగీకారాన్ని వ్రాతపూర్వకంగా చలపతి చేతికందించింది ఉమ. ఆమె ముఖంలో ఏ భావమూ చదవలేకపోయాడు చలపతి. భార్యాభర్తలిద్దరికీ విడాకులు అంగీకారం కావటం వల్ల విడాకులు త్వరలోనే లభించాయి.
    లాయరు దస్తావేజు తన చేతిలో పెడుతూంటే అందుకోవటానికి చలపతి చేతులు వణికాయి. తన ఉమ, తన దేవత, ఇంక తనకేమీ కాదా? ఎవరిని చూడకుండా ఒక్కరోజు ఉండలేడో, ఎవరి ముఖం కొంచెం విషాదంగా కనబడినా తన గుండెలల్లాడిపోతాయో, ఎవరు తనకు జీవితాన్ని వివరించి చెప్పారో, ఎవరికోసం జీవిస్తున్నాడో, ఆ ఉమకూ తనకూ ఏమీ సంబంధంలేదా? ఈ సత్యాన్ని ఎలా భరించటం? ఇంక తనకు చదువెందుకు? ఉద్యోగమెందుకు? ఎవరిని సంతోషపెట్టడానికి? ఉమ లేకుండా తనెన్నాళ్ళు బ్రతకగలడు? పోనీ, ఉమ సుఖపడుతుంది. అదే తనక్కావాలి.
    ఇంటికెళ్ళి ఉమ దగ్గిర కెళ్ళకుండా స్నానాలగదిలోకెళ్ళి తన ముఖంలో విషాదచ్చాయలు ఉమకు కనిపించకుండా ఉండటానికి చన్నీళ్ళతో కడుక్కున్నాడు. సాధారణంగా కనిపించటానికి సాధ్యమైనంత ప్రయత్నిస్తూ ఉమను సమీపించాడు.
    ఈ విపత్కర పరిస్థితిలోంచి బయటపడటానికి, పాపం ఉమ చాలా ప్రయత్నించింది. ఒకటికి రెండుసార్లు తనే చలపతికి దగ్గిర కాబోయింది. కాని చలపతి చటుక్కున అక్కడినుండి లేచిపోవటంతో అవమానంతో లజ్జతో కృంగిపోయి ఆ ప్రయత్నాలన్నీ విరమించుకొంది. ఇంక తను చేయగలిగిందేమీ లేదని అర్థం చేసుకుంది. శిలా ప్రతిమలా పరిణామాల నెదుర్కోవటానికి సిద్ధపడింది.
    ఇటీవల చలపతి ఉమను సాధ్యమైనంత తక్కువగా పలకరిస్తున్నాడు. ఉమకూ చలపతితో మాట్లాడటానికి ఏదో బెరుగ్గా ఉంటోంది. చలపతి దగ్గరకు రాగానే ఉమ బెదురుగా లేచి నిలబడింది.
    "ఇదిగో ఉమా!" అంటూ దస్తావేజు ఉమ చేతిలో పెట్టాడు.
    "ఏవిఁటిది?" అయోమయంగా అంది ఉమ.
    "నిన్నీ అబద్ధాల సాంఘిక వివాహబంధం నుండి విడిపించే వరపత్రం."
    ఉమకర్థమయింది. అప్రయత్నంగా ఉమ చూపులు తన మాంగల్యం వంకకు మరలాయి. చలపతి చటుక్కున ఉమ మెడలోంచి దాన్ని తీసేశాడు. ఒక్కసారిగా ఉమ సర్వాంగాలు జలదరించాయి. పిండిబొమ్మయింది. ఆమె చూపుల్లో జీవం లేదు.
    "పిచ్చిదానా! ఎందుకలా అయిపోయావు? ఇంకా ఎందుకది నీ మెడలో? ఇంతలో నేనేమైనా అయిపోతాననా? నల్లరాయిలా ఉన్నాను. ఉంటాను. ఆనాడు దీన్ని నీ మెడలో కట్టినప్పుడు దాని అర్థం నాకు తెలియకపోయినా ఈనాడు తీసేటప్పుడు నాకు తెలుసు. నేను పొరపాటు చెయ్యలేదనికూడా తెలుసు. నాకింత నేర్పావు. నీకీ పిచ్చి సంకోచమేమిఁటీ?"
    చలపతి మాటలు పూర్తికాకుండానే ఉమ ఫిట్ వచ్చి పడిపోయింది.
    ఆ ఫిట్ నుండి ఉమ కోలుకోలేదు. పూర్తిగా మంచమెక్కేసింది. అన్ని వైద్యాలు విఫలమయ్యాయి. ఏదీ మాట్లాడలేదు. ఎవరివంకా చూడదు. ఈ లోకంతో నిమిత్తంలేనిదానిలా తయారయిపోయింది. విజ్ఞానశాస్త్రం ఇంకా అభివృద్ధి పొంది మానవుడు కృత్రిమ మానవ రూపాన్ని తయారుచెయ్యగలిగితే అది ఈ ఉమలా ఉంటుందేమో?
    ఉమ నీరసించిపోతూంది. అంత నీరసంలోనూ ముఖం అగ్నిజ్వాలలా ప్రకాశిస్తోంది. ఉమను మనుష్యులలోకి తేవడానికి చలపతికి ఒకే ఒక మార్గం కనిపించింది. అది కేశవను ఉమ దగ్గిరకు తీసుకురావటం. ఆమెను కదిలించగలిగే శక్తి కేశవకే ఉంది. అభిమానమో, దుఃఖమో, కోపమో లేక ఇవన్నీ కలిసిన ఏదో ఒక విచిత్రమైన ఉద్వేగమో, తప్పక ఉమను కదిల్చి తీరుతుంది.
    ఉమ పరిస్థితి విని కేశవ దిగాలుపడిపోయాడు.
    "అసలీ పరిస్థితికంతకూ నేనే కారణం. నేను పాపిని, మీ ఇద్దరిమధ్యకూ నేను రాకుండా ఉంటే ఏ గొడవా ఉండేదికాదు. చల్లని మీ సంసారంలో చిచ్చుపెట్టాను. నన్ను శిక్షించక గౌరవిస్తారేవిఁటి చలపతిరావుగారూ!"
    "తప్పొప్పులు విచారించుకునే సమయం కాదిది. రండి. ముందు ఉమను కాపాడుకోవాలి. తనసలు మనధ్యాసలో లేదు."
    గాభరాగా కేశవను తీసుకొచ్చాడు చలపతి. అతనాశించినట్లే జరిగింది. కొన్ని క్షణాలు కేశవను అయోమయంగా చూసిన ఉమ అతనిని గుర్తించి వణికిపోయింది. కేశవ ఉమ మంచం పక్కన మోకరిల్లి రెండుచేతులూ జోడించాడు. అంతకంటే తనేం చెప్పలేనట్లు. లోకంలోని దైన్యమంతా అతని ముఖంలో మూర్తీభవించి ఉంది. జీవితంలో మొదటిసారిగా అతని చూపులతో చూపులు కలిపింది ఉమ. ప్రేమ, త్యాగం, దైన్యం. ఒకదానితో ఒకటి కలిసిపోయి తొంగిచూస్తున్న ఆ చూపులు ఉమ హృదయాన్ని స్పృశించి కదిలించి వేశాయి. సంవత్సరాలుగా క్రూరంగా అణగత్రొక్కిన ప్రేమప్రవాహం వరదలై కన్నీరుగా ప్రవహించింది. పెదవులు కదిలాయి.
    "క్షమించండి. నన్ను మరిచిపొండి. గతాన్ని సింహావలోకనం చేసుకోగలిగే ఓపిక కాని, అందులోని తప్పొప్పులను విమర్శించే సాహసంకాని నాకు లేవు. త్వరలో తగిన యువతిని పెళ్ళిచేసుకుంటానని మాటివ్వండి."

 Previous Page Next Page