Previous Page Next Page 
ఆత్మబలి పేజి 52


    ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది చలపతి కంఠం. ఉమ నీరసంగా కళ్ళు మూసుకుంది. ఈ మధ్య ఉమకు తరచుగా ఫిట్స్ రావటం, కొంచెంసేపు వళ్ళు తెలియకుండా పడిపోవటం, తరువాత స్మృతి రావటం జరుగుతోంది. చలపతి కంగారుగా డాక్టర్ని పిలిపించాడు.
    "ఈవిడ మానసికంగా ఎందుకో తీవ్రంగా మథనపడుతున్నారు. ఏ ఆలోచనలూ లేకుండా విశ్రాంతి తీసుకుంటే అన్ని జబ్బులూ పోతాయి" అన్నాడు డాక్టర్.
    ఉమ మానసికంగా తీవ్రంగా మథనపడుతోంది ఎందుకో తనకు తెలుసు. తనను నిలువునా దహించివేసే హాలాహలంలాంటి ఆవేదన నంతనూ తనలో ఇముడ్చుకుని నవ్వుతూ ఉమను సమీపించాడు చలపతి. పసిపిల్లలా అమాయకంగా కళ్ళు మూసుకుని పడుకున్న ఉమను చూసి జాలితో కరిగిపోయి లాలనగా తల నిమరబోయి అంతలో చెయ్యి వెనక్కు తీసుకున్నాడు. మూసుకున్న ఉమ కనురెప్పల చివరలలో సన్నని నీటిబిందువులు. ఆ నీటిబిందువుల వంక తదేకంగా చూస్తూ కూర్చున్నాడు చలపతి.
    ఆ చిన్న నీటిబిందువు వెనుక ఏఏ విచిత్రగాథలు దాక్కున్నాయో! పైకి రాలేని ఎన్నెన్ని కన్నీటి సముద్రాల ప్రతినిధో ఆ నీటిబిందువు?
    మూసిన ఉమ కనుకొలకులలో నీటిబిందువులు అణచిపెట్టుకున్న చలపతి మానసిక సంక్షోభాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఇంక సహించలేక ముందుకు వంగి ఆ బిందువులను చేత్తో తుడిచాడు.
    ఉమ కళ్ళు విప్పింది.
    "సారీ ఉమా! నిన్ను లేపినట్లున్నాను." సిగ్గుపడుతూ అన్నాడు చలపతి.
    "లేదు. లేదు. నేనసలు నిద్రపోవటంలేదు. లేచి ఇంటిపనులు చేసుకోగలను. మీరే లేవనియ్యటంలేదు."
    చలపతి ఉమ ముఖంలోకి నిదానించి చూశాడు.
    "ఉమా! నీ వ్యాధికి కారణం డాక్టరేం చెప్పాడో నీకు తెలుసా?"
    "తెలుసు! ఆ డాక్టర్లకు మతిలేదు. అసలు కారణం నేను చెపుతాను. తిండికి తగిన పరిశ్రమలేక..."
    నవ్వడానికి ప్రయత్నించిన ఉమ గంభీరంగా ఉన్న చలపతి ముఖాన్ని చూసి ఆగిపోయింది.
    "ఉమా! నేను మనసారా నీ సుఖం కోరేవాడిననే విషయంలో నీకేమైనా సందేహముందా?"
    "లేదు. ఏం లేదు."
    "మరి నిండు హృదయంతో నేను చేసిన సూచననెందుకంగీకరించవూ?"
    ఉమ ముఖం మలినమయిపోయింది. "మీకు పుణ్యముంటుంది. ఆ ప్రసక్తి తేకండి. అక్కడ అతనుంటాడని తెలిస్తే నేను వెళ్ళేదానినికాను. నన్ను మభ్యపెట్టి నా కనవసరమైన సంక్షోభాన్ని కలిగించారు. పైపెచ్చు పదేపదే ఆ ప్రస్తావన తెస్తున్నారు. ఇంక నాకు మనశ్శాంతెలా ఉంటుందీ?"
    "నువ్వు అశాంతిని కోరి తెచ్చుకుంటున్నావు. నీ మెడలో మంగళసూత్రం కట్టినంతమాత్రాన నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనే సంకల్పం నాకు లేదు. నన్నెందుకర్థం చేసుకోవు?"
    "ఇలాంటి మాటలతో నన్ను చిత్రవధ చెయ్యవద్దని ఇదివరలో లక్షసార్లు ప్రార్థించాను. మళ్ళీ ప్రార్థిస్తున్నాను. నా సౌఖ్యమంతా మీతోనే ఉంది. నాకింకే సౌఖ్యాలు అక్కర్లేదు."
    "పచ్చి అబద్ధం. నాతో నువ్వీజన్మలో సుఖపడలేవు."
    ఉమ వణికిపోయింది.
    "ఏవిఁటీ దారుణం? ఏ ఆధారంతో ఇలా మాట్లాడుతున్నారు? ఎన్నడైనా నా ప్రవర్తనలో మీకు లోపం కనిపించిందా?"
    "నువ్వు శీలవతివి. ఆ విషయంలో నా కణుమాత్రమూ సందేహం లేదు. నేను మాట్లాడుతున్నది నీ మనసు గురించి. నీ మనసులో నిలుపుకోలేని నాతో నువ్వేం సుఖపడతావు?"
    "మిమ్మల్ని మనసులో నిలుపుకోలేకపోయానని మీకెవరు చెప్పారు?"
    "నీ ప్రవర్తన."
    "నా ప్రవర్తన?"
    "అవును. మన పెళ్ళయి మూడేళ్ళు పూర్తికావస్తోంది. ఒక్కనాడైనా మనం భార్యభార్తల్లా జీవించామా? ఎందుకు?"
    "ఏముందీ? మీరు చదవాలని - చదివి వృద్ధిలోకి రావాలని. మొదటిరోజే ఏదెలా ఉన్నా నామీద మీకభిమానం ఉందనీ, నా సంతృప్తికి ప్రయత్నిస్తున్నారనీ అర్థం చేసుకున్నాను. మీ చదువు పూర్తయ్యేవరకూ మనం దూరంగా ఉండాలనే నిబంధనను నేను నియమిస్తే, నాకు దగ్గిర కావాలనే ఆశతోనైనా చదువుమీద మనసు కేంద్రీకరించటానికి ప్రయత్నిస్తారని ఆశపడ్డాను. ఈ వయసులో మనసు చదువుపట్ల సంపూర్ణంగా విముఖమైన తరువాత తిరిగి చదువులో ప్రవేశించటం ఎట్లాంటిదో నాకు తెలుసు. అందుకనే తప్పనిసరిగా ఈ మార్గాన్నాశ్రయించాను."
    "నన్ను చదువులో పెట్టడానికే అయితే, ఇదే మార్గమా? నన్ను నీ విలాసాలతో మురిపించి నీకు కావలసినవిధంగా నన్ను మలుచుకునే శక్తి నీకు లేకపోయిందా? కేవలం నీ ప్రసన్న మందహాసం కోసం ఏపనినైనా చెయ్యటానికి సిద్ధపడుతున్నానే! నువ్వు నా దానివైననాడు నీ ఆజ్ఞ శిరసావహించలేకపోదునా? నాకు తెలుసు. శారద నారాయణరావు నెందుకు దూరంగా ఉంచిందీ? కుట్టాన్ ఏకవీర నెందు కాదరించలేకపోయాడు? మీనాక్షి భర్తనెందుకు దరిజేరలేకపోయిందీ? నువ్వూ అందుకే దూరంగా ఉన్నావు."
    ఉమ హతాశురాలయింది. అతని మనోవికాసం కోసం నిర్విరామంగా, తాను సల్పిన కృషి చివరికీవిధంగా ఫలించిందా?
    పగిలిపోతున్న తలను చేతులతో అదిమి పట్టుకొని "మీరు పొరపడుతున్నారు. నేను మీ దానిని కాలేదు గనుకనే మీలో ఆ తపన నిలిచి నా ప్రసన్నతనైనా పొందాలని తాపత్రయపడుతున్నారు. మీ దానినైపోయాక నాలో మీకిక ఏ ప్రత్యేకతా కనిపించదు. సాధించవలసినదేమీ ఉండదు. కనీసం నేనలా భావించాను. మీరు దానిని మరొకరకంగా అర్థం చేసుకుంటే నేనేం చెప్పగలను? ఇప్పుడైనా ఏం మించిపోయిందీ? మీ అపార్థం తొలగటానికి ఈ క్షణంలో మీ దానిని కావటానికి సిద్ధంగా ఉన్నాను" అని చలపతి చెయ్యి అందుకోబోయింది.

 Previous Page Next Page